చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! | Samantha Hits Gym While Recovering From Chikungunya, Shared Video Of Her It Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సామ్‌.. అందులోనూ ఫన్‌ ఉందంటూ..

Published Sat, Jan 11 2025 4:13 PM | Last Updated on Sat, Jan 11 2025 4:42 PM

Samantha Hits Gym while Recovering from Chikungunya

కాస్త ఆరోగ్యం బాగోలేకపోతే చాలు చాలామంది ముసుగు తన్నిపడుకుంటారు. కానీ సమంత మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పక్కన పెట్టలేదు. చికెన్‌ గున్యాతో సతమతమవుతున్న ఆమె ఒళ్లు నొప్పులున్నా సరే జిమ్‌లో చెమటలు చిందిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. చికెన్‌గున్యా నుంచి కోలుకోవడం భలే సరదాగా ఉంది అంటూ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తోంది.

చికెన్‌ గున్యాతో బాధపడుతున్న సామ్‌
శరీరం సహకరించకపోయినా తను పట్టుదలతో వ్యాయామం చేస్తుండటం చూసి ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు. సామ్‌ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంత (Samantha) చివరగా సిటాడెల్‌: హనీ బన్నీ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్‌ షూటింగ్‌లో ఓ రోజు సామ్‌ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. దీని  గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సడన్‌గా స్పృహ తప్పి కింద పడిపోయాను. 

ఆస్పత్రికి తీసుకెళ్లలేదు
కళ్లు తెరిచేసరికి నాకు ఎవరి పేర్లూ గుర్తు రావడం లేదు. కొద్ది క్షణాలపాటు బ్లాంక్‌ అయిపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నన్ను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు అనిపిస్తోంది. ఏ ఒక్కరూ హాస్పిటల్‌కు వెళ్దామనలేదు అని చెప్పుకొచ్చింది. కాగా సమంత కొన్నేళ్లుగా మయోసైటిస్‌తో బాధపడుతోంది. తను ఈ వ్యాధి బారిన పడిన విషయాన్ని 2022లో వెల్లడించింది. అది కూడా నిర్మాతల బలవంతం వల్లే చెప్పింది. 

(చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)

బలవంతం వల్లే..
2022లో శాకుంతలం సినిమా రిలీజైంది. ఆ సమయంలో సమంత ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మయోసైటిస్‌ తనను శారీరకంగా కుంగదీసింది. మరోవైపు సినిమా ప్రమోషన్స్‌ చేయాలి. నీకున్న బాధ బయటపెడితే తప్పేంటని నిర్మాతలు ఒత్తిడి తేవడంతో సామ్‌ మయోసైటిస్‌తో సతమతమవుతున్న విషయాన్ని బయటకు చెప్పింది. వారి ఒత్తిడి వల్లే నాకు మయోసైటిస్‌ ఉందని అందరికీ చెప్పానని, లేదంటే నిశ్శబ్ధంగానే ఆ వ్యాధితో పోరాటం చేసేదాన్ని అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సినిమా
ఏ మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సమంత. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో సెన్సేషన్‌ హీరోయిన్‌గా మారింది. బృందావనం, ఎటో వెళ్లిపోయింది మనసు, జబర్దస్త్‌, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, మనం, అల్లుడు శీను, రభస, సన్నాఫ్‌ సత్యమూర్తి, అఆ, జనతా గ్యారేజ్‌, బ్రహ్మోత్సవం, రంగస్థలం, ఓ బేబీ, మజిలి, యశో, శాకుంతలం, ఖుషి.. ఇలా ఎన్నో చిత్రాలతో మెప్పించింది. పుష్ప:ద రైజ్‌ మూవీలో ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా అనే ఐటం సాంగ్‌తో పాన్‌ ఇండియాను ఊపేసింది.

సిటాడెల్‌ సిరీస్‌
ఓటీటీలో ద ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో అలరించిన ఆమె చివరగా సిటాడెల్‌: హనీ బన్నీ సిరీస్‌లో యాక్షన్‌ అవతార్‌లో కనిపించింది. సిటాడెల్‌ సిరీస్‌ విషయానికి వస్తే.. ఇందులో సమంత ఏజెంట్‌గా నటించింది. సీతా ఆర్‌ మీనన్‌ కథ అందించగా రాజ్‌ అండ్‌ డీకే (Raj Nidimoru and Krishna DK) డైరెక్ట్‌ చేశారు. గతేడాది నవంబర్‌ 7న ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో వరుణ్‌ ధావన్‌, కేకే మీనన్‌, సాఖిబ్‌ సలీమ్‌, సికిందర్‌ ఖేర్‌ ప్రముఖ పాత్రలు పోషించారు.

 

 

చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్‌ రాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement