రాత్రిపూట కనిపించే నక్షత్రాలు ఉదయాన్నే మాయమైనట్లు గ్లామర్ ప్రపంచంలో రఫ్ఫాడించిన ఎంతోమంది సినీతారలు అవకాశాలు సన్నగిల్లాక కనిపించకుండా పోయారు. అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో నెట్టుకొచ్చినవారు కొందరైతే, ఖాళీ చేతులతో, ఆర్థిక కష్టాలతో, గుండెనిండా శోకంతో అర్ధాంతరంగా కన్నుమూసిన ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకరే కె.మాలతి. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె తర్వాతికాలంలో ఎటువంటి దుర్భర జీవితం గడిపింది? ఎన్ని కష్టాలు అనుభవించింది? అనేది నేటి కథనంలో చదివేద్దాం..
చిన్న వయసులోనే పెళ్లి
కె. మాలతి. ఈమె తెలుగింటి అమ్మాయి. 1926లో ఏలూరులో జన్మించింది. తండ్రి గొల్లపూడి సూర్య నారాయణ. ఆమె ఐదవ ఏటనే ఆయన చనిపోయారు. అయినా మాలతి బడికి పోయింది. సంగీతం నేర్చుకుంది. నాటకాల్లో పాల్గొంది. చిన్నతనంలోనే మాలతి పెళ్లి జరిగింది. భర్త వీరాచారి ప్రోత్సాహంతో సినిమాల్లో అడుగుపెట్టింది. ఉష సినిమాలో పార్వతీదేవిగా నటించింది. ఈ సినిమా సక్సెస్ అవలేదు కానీ, మాలతి కెరీర్‌కు మాత్రం దీనితోనే బలమైన పునాది పడింది. తన రెండో సినిమా సుమంగళి. ఇందులో ఆమె పాడిన వస్తాడే మా బావ.. పాట ఏళ్లతరబడి ప్రేక్షకుల పెదవులపై నాట్యం చేసింది.
పాతాళ భైరవితో క్రేజ్.. కానీ కొరవడిన ఆఫర్లు
మామా మచ్ఛీంద్ర, గుణ సుందరి, రత్నకుమారి.. ఇలా అనేక సినిమాలు చేసుకుంటూ పోయింది. నందమూరి తారకరామారావుతో కలిసి చేసిన పాతాళ భైరవి(1951) అఖండ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు కలిసి రాలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపు మూడేళ్లపాటు మరే సినిమా చేయలేదు. కాళహస్తి మహత్యంతో రీఎంట్రీ ఇచ్చింది, కానీ ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్టీఆర్‌తో జోడీ కట్టిన మాలతి తర్వాత ఆయనకు సోదరిగానూ నటించినట్లు తెలుస్తోంది. తను చివరగా 1979లో వచ్చిన 'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం'లో నటించింది.
ఇదీ చదవండి: నటుడి భార్య మృతి.. నూరేళ్లు చేయి వదలనంటూ ఎమోషనలైన వీడియో వైరల్
ప్రసాదమే భోజనం
భర్త మరణించాక మాలతి మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. అప్పట్లో కాచిగూడలో ప్రభాస్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ వెనక రేకుల షెడ్డులో మాలతి ఒంటరిగా ఉండేది. రోజూ పక్కనే ఉన్న గుడికి వెళ్లి రెండుపూటలా పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునేది. తను నటిని అన్న విషయం ఎవరికీ చెప్పేది కాదు. 1979 నవంబర్ 25న పెనుగాలి వీచడంతో ప్రభాస్ థియేటర్‌కు చెందిన 20 అడుగుల గోడ కూలి మాలతి ఇంటి పైకప్పుపై పడింది. రేకుల షెడ్డు నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న మాలతిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె కన్నుమూసింది. ఇంట్లో ఉన్న ట్రంకుపెట్టె తెరచి చూస్తే ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి. అప్పుడు అందరికీ తను పాతాళ భైరవి హీరోయిన్ అని తెలిసింది. అలాగే ఆమె కష్టాలను, బాధలను రాసుకున్న డైరీ కనిపించగా దాన్ని చదివి కంటతడి పెట్టనివారు లేరు!
Comments
Please login to add a commentAdd a comment