సినీసౌధానికి పునాదిరాయి ‘పాతాళభైరవి’
ధైర్యం చేసినప్పుడే విజయం వరిస్తుంది. సాహసం చేసినప్పుడే సంతృప్తి లభిస్తుంది. అది జీవితంలోనైనా... సినిమాలోనైనా! ఈ విషయాన్ని ఏడు దశాబ్దాల క్రితం ఓ భారీ బ్లాక్ అండ్ వైట్ సినిమా... పంచరంగుల్లో నిరూపించింది. నిర్మాణ వ్యయంలో, సాంకేతిక విలువల్లో, సంగీతంలో, సంభాషణల్లో, చివరకు రిలీజులోనూ చేసిన సాహసం ఎందరినో స్టార్లను చేసింది. నిర్మాతలతో పాటు పరిశ్రమకూ ఓ స్థాయి తెచ్చింది. పింగళి నాగేంద్రరావు రచనతో, కె.వి. రెడ్డి దర్శకత్వంలో విజయా సంస్థపై ఎన్టీఆర్, యస్వీఆర్ తదితరులతో నాగిరెడ్డి – చక్రపాణి చేసిన సాహసం... డెబ్భై ఏళ్ళు గడిచినా ఇవాళ్టికీ బలహీనులకూ, బాక్సాఫీస్ గ్రామర్ కూ ఓ పెద్ద బాలశిక్ష.
సినీసౌధానికి పునాదిరాయిగా...
వందేళ్ళ క్రితం 1921 ప్రాంతంలో తెలుగు వారు మూగచిత్రాలు తీయడం మొదలుపెట్టినప్పుడు సిన్మా ఓ కొత్త ప్రక్రియ. తర్వాతి రోజుల్లో అది ఓ మాధ్యమం. అటుపైన పెరిగిన పరిశ్రమ. ఇవాళ సినిమా – జీవితంలో క్రికెట్‌తో పాటు భాగమైన ఓ మతం. పేరుప్రతిష్ఠలు, వ్యాపార విస్తృతి, వాణిజ్య లాభం – ఇలా అన్నింటిలోనూ తెలుగు సినిమా ఎదగడంలో పునాదిగా నిలిచిన తొలితరం సినిమాల్లో మూలస్తంభం – ‘పాతాళభైరవి’. తమిళ మార్కెట్ కూడా కలిసొచ్చేలా, ఏకకాలంలో రెండు భాషల్లో సినిమా తీసే లాభదాయక ధోరణిని ‘పాతాళభైరవి’తో సక్సెస్‌ఫుల్‌గా ఆచరణలోకి తీసుకొచ్చారు – మన దర్శక, నిర్మాతలు.
ధైర్యే సాహసే ‘విజయ’లక్ష్మీ...
నిరాశ ముంచెత్తినప్పుడే ధైర్యం కావాలి. సాహసం చేయాలి. 1949లో నిర్మాణ కష్టాల్లో ఉన్న వాహినీ స్టూడియోస్‌ను లీజుకు తీసుకొని, విజయా ప్రొడక్ష¯Œ ్సను స్థాపించిన నాగిరెడ్డి – చక్రపాణి వరుసగా సినిమాలు తీద్దామనుకొన్నారు. తొలిగా ‘షావుకారు’ తీస్తున్నారు. అప్పుడే వాహినీ ‘గుణసుందరి కథ’ (1949 డిసెంబర్ 29) హిట్ అయింది. ఆ జానపదం తీసిన కె.వి. రెడ్డితోనే విజయా వాళ్ళు మరో జానపదం ‘పాతాళభైరవి’ మొదలుపెట్టారు. ఇంతలో ‘షావుకారు’ (1950 ఏప్రిల్ 7) రిలీజై, పేరొచ్చినంత డబ్బు తేలేదు. అయినాసరే భారీ ‘పాతాళభైరవి’ సాహసం నిర్మాతలు ఆపలేదు. ఒకటికి 2 భాషల్లో తీశారు.
అక్కడి అద్భుతదీపం.. ఇక్కడి పాతాళభైరవి
చందమామ తరహా కథ ‘పాతాళభైరవి’. అరేబియన్ నైట్స్‌లోని ‘అల్లావుద్దీన్ – అద్భుతదీపం’ కథను మన నేటివిటీకి తగ్గట్టు మార్చేశారు రచయిత పింగళి. కె.వి. రెడ్డి స్క్రీన్‌ప్లే రచనకు సహ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తన వంతు తోడ్పాటునిచ్చారు. ‘షావుకారు’ను పొదుపుగా పరిమిత సౌకర్యాలతో తీసిన విజయా సంస్థ ఇక పెద్ద ఆట ఆడాలని సాహసించడంతోనే ‘పాతాళభైరవి’కి కళాదర్శకుడు గోఖలే సారథ్యంలో కళాధర్ నిర్వహణలో భారీ సెట్లు వేయించింది. గెటప్స్ చేయించింది. నిర్మాణ విలువల్ని పెంచేసింది. మార్కస్ బార్ట్లీ కెమెరా మాయాజాలం, ‘డింగరీ’లాంటి మాటలు, చిరకాలం గుర్తుండే ‘సాహసం శాయరా డింభకా’లాంటి డైలాగులు, ‘కలవరమాయే మదిలో..’ లాంటి ఘంటసాల – లీల పాటలు, హేమండ్ ఆర్గాన్ లాంటి విశిష్ట వాద్యాలతో మాస్టర్ వేణు బృందం కూర్చిన ఆర్కెస్ట్రయిజేషన్ – ఇలాంటివన్నీ తోడయ్యాయి. అప్పట్లో వాహినీ స్టూడియోలో శబ్దగ్రహణ శాఖలో పనిచేస్తున్న నేటి మేటి దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ సినిమాకు సౌండ్ అసిస్టెంట్‌గా చేయడం విశేషం. వెరసి, ఈ వీరరస ప్రధాన ప్రేమకథ రసవత్తరంగా తయారైంది.
వరుస ఫ్లాపుల మధ్యలోనూ...
నిజానికి జానపదాలు వరుసగా ఫ్లాపవుతున్న రోజులవి. ‘షావుకారు’, ‘జీవితం’, ‘సంసారం’ హిట్టయి, సాంఘికాలదే పైచేయనుకుంటున్న సమయం. ఆ వాతావరణంలో దర్శక, నిర్మాతలు చేసిన ఖరీదైన జానపద సాహసం ‘పాతాళభైరవి’. ఆ సాహసం ఫలించి, తరువాత మరో రెండు దశాబ్దాల దాకా జానపద కథలకు కమర్షియాలిటీని నిలిపింది. అలాగే, బొంబాయి పలు ప్రాంతీయ సినీ పరిశ్రమలకు కేంద్రమైనా, అక్కడ హిందీ చిత్రపరిశ్రమే ఎదిగింది. మర్రిచెట్టు లాంటి హిందీ పరిశ్రమ కింద మిగతావి ఆ స్థాయిని అందుకోలేకపోయాయి. కానీ, మద్రాసులో మన చిత్ర పరిశ్రమ పరిస్థితి వేరు. ప్రధానమైన తమిళ పరిశ్రమతో పోటాపోటీగా నిలబడింది. భారీగా ఎదిగింది. ఆ పరిణామంలో 1950ల నుంచి విజయ సంస్థ, వాహినీ స్టూడియో, ఎన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్, సావిత్రి లాంటి స్టార్ల భాగస్వామ్యం, ‘పాతాళభైరవి’ లాంటి సినిమాల పాత్ర ఉంది.
సౌత్‌లో తొలిసారి రికార్డు ప్రింట్లు
కథగా పాతాళభైరవి చాలా సింపుల్. రాకుమారి (మాలతి) ప్రేమ కోసం నేపాళ మాంత్రికుడి (యస్వీఆర్) వెంట వెళతాడు తోట రాముడు (ఎన్టీఆర్). కోరిన కోర్కెలు తీర్చే పాతాళభైరవిని సాధిస్తాడు. దుష్టమాంత్రికుణ్ణి ఆఖరికి వధిస్తాడు. ఆసక్తికరమైన కథ, ఆగకుండా సాగే కథనంతో ‘పాతాళభైరవి’ అందరినీ ఆకట్టుకుంది. రిలీజ్ ముందు అనుమానాలు వ్యక్తమైనా, తొలి వారాల్లో విభిన్న స్వరాలు వినిపించినా అవేవీ హిట్‌ను ఆపలేదు.
అప్పట్లో తెలుగు సినిమాల వ్యాపారం 10 – 15 ప్రింట్లతోనే జరిగేది. కానీ, 1951 మార్చి 15న విడుదలైన తెలుగు ‘పాతాళభైరవి’ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. అలా మొదట 13 కేంద్రాల్లో విడుదలై, పది కేంద్రాల్లో వంద రోజులు, మిగతా 3 కేంద్రాల్లో 90కి పైగా రోజులు ఆడింది. పెరిగిన ప్రజాదరణతో, ఫస్ట్ బ్యాచ్‌లోనే మొత్తం 60కి పైగా ప్రింట్లు తీశారు. ఇక, తెలుగు, తమిళం – రెండూ కలిపితే అప్పట్లోనే 100 ప్రింట్లు తీసిన తొలి సినిమా దక్షిణాదిలో ఇదే! ఆ తరువాత ఇన్నేళ్ళలో పదే పదే రీ–రిలీజైన ‘పాతాళభైరవి’కి మొత్తం మీద 500 ప్రింట్లు తీశారని ఓ లెక్క.
ఫస్ట్ డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ... ఫస్ట్ 200 డేస్...
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంకా ఏర్పడని ఆ రోజుల్లో, అప్పటి భౌగోళిక ప్రాంతాల ప్రకారం చూస్తే – ఆంధ్రా, నైజామ్, మైసూరు, మద్రాసు, మలబార్, బొంబాయి – ఇలా మొత్తం 6 విభిన్న భాషా ప్రాంతాలలోనూ శతదినోత్సవం చేసుకున్న తెలుగు సినిమా ఇదే. విజయవాడ, బళ్ళారి, బెంగుళూరు, గుడివాడ, నెల్లూరుల్లో ‘పాతాళభైరవి’ రజతోత్సవమూ చేసుకుంది. తెలుగు నాట ఒక సినిమా డైరెక్టుగా 25 వారాలు ఆడడం అదే తొలిసారి. అంతకు ముందు ఏయన్నార్ ‘బాలరాజు’ రజతోత్సవ చిత్రమే అయినా, ఏలూరులో షిఫ్టింగుతో అది 25 వారాలు ఆడిందనేది గమనార్హం. కాగా, ద్విశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు చిత్రమూ ‘పాతాళభైరవే’.
జాతకాలు మార్చిన సినిమా
విజయా వారి ‘పాతాళభైరవి’ ఎంతోమందికి కలిసొచ్చింది. జీవితాలను మార్చేసింది. ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగి, స్టారయ్యారు. నేపాళ మాంత్రికుడి పాత్ర అనన్య సామాన్యంగా పోషించి, యస్వీఆర్ తీరిక లేని నటుడయ్యారు. ఒక పాటలో నృత్యంలో కనిపించిన సావిత్రి ఆ తరువాతి అవకాశాలతో మహానటిగా తారాపథానికి ఎగిశారు. విజయా సంస్థ సుస్థిరమైపోయింది.
