రూ.2 లక్షల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం.. ‘మాయా బజార్‌’ రికార్డులెన్నో! | Mayabazar Movie Review In Telugu, An Engaging And Entertaining Film | Sakshi
Sakshi News home page

Mayabazar Movie Review: వెండితెర అద్భుత దృశ్య కావ్యం...తొలి పాన్‌ ఇండియా చిత్రం

Published Sun, Oct 20 2024 10:40 AM | Last Updated on Sun, Oct 20 2024 11:47 AM

Mayabazar Movie Review In Telugu

చరిత్ర గాని, పురాణాలు గాని... వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడ్ని ఆనందింపజేయడాన్ని ఆల్టర్నేటివ్‌ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ని ఓ థియేటర్లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్లని నవ్వులపాలు చేయడం వంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన అహాన్ని సంతృప్తిపరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటివైపు ఆకర్షితులవుతాం. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే ‘మాయాబజార్‌’ సినిమా. ఈ చిత్రం లక్ష్యం కూడా అదే.

మాయాబజార్‌ అను శశిరేఖా పరిణయంగా...
వ్యాస భారతం ప్రకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్‌ నిజానికి శశిరేఖా పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా ‘మాయాబజార్‌’కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది.

‘మాయాబజార్‌’కు తొలుత చాలా పేర్లనే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. తర్వాత శశిరేఖా పరిణయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని మాయాబజార్‌ అను శశిరేఖా పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది ‘మాయాబజార్‌’గా మిగిలింది. ‘మాయాబజార్‌’ కథకు ఉన్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు... కొన్ని కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దండించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది.. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.

చిన్న కథ... బలమైన స్క్రీన్‌ప్లే
నిజానికి ‘మాయాబజార్‌’ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్‌ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి. ప్రథమార్ధం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు... వంటివి ఇప్పటికీ ప్రతీ ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్‌ చేస్తాయి. ప్రథమార్ధమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్లి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మాన సిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.

ఎస్వీఆర్‌ మీదే ప్రమోషన్‌!
66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామేన్‌ మార్కస్‌ బార్ట్‌ లీ. గ్రాఫిక్స్‌ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్‌తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్ఠు లయ్యారు. నిజంగా మాయ జరుగుతున్నట్టుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ వాటికవే కదలడం.. వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్‌ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకు ముందు 1954లో వచ్చిన ‘ఇద్దరు పెళ్ళాలు’, 1956లో వచ్చిన ‘సొంతవూరు’ సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. ‘మాయాబజార్‌’ టైమ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మార్కెట్‌ కన్నా ఎస్వీఆర్‌ మార్కెట్‌ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్‌ పేరు మీదే చేశారట.

రెండు లక్షల బడ్జెట్‌తో...
‘మాయాబజార్‌’ను సుమారు రెండు లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్‌ సినిమా ఇదే. సాధారణంగా 30 వేల బడ్జెట్‌ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ ‘మాయాబజార్‌’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయా ప్రొడక్షన్స్‌ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్‌ చేశారు. విడుదలైన అన్నిచోట్లా విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా ‘మాయాబజార్‌’ని తొలి పాన్‌  ఇండియా  మూవీ అనొచ్చేమో. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా ‘మాయాబజార్‌’ అనేది ఓ గోల్డ్‌ మెమరీ. 
– ఇంటూరు హరికృష్ణ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement