హహ్హహహ్హహహ్హహా..! | diwali special recipes | Sakshi
Sakshi News home page

హహ్హహహ్హహహ్హహా..!

Published Fri, Oct 17 2014 10:41 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

diwali special recipes

... వివాహభోజనంబు.. వింతైన వంటకంబు..
 వియ్యాలవారి విందు.. ఒహ్హొహ్హొ  నాకె ముందు!
 ఔరౌర గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల...
 ఒహోరే అరిసెలుల్ల... ఇయెల్ల నాకె చెల్ల...
 పెళ్లి భోజనం ఎలా ఉందో... అధరాన్ని, ఉదరాన్ని
 మధురంగా ఊదరగొడుతూ
 పంచేంద్రియాలనూ అదిలించి కదిలిస్తారు
 ‘మాయాబజార్’ సినిమాలో ఎస్వీ రంగారావు!
 గారెలు, బూరెలు, అరిసెలేనా?
 లడ్లు, జిలేబీలు, అప్పడాలు..
 పులిహోర దప్పళాలు.. పాయసాలు...
 ఎన్ని లేవు ఆ లిస్టులో!
 వాటిల్లో ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని కలిపి ఇవాళ మీ చేత లొట్టలు వేయించబోతోంది ‘ఫ్యామిలీ’!
 వివాహభోజనానికి ఏ మాత్రం తక్కువకాని ఈ దీపావళి భోజనాన్నిహహ్హహహ్హహహ్హహా... అంటూ ఆరగించండి.
 మీ ఆత్మీయులకు కొసరి కొసరి తినిపించండి.
 హ్యాపీ దీపావళి!  

 
సజ్జప్పాలు లేదా హల్వా పూరీ
 
కావలసినవి:   
స్టఫింగ్ కోసం... బొంబాయి రవ్వ - కప్పు; పంచదార - కప్పు; నీళ్లు - రెండున్నర కప్పులు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
 
పై భాగం కోసం...  మైదా పిండి - కప్పు; ఉప్పు - చిటికెడు; నూనె - అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి); నూనె - డీప్ ఫ్రైకి తగినంత
 
 తయారీ:
 బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి  
 
 అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి  
 
 ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార  జత చేయాలి
 
 బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి  
 
 ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి
 
 చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి
 
 బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి  
 
 ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి.
 
 జిలేబీ
 
కావలసినవి:  
మైదా పిండి - కప్పు; బేకింగ్ పౌడర్ - అర టీ; స్పూను; పెరుగు - కప్పు; నూనె - వేయించడానికి తగినంత; పంచదార - కప్పు; కుంకుమ పువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - పావు టీస్పూను; మిఠాయి రంగు - రెండు చుక్కలు; రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారీ:
 ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి  
 
 మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసా వంటి దానిలో ఈ మిశ్రమాన్ని పోయాలి  
 
 ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేయాలి
 
 బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి (మంట మధ్యస్థంగా ఉండాలి)
 
 పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి  
 
 బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి  
 
 వేడివేడిగా అందించాలి.
 
 అప్పడాల కూర
 
మీకు అప్పడాలంటే ఇష్టం ఉంటే, ఈ కూరను కూడా ఇష్టపడతారు. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. రాజస్థానీయులు ఎక్కువగా తయారుచేసే ఈ కూరను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు.
 
 కావలసినవి:  
 అప్పడాలు - పావు కిలో; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; నెయ్యి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; ఉల్లి తరుగు - పావు కప్పు; అల్లం ముద్ద - టీ స్పూను; వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; చిక్కగా గిలక్కొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
 
 తయారీ:
 అప్పడాలను నూనెలో వేయించి నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి (మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు)  
 
 స్టౌ (సన్నని మంట) మీద బాణలి ఉంచి, నెయ్యి లేదా నూనె వేసి,  కాగాక జీలకర్ర వేసి వేయించాలి  
 
 ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి   
 
 పెరుగు, కప్పుడు వేడి నీళ్లు జత చేయాలి  
 
 అప్పడం ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి, కొద్దిసేపు ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీరతో అలంకరించి, అన్నంతో వడ్డించాలి.
 
 దప్పళం
 
కావలసినవి:  
కందిపప్పు - పావు కప్పు; బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - చిన్న కట్ట; చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు - అర కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; దొండకాయ ముక్కలు - పావు కప్పు; అరటికాయ ముక్కలు - పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు - కప్పు; సొరకాయ ముక్కలు - అర కప్పు; సెనగ పిండి - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; కారం - 2 టీ స్పూన్లు;
 
 పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - కొద్దిగా
 
 తయారీ:
 పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి
 
 ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాక, మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి
 
 సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి  
 
 కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి  
 
 ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి.
 
 పేణీ లడ్డు
 
 కావలసినవి:
 సెనగపిండి - కప్పు; పేణీ - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారీ:
 స్టౌ (సన్న మంట) మీద బాణలి ఉంచి సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి  
 
 మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చేసి, సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి  డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి  
 
 కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి.
 
పేణీ పాయసం

పాలు వేడి చేసి, బెల్లం పొడి జత చేసి కలిపాక, డ్రై ఫ్రూట్ పొడి జత చేయాలి  
 
 ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి  
 
 తేనె వేసి బాగా కలిపి బాగా చల్లారాక అందించాలి.
 
 కట్టె పొంగలి
 
 కావలసినవి:  
 బియ్యం - ముప్పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; మిరియాల పొడి - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చి మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను; జీడిపప్పులు - 10; కరివేపాకు - 2 రెమ్మలు; నెయ్యి - 5 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత
 
 తయారీ:
 బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి  
 
 పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి
 
 బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాక, జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి  
 
 కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి, అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి
 
చట్నీ, సాంబారులతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
 
సేకరణ: డా. వైజయంతి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement