రమణారెడ్డి లేకుండా నాటి సినిమాను ఊహించడమా? మంచిగానో చెడ్డగానో ఆయన ఉండాల్సిందే. మిస్సమను, గుండమ్మ కథను, మాయాబజార్‌ను ఆయన పాత్రలు ఎంత మెరిపించాయి. నెల్లూరు యాసకు సినిమాలో యాక్సెప్టెన్స్ తెచ్చిన నటుడు. ఎవరైనా సన్నగా ఉంటే రమణారెడ్డిలా ఉంటాడు... అనే పోలిక ఇప్పటికీ సాగుతూనే ఉంటుంది. సన్నగా ఉన్నా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్ రెడ్డి తండ్రి గురించి చెప్పిన విశేషాలు ఇవి.
నాన్నగారికి మేం ఐదుగురు పిల్లలం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. నేను ఇంటికి పెద్ద. నా తరవాత చెల్లాయి వసుమతి, స్వర్ణలత, పద్మావతి, తమ్ముడు శ్రీనివాసరెడ్డి. అల్లుళ్లు ముగ్గురూ డాక్టర్లు. ఇద్దరు మెడికల్ డాక్టర్లు, ఒకరు డాక్టరేట్. నేను, తమ్ముడు ఇద్దరం చెన్నైలోనే ఇంజినీరింగ్ చదివాం. నేను బిటెక్ తరవాత ఎంబిఏ పూర్తి చేశాను. ఎల్ అండ్ టి లో పని చేశాను. అందరం చక్కగా సెటిల్ అయ్యాం. నాన్నగారు 1974లో అల్సర్‌తో బాధపడుతూ కన్ను మూశారు. అదే సంవత్సరం నాన్నగారితోపాటు ఘంటసాల, ఎస్‌విఆర్ కూడా తుదిశ్వాస విడిచారు. ఆ మరుసటి సంవత్సరం రేలంగి గారు. మా తల్లిగారు సుదర్శనమ్మ 93 ఏళ్లపాటు జీవించి ఇటీవలే అంటే 2018 అక్టోబరులో నాన్నగారిని చేరుకున్నారు. నాకు ఒకర్తే అమ్మాయి. హైదరాబాద్ ఏఎండిలో పనిచేస్తోంది. అల్లుడు కూడా అదే కంపెనీలో పని చేస్తున్నారు.
వ్యవసాయ కుటుంబం..
నెల్లూరు దగ్గర జగదేవిపేట నాన్నగారి జన్మస్థలం. మాది వ్యవసాయ కుటుంబం. తాతగారు నాన్నగారి చిన్నప్పుడే పోవడంతో నాన్న ఇంటర్ తో చదువు ఆపేశారు. చెన్నై వచ్చాక, సోషల్ లైఫ్ బాగా పెరగటంతో మంచి ఇంగ్లీషు నేర్చుకోగలిగారు. నాన్నగారిది మేనరికం. అమ్మగారిది కోవూరు. నాన్నగారికి ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికితే మమ్మల్నందరినీ ఎక్కడికైనా తీసుకువెళ్లేవారు.
రిజర్వ్‌డ్..
స్నేహితులతో బాగా మాట్లాడేవారు. ఇంట్లో మాత్రం చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. అప్పుడప్పుడు ప్రివ్యూలకు వెళ్లేవాళ్లం. నాన్నగారు విడిగా, మేమందరం విడిగా వెళ్లేవాళ్లం. అంత రిజర్వ్‌డ్‌గా ఉనా, పిల్లలు అడిగినదేదీ కాదనేవారు కాదు. బాగా బిజీగా ఉన్న రోజుల్లో రోజుకి రెండు మూడు షిఫ్టులు పనిచేయటం వల్ల నాన్నగారు ఇంట్లో చాలా తక్కువసేపు ఉండేవారు. అందుకే మాతో ఎక్కువసేపు గడపటానికి అవకాశం ఉండేది కాదు. ఒకసారి నాన్నని చూడటానికి ఎస్.వి. రంగారావు గారు మా ఇంటికి వచ్చారు. నేను ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చాను. ఆయన నా చేతిలో కాఫీ అందుకుంటూ, ‘అబ్బాయి ఏం చేస్తున్నాడు?’ అని నాన్నను అడిగారు. ఆయన వెంటనే చెప్పలేక నా వైపు చూశారు. మా చదువు గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేవారు.
