
‘‘నా కెరీర్‌లో ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేశాను. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్’ చిత్రంతో సాయిధరమ్ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశాను. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు దివంగత జానకి రామ్(ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాని ప్రకటించారు వైవీఎస్ చౌదరి. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు.
సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ–‘‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ మూవీతో దర్శకునిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునగారికి రుణపడి ఉంటాను. తొలి సినిమాకే నాగేశ్వరరావుగారితో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తాజాగా నా కొత్త సినిమాకి హీరోగా ఎవర్ని తీసుకోవాలి? అనుకుంటున్న సమయంలో తమ్ముల ప్రసన్న కుమార్‌గారు తారక రామారావుని చూపించారు. తనని చూడగానే జానకి రామ్ కలని నెరవేర్చుతాడనిపించింది. ఈ మూవీ ద్వారా తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’’ అన్నారు.
‘‘మా స్నేహితులు, సన్నిహితుల అండదండలతో న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి.
Comments
Please login to add a commentAdd a comment