‘మాయాబజార్’ సినిమా ఒక సినీ వైష్ణవ మాయ. దాన్ని ప్రేక్షకులు కొలుచుకుంటారు. తలుచుకుంటారు. దర్శకులు సింగీతం మళ్లీ దానిని తలుచుకున్నారు. ఆ సినిమాలో సాలూరు వారు అర్ధంతరంగా వదిలేసిన ట్యూన్‌కు తన గొంతుతో మళ్లీ పునర్జీవం ఇచ్చారు. తెలుగువారందరూ విని మురిసిపోతున్న తాజా పాట ఇది. కుశలమా నవ వసంత మధురిమా...
గత మూడు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పాట వైరల్‌గా మారింది. అది ఈనాటి పాట కాదు. సరిగా చెప్పాలంటే ఈనాడు పురుడుపోసుకున్న ఆనాటిది. ‘మాయాబజార్’ సినిమాలో వాడకుండా వదిలేసిన ‘కుశలమా’... పాటను, ఆ సినిమాకు దర్శకత్వ శాఖ లో పని చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్లీ వెలికి తీశారు. అసంపూర్ణంగా ఉన్న పల్లవిని తన మిత్రుడు, గేయకర్త వెన్నెలకంటి ద్వారా పూర్తిగా పాటగా మలిచారు. దానికి బాణీ కట్టి తానే స్వయంగా పాడారు. ఆయన మనమరాలు తోడు గొంతునిచ్చింది. ఇదంతా ఒక వీడియోగా చేసి ఆయన రిలీజ్ చేయడంతో మాయాబజార్ అభిమానులు మురిసిపోతున్నారు.
అరవయ్యేళ్ల నాటి పాట: సింగీతం
ఈ ప్రయత్నం గురించి సింగీతం ఇలా వివరించారు. ‘మాయాబజార్ కోసం సాలూరి రాజేశ్వరరావు శ్రీకరులు దేవతలు శ్రీరస్తు అనగా, చూపులు కలసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహారిలో, నీ కోసమే నే జీవించునది... పాటలు చేసిన తరవాత శశిరేఖ ప్రియదర్శినిలో అభిమన్యుని చూస్తూ పాడే ‘కుశలమా’ అనే పాట. ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమా’ అని దాని పల్లవి. సాలూరి రాజేశ్వరరావుగారు అద్భుతంగా స్వరపరిచారు. ఆ తరవాత ఏవో కారణాల వల్ల సాలూరి ఆ సినిమాకి సంగీత దర్శకులుగా చేయలేదు. ఆ పాట రికార్డు కాలేదు.
తరవాత ఘంటసాల గారు వచ్చి ఆ సందర్భానికి ‘నీవేనా నను పిలిచినది’ పాటతోబాటు మిగిలిన పాటలూ పూర్తి చేశారు. ఇది జరిగి 60 సంవత్సరాల పైచిలుకు అయ్యింది. ఇప్పుడు ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో నాకొక జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు అలా వదిలిపెట్టి, ప్రజల్లోకి వెళ్లలేని ఆ పల్లవిని మళ్లీ ఎందుకు రివైవ్ చేయకూడదు అనుకున్నాను. వెన్నెలకంటి గారు ఆ పల్లవి కొనసాగింపు, చరణాలు రాశారు. పాటను నేను ట్యూన్ చేశాను. మ్యూజిక్ నా మిత్రుడు జైపాల్, ఎడిటింగ్ నా మరో మిత్రులు గౌతంరాజు చేశారు. ఇక పాట విషయానికి వస్తే, నాయికపాత్రకు నా మనవరాలు అంజనీ నిఖిల పాడింది. నాయకుని పాత్రకు నేను పాడాను.’ అన్నారు.
పింగళి వారికి నివాళి: వెన్నెలకంటి
మహానుభావుడు పింగళి గారు రాసిన లైన్‌కి కొనసాగింపు రాయటం నా అదృష్టం. గతంలో సింగీతం గారు తీసిన ‘ఆదిత్య 369’ చిత్రంలో ‘జాణవులే..’ అనే మెలోడీ నాతో రాయించారు. తర్వాత వచ్చిన విజయా పిక్చర్స్ వారి ‘బృందావనం’ చిత్రానికి కూడా సింగీతం గారు సింగిల్ కార్డ్‌గా నా చేత అన్ని పాటలూ రాయించారు. ప్రస్తుతం లోకి వస్తే... నేను పింగళివారికి భక్తుడిని కదా... సింగీతం గారు పింగళిగారు రచించిన ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమా కుశలమా’ పల్లవి ఇచ్చి, చరణాలు రాయమన్నారు సింగీతం గారు. పల్లవిలో అబ్బాయి అడిగిన దానికి కొనసాగింపు కోసం కనీసం పది పల్లవులు రాసుకున్నాను. చివరకు ‘కుశలమా కుశలమా కుసుమబాణ చతురిమా కుశలమా’ రాశాక నాకు తృప్తి కలిగింది. పింగళిగారి పాటకు కొనసాగింపు రాసే అవకాశం రావటం చాలా సంతోషం. ఆ నివాళి పరిపుష్టమైనట్లే. – డాక్టర్ వైజయంతి పురాణపండ
‘మాయాబజార్’ సినిమాలో ముందు ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమా’ పాట అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది రికార్డ్ కాలేదు. దాని స్థానంలో ‘నీవేనా నను పిలిచినది’ పాట చేశారు.
Comments
Please login to add a commentAdd a comment