చిన్న వయసు – పెద్ద పాత్రలు
చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాలు వేయటం సరదా. చదువుకునే రోజుల నుంచే నాటకాలు వేయటం ప్రారంభించారు. ఆ తరవాత సినిమాలలోకి ప్రవేశించారు. నాన్నగారు నటించిన మొదటి సినిమా ‘మానవతి’. శంకర్‌రెడ్డిగారు నాన్నగారికి మొదటి అవకాశం ఇచ్చారు. ‘చరణదాసి’ లో సూర్యకాంతం గారికి కొడుకు వేషం వేశారు. రేలంగి గారి కంటె నాన్నగారు వయసులో కొద్దిగా చిన్నవారే. కాని ఇంచుమించు అన్ని సినిమాలలోను ఆయనకు తండ్రి, మామగారు పాత్రలే పోషించారు నాన్నగారు.
నాన్న సినిమాలు..
సాధారణంగా అందరూ విజయవంతమైన సినిమాలలోని పాత్రలనే గుర్తుపెట్టుకుంటారు. ఫెయిల్ అయినవాటిని మర్చిపోతుంటారు. ‘గంగ గౌరి సంవాదం’ సినిమాలో నాన్నగారు భగ్న ప్రేమికుడు. కృష్ణకుమారి హీరోయిన్. నాన్నగారు చాలా డిఫరెంట్‌గా నటించిన సినిమా అది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. అది గుర్తుపెట్టుకోలేకపోయారు. ‘గుండమ్మ కథ’ సినిమాలో నాన్నగారు, రామారావు గారు, సూర్యకాంతం గారు... ఈ ముగ్గురి గురించే మాట్లాడుకునేవారు. అప్పట్లో ఒక సినిమా శతదినోత్సవం జరుపుకుంటే ఘనంగా ఉండేది. జగపతి వారి మొదటి సినిమా ‘అన్నపూర్ణ’ వేడుకలు విజయ గార్డెన్స్‌లో చేశారు. దానికి నాన్నగారు కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. అందరూ ఎదురు వచ్చి తప్పట్లు కొడుతూ వేదిక మీదకు ఘనంగా, సంతోషంగా తీసుకెళ్లారు.
పొరపాటు జరిగింది..
నాన్నగారి దగ్గర రాధాకృష్ణమూర్తి అనే ఆయన మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయన చాలా నమ్మకస్థుడు. అనుకోకుండా ఒకసారి చిన్న పొరపాటు జరిగింది. ఒకేరోజు మూడు ప్రొడక్షన్స్‌కి కాల్‌షీట్లు ఇచ్చేశారు. మూడు సినిమాల లోనూ పెద్ద నటులతో కలిసి నటించాలి. దాంతో నాన్న ఇరుకున పడ్డారట. అయినప్పటికీ ఆయనను ఏమీ అనలేదట. నాన్నగారు పోయిన రెండో రోజున ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పారు. ఆయనకు నాన్నగారంటే విపరీతమైన అభిమానం.
అల్లు రామలింగయ్య..
ఇంజినీరింగ్ ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా చదువుకోవటం వల్ల అందరికీ నేను గుర్తుండిపోయాను. నాన్నగారు పోయిన రెండు సంవత్సరాల తరవాత ఆఫీస్ పని మీద హైదరాబాద్ సరోవర్ హోటల్‌కిlవచ్చాను. అక్కడ అల్లు రామలింగయ్య గారు నన్ను చూసి పలకరించి, నాన్నగారితో ఉన్న అనుబంధం గురించి చాలా సేపు ముచ్చటించారు. చెన్నైలో ఉన్న రోజుల్లో నేను ఆయనను చాలాసార్లు చూశాను. కాని ఎన్నడూ ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. ఆయన నన్ను గుర్తు పెట్టుకుని, పలకరించార ంటే నేను రమణారెడ్డిగారి అబ్బాయిని కాబట్టే కదా!
మెజీషియన్...
పాత ‘అక్కచెల్లెళ్లు’ సినిమాలో నాన్నగారిది మెజీషియన్ పాత్ర. దానికోసం నాన్నగారు మ్యాజిక్ నేర్చుకున్నారు. ఆయనకు మ్యాజిక్ అంటే సరదా ఉండటం వల్ల, ఆ తరవాత చాలా ప్రదర్శనలిచ్చారు. అందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. సినిమాల వల్ల డబ్బులు సంపాదిస్తే, మ్యాజిక్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు. 1957 లో నెల్లూరు టౌన్‌హాల్‌లో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. ఆ రోజున ఘంటసాల గారి కచేరీ కూడా ఉంది. ‘ఘంటసాల మ్యూజిక్, రమణారెడ్డి మ్యాజిక్’ అని పబ్లిసిటీ ఇచ్చారు. నాన్నగారు చివరి ప్రదర్శన ఢిల్లీలో జరిగింది.
