మాయామాటల బజార్‌ | Mayabazar Movie Special Story | Sakshi
Sakshi News home page

మాయామాటల బజార్‌

Published Mon, Aug 26 2019 6:35 AM | Last Updated on Mon, Aug 26 2019 6:35 AM

Mayabazar Movie Special Story - Sakshi

మాయాబజార్‌’ చిత్రంలోని సన్నివేశాలు

తెలుగు.. ఇంగ్లిష్‌ అయిపోతోంది అని ఇంగ్లిష్‌ పదాలను పలకడానికి.. మట్లాడ్డానికి వీల్లేని తెలుగు పదాలతో సమం చేస్తే సబబా? బాగుంది.. మరి తెలుగు తేనెలూరేదెట్లా? బహు బాగుంది.. మాయాబజార్‌ ఎన్ని కొత్త తెలుగు పదాలను కనిపెట్టలేదు? పింగళి నాగేంద్రరావు, కేవీ రెడ్డితో కలిసి సృష్టించిన ఆ మాటల మాయలో పడి ఇంకా కొట్టుకుపోతూనే ఉన్నాం! ఆ నిఘంటువు ఆంగ్లపదాలకు తెలుగు సమానార్థకాలను కనిపెట్టే క్లూ ఇస్తుందేమో ..చదువుదాం..

అస్మదీయులకు వ్యతిరేక పదం యుష్మదీయులు. సంస్కృతంలో ఉన్న అస్మత్, యుష్మత్‌ శబ్దాలకు కొత్త భాష్యం చెప్పారు పింగళి. అరవయ్యేళ్ల కిందటే కొత్త భాషను సినిమాలో పరిచయం చేశారు కె. వి. రెడ్డి, పింగళి నాగేంద్రరావు జంటగా. అచ్చతెలుగు పేర్లతో సినిమాలు వచ్చే రోజుల్లోనే మాయా బజార్‌ అనే ఉర్దూ పదంతో ఉన్న తెలుగు పౌరాణికాన్ని వెండి తెర మీద మెరిపించి ప్రేక్షకులను మురిపించారు. కొత్త కొత్త పదాలను కనిపెట్టి, ప్రయోగించారు..వాటితో ఆడుకున్నారు. అవి నిజంగా ఉన్న పదాలేమో అన్నంతగా మాటల్లో కలిపేశారు. పింగళి నాగేంద్రరావు సంస్కృతం బాగా అధ్యయనం చేసి, పాణినిని ఔపోసన పట్టి ఉంటారు. అందుకే సంస్కృత వ్యాకరణంలోని ఎన్నో పదాలను, ప్రత్యయాలను తెలుగు చేసేశారు. అస్‌ మస్‌ థస్, ఏ భ్యామ్, భ్యస్‌... అంటూ సంస్కృత ప్రత్యయాల గురించి తెలియనివారికి ఇవి నిజంగా మంత్రాలే అన్నంతగా భాషలో ఇమిడిపోయేలా చేశారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కాని, ప్రత్యయాలు మాత్రం మంత్రాలుగా వచ్చి కూర్చున్నాయి.

కోపధారి.. హైహై నాయకా
శ్రీకృష్ణుడు వాసుదేవుడైతే, బలరాముడు మాత్రం తక్కువా! ఆయన్ని బలరారామదేవుని చేశారు మాయాబజార్‌లో పింగళి. ‘ముక్కోపాని’ కి విరుగుడుగా ‘ముఖస్తుతి’ని కనిపెట్టారు. శరధారి, బాణధారి లాగ ‘కోపధారి’ అంటూ సంకర ప్రయోగం చేశారు. ఘటోత్కచుని అనుయాయుడికి ‘దుందుభి’ అని పేరు పెట్టారు. ఈ సినిమాలోని ‘బహుబాగుంది’ అనే పదప్రయోగాన్ని నలభై సంవత్సరాల తరవాత వచ్చిన ‘భైరవద్వీపం’ అనే సినిమా కూడా వాడుకున్నది.  ‘మీరన్నది బాగుంది నేనన్నది బహుబాగుంది’ అంటూ! ఇంగ్లిష్‌ హాయ్‌ని తెలుగైజ్‌ చేసి ‘హైహైనాయకా’ అంటూ గొప్పనాయకుడికి జేజేలు పలికించారు. పాండవుల ప్రతాపాలు, దేవగురుడు, కొండాడవలదే, ఘనకీర్తి కొట్టవలదే అంటూ కొంగొత్త పదాలను చెక్కారు. అన్నమయ్యలాగ ‘చిన్నమయ్య’ పేరును సృష్టించారు. ‘శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం... మిత్రులను రక్షించాలి శత్రులను భక్షించాలి’ అంటూ శత్రువు, మిత్రువులలోని ‘వు’ ని లోప సంధి చేశారు.