కె.వి. రెడ్డి స్టార్ డైరెక్టరైపోయారు. మంచి చిత్రాలకు చిరునామాగా నిలిచి, తెలుగు సినిమా పురోభివృద్ధికి దోహదం చేసిన అక్కినేని సొంత సంస్థ ‘అన్నపూర్ణా’ ప్రారంభచిత్రం (‘దొంగరాముడు)కు కె.వి. రెడ్డే దర్శకుడయ్యారు. అలాగే, విజయా సంస్థ శాఖోపశాఖలైంది. ‘వాహినీ’ స్టూడియోస్ కాస్తా ‘విజయ – వాహినీ’ స్టూడియోస్‌గా విస్తరించింది. సౌత్ ఈస్ట్ ఏషియాలోకెల్లా అతి పెద్ద ఫిల్మ్స్టూడియోగా అవతరించింది. దీని వెనక ‘పాతాళభైరవి’ మొదలు వరుస హిట్లతో నిర్మాతలకొచ్చిన ధనం, ధైర్యం ఉన్నాయి.
పదేళ్ళలో... ఆరు రీళ్ళు మిగిల్చే ఇమేజ్
‘పాతాళభైరవి’ తర్వాత విజయా సంస్థ ఎన్టీఆర్‌తో ఎన్నో హిట్స్ తీసింది. పదేళ్ళకు ‘జగదేకవీరుని కథ’ తీసినప్పుడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక్క యుద్ధం కూడా చేయలేదేమిటని నిర్మాత చక్రపాణిని అడిగారు. అందుకాయన, ‘‘పాతాళభైరవి అప్పుడంటే ఎన్టీఆర్ సాహసాల గురించి తెలీదు కాబట్టి అవే 6 రీళ్ళు చూపాం. ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది. ఎన్టీఆర్‌ను చూపిస్తే చాలు... జగదేకవీరుడని అర్థం చేసుకుంటారు. మళ్ళీ యుద్ధాలు తీయక్కర్లేదు. మాకు 6 రీళ్ళు మిగిలాయి’’ అని చమత్కరించారు. అదీ
పదేళ్ళలో ఎన్టీఆర్‌కు పెరిగిన ఇమేజ్!
ఋణం తీర్చుకున్న ఎన్టీఆర్...
కాలం ఎప్పుడూ ఒకే రీతిలో సాగదు. విజయాకూ, ఎన్టీఆర్ కెరీర్‌కూ పలు హిట్స్ అందించిన కె.వి. రెడ్డి కెరీర్ ఒక దశలో వెనుక పట్టు పట్టింది. ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ ఫ్లాపయ్యాక ‘విజయా’ సంస్థ ఆయనను దూరం పెట్టింది. ఒకప్పుడు సూపర్ హిట్లతో వెలిగిన దర్శకశ్రేష్ఠుడు చేతిలో సినిమాలు లేక, చదువు కోసం కొడుకును అమెరికాకు పంపేందుకు డబ్బు లేక అవస్థలు పడుతున్న సమయంలో ఎన్టీఆర్ తన గురుభక్తి చాటుకున్నారు. ఆ సందర్భంలో వయసుపై పడి, ఆరోగ్యం సహకరించని కె.వి. రెడ్డి ఓసారి ఆటోలో ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు. ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించి, అప్పటికప్పుడు పాతికవేలు చెక్కు రాసిచ్చారు.
అభిమానధనుడైన కె.వి. రెడ్డి, ‘‘నేను యాచించడానికి రాలేదు రామారావ్! ఏదైనా వర్క్ ఇస్తే చేస్తా’’ అన్నారు. వెంటనే ఎన్టీఆర్, ‘‘నేను మీ ఆత్మాభిమానానికి వెలకట్టడం లేదు గురువు గారూ! నా తదుపరి చిత్రానికి మీరే డైరెక్టర్. ఇది అడ్వాన్స్. పింగళి వారే రాసిన 3 స్క్రిప్టులు ‘శ్రీకృష్ణసత్య, చాణక్య శపథం, శ్రీరామ పట్టాభిషేకం’ నా దగ్గరున్నాయి. మీరు ఏది ఎంచుకుంటే, అది మీ దర్శకత్వంలో చేస్తా’’నన్నారు. ‘‘దర్శకత్వం వహించేందుకు ఆరోగ్యం సహకరించేలా లేద’’న్నారు కె.వి. ‘‘మీరు కుర్చీలో కూర్చొని పర్యవేక్షిస్తే చాలు. మీరు చెప్పినట్టు నేను తీస్తా’’ అని గురుభక్తి చాటారు ఎన్టీఆర్. శిష్యుడి గౌరవానికి కె.వి సంతోషించారు. ఆయన ఎంచుకున్న ‘శ్రీకృష్ణసత్య’ స్క్రిప్టునే, గురువు గారి వాంఛ తీర్చడం కోసం కలర్ సినిమాగా నిర్మించారు ఎన్టీఆర్.
సి.ఎం. సీటులో... ‘‘ఫాదర్’’ నాగిరెడ్డి!
కానీ తాము వద్దనుకున్న కె.వి.రెడ్డితో ఎన్టీఆర్ కృష్ణసత్య (’71) తీయడం విజయాధినేతలకు నచ్చలేదు. దాంతో, తమ ఆస్థాన హీరో ఎన్టీఆర్‌నే తమ తదుపరి ప్రాజెక్టుల్లో దూరం పెట్టారు. ఎన్టీఆర్ రాయబారం పంపినా, లాభం లేకపోయింది. విజయా వారు తీసిన ‘గంగ–మంగ’, ‘శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ రెండు చిత్రాల్లోనూ ఎన్టీఆర్ లేరు. దాని వల్ల స్టార్ హీరోగా ఎన్టీఆర్ కెరీర్ కేమీ నష్టం రాలేదు కానీ, ఆ తరువాత విజయాధినేతలే చిత్రనిర్మాణం కొనసాగించలేకపోయారు.
కాలగతిలో ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ హయాంలో టి.టి.డి. బోర్డు చైర్మనైన నాగిరెడ్డి అప్పటికి ఆ పదవిలో ఉన్నారు. ప్రభుత్వం మారినా సరే తానెప్పుడూ ‘‘ఫాదర్’’ అని ఆత్మీయంగా పిలిచే నాగిరెడ్డిని ఎన్టీఆర్ పక్కకు తప్పించలేదు. పైపెచ్చు, నాగిరెడ్డిని సాదరంగా ఆహ్వానించి, తన సి.ఎం. సీటులో కూర్చోబెట్టి, సముచితంగా సత్కరించారు.తన ఉజ్జ్వల సినీ జీవితానికి బాట వేసిన ‘‘ఫాదర్’’కు కృతజ్ఞత చెల్లించుకున్నారు.
సినిమా నుంచే... డ్రామాగా!
రంగస్థల నాటకాలు వెండితెరకెక్కడం సినీ చరిత్రలో తొలి రోజుల నుంచి చూస్తున్నదే. కానీ, తెర మీది సినిమా కాస్తా వేదిక మీద నాటకంగా మారడం మాత్రం సురభి నాటకాలలో ‘పాతాళభైరవి’కే దక్కిన మరో ఘనత. సురభి నాటక సమాజం వారు ప్రదర్శించే ధర్మవరపు రామకష్ణమాచార్యుల ‘భక్త ప్రహ్లాద’ తొలి తెలుగు టాకీగా తెరకెక్కితే, ఆపైన సరిగ్గా రెండు దశాబ్దాలైనా గడవక ముందు వచ్చిన పింగళి వారి ‘పాతాళభైరవి’ కథను 135 సంవత్సరాల చరిత్ర ఉన్న సురభి నాటక సమాజం తమ సొంతం చేసుకొని, ఇవాళ్టికీ రంగస్థల నాటకంగా ప్రదర్శిస్తోంది. దాన్నిబట్టి, పాతాళభైరవి కథ, తోటరాముడి సాహసం, నేపాళ మాంత్రికుడి మాయాజాలం తెలుగు వారి కళ, సంస్కతిలో ఎంతగా భాగమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో ఒక సినిమా ఆణిముత్యంగా నిలిచిందనడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి. అందుకే, ఎన్నేళ్ళయినా... మళ్ళీ మళ్ళీ ‘జై పాతాళభైరవి’!
స్టార్ హీరోగా ఎన్టీఆర్... కొత్త దారిలో ఏయన్నార్!
‘పాతాళ భైరవి’ నాటికే ఏయన్నార్ అగ్రనటుడు. అప్పటికి ఎనిమిదేళ్ళుగా జానపద హీరో అంటే ఏయన్నారే. అప్పటి దాకా ఆయన చేసిన సినిమాల్లో 90 శాతం జానపదాలే. కానీ, ఒక్కసారిగా ‘పాతాళభైరవి’తో తెలుగు తెరపై తిరుగులేని జానపదహీరోగా ఎన్టీఆర్ అవతరించారు. ఏయన్నార్ అటుపైన రూటు మార్చి, ‘దేవదాసు’ లాంటి సాంఘికాల్లో తన ముద్ర చూపారు. ఆ తరువాత ఆయన కెరీర్ లో చేసిన 200 పై చిలుకు చిత్రాల్లో మూణ్ణాలుగు మాత్రమే, అంటే ఒక్క శాతమే జానపదాలనేది గమనార్హం. ఇక, జానపదాలకు ఊపు తెచ్చిన ‘పాతా ళభైరవి’ నుంచి దేశంలో ఏ హీరో చేయనన్ని విధంగా 58 ఫోక్లోర్ చిత్రాల్లో ఎన్టీఆరే హీరో. ఆయన తర్వాతి స్థానంలో కత్తివీరుడు కాంతా రావు నిలిచారు.
ఫస్ట్ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో...
మన దేశంలో తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 1952లో బొంబాయి, మద్రాసు, ఢిల్లీ, కలకత్తాల్లో జరిగింది. అందులో దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ‘పాతాళభైరవి’. ‘మొఘల్ –ఎ–ఆజమ్’ (1960) రూపకర్త కె. ఆసిఫ్ ఈ ఫెస్టివల్లో ‘పాతాళభైరవి’, ఆ సెట్లు, ఆ సాంకేతిక విలువలు చూసి, అబ్బురపడ్డారట. ఒక ప్రాంతీయ సినిమానే ఈ స్థాయిలో తీస్తే, హిందీలో జాతీయస్థాయిలో తాను రూపొందిస్తున్న ‘మొఘల్–ఎ–ఆజమ్’ ఇంకెంత స్థాయిలో ఉండాలని తమ సెట్లు, రూపకల్పన శైలిపై మరింత దృష్టి, డబ్బు పెట్టారంటారు. ఇప్పుడు చూస్తున్నా ‘పాతాళభైరవి’ బోరు కొట్టదు. టీవీల దెబ్బకు రిపీట్ రన్లు ఆగే వరకు 60 ఏళ్ళ పాటు ‘పాతాళభైరవి’ హాళ్ళలో అలరిస్తూనే వచ్చింది. ఇప్పటికీ టీవీ, యూట్యూబుల్లో పలకరిస్తూనే ఉంది. ఇంత దీర్ఘకాల జనాదరణ ఉన్న సినిమా మరొకటి కనిపించదు. 1950ల ముందు మ్యూజికల్ హిట్లున్నా, ఆ పాటలు ఆ కాలానికే! కానీ ఇప్పటికీ వినిపించే ఫస్ట్ లాంగ్‌టైమ్ మ్యూజికల్హిట్‘పాతాళభైరవి’.
సూపర్ హీరోయిజమ్
తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ (1931 మార్చి 14) రిలీజైన సరిగ్గా రెండు దశాబ్దాలకు తెలుగు ‘పాతాళభైరవి’ (1951 మార్చి 15) వచ్చింది. అంతకు ముందు వరకు సాధారణంగా సినీ కథానాయకుడు సామాన్యుడు. విధి ఆడే వింత నాటకంలో ఓ కీలుబొమ్మ. కానీ, సామాన్యుడు సైతం సాహసిస్తే, ఏదైనా సాధిస్తాడనే హీరోయిజమ్‌ను ‘పాతాళభైరవి’ జనంలోకి బాగా తీసుకువెళ్ళింది. జీవితంలో మనం చెయ్యలేని పనులను తెర మీది సూపర్ నేచురల్ హీరో చేస్తే సామాన్య జనం జై కొడతారనే సైకాలజీని ష్యూర్ హిట్ బాక్సాఫీస్ ఫార్ములాగా తీర్చిదిద్దింది. గత 70 ఏళ్ళుగా సాంఘికాల్లోనూ అదే హిట్ మంత్రమైంది. అలా ఇండియన్ సిల్వర్‌స్క్రీన్‌పై హీరో ఇమేజ్‌కు కొత్త భాష్యం చెప్పింది ‘పాతాళభైరవి’.
నెల జీతంపై... 4 సినిమాలు
అసలు ‘పాతాళభైరవి’ కథకు దర్శక, నిర్మాతలు ముందు అనుకున్న హీరో – ఏయన్నార్. విలన్ – ముక్కామల. ఒక దశలో అప్పుడే ‘మాయలమారి’ (1951 జూన్ 14)లో గండరగండ పాత్ర చేస్తున్న రాజారెడ్డితో హీరో వేషం వేయిస్తే ఎలా ఉంటుందా అనీ ఆలోచించారట. కానీ, ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్య ఓ ప్రాక్టీస్ టెన్నిస్ మ్యాచ్‌లో బంతిని ఎన్టీఆర్ బలంగా కొట్టిన తీరు చూసి, దర్శకుడు కె.వి. రెడ్డి ఈ పాత్రకు ఎన్టీఆరే పర్ఫెక్ట్ అనుకున్నారు. గదతో బొడ్డుదేవర విగ్రహాన్ని బలంగా మోదే దృశ్యాన్ని ఎన్టీఆర్ తో ట్రయల్ షూట్ చేసి మరీ ఓకే అన్నారు. వాహిని – విజయాధినేతలు అంతకు ముందే, తాము తీయనున్న 3 చిత్రాలకు (‘మల్లీశ్వరి’, ‘పెళ్ళిచేసి చూడు’, ‘చంద్రహారం’) హీరోగా కాంట్రాక్టు రాయాలంటూ ఎన్టీఆర్‌ను అడిగారు. భారీ ఖర్చయ్యే ‘పాతాళభైరవి’కి ఇమేజ్ ఉన్న మరో హీరోను పెట్టుకోవాలన్నది వారి ఆలోచన. కానీ, ‘పాతాళభైరవి’ సహా 4 సినిమాలకైతేనే కాంట్రాక్ట్‌గా చేస్తానన్నారు ఎన్టీఆర్. విజయా వారూ సరేనన్నారు.
అప్పట్లో ఎన్టీఆర్ కు వారిచ్చిన జీతం – తొలి ఏడాది నెలకు రూ. 500, రెండో ఏడాది నెలకు రూ. 750. మొత్తంగా మొదటి రెండు సినిమాలకూ ఏడున్నర వేల చొప్పున, తరువాతి రెండు సినిమాలకూ పది వేల చొప్పున రెమ్యూనరేషన్ అని ఫిక్స్ చేశారు. ‘‘ఆ 4 సినిమాల తరువాత విజయా వారి కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చాక, ఏకంగా ఇరవై ఏడున్నర వేల అత్యధిక పారితోషికంతో కథానాయక పాత్ర చేశా. ఆ నాటి నుంచి సినీ సీమ వదిలి బయటకొచ్చే దాకా హీరోగా నాదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్’’ అని 1986 ఫిల్మోత్సవ్ వేళ ఎన్టీఆరే చెప్పారు.
బహుమతిగా కారు
అనేకచోట్ల ‘పాతాళభైరవి’ వందరోజులాడిన సందర్భంగా, ముఖ్యమైన కళాకారులకు కార్లను బహుమతిగా ఇచ్చారు విజయాధినేతలు. ఆ రోజుల్లోనే 6 వేలు ఖరీదు చేసే ఆ బ్యూక్ కారును పదిలంగా ఉంచుకున్నారు ఎన్టీఆర్. ‘‘ఫాదర్ (నాగిరెడ్డి) ఇచ్చిన కారు’’ అని గొప్పగా చెప్పేవారు.
ఒకటికి రెండుసార్లు!
లేట్ రిలీజులోనూ 20కి పైగా కేంద్రాల్లో ‘పాతాళభైరవి’ శతదినోత్సవం చేసుకొంది. ఆ తర్వాత అలా లేట్ రిలీజ్లో 20కి పైగా కేంద్రాల్లో (సరిగ్గా 46 కేంద్రాల్లో) వంద రోజులు ఆడింది ‘లవకుశ’. రెండూ ఎన్టీఆర్ చిత్రాలే కావడం విశేషం. ఫస్ట్ రిలీజైన తరువాత రెండేళ్ళకే 1953 జూలైలో విజయవాడలో దుర్గాకళామందిరంలోనే ‘పాతాళభైరవి’ మరోసారి రిలీజైంది. అప్పుడూ అదే హాలులో ఏకంగా 11 వారాల పైగా ఆడడం మరో విశేషం.
పార్ట్లీ కలర్‌తో... హిందీలోకి!
‘పాతాళభైరవి’ని ఒకేసారి రెండు భాషల్లో చిత్రీకరించారు. తెలుగు వెర్షన్ రిలీజైన రెండు నెలలకు 1951 మే 17న తమిళ వెర్షన్ రిలీజైంది. తెలుగుతో పాటు తమిళంలోనూ హిట్టయిన ఈ చిత్రాన్ని ప్రసిద్ధ జెమినీ సంస్థ హిందీ ప్రేక్షకులకూ అందించింది. నాగిరెడ్డిని ‘‘నాగి.. నాగి..’’ అంటూ అభిమానంతో సంబోధించే జెమినీ అధినేత ఎస్.ఎస్. వాసన్ అప్పటికే ‘చంద్రలేఖ’ లాంటి భారీ చిత్రంతో ఉత్తరాది వారికి దక్షిణాది సినిమా రుచి చూపించారు. ఈసారి విజయా వారి ప్రొడక్షన్ ‘పాతాళభైరవి’లోని నృత్యగీతాలు ‘ఇతిహాసం విన్నారా’, ‘వగలోయ్ వగలు’ రెండింటినీ కలర్లో ప్రత్యేకంగా చిత్రీకరించి మరీ, హిందీలో ‘పాతాళ్ భైరవి’ టైటిలుతో 1952 మార్చి 14న జెమినీ సంస్థ రిలీజ్ చేసింది. అలా ఒకే కథ మూడు భాషల్లో జనం ముందుకు రావడం, వాటిల్లో ఒకే హీరో నటించడం, 3 భాషల్లో విజయం సాధించడం కూడా అదే తొలిసారి. 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే కథను ‘పాతాళ్ భైరవి’ (1985) పేరుతోనే హీరో కృష్ణ సమర్పణలో పద్మాలయా స్టూడియోస్ బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, జయప్రదలతో హిందీలో మరోసారి తీశారు.
– రెంటాల జయదేవ