మంచి స్నేహం..
నాన్నను అందరూ ‘రమణయ్యా’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆ రోజుల్లో స్నేహాలు బావుండేవి. నాన్నగారి స్నేహితులు ఒకాయన ఒక చిత్రంలో నాన్న నటించిన పాత్రకు వచ్చిన పారితోషికం తీసుకుని, ‘దీని గురించి నువ్వు నన్ను అడగకు’ అన్నారు. ఆ డబ్బులతో హైదరాబాద్‌లో ఒక స్థలం కొని, ఆ కాగితాలను, మిగిలిన డబ్బును మా చెల్లాయి పెళ్లి సమయంలో అందచేశారు. ఆ రోజు నాన్న కళ్లలో కనిపించిన ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేను. అంత మంచి స్నేహాలుండేవి.
అదే నంబరు నేటికీ...
1963 దాకా మా ఇంట్లో ఫోన్ లేదు. మా మొట్టమొదటి ఫోన్ నెంబరు 42537 ఇప్పటికీ అదే నెంబరులోని ఆఖరి మూడు డిజిట్లు కంటిన్యూ అవుతున్నాయి. నాన్నగారిది చాలా సింపుల్ లైఫ్. ఇంట్లో తీరికగా ఉన్నప్పుడు ఆంధ్ర క్లబ్‌కి కాని, టి. నగర్ క్లబ్‌కి కాని వెళ్లేవారు. ఆ సమయంలో డ్రైవర్ రాకపోతే నా సైకిల్ మీద వెళ్లిపోయేవారు.
అజాత శత్రువు..
1964 టైమ్‌లో మా పెద్ద నాన్నగారి అబ్బాయి టి. సుబ్బిరామిరెడ్డి (మా నాన్నగారు, వాళ్ల నాన్నగారు అన్నదమ్ములు) కాంట్రాక్ట్‌లు చేస్తున్నారు. నాన్నగారు హైదరాబాద్ వచ్చారని తెలిస్తే, షూటింగ్ చూడటానికి వచ్చేవారు. ఒకసారి నాగార్జున సాగర్ నుంచి సారథి స్టూడియోకి వచ్చి, ‘మా చిన్నాయన రమణారెడ్డిని చూడటానికి వచ్చాను’ అని చెప్పారు. నాన్నగారు ఆయనను అందరికీ పరిచయం చేశారు. సుబ్బిరామిరెడ్డిగారికి సినిమాల పరిచయం అప్పుడే కలిగింది. అలా ఆయనకు సినిమాల మీద మోజు బయలుదేరింది. సినిమాలలో ఎన్నో నెగిటివ్ పాత్రలుæవేసినా, నాన్నని అందరూ గౌరవించేవారు. ప్రేమించేవారు. నాన్నగారికి అజాతశత్రువు అని పేరు. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: సురేశ్ కుమార్ ఎ.
అకాల భోజనంతో...
చిన్నప్పటి నుంచి నాయనకు అల్సర్లు ఉండేవి. ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అది అప్పుడప్పుడు బాధిస్తుండేది. అప్పట్లో సరైన వైద్యం కూడా లేదు. మూడు షిఫ్టులు పని చేస్తూండటం వల్ల అకాల భోజనంతో, తరచు ఆరోగ్యం దెబ్బ తినేది. 1968లో ఆపరేషన్ చేయించుకున్నారు. నెలరోజులపాటు కాల్‌షీట్లు తీసుకోలేకపోవటంతో, అవకాశా లు తగ్గిపోయాయి. ఆ తరవాత సినిమాలలో అతిథి పాత్రలలో మాత్రమే నటించారు. అంతకంటె చేయలేకపోయారు. ఆ సమయంలోనే ‘మనసు – మాంగల్యం’, ‘శ్రీమంతుడు’ చిత్రాలలో పూర్తి స్థాయి పాత్ర చేశారు. 1974లో అల్సర్ తిరగబెట్టింది. ఆపరేషన్ చేసిన నాలుగు నెలలకు ఆయన కన్నుమూశారు. నాన్నగారు పోయేనాటికి నా వయసు 28 సంవత్సరాలు. కుటుంబ బాధ్యత నాదే. అప్పటికి ఒక చెల్లాయికి మాత్రమే వివాహమైంది.
Comments
Please login to add a commentAdd a comment