పాతాళ భైరవి.. 1951లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో 28 కేంద్రాలలో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకొన్న మూవీ. కేవీ రెడ్డి డైరక్షన్‌లో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావులు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐతే తోటరాముణ్ణి బలిచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడ్ని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ.
(చదవండి: తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు)
మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఓ కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి పాంటసీ ఫిలిం చేయాలనే ఆలోచన రావడం.. అనుకున్నదాన్ని అత్యద్భుతంగా తీసి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.
పాతాళభైరవిలో తోటరాముడి రోల్‌కు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను అనుకున్నారట డైరక్టర్. ఓ రోజు వాహినీ స్టూడియో ప్రెమిసెస్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు టెన్నిస్ ఆడుతుంటే కేవీరెడ్డి అక్కడికొచ్చారు. ఇద్దరు హీరోలూ ఆటలో లీనమైపోయారు. రెండు మూడు సార్లు బాల్ రాకెట్‌కు తగలకపోవడంతో ఎన్టీఆర్‌కు కోపమొచ్చి నెక్ట్స్ బాల్‌ను బలంగా బాదారట. దాంతో అది అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్‌ను పట్టుకున్న విధానం డైరక్టర్ కేవీ రెడ్డికి బాగా నచ్చేయడంతో తోటరాముడి రోల్‌కు ఆయన్ను సెలక్ట్ చేసుకున్నారట. హీరోగా పెద్దగా ఇమేజీ లేని యాక్టర్‌ను తీసుకోవడంతో విలన్‌ను కూడా ముక్కామల కాకుండా కొత్తవాడై ఉండాలని ఎస్వీఆర్‌ను తీసుకున్నారట. అంటే అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు ఇద్దరూ కూడా పెద్దగా పేరున్న నటులు కాదన్నమాట.
(చదవండి: టీమిండియా జట్టు వరకు పాకిన 'పుష్ప' క్రేజ్)
అప్పట్లో సినిమాలకు డూప్‌లుండేవారు కారు. పాతాళభైరవిలోనూ ఎక్కడా డూప్‌లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4.30గంలకే ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లు వాహిని స్టూడియోకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సాండ్ కోర్టులో ఫైట్స్ రిహార్సిల్స్ చేసేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలట. అంతేకాదు విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ఒప్పందం కూడా జరిగిపోయింది. ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్, మార్కస్ బార్‌ట్లే కెమెరా మాయాజాలం సినిమాకు ప్రాణం పోశాయి.
1952 జనవరిలో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారత్ నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక సినిమా పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా సినిమా కూడా ఇదే. తెలుగులో 1951 మార్చి 15న రిలీజైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లో జితేంద్ర హీరోగా ఇదే సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ హిందీలో కలర్‌లో తీశారు. ఈ సినిమాలోని సాహసం సేయరా డింభకా.. రాకుమారి దక్కునురా.. అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.
- అలిపిరి సురేష్
Comments
Please login to add a commentAdd a comment