దుషటచతుషటయం
మనిషిని పలకరించగానే ‘ఏంటి’ అనడాన్ని ఆంగ్ల ‘వై’ తో ‘వై నాయకా’ అంటూ ఆనాడే టెంగ్లిష్‌ను భాషించారు. బకాసురుడు, శకటాశురుడు వీళ్లేనా రాక్షసులు, నేనూ ఒక రాక్షసుడిని సృష్టిస్తాను అంటూ ‘‘కుడ్యాసురా’ అనే గోడ రాక్షసుడిని పుట్టించారు. ‘కోర్‌ కోర్‌ శరణు కోర్‌’ అంటూ తెర వెనకాల పలికించిన పద్ధతిని నేటికీ దర్శకులు అనుసరిస్తున్నారు. ‘అసమదీయులు’ అంటే ‘మనవాళ్లు’ అని నాడు మాయాబజార్‌ చెప్పిన కొత్త అర్థం ఈరోజు రాజకీయాల్లో మనవాళ్లకు ఓ పర్యాయపదంగా ఎలా స్థిరపడిందో వేరే చెప్పాలా?  పైగా ‘ఎవడూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?’ అంటూ కొత్త పదాల ప్రయోగాన్ని సమర్థించుకున్నారు కూడా. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులను కలిపి దుష్టచతుష్టయమని కాక ‘దుషటచతుషటయం’ అని సినిమాలో లంబూజంబూలు విడివిడిగా తప్పుగా పలికిన మాటనూ ‘‘ఆ దుష్టచతుష్టయాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడిపొడి చేసేయాలి’ అని ఘటోత్కచుడి సమయస్ఫూర్తితో సరిచేశారు. ‘తక్షణ కర్తవ్యం’ని ప్రయోగిస్తూనే ‘తక్షణ సమస్య’నూ వదిలారు. తండ్రి పితృపాదులైతే తాతను ‘తాతపాదులు’ చేశారు. అంతేనా లక్ష్మణకుమారుడి నోట ‘సభాపరికి’ అనే మాటను పలికించి దాన్నీ పాపులర్‌ చేశారు.

అం..అః .. ఇం.. ఇః... ఉం..ఉః
అచ్చులలో ఆఖరి అక్షరాలు ‘అం అః’ లకు మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘ఇం ఇః ఉం ఉః’లను జన్మకునిచ్చారు. ఎవరైనా జైత్రయాత్రకు వెళ్తారు, తీర్థయాత్రకు వెళ్తారు. కాని ఇందులో ‘యుద్ధయాత్రకు’ బయలుదేరుతారు.

‘ఏనుగులు మింగావా! పర్వతాలు ఫలహారం చేశావా’ అని వృద్ధరూపంలో ఉన్న శ్రీకృష్ణులవారితో కోపంగా సరసపలుకులు ఆడించారు. ‘వంకాయ, బెండకాయ, బూడిద గుమ్మడికాయ’ అనగానే పసుపుతాడు, పలుపుతాడు, పడతాడు గుర్తు రాకమానదు.  ‘వహ్వారే అప్పడాలు’, ‘మఝారే అప్పళాలు’ అంటూ తెలుగు వంటకాలకు ఉర్దూ కితాబులిచ్చారు. ‘ఓహోరే అరిసెలుల్ల’, ‘భళీరే లడ్డులందు’ అంటూ కొత్త విశేషణాలతో తీపిని అద్దారు. ఇక కంబళి గింబళి, తల్పం గిల్పం... ఇంటింటా వాడుక పదాలు అయిపోయాయి. కంబళికి అప్పగారు గింబళి, తల్పం కంటె పెద్దది గిల్పం అంటూ ఆ పదాలకు అర్థాలూ చెప్పేశారు. అస్తు అస్తు, ‘గోభ్రాంతి,  సమాధి భ్రాంతి’.. ఇలా ఎన్నని గుర్తుపెట్టుకోగలం! ఈ పదాలతో ఒక నిఘంటువునే తయారుచేయొచ్చు. పాదపీడనం తరవాత కరపీడనం చేయించాలి. కాని మాయాబజార్‌లో పింగళి.. పాణిగ్రహణం బదులుగా పాణిపీడనం చేయించారు. కన్నుల వెన్నెల కాయించారు, మనసున మల్లెలు పూయించారు.ఈ పదాల లాహిరిలో తెలుగు జగమంతా ఊగుతూనే ఉంది.– వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement