Dr.yaijayanti
-
ఏ రుచైనా వెరైటీనే...
పిల్లలు నిన్న మొన్నటి దాకా పండగ వంటలు తిన్నారు. సెలవలు పూర్తయి స్కూల్స్‌కి బయలుదేరబోతున్నారు. వాళ్లకి ఈ వెరైటీ చైనీస్ వంటల్ని సిద్ధం చేసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టండి... ఇష్టంగా తింటారు. సేకరణ: డా. వైజయంతి పురాణపండ మష్రూమ్ మంచూరియా కావలసినవి: కార్న్‌ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు తాజా మష్రూమ్స్ - పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను సోయా సాస్ - అర టీ స్పూను నూనె - తగినంత ఉప్పు - తగినంత వేయించడానికి: అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను ఉల్లి తరుగు - పావు కప్పు ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు నూనె - 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ - ఒకటిన్నర టీ స్పూన్లు చిల్లీ సాస్ - అర టేబుల్ స్పూను టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మష్రూమ్లను మురికి పోయేలా శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబెట్టి, తడి పోయాక ముక్కలుగా కట్ చేయాలి. (ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండాలి) ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, అర టీ స్పూను సోయా సాస్, ఉప్పు , 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలపాలి మష్రూమ్ ముక్కలు జత చేసి కలపాలి బాణలిలో నూనె కాగాక, కొద్దికొద్దిగా పిండి తీసుకుని పకోడీల మాదిరిగా వేయాలి. (కొద్దిగా బంగారు వర్ణంలోకి మారగానే తీసేయాలి. లేదంటే మాడిపోతాయి) ఇలా అన్నీ తయారుచేసి, పక్కన ఉంచాలి వెడల్పాటి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు వేయించాలి టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వే యించిన మంచూరియాలు వేసి బాగా కలిపి, ఉల్లికాడల తరుగు వేసి మరో మారు కలపాలి అన్నీ బాగా కలిసినట్లు అనిపించగానే మంట ఆర్పేసి, టొమాటో సాస్‌తో వేడివేడి మష్రూమ్‌లు అందించాలి. వెజ్ హక్కా నూడుల్స్ (హక్కా నూడుల్స్ ఇండియన్ చైనీస్ రెస్టారెంట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఇతర నూడుల్స్ కంటె చాలా రుచిగా ఉంటాయి. ఇవి పల్చగా ఉండే రైస్ నూడుల్స్. చైనాలోని హక్కా అనే తెగ వారి నుంచి ఈ పేరు వచ్చింది. అయితే ఒక విధంగా ఇది భారతీయుల వంటకమే!) కావలసినవి: క్యారట్ - 1; బీన్స్ - గుప్పెడు; మష్రూమ్స్ - అర కప్పు; ఉల్లి కాడల తరుగు - పావు కప్పు; బఠాణీ - అర కప్పు; గ్రీన్ క్యాప్సికమ్ - 1; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - అర టీ స్పూను; నూనె - టీ స్పూను; హక్కా నూడుల్స్ - ఒక ప్యాకెట్; ఎండు మిర్చి - 6; వెల్లుల్లి రేకలు - 4; సోయా సాస్ - కొద్దిగా తయారీ: ముందుగా కూరలన్నిటినీ సన్నగా తరగాలి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, కూరముక్కలు జత చేసి, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి హక్కా నూడుల్స్‌కి తగినన్ని నీళ్లు జత చేసి వేరుగా ఉడికించాలి నీళ్లు ఒంపేసి, నూడుల్స్‌ను చన్నీళ్లలో రెండు మూడు సార్లు జాడించాక, నూనె జత చేసి, బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల నూడుల్స్ అతుక్కుపోకుండా విడిగా ఉంటాయి ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి మంట పెంచి, ఉల్లి కాడల తరుగు, ఫ్రెంచ్ బీన్స్ తరుగు వేసి సుమారు మూడు నిమిషాలు వేయించాలి మష్రూమ్స్, క్యారట్ తరుగు, బఠాణీలు, గ్రీన్ క్యాప్సికమ్ తరుగు జత చేసి ఐదారు నిమిషాలు వేయించాలి బంగారు వర్ణంలోకి మారుతుండగా సోయా సాస్ వేసి కలపాలి. హక్కా నూడుల్స్ వేసి కింద నుంచి పైకి బాగా కలపాలి ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి, స్టౌ మీద నుంచి దింపేయాలి ఉల్లికాడల తరుగుతో అలంకరించి అందించాలి. -
హహ్హహహ్హహహ్హహా..!
... వివాహభోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. ఒహ్హొహ్హొ నాకె ముందు! ఔరౌర గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల... ఒహోరే అరిసెలుల్ల... ఇయెల్ల నాకె చెల్ల... పెళ్లి భోజనం ఎలా ఉందో... అధరాన్ని, ఉదరాన్ని మధురంగా ఊదరగొడుతూ పంచేంద్రియాలనూ అదిలించి కదిలిస్తారు ‘మాయాబజార్’ సినిమాలో ఎస్వీ రంగారావు! గారెలు, బూరెలు, అరిసెలేనా? లడ్లు, జిలేబీలు, అప్పడాలు.. పులిహోర దప్పళాలు.. పాయసాలు... ఎన్ని లేవు ఆ లిస్టులో! వాటిల్లో ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని కలిపి ఇవాళ మీ చేత లొట్టలు వేయించబోతోంది ‘ఫ్యామిలీ’! వివాహభోజనానికి ఏ మాత్రం తక్కువకాని ఈ దీపావళి భోజనాన్నిహహ్హహహ్హహహ్హహా... అంటూ ఆరగించండి. మీ ఆత్మీయులకు కొసరి కొసరి తినిపించండి. హ్యాపీ దీపావళి! సజ్జప్పాలు లేదా హల్వా పూరీ కావలసినవి: స్టఫింగ్ కోసం... బొంబాయి రవ్వ - కప్పు; పంచదార - కప్పు; నీళ్లు - రెండున్నర కప్పులు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు పై భాగం కోసం... మైదా పిండి - కప్పు; ఉప్పు - చిటికెడు; నూనె - అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి); నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారీ: బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార జత చేయాలి బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి. జిలేబీ కావలసినవి: మైదా పిండి - కప్పు; బేకింగ్ పౌడర్ - అర టీ; స్పూను; పెరుగు - కప్పు; నూనె - వేయించడానికి తగినంత; పంచదార - కప్పు; కుంకుమ పువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - పావు టీస్పూను; మిఠాయి రంగు - రెండు చుక్కలు; రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసా వంటి దానిలో ఈ మిశ్రమాన్ని పోయాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి (మంట మధ్యస్థంగా ఉండాలి) పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి వేడివేడిగా అందించాలి. అప్పడాల కూర మీకు అప్పడాలంటే ఇష్టం ఉంటే, ఈ కూరను కూడా ఇష్టపడతారు. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. రాజస్థానీయులు ఎక్కువగా తయారుచేసే ఈ కూరను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. కావలసినవి: అప్పడాలు - పావు కిలో; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; నెయ్యి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; ఉల్లి తరుగు - పావు కప్పు; అల్లం ముద్ద - టీ స్పూను; వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; చిక్కగా గిలక్కొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: అప్పడాలను నూనెలో వేయించి నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి (మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు) స్టౌ (సన్నని మంట) మీద బాణలి ఉంచి, నెయ్యి లేదా నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి పెరుగు, కప్పుడు వేడి నీళ్లు జత చేయాలి అప్పడం ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి, కొద్దిసేపు ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీరతో అలంకరించి, అన్నంతో వడ్డించాలి. దప్పళం కావలసినవి: కందిపప్పు - పావు కప్పు; బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - చిన్న కట్ట; చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు - అర కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; దొండకాయ ముక్కలు - పావు కప్పు; అరటికాయ ముక్కలు - పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు - కప్పు; సొరకాయ ముక్కలు - అర కప్పు; సెనగ పిండి - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; కారం - 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - కొద్దిగా తయారీ: పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాక, మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. పేణీ లడ్డు కావలసినవి: సెనగపిండి - కప్పు; పేణీ - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: స్టౌ (సన్న మంట) మీద బాణలి ఉంచి సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చేసి, సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి. పేణీ పాయసం పాలు వేడి చేసి, బెల్లం పొడి జత చేసి కలిపాక, డ్రై ఫ్రూట్ పొడి జత చేయాలి ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి తేనె వేసి బాగా కలిపి బాగా చల్లారాక అందించాలి. కట్టె పొంగలి కావలసినవి: బియ్యం - ముప్పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; మిరియాల పొడి - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చి మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను; జీడిపప్పులు - 10; కరివేపాకు - 2 రెమ్మలు; నెయ్యి - 5 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత తయారీ: బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాక, జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి, అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి చట్నీ, సాంబారులతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. సేకరణ: డా. వైజయంతి -
మనిషికి బతకాలనే ఆశ ఉండాలి...
తురగా జానకీరాణి... ఒక కథకురాలు... ఒక నవలా రచయిత్రి... రేడియో ప్రయోక్త... ఒక గాయని... ఒక నర్తకి... ఒక నటి... చదువులో బంగారు పతకాలు... ఉద్యోగంలో జాతీయ అవార్డులు... బాలానందం కార్యక్రమంతో ఆకాశవాణి జీవితం ప్రారంభం... ప్రొడ్యూసర్‌గా పదవీ విరమణ... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు... అన్నిటినీ అధిగమించారు... జానకీరాణిగారు అక్టోబరు 15, బుధవారం గతించడానికి కొన్ని వారాల ముందు ‘సాక్షి’తో కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇదే ఆవిడ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ... ఆ స్పర్శ చల్లగా ఉంది... నా ఆరో ఏట ఒకసారి మహాత్మాగాంధీ మా ఊరు వచ్చారు. ఆయనను చూడటానికి జనమంతా వెళ్తుంటే నేను కూడా వాళ్లతో వెళ్లాను. ఆయన ఒక్కో అడుగు వేస్తుంటే, ప్రజలంతా ఆయన కాళ్ల దగ్గర ఉన్న ఇసుకను దోసెళ్లతో ఎత్తి నెత్తిన పెట్టుకున్నారు. నేను ఆయన మెడలో వేయడానికి తీసుకువెళ్లిన ఎర్రగులాబీల దండలో పూలన్నీ, ఆయన దగ్గర చేరే లోపే రాలిపోయాయి. ఆయన ఆ దండ తీసుకుని, నా తల మీద మృదువుగా నిమిరారు. ఆయన చేతి స్పర్శ నాకు చల్లగా అలాగే ఉండిపోయింది. ఆయనకు ‘జి’ అని రాసి ఉన్న నా చేతి ఉంగరాన్ని ఇస్తుంటే, తన చిటికెనవేలితో తీసుకుని ‘ఇది ఎందుకు?’ అన్నారు. ‘కస్తూర్బా ఫండ్’ కి అన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. బాలానందంతో ప్రారంభం...: చిన్నప్పటి నుంచే ఆకాశవాణి బాలానందం కార్యక్రమంలో పాల్గొన్నాను. అబ్బూరి వరదరాజేశ్వరరావు రచించిన ‘ఒరియా’ అనువాద నాటకం లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో పాటలు పాడాను. ‘‘నీ కంఠంలో కరుణరసం బాగా పలుకుతుంది’’ అన్నారు సినారె. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కోకిలమ్మపెళ్లి’ నాటకంలో చిలకతల్లి వేషం వేశాను. విదేశీ ప్రసారాల కోసం బాలమురళిగారు మా చేత జోలపాటలు, ఉయ్యాల పాటలు, అప్పగింతల పాటలు పాడించారు. వివాహ బంధం... నా 12వ ఏట తురగా కృష్ణమోహన్‌గారు (అప్పటికి ఆయన వయసు 18) నా వెంటపడ్డారు. ‘ఒక మనిషి ఇంకో మనిషిని అంతగా ప్రేమించగలరా’ అనుకునేంతగా ఆయన నన్ను ఇష్టపడ్డారు. అందుకే నేను ఆయన అభిమానంలో చిక్కుకుపోయాననుకుంటాను. మా మధ్య స్నేహం సుమారు పది సంవత్సరాలు నడిచింది. ఏది ఎలా ఉన్నా చదువులో మాత్రం ముందుండేదాన్ని. డిగ్రీ, పీజీలలో గోల్డ్‌మెడల్స్ సాధించాను. 1959 లో నా 22వ ఏట మా వివాహం జరిగింది. అప్పుడు ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తుండేవారు. నేను ఇంట్లో తలనొప్పితో బాధపడుతుంటే, ఆఫీసులో అందరికీ నా గురించి చెబుతూ ఆయన కూడా బాధపడేవారని ఆయన స్నేహితులు చెప్పేవారు. అంత ప్రేమగా ఉండేవారు ఆయన. కొంతకాలానికి ఆయన ఆంధ్రపత్రిక నుంచి ఆకాశవాణిలో వార్తావిభాగంలో చేరారు. నేను ‘సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో చేరి పదిహేనేళ్లు పనిచేశాను. నిజాయితీ గల ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నాను. మారిన జీవితం...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఉద్యోగం మానేశాను. మేమిద్దరం... మాకిద్దరు... అన్నచందాన ఎంతో అన్యోన్యంగా ఉంటున్న నా జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది. 1974 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు ఆ రోజు ఉదయం కాఫీ ఇచ్చిన గ్లాసు ఇంకా కిటికిలోనే ఉంది, ఇంతలో మృతదేహం వచ్చింది. ఎన్నో ఏళ్లు కుమిలికుమిలి ఏడ్చాను. కాలం నెమ్మదిగా గాయాల్ని మాన్చింది. పిల్లల్ని చూసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఏ పిల్లల కోసం నేను ఉద్యోగం మానేశానో, అదే పిల్లల కోసం మళ్లీ ఉద్యోగంలో చేరాను. ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా ... 1974లో ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా చేరి 1995లో రిటైరయ్యేవరకు అక్కడే కొనసాగాను. ఆకాశవాణి అప్పుడొక స్వర్ణయుగం. నేను పనిచేసిన 20 సంవత్సరాల కాలంలో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ప్రసారం చేసినప్పుడు, అన్ని జిల్లాల నుంచి అక్కడి బడి పరిస్థితులను వివరిస్తూ ఉత్తరాలు వచ్చేవి. వాటిని విద్యాశాఖ కార్యదర్శికి పంపేదాన్ని. ఇంకా... పిల్లల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, నవయుగం, నవలా స్రవంతి, సమత, బాలవిహార్, మహిళా సమాజం... వంటి కార్యక్రమాలు చేశాను. అనేక బాలకవిసమ్మేళనాలు నిర్వహించాను. ‘బ్రాడ్‌కాస్టర్’ అనే పదానికి బదులు ‘ప్రసారకర్త’ అనే పదాన్ని వాడటం ప్రారంభించింది నేనే. దాశరథి కృష్ణమాచారిగారు మా స్టేషన్ డెరైక్టర్‌తో ‘జానకీరాణి తెలుగుభాషకు చాలా సేవచేస్తోంది’ అంటూ నన్ను అభినందించారు. వందేమాతరం... ‘ఆనంద్‌మఠ్’ నవల రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేడియోలో సెలట్రేబ్ చేయమన్నారు. వందేమాతరం గీతంలోని ‘సుజలాం, సుఫలాం’ వాక్యాన్ని తీసుకుని డా. సి. నారాయణరెడ్డిగారితో ‘‘మంచుకొండలను దిగివచ్చింది మా గంగమ్మ... మనసే మురళిగా మలచుకొంది మా యమునమ్మ...’’ అని పాట రాయించాను. ఈ కార్యక్రమం ఆహ్వానపత్రికలో ‘దృశ్య గీతి’ అని వేస్తే, అలా ఎందుకు వేశారని అందరూ నన్ను అడిగారు. అందుకు నేను ‘అది దృశ్యం కాదు, శ్రవ్యం కాదు, చూడవలసిన గీతి కనుక అలా వేశాను’ అని చెప్పాను. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశానో నాకే గుర్తు లేదు. గుర్తున్నంతవరకు కొన్ని మాత్రమే చెప్పగలిగాను. ఇప్పుడు నా వయసు 78. అయినా నా మనసు మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంది. ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్‌కి పిలిచినా వెళ్లిపోతాను. రేడియోవాళ్లు నా గురించి నాతో మాట్లాడించి ఆరు భాగాలు టేప్ చేశారు. ‘బతకాలి బతకాలి’ అన్నదే నా ఫిలాసఫీ. జీవితం చాలా విలువైనది. మనం బతికున్నామంటే అది ఒక వరం. మనిషికి బతకాలనే ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం... అంటూ ముగించారు. - డా॥వైజయంతి తాతగారి ఆశీస్సులే కారణం... చిన్నప్పుడే నేను కథలు రాయడానికి ఒక రకంగా మా తాతయ్య చలంగారి ఆశీస్సులే కారణం. నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు తిరువణ్నామలై వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన నా కంటె 50 సంవత్సరాలు పెద్ద. ఆయన్ని నేను ఎన్నోరకాల ప్రశ్నలు వేసి వేధించాను. అన్నిటికీ ఆయన ఓరిమిగా సమాధానాలు చెప్పారు. ‘‘నువ్వు హృదయం ఉన్న పిల్లవు. నీలోంచి ఆలోచనలు పెళ్లగించుకుని వస్తేనే కథలు రాయి’’ అన్నారు. ఆయన మాటలు నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ఆయన నాకు 16 ఉత్తరాలు రాశారు. ఆయనతో పరిచయం నాకు గొప్ప అనుభవం. అంత పెద్దమనిషి చేత నేను ప్రశంసలు పొందానని నాకు గర్వంగా ఉండేది. కృష్ణార్జున సంవాదంలో కృష్ణుడు వేషం వేశారు. మొట్టమొదటి కథ 15వ ఏట కృష్ణాపత్రికలో పడింది. వెంపటి చిన సత్యం గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుని, అనేక ప్రదర్శనలిచ్చారు. నాట్యంలో డిప్లమా చేశారు. చినసత్యంగారు ఇచ్చిన గజ్జెలు ఇప్పటికీ ఆవిడ దగ్గరున్నాయి. ‘నిశ్శబ్దంలో ప్రయాణాలు’ అని మూగచెముడు వారికోసం, ‘ఆశ్రయం’ అని వయోవృద్ధుల కోసం చేసిన కార్యక్రమాలకు, పిల్లల కోసం రచించిన బాల గేయాలకు రెండుసార్లు... మొత్తం నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. 1963లో ‘అఖిలభారత రచయిత్రుల సంఘం’ ఏర్పాటుచేశారు. ఆ ప్రారంభోత్సవానికి విజయలక్ష్మీ పండిట్ వచ్చారు. -
ఓనమాలు నేర్పిన ఓనమ్
ఓనమ్... మళయాళీలు పది రోజుల పాటు... వేడుకగా, ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ... రకరకాల వంటలతో, సంప్రదాయ నృత్యాలతో... ఆటలతో... పడవల పోటీలతో... పులి వేషాలతో... తెలుగువారి దసరాలను త లపించే పండుగ... ఇంటికి పంటలు చేరి భోగభాగ్యాలతో తులతూగే పండుగ... రేపు ‘ఓనమ్’... తెలుగింటి కోడలుగా మనలో ఒకరైపోయిన పరహారణాల కేరళ కుట్టి సుమ ‘సాక్షి’కి చెప్పిన ఓనమ్ పండుగ కబుర్లు... మీరు మలయాళీ ఇంటి ఆడపడుచు! తెలుగింటి కోడలు! మరి ఓనమ్ బాగా సెలబ్రేట్ చేస్తారా? సుమ: నేను చిన్నతనం నుంచీ ఇక్కడే అంటే హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. మా పెళ్లయినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ వేడుకగా జరుపుకుంటున్నాను. మా ఇంట్లో అటు తెలుగు పండుగలు, ఇటు కేరళ పండుగలు - రెండూ బాగా చేసుకుంటాం. కిందటేడాది మానాన్నగారు పోవడంతో ఆ ఒక్క సంవత్సరమే చేయలేదు. పండుగను ఎలా జరుపుకుంటారు? సుమ: ఓనమ్ పండుగ పది రోజులూ ఇంటి ముందర కళ్లాపి జల్లి, నేల తడిగా ఉండగానే పువ్వులతో పూక్కళమ్ చేస్తారు. అంటే పూల ముగ్గులాంటిదన్నమాట. సాధారణంగా అందరూ పది రోజులూ చేస్తారు. అయితే నేను నా షూటింగులలో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కరోజు మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించి, ఆనందిస్తాను. ఓనమ్ సందర్భంగా ప్రత్యేక వంటలు ఏమేం చేస్తారు? సుమ: ఈ పండుగకు సాధారణంగా 13 రకాల వంటకాలు చేస్తారు. మేం మాత్రం అవియల్, ఓలెన్, ఇంజుప్పులి, పాలడ పాయసం, కరి (సెనగపప్పు వంటకం), అనాస లేదా మామిడికాయతో పచ్చడి చేస్తాం. ప్రతి ఏడాదీ ఈ వంటలన్నీ నేనే చేస్తాను. ఈసారి మా అమ్మ కూడా నా దగ్గరే ఉన్నారు కనుక ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓనమ్ నాడు మీ ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయి? సుమ: ఈ పండుగ నాడు అప్పడం కంపల్సరీ. అరటిపండు (వేందరప్పళన్) ను ఇడ్లీ రేకులలో ఉంచి ఆవిరి మీద ఉడికించి తింటాం. ఈ అరటిపండును నెల రోజుల పసి పాపలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బలాన్నిస్తుంది. ఆవిరి మీద ఉడకపెట్టడం వలన ఇందులోని పోషకాలు ఎక్కడికీ పోవు. ఓనమ్ పండుగకు తప్పనిసరిగా అరటి ఆకులోనే భోజనం చేస్తాం. నాకు అందులో తినడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకులో పాలడ పాయసం వేసుకుని అది అటూ ఇటూ జారిపోతూ ఉంటే చేత్తో గబగబ దగ్గరకు లాక్కుంటూ తినడం భలే సరదాగా ఉంటుంది. నేను కొంచెం చిలిపి పనులు చేస్తుంటాను. నా ఆకు క్లీన్‌గా ఉండాలని, (నవ్వుతూ) నేను అన్నం తినడం పూర్తయిన తర్వాత, నా ఆకులో ఉన్న కరివేపాకు, పచ్చి మిర్చి వంటి వాటిని పక్క వాళ్ల ఆకులలోకి వాళ్లు చూడకుండా తోసేస్తాను. ఈ పండుగకు ప్రత్యేకంగా ముండుమ్ వేష్టి ధరిస్తాం (ఇది ఓనమ్ ప్రత్యేకం). ఇంతకీ మీరు మొట్టమొదటసారి వంట చేసినప్పుడు మీ అనుభవం ఏమిటి? సుమ: పెళ్లయిన పదిహేను రోజులకు మొదటిసారి రాజీవ్ నన్ను పచ్చి మిర్చి పచ్చడి చేయమన్నారు. ఆయన కోరిక మేరకు వంట చేయడానికి వంట గదిలోకి సంతోషంగానే అడుగుపెట్టాను. రాజీవ్ ఉద్దేశం కొబ్బరిలో పచ్చి మిర్చి కలిపిన పచ్చడి! కానీ నేను కేవలం పచ్చి మిర్చితో అనుకుని, పచ్చి మిర్చిలో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పి అన్నంలో వడ్డించాను. ఆ పచ్చడి కలుపుకుని తినేసరికి, ఇంక చూడాలి... రాజీవ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కళ్లలోనూ బాధతో నీళ్లు తిరిగాయి. రాజీవ్‌కి అందరు దేవుళ్లతో పాటు, మా కుటుంబ సభ్యులూ కళ్ల ముందు సాక్షాత్కరించారు. మరి, ఆ తరవాత వంట నేర్చుకున్నారా? సుమ: ఆ తరవాత అనుభవం మీద అదే వచ్చేసింది. వంట చేయడం నాకు ఇష్టమే. కానీ సమయం మాత్రం లేదు. పండుగలకు, వంటమనిషి ఊరెళ్లినప్పుడు, పిల్లలు అడిగితే చేసిపెట్టడం... అంతే తప్ప మిగతా సమయాల్లో వంట చేయాల్సిన అవసరం ఉండదు. మలయాళీలు అన్ని వంటల్లోనూ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారంటారు? సుమ: కొలెస్ట్రాల్ చింత పెరిగిపోవడంతో, ఇప్పుడు కొబ్బరి నూనెతో వంటలు చేయడం బాగా తగ్గిపోయింది. కొన్ని ప్రత్యేకమైన వంటకాలకు మాత్రమే కొబ్బరి నూనె వాడతున్నాం. మీ జీవితంలో ఓనమ్ పండుగ పోషించిన ప్రత్యేక పాత్ర గురించి ఎక్కడో విన్నాం... సుమ: అవును. సికింద్రాబాద్‌లో మలయాళీలకు ప్రత్యేకంగా ‘కేరళ అసోసియేషన్’ అని ఒకటి ఉంది. దానికి మా నాన్నగారు మేనేజర్‌గా ఉండేవారు. అక్కడ ప్రతి యేడూ ఓనమ్ పండుగనాడు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఏమాత్రం భయపడకుండా నేను వాటిలో పాల్గొనేదాన్ని. అందువల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది. అలా నా ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఓనమ్ పండుగ వల్లే వచ్చింది. ఇప్పుడు యాంకర్‌గా ఇంత సక్సెస్ సాధించగలిగానంటే అందుకు కారణం ఓనమ్ పండుగే. అలా ఓనమ్ నుంచి ఓనమాలు నేర్చుకున్నాను. - సంభాషణ: డా. వైజయంతి పాలడ పాయసం కావలసినవి: పాలడ (రైస్ అడ) - ముప్పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నెయ్యి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; కిస్మిస్ - టేబుల్ స్పూను; పాలు - 2 కప్పులు; బెల్లం తురుము - పావు కప్పు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారీ: రైస్ అడను రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత అవి బాగా పొంగి కనపడతాయి. అప్పుడు నీళ్లు వడకట్టి చల్ల నీళ్లలో వేసి వార్చాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో పాలు, బెల్లం తురుము, ఏలకుల పొడి, నానబెట్టి తీసిన పాలడ వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత దించి, వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి అందించాలి. ఇంజిప్పులి కావలసినవి: నూనె - 5 టేబుల్ స్పూన్లు; అల్లం - అర కేజీ (సన్నగా తురమాలి); ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను; కొబ్బరి ముక్కలు - 2 కప్పులు; కరివేపాకు - 2 రెమ్మలు; చిన్న ఉల్లిపాయలు - పావు కేజీ; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేయాలి); పసుపు - అర టీ స్పూను; ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు - 100 గ్రా. (నానబెట్టాలి); బెల్లం తురుము - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి వేడి చేయాలి అల్లం తురుము వేసి వేయించి, ఉప్పు జత చేసి దోరగా వేయించి దించి పక్కన ఉంచాలి మిగిలిన నూనెను బాణలిలో వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొబ్బరి ముక్కలు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక కరివేపాకు జత చేయాలి చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించాలి వేయించి ఉంచుకున్న అల్లం తురుము, చింతపండు పులుసు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి బెల్లం తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. చక్క ఎరిసెరి కావలసినవి: పచ్చిగా ఉన్న పనస తొనలు - పావు కేజీ; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - అర కప్పు; జీలకర్ర - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 2; కొబ్బరినూనె - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 4; చిన్న ఉల్లి పాయలు - 5; కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు తయారీ: ముందుగా పనస తొనలలోని గింజలు వేరు చేసి తొనలను నాలుగైదు ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మూత పెట్టి ఉడకించాలి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల నీళ్లు మిక్సీలో మెత్తగా చేసి పక్కన ఉంచాలి పనస ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి మరొక బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఎండు మిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి దించేయాలి అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి. -
‘సెలైంట్’ గా మనసులు దోచిన ‘మెలడీ’
షార్ట్ ఫిల్మ్ పుష్పక్... ఈ సెలైంట్ సినిమా పేరు చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది... తెలుగు సినిమాలలో అదొక కొత్త ట్రెండ్... ప్రేక్షకుల మనసుల్ని నిశ్శబ్దంగా దోచేసింది... ఆ తరవాత తెలుగులో మళ్లీ సెలైంట్ మూవీ రాలేదు. అయితే లఘుచిత్రాలలో మాత్రం చాలామంది నిశ్శబ్ద చిత్రాలు తీస్తున్నారు. ప్రశాంత్ కూడా అలాంటిదే ఒక చిత్రం తీశారు. ‘సెలైంట్ మెలడీ’ పేరుతో తీసిన ఈ చిత్రం మొదటి నెలలోనే పది లక్షల వ్యూస్‌తో ‘వైవా’ లఘుచిత్రం తరవాత అంత పేరు సంపాదించుకుంది. పాలకొల్లుకి చెందిన 26 సంవత్సరాల ప్రశాంత్, హైదరాబాద్‌లోని సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పట్టా పుచ్చుకున్నారు. తండ్రి బిల్డర్‌గా పని చేస్తున్నారు. తల్లి గవర్నమెంట్ స్కూల్లో టీచర్. ‘‘మా పేరెంట్స్ నేను సినిమాల్లోకి వెడతాననగానే ముందు షాకయ్యారు. తరవాత నాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు’’ అంటూ తల్లిదండ్రుల ఆశీస్సుల గురించి వివరించారు ప్రశాంత్. ఈ చిత్ర కథ గురించి - ‘‘ఒకసారి నేను హోటల్‌కి వెళ్లినప్పుడు, ఒక జంటను చూశాను. వారి మధ్య సంభాషణ చేతి సైగలతో నడుస్తోంది. మూగవారేమో అనుకున్నాను. అంతలోనే ఆయన వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇవ్వడంతో, ఆయనకు మాటలు వచ్చు, ఆవిడ మూగది అని అర్థం అయ్యింది. నా మనసు వారి వైపు ఆరాధనగా చూసింది. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని లఘుచిత్రం తీయాలనిపించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా హీరో సందీప్ కిషన్‌కి కథ చెప్పాను. తనకి బాగా నచ్చి ఈ సినిమాని తనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. అలా ఈ చిత్రం తీశాం’’ అంటారు ప్రశాంత్. సెలైంట్ మెలడీ’ లఘుచిత్రానికి యాహూ, ఎన్డిటివి వాళ్లు ‘బెస్ట్ మూవీ’ అంటూ పబ్లిసిటీ ఇచ్చారు. ఇందులో సినిమాలకి వాడే కెమెరాలు వాడారు. ‘‘సినిమా బడ్జెట్ రూ. 75000 వేలు. రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. ఇందులో హీరోయిన్గా నటించిన ప్రాచీ థాకరేను ఫేస్బుక్ ద్వారా సంప్రతించాను. అయితే ఆ అమ్మాయికి తెలుగు రాదని చెప్పింది. ఇది ఏ భాషా అవసరం లేని సెలైంట్ మూవీ అని చెప్పడంతో ఆ అమ్మాయి అంగీకరించింది’’ అన్నారు ప్రశాంత్. ప్రాచీ థాకరే నిఫ్ట్‌లో చదువుతున్నారు. అందువల్ల తన కాస్ట్యూమ్స్‌ను తానే సొంతంగా డిజైన్ చేసుకున్నారు. ప్రొడ క్షన్ వర్క్ బాగా నేర్చుకున్న ప్రశాంత్, చదువుతూన్న రోజుల్లోనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ‘ఆడపిల్లల్ని చంపుకోవడం’ గురించి సందేశాత్మకమైన పాట ఒకటి తీశారు. కొన్ని డాక్యుమెంటరీలూ చేశారు. చాలా సినిమాలకు యాడ్స్ చేశారు. ‘‘బీటెక్ పూర్తవ్వగానే అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరదామనుకున్నాను. కానీ, నేను అనుకున్న యూనివర్శిటీలో సీటు రాకపోవడంతో ఇక్కడే ఉండిపోయాను’’ అంటున్న ప్రశాంత్... సినిమా రంగానికి చెందిన వారితో పరిచయాలు పెంచుకుని, సినిమాల గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించుకున్నారు. ‘‘నేను చేసిన లఘుచిత్రాలను కాంపిటీషన్‌కి పంపినప్పుడు అక్కడ ఐదుగురు న్యాయనిర్ణేతలు నన్ను ప్రశంసించారు. అయితే నా చిత్రం వారు ఇచ్చిన అంశానికి భిన్నంగా ఉండటంతో బెస్ట్ కన్సొలేషన్ ప్రైజ్ ఇచ్చారు. దాసరిగారు నన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు’’ అని వివరించారు ప్రశాంత్. ప్రస్తుతం రెండు పెద్ద చిత్ర నిర్మాణ సంస్థల సినిమాలకు డెరైక్టర్‌గా సంతకం చేశారు ప్రశాంత్. చదువులో టాపర్ అయిన ప్రశాంత్ తన వెండి తెర కలల్ని నిజం చేసుకొనే ప్రయత్నంలో కృషి చేస్తున్నారు. ‘‘నాటాలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ‘సెలైంట్ మెలడీ’ ఫైనలిస్ట్‌లోకి చేరడం, అందులో నేను మోస్ట్ ప్రామిసింగ్ బడ్డింగ్ డెరైక్టర్ అవార్డు అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా 18వ పుచోన్ ఇంటర్నేషనల్ ఫెన్టాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘సైలంట్ మెలడీ’ని స్క్రీనింగ్‌కి ఎంపిక కావడం నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన’’ అంటారు ప్రశాంత్. - డా. పురాణపండ వైజయంతి -
కోటి రతనాలంటి రుచులు...
కోటి రతనాల రాగాలు పలికించే వీణ పట్టే చేతులు... కోటి రుచులను వండలేవా? వడ్డించలేవా? ఉద్యమాల గడ్డ మీద... వండే వంటల్లోనూ పవరుంటుంది... పౌరుషముంటుంది... నాలుకనంటగానే రుచిస్తుంటుంది. అసలు సిసలు తెలంగాణాంగణ ప్రాంగణపు వంటలైన శేవల పాయసం కేవలం రుచి చూస్తే సరిపోదు... మసాలా పూరీ తింటే మనసు నిండదు... మరి కాస్త తప్పక కావాలనిపిస్తుంది... నడుములెత్తకుండా కూర్చుని తినాలనిపించే ఆనపగింజ కుడుములు వారేవా అనిపించే వాక్కాయ ఆవకాయ వడివడిగా తినిపించే చేమకూర బడీలు పూర్ణం కట్టు చారుతోనే సంపూర్ణమయ్యే భోజనాలు... కోటి రుచుల్లో కొన్ని శాంపిల్ రుచులివి... రాష్ట్రాలుగా వేరైనంత మాత్రాన రుచులు వేరవుతాయా? స్టేటులుగా విడిపోయినంతనే టేస్టులు విడివడతాయా? ఒకటీ రెండు తింటేనే కోటి రుచుల పెట్టు ఈ తెలగాణ్యపు వంటలు ముద్ద నోట పెట్టగానే... నాలుక మాగాణ్యంపై రుచుల సిరుల పంటలు. మసాలా పూరీ కావలసినవి: గోధుమపిండి - 3 కప్పులు; సెనగపిండి - కప్పు; కరివేపాకు - 3 రెమ్మలు; పచ్చి మిర్చి - 3; పసుపు - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: గోధుమపిండి, సెనగపిండి కలిపి జల్లించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్దలో కొన్ని నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి కరివేపాకు, పచ్చి మిర్చి సన్నగా తరిగి పిండిలో వేయాలి పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత కొద్దిగా నూనె వేసి మృదువుగా అయ్యేలా కలిపి చిన్న ఉండలు చేసుకోవాలి ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి అన్నీ చేసుకుని, వేడి నూనెలో నిదానంగా రెండు వైపులా కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. (పూరీలు మందంగా ఉంటే మెత్తబడిపోతాయి. నిల్వ ఉండవు) శేవల పాయసం కావలసినవి: గోధుమపిండితో చేసిన శేవలు - 200 గ్రా.; బెల్లం తురుము - 250 గ్రా.; నెయ్యి - 4 టీ స్పూన్లు; గసగసాలు - టీ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; పాలు - కప్పు; కొబ్బరి తురుము - కొద్దిగా తయారీ: ఒక గిన్నెలో బాగా ఎండిన శేవలు, తగినన్ని నీళ్లు పోసి శేవలను ఉడికించాలి బెల్లం తురుము, పాలు, నెయ్యి వేసి నెమ్మదిగా కలపాలి బాగా ఉడికిన తర్వాత ఏలకుల పొడి, గసగసాలు వేయాలి కొబ్బరితురుముతో గార్నిష్ చేసి దింపేయాలి వేడివేడిగా అందించాలి ఇష్టమైన వారు మరి కాస్త నెయ్యి వేసుకోవచ్చు శేవల తయారీ... గోధుమపిండికి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, చేతితో ఒత్తుతూ సన్నగా పొడవుగా సేమ్యా మాదిరిగా చేయాలి రెండు మూడు రోజులు ఎండబెట్టాలి డబ్బాలో నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. వీటిని తయారు చేసే మిషన్లు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి సేమ్యా లాంటివి. చేమకూర బడీలు కావలసినవి: చేమకూర ఆకులు - 10 (వెడల్పుగా ఉండే ఆకులు); సెనగపిండి - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - చిటికెడు; గరం మసాలా - చిటికెడు; సన్నగా తరిగిన కొత్తిమీర - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: చేమకూర ఆకులను కడిగి, తుడిచి పెట్టుకోవాలి సెనగపిండిలో మిగతా వస్తువులు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి ముద్దలా చేసుకోవాలి చేమకూర ఆకుపై ఈ ముద్దను పలుచగా రాసి చాప చుట్టలా మడిచి ఉంచాలి అదే విధంగా అన్ని ఆకులతో చేసుకోవాలి ఈ మడతలను ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి చల్లారిన తర్వాత అంగుళం వెడల్పులో ముక్కలుగా కట్ చేయాలి నూనెలో వేసి ఎర్రగా కరకరలాడేలా వేయించాలి వీటిని ఉల్లి చక్రాలతో నంచుకు తింటే రుచిగా ఉంటాయి. పూర్ణం కట్టు చారు కావలసినవి: సెనగపప్పు ఉడకబెట్టిన నీళ్లు - 2 కప్పులు; చింతపండు - నిమ్మకాయంత; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి - 2; ఎండు మిర్చి - 3; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; టొమాటో - 1; పసుపు - పావు టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు; ఉడికించిన సెనగపప్పు ముద్ద (పూర్ణం) - పావు కప్పు తయారీ: చింతపండులో నీళ్లు పోసి, నానబెట్టి, పులుసు తీసుకుని పప్పు నీళ్లలో కలపాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగాక కలిపి పెట్టుకున్న కట్టు చారు వేయాలి కొద్దిసేపు మరిగిన తర్వాత పూర్ణం వేసి కలపాలి మరో రెండు నిమిషాలు మరిగించి దించేయాలి చారు తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉంటుంది. ఆనప గింజల కుడుములు కావలసినవి: బియ్యప్పిండి - కప్పు; ఆనప గింజలు - ఒకటిన్నర కప్పులు; ఉల్లికాడల తరుగు - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; పచ్చి మిర్చి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: ఆనప గింజలు మరీ లేతగా కాకుండా కొద్దిగా ముదురుగా ఉండేలా చూసుకోవాలి. (చిక్కుడు గింజలతో కూడా చేయవచ్చు) బియ్యప్పిండిలో ఆనప గింజలు, పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి గోరువెచ్చని నీళ్లతో తడిపి మూత పెట్టి గంటసేపు ఉంచాలి నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి ఇడ్లీ రేకులలో ఒక్కో ఉండను ఉంచి ఆవిరి మీద ఉడికించాలి ఆవకాయతో కాని, ఉల్లిపాయ పచ్చడితో కాని తింటే రుచిగా ఉంటాయి. వాక్కాయఆవకాయ కావలసినవి: వాక్కాయలు - కేజీ; ఉప్పు - 250 గ్రా.; నువ్వుల నూనె - 250 గ్రా.; మిరప్పొడి - 125 గ్రా.; అల్లం ముద్ద - 125 గ్రా.; వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర + మెంతులు - టీ స్పూను తయారీ: వాక్కాయలను రెండు లేదా నాలుగు ముక్కలుగా తరిగి లోపలి జీడి వేరు చేయాలి ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి పూర్తిగా చల్లారాక కలిపి పెట్టుకున్న పొడులు, వాక్కాయ ముక్కలు వేసి బాగా కలపాలి జాడీలోకి తీసుకుని మూడు రోజుల తర్వాత ఆవకాయ మొత్తం ఇంకోసారి కలిపి వాడుకోవాలి. చేమగడ్డ పప్పు కావలసినవి: కందిపప్పు - 200 గ్రా.; చేమగడ్డలు - 200 గ్రా.; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; గరంమసాలా పొడి - పావు టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - అర టీ స్పూను; టొమాటో - 1 (ముక్కలుగా తరగాలి); చింతపండు పులుసు - పావు కప్పు; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు తయారీ: కందిపప్పు కడిగి నీళ్లు పోసి సగం పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించాలి చేమగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉంచాలి పసుపు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నిమిషం సేపు వేయించి చేమగడ్డలు, వాటికి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి చేమగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేసి అందులో చింతపండు పులుసు, అర కప్పు నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి చేమగడ్డలు మెత్తబడ్డ తర్వాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరి కొద్దిసేపు ఉడికించాలి గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. సేకరణ డా. వైజయంతి కర్టెసీ: జ్యోతి వలబోజు -
సెన్సార్ చేతి రాత
చేతిరాతను చూసి తలరాతను నిర్ణయిస్తారు చాలామంది... ప్రస్తుతం చేతిరాతను చాలామంది మర్చిపోయారు. వరంగల్‌కి చెందిన సతీశ్ మాత్రం వందల కొద్దీ పేజీలు చేతితోనే రాస్తున్నారు. అది కూడా అచ్చంగా ప్రింట్లో అక్షరాల్లాగ. డిగ్రీ చదువుతుండగానే చలనచిత్రరంగంలోకి ప్రవేశించారు సతీశ్. ‘‘నా అక్షరాలు బాగున్నాయని ప్రశంసించిన చిత్రదర్శకుడు ఆదినారాయణరావు, చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించారు. చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తూ, నా చేతిరాతకు పనికి వచ్చే పని చేయడానికి ప్రయత్నించాను. సినిమా సెన్సార్‌కి స్క్రిప్ట్ రైటర్లు చాలా తక్కువమంది ఉంటారు. నాకు చిత్ర పరిశ్రమలో అంతగా అవకాశాలు కలిసిరాని సమయంలో, అల్లాణి శ్రీధర్ గారి ఫిల్మీ మీడియా సంస్థలో సెన్సార్ స్క్రిప్ట్ వర్క్ పని అప్పచెప్పారు. నేను ఆ వర్క్ అంతా చేతితో రాసి ఇచ్చాను. ఆది చూసి ఆయన నన్నెంతగానో ప్రోత్సహించారు’’ అని తన సినీరంగ ప్రవేశం గురించి తెలిపారు సతీశ్. దర్శకత్వశాఖలో అవకాశాలు లభించక, ఆర్థికం ఇబ్బందుల నుంచి బయటపడటానికి సతీశ్ ఎంచుకున్న మార్గం సెన్సార్ స్క్రిప్ట్‌ను స్వయంగా చేతితో రాయడం. సతీశ్చేతిరాత చూసిన ‘7్టజి సెన్స్’ చిత్ర దర్శకుడు పెద్ది కె. ఈశ్వర్ ఆ సినిమాకి సెన్సార్ స్క్రిప్ట్ రాయమని కోరటంతో సతీశ్ మొట్టమొదటిసారి సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒక సినిమాకి సుమారు 100 - 150 పేజీల వరకు స్క్రిప్ట్ ఉంటుంది. సతీశ్ అదంతా చేతితో రాశారు. ‘‘సతీశ్ చేతి రాత చూసిన తర్వాత ఎన్నో పెద్దపెద్ద సినిమా స్క్రిప్ట్స్ అతనితోనే రాయించాను. అతని చేతి రాత అచ్చు డిటిపి చేసినట్టుగా ఉంటుంది’’ అని ప్రశంసించారు ఎఫ్‌డిసిలో పని చేస్తున్న అనంత్. ‘‘నా చేతిరాత చూసిన దర్శకుడు చంద్రసిద్ధార్థ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా సెన్సార్ స్క్రిప్ట్ పని నాకు అప్పగించారు. సాహసం, అత్తారింటికి దారేది, డికెబోస్, ప్రతినిధి, జెండాపై కపిరాజు, వెల్కమ్ ఒబామా, వీడికి దూకుడెక్కువ... ఇలా అనేక చలనచిత్రాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశాను’’ అంటున్నారు సతీశ్. సతీశ్ చేతిరాత కంప్యూటర్ అక్షరాలు అందంగా ఉండడం వల్ల రెండేళ్లలోనే వందకు పైగా సినిమాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే మరో వైపు సెన్సార్ స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉంటున్నారు సతీశ్. ‘‘దర్శకత్వ శాఖలో అవకాశాలు లభించక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అటువంటి వారికి డిటిపి వర్క్ అప్పచెబుతున్నాను. ఒకవేళ నా జీవితంలో నేను సెన్సార్ స్క్రిప్ట్ రాయకుండా ఉండి ఉంటే పరిశ్రమ నుండి తప్పుకునేవాడినేమో!’’ అని చెబుతున్న సతీశ్లోని ఆశావాదాన్ని అందరూ అనుసరిస్తే, ఎప్పటికైనా ఉన్నతస్థాయికి ఎదుగుతారనడంలో సందేహం లేదు. - డా.వైజయంతి -
మామిడి రుచిలెక్కలెరుగదు...
రుచులను షడ్రుచులుగా వర్ణించి వర్గీకరించారు... రసాలను నవరసాలంటూ పరిమితి విధించి చెప్పారు... ఇలా నిర్ణయించినవారికి మామిడి గురించి తెలుసో? లేదో? ఆ ఒక్క పండులోనే ఎన్నో రసాలు... చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు... మామిడిని ఆస్వాదించడానికి... ఆ ఆరూ, ఈ తొమ్మిదీ సరిపోలేదు... వంట వంక పెట్టుకుని... రెసిపీ పేరు పెట్టుకొని ... కొత్త రుచుల అన్వేషణ చేస్తున్నారు... ఆకలి రుచినీ, నిద్ర సుఖాన్నీ ఎరగనట్టే... మామిడి రుచులు లెక్కలెరగవు. లెక్కలకు ప్రాధాన్యమిస్తే పండును వదిలేసి టెంకను తిన్నంత ఒట్టు. ఈ వంటలన్నీ చేసేసి, కొత్తరుచుల గిన్నెలను పొయ్యి దించండి. లెక్క లేని, అంతు లేని మామిడి వంటలను ఆస్వాదించండి. మ్యాంగో చీజ్ కేక్ కావలసినవి: హెవీ క్రీమ్ - కప్పు; కన్ఫెక్షనరీ పంచదార - 2 టేబుల్ స్పూన్లు; మేరీ బిస్కెట్ల పొడి - 3 కప్పులు; పనీర్ తురుము - 50 గ్రా;క్రీమ్ చీజ్ - 150 గ్రా., పనీర్ - 100 గ్రా., పాలు - పావు కప్పుపంచదార పొడి - 6 టీ స్పూన్లు, కరిగించిన బటర్ - 4 టేబుల్ స్పూన్లు వెనీలా ఎసెన్స్ - టీ స్పూను, మామిడిపళ్లు - 2, మామిడిపండు గుజ్జు - పావు కప్పు తయారీ: ఒక పాత్రలో హెవీ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలపాలి బిస్కెట్ల పొడి ఇందులో వేసి అన్నీ కరిగిపోయేలా కలపాలి సర్వింగ్ బౌల్స్‌లో ఈ మిశ్రమాన్ని కింద వేసి గట్టిగా ఒత్తి వీటిని డీప్ ఫ్రిజ్‌లో సుమారు 10 నిమిషాలు ఉంచాలి పనీర్ ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి పనీర్ మిశ్రమానికి పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ జత చేసి మెత్తగా అయ్యేవరకు గిలక్కొట్టాలి. (అవసరమనుకుంటే పాలు జత చేయాలి) మామిడి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సగం ముక్కలను చీజ్ మిశ్రమంలో వేయాలి క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్‌తో సర్దాలి మామిడిపండు గుజ్జును పైన వేసి సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి చివరగా చీజ్ కేక్ పైన మామిడి పండు ముక్కలతో అలంకరించి, అందించాలి. మ్యాంగో ముసిలీ కావలసినవి: కార్న్ ఫ్లేక్స్ - 100 గ్రా., ఓట్లు - 100 గ్రా. (ఎండబెట్టి వేయించాలి) డ్రై ఫ్రూట్స్ - అర కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు - పావు కప్పు, నువ్వుపప్పు - పావు కప్పు (వేయించాలి) పెరుగు - అర లీటరు, పచ్చి మామిడికాయ తురుము - 2 కప్పులు, తేనె - 4 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో కార్న్ ఫ్లేక్స్, వేయించిన ఓట్లు, వేయించిన నువ్వు పప్పు, డ్రై ఫ్రూట్స్ కలిపితే ముసిలీ తయారవుతుంది. ఒక పాత్రలో పెరుగు, తేనె వేసి బాగా గిలక్కొట్టాలి. ఒక గ్లాసులో ముందుగా పెరుగు + తేనె మిశ్రమం ఒక పొరలా వేయాలి. ఆ పైన నాలుగు టేబుల్ స్పూన్లు ముసిలీ మిశ్రమం వేయాలి. ఆ పైన పెరుగు మరో పొరలా వేయాలి. చివరగా పచ్చిమామిడికాయ తురుము, ముసిలీ మిశ్రమం వేయాలి. ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచి తీసి అందించాలి. మ్యాంగో కార్డమమ్ పౌండ్ కేక్ కావలసినవి: మైదా పిండి - ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ - టీ స్పూను బేకింగ్ సోడా - పావు టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను ఏలకుల పొడి - టీ స్పూను, అన్ సాల్టెడ్ బటర్ - అర కప్పు పంచదార - ముప్పావు కప్పు, గట్టి పెరుగు - 3 టేబుల్ స్పూన్లు మజ్జిగ - 100 మి.లీ., మామిడి పండు గుజ్జు - అర కప్పు మామిడి పండు ముక్కలు - కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) ఐసింగ్ సుగర్ - టీ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) తయారీ: అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి ఉంచాలి. కేక్ టిన్ తీసుకుని దానిలో ముందుగా అన్ సాల్టెడ్ బటర్, ఆ తరవాత కొద్దిగా మైదా పిండి వేయాలి. ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి. బటర్లో పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి. పెరుగు జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. పెన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో మజ్జిగ, మామిడిపండు గుజ్జు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. సిద్ధంగా ఉన్న కేక్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోయాలి. సుమారు 45 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. బాగా చల్లారాక పైన ఐసింగ్ సుగర్, మామిడిపండు ముక్కలు వే సి అందించాలి. మ్యాంగో అండ్ జింజర్ జామ్ కావలసినవి: మామిడి పండు ముక్కలు - 2 కప్పులు పంచదార - పావు కప్పు ఉప్పు - చిటికెడు అల్లం తురుము - టీ స్పూను నిమ్మరసం - టీ స్పూను తయారీ: అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి స్టౌ (సన్నని మంట) మీద ఉంచి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. (మాడకుండా ఉండేలా మధ్య మధ్యలో కలుపుతుండాలి) రుచి చూసి పంచదార తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా జత చేయాలి. బాగా చల్లారాక శుభ్రమైన గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే సుమారు నెల రోజులు నిల్వ ఉంటుంది. మ్యాంగో పులిసేరీ కావలసినవి: మామిడిపండు - 1; కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి - 2; మెంతులు - అర టీ స్పూను; చిక్కటి మజ్జిగ - ఒకటిన్నర కప్పులు; నూనె - 2 టీ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఉప్పు - తగినంత తయారీ: ఇది కేరళ వంటకం ముందుగామామిడి పండు తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు, మామిడిపండు ముక్కలు, కరివేపాకు వేసి ఉడికించాలి చిన్న బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక, మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా చేసి, ఉడుకుతున్న మామిడిపండుగుజ్జులో వేయాలి బాగా ఉడుకుతుండగా మజ్జిగ జత చేసి, కలిపి దించేయాలి చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు వేసి వేయించి, మామిడిపండు గుజ్జులో వేయాలి ఇది అన్నంలోకి, వేపుడులోకి బాగుంటుంది. రా మ్యాంగో సలాడ్ కావలసినవి: నువ్వు పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - టేబుల్ స్పూను; బెల్లం - టేబుల్ స్పూను; పచ్చి మామిడికాయ తురుము - కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; ఎల్లో క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; కొత్తిమీర తరుగు - నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత తయారీ: బాణలిని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నువ్వుపప్పు, పల్లీలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి చిన్న రోలు వంటి దాంట్లో పల్లీలు, నువ్వుపప్పు, బెల్లం వేసి, పొడిపొడిలా అయ్యేలా దంచి తీసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో పచ్చి మామిడికాయ తురుము, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. (ముందుగా వీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడనివ్వాలి) సర్వింగ్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా వేసి, పైన కొత్తిమీర, పల్లీలు + నువ్వుపప్పు + బెల్లం మిశ్రమం చల్లి అందించాలి. సేకరణ: డా. వైజయంతి కర్టెసీ: అరుంధతీరావ్ -
నోరు పండే పచ్చళ్లు
పండుమిర్చి... పేరు వినగానే నోరు మండుతుంది... అలాగని మనసు ఊరుకోనిస్తుందా... ఒక్కసారి ఆ ఘాటును రుచి చూడమంటుంది... అంత కారం తినాలంటే ఎలా అని మళ్లీ అనిపిస్తుంది... అందుకే పండుమిర్చితో రకరకాల పదార్థాలను జత కట్టిద్దాం... గోంగూర, కొబ్బరి, చింతకాయ, టొమాటో, మసాలా... వీటి స్నేహంతో మిరప తన ఘాటు కోపాన్ని కాస్తంత తగ్గించుకొని... కమ్మటి రుచిని అందిస్తోంది... అమ్మో! పండుమిర్చి! అనకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి... అబ్బ! ఎంత బాగుందో... అనక మానరు. పండుమిర్చిచింతకాయ పచ్చడి కావలసినవి: పండుమిర్చి - 100 గ్రా. చింతకాయలు - 100 గ్రా., శనగపప్పు - టీ స్పూను జీలకర్ర - అర టీస్పూను, కరివేపాకు - ఒక రెమ్మ, వెల్లుల్లి రేకలు - 5 ఇంగువ - చిటికెడు, ఆవాలు - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2, ఉప్పు - 25 గ్రా. పసుపు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను తయారి: చింతకాయలను కడిగి ఆరబోసి, తడి పోయాక దంచి, గింజలు, ఈనెలు, పై తొక్క వేరు చేయాలి పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి, మిర్చిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి చింతకాయల పేస్ట్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు తిప్పి తీసేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక, ఇంగువ, కరివేపాకు జత చేసి వేగాక పచ్చడిలో వేసి కలపాలి. పండుమిర్చి టొమాటో పచ్చడి కావలసినవి: ఆవాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వైట్ వెనిగర్ - ఒకటిన్నర కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు, పండుమిర్చి - పావు కేజీ (గింజలు తీసేయాలి) టొమాటోలు - 2 కేజీలు, (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పసుపు - టీ స్పూను, జీలకర్ర - 4 టీ స్పూన్లు పంచదార - కప్పు, ఉప్పు - తగినంత తయారి: ఒక పాత్రలో ఆవాలు, వైట్ వెనిగర్ వేసి సుమారు అరగంటసేపు నాననివ్వాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి పసుపు, జీలకర్ర, పంచదార, ఉప్పు, వెనిగర్‌లో నానబెట్టిన ఆవాలు జత చేయాలి మిశ్రమం దగ్గరపడే వరకు సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి చల్లారాక గాలిచొరని జాడీలోకి తీసుకుని సుమారు 10 రోజుల తరువాత ఉపయోగించుకోవాలి. పండుమిర్చి కొబ్బరి పచ్చడి కావలసినవి: పండుమిర్చి - 200 గ్రా., కొబ్బరితురుము - కప్పు, వెల్లుల్లి రేకలు - 10, అల్లం తురుము - టీ స్పూను, ఆవపొడి - అర కప్పు, ఎండుమిర్చి - 6, ఆవాలు - టేబుల్ స్పూను, పసుపు - టీ స్పూను, చింతపండు - కొద్దిగా, మెంతిపొడి - అర టేబుల్ స్పూను, పల్లీ నూనె - 300 మి.లీ., ధనియాలపొడి - టీ స్పూను, జీలకర్రపొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - టీ స్పూను తయారి: పండుమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి బాణలిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, కొబ్బరితురుము వేసి వేయించాలి. చల్లారాక, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి అల్లం తురుము, చింతపండు జత చేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి పండుమిర్చి, కొబ్బరిపేస్ట్ వేసి వేయించాలి చివరగా ఆవపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. పండుమిర్చి గుత్తి పచ్చడి కావలసినవి: పండుమిర్చి -3 కేజీలు, వాము - 100 గ్రా. జీలకర్ర - 100 గ్రా., సోంపు - 100 గ్రా., ఎండుమిర్చి - 100 గ్రా. మెంతులు - 100 గ్రా., ఇంగువ - టేబుల్ స్పూను కలౌంజీ - 100 గ్రా., ఉప్పు - 200 గ్రా. ఆమ్చూర్ - 150 గ్రా., ఆవనూనె - కేజీ వైట్ వెనిగర్ - 200 మి.లీ. తయారి: పండుమిర్చిని శుభ్రంగా కడిగి,తడి పోయేవరకు గాలిలో ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి. గింజలు తీసి పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో వాము, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఉప్పు, ఆమ్చూర్ జతచేసి మరోమారు మిక్సీ పట్టాలి. పండు మిర్చి గింజలను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి రెండు పొడులకు కలౌంజీ జత చేసి, ఆవనూనె, వైట్ వెనిగర్ వేయాలి. (వీటిని కలిపేటప్పుడు గ్లౌజ్ వేసుకుంటే మంచిది. లేదంటే చేతులు మండుతాయి) నూనె, ఇంగువ వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని రెండు మూడు రోజులు ఎండలో ఉంచాలి ఈ మిశ్రమాన్ని కట్ చేసి ఉంచుకున్న పండుమిర్చిలో స్టఫ్ చేసి, నాలుగు రోజులు ఎండలో ఉంచాక, మిగిలిన నూనెను వాటి మీద పోసి గాలిచొరని జాడీలో నిల్వ చేయాలి. పండుమిర్చి గోంగూర పచ్చడి కావలసినవి: గోంగూర - కేజీ, పండుమిర్చి - 300గ్రా., చింతపండు - 250 గ్రా., ఉప్పు -తగినంత, ఇంగువ - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 6, పసుపు - టీ స్పూను, మెంతులు - 3 టీ స్పూన్లు, నూనె - పావు కేజీ తయారి: మెంతులను దోరగా వేయించి పొడి చేసి పక్కన ఉంచాలి పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి చింతపండు శుభ్రం చేసి పక్కన ఉంచాలి గోంగూర ఆకులను శుభ్రం చేసి, బాగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పెద్ద పాత్రలో మెత్తగా చేసి ఉంచుకున్న పండుమిర్చి, గోంగూర, చింతపండు వేసి వాటికి ఉప్పు, వెల్లుల్లి రేకలు, పసుపు, మెంతిపొడి జత చేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపి దించి చల్లారిన తరువాత పచ్చడిలో వేసి బాగా కలిపి, గాలిచొరని జాడీలో నిల్వ చేసుకోవాలి వాడుకునే ముందు పోపు వేస్తే తాజాగా, రుచిగా ఉంటుంది. పండుమిర్చి పచ్చడి కావలసినవి: పండుమిర్చి - కేజీ ఉప్పు - అర కప్పు చింతపండు - పావు కేజీ పసుపు - టీ స్పూను మెంతులు - టీ స్పూను నూనె - 2 కప్పులు జీలకర్ర - టేబుల్ స్పూను ఆవాలు - టేబుల్ స్పూను ఇంగువ - పావు టీ స్పూను తయారి: ఒక పాత్రలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి బాగా కలిపి గాలిచొరని సీసాలో మూడు రోజులు ఉంచాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు, పసుపు వేయించి, పచ్చడిలో వేసి కలపాలి తగినంత నూనె పోసి రెండు రోజుల తర్వాత వాడుకోవాలి. సేకరణ: డా. వైజయంతి -
స్వీటొమాటో హాటొమాటో
టొమాటోలు... నిన్నమొన్నటి దాకా ఆకాశంలో కూర్చుని మనకు అందకుండా దూరం నుంచి ఊరించాయి... మరి ఇప్పుడో... ఒక్కసారిగా నేలమీదకు వచ్చి బుద్ధిగా చేతులు కట్టుకు నిలబడ్డాయి... ఆలస్యం చేయకుండా.... చాకు పట్టుకుని టొమాటోలను కసాకసా ముక్కలు చేసేద్దాం... పచ్చడి, ఊరగాయ, రసం, సూప్, స్నాక్... మనకు నచ్చినట్టుగా వండేద్దాం... స్వీటైనా, హాటైనా టొమాటో మాటెత్తకుండా ముద్ద దిగడం కష్టమని గమనిద్దాం... టొమాటోకి ఓటేద్దాం... టొమాటో హల్వా కావలసినవి: టొమాటోలు - 4 (మీడియం సైజువి) నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి - పావు టీ స్పూను పంచదార - 7 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను బాదంపప్పులు, పిస్తా పప్పులు - గార్నిషింగ్‌కి తగినంత తయారీ: టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి కాగాక టొమాటో గుజ్జు, ఏలకులపొడి, పంచదార వేసి, కలుపుతుండాలి మంట బాగా తగ్గించి, టొమాటో గుజ్జు ఉడుకుతుండగా మరికాస్త నెయ్యి జత చేయాలి కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీరు జత చేయాలి మిశ్రమం బాగా చిక్కగా, మృదువుగా అయ్యేవరకు కలిపి దించేయాలి బాదంపప్పులు, పిస్తా పప్పులతో గార్నిష్ చేయాలి. టొమాటో సూప్ కావలసినవి: పాస్తా - కప్పు నీరు - 4 కప్పులు టొమాటోలు - 8 మిరియాలపొడి - టీ స్పూను కారం - టీ స్పూను జీలకర్ర పొడి - టీ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను ఉప్పు - తగినంత పుదీనా ఆకులు - 5 బ్రెడ్ క్యూబ్స్ - 10 కొత్తిమీర - ఒక కట్ట తయారీ: ఒక పాత్రలో నీరు మరుగుతుండగా పాస్తా వేసి దించేయాలి. టొమాటోలను శుభ్రంగా కడిగి, రెండు విజిల్స్ వచ్చేవరకు కుకర్‌లో ఉడికించాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి నీటిని జత చేసి స్టౌ మీద ఉంచి, బాగా మరుగుతుండగా మిరియాలపొడి, కారం, జీలకర్రపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. ఉడికించిన పాస్తా జత చేయాలి. మంట తగ్గించి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. ఔసూప్బౌల్లో బ్రెడ్ క్యూబ్స్, పుదీనా, కొత్తిమీర వేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి. స్టఫ్డ్ టొమాటో కావలసినవి: ఎర్రగా ఉన్న టొమాటోలు - 2 ఆలివ్ ఆయిల్ - టీ స్పూను వెల్లుల్లి రేక లు - 2 ఉల్లి తరుగు - పావుకప్పు జీలకర్ర - అర టీ స్పూను వంకాయ ముక్కలు - అర కప్పు వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు టొమాటో ముక్కలు - పావుకప్పు పుదీనా ఆకులు - 5 నువ్వుపప్పు - 3 టేబుల్ స్పూన్లు పైన్‌నట్స్ - 2 టేబుల్ స్పూన్లు కారం - అర టీ స్పూను ఉప్పు - తగినంత మిరియాలపొడి - పావు టీ స్పూను కొత్తిమీర తరుగు - కప్పు తయారీ: అవెన్‌ను 375 డిగ్రీల దగ్గర వేడి చేయాలి టొమాటోలపై భాగాన్ని కట్ చేసి, లోపల ఉండే గుజ్జును స్పూను సహాయంతో జాగ్రత్తగా తీయాలి ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లిరేకలు, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మూడు నిమిషాలు వేయించాలి వంకాయ ముక్కలను జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి ఒక చిన్న బాణలిలో వెనిగర్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి పుదీనా ఆకులు, కారం జత చేసి రెండు నిమిషాలు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మరో బాణలిలో కూరగాయ ముక్కలకు, నువ్వుపప్పు, పైన్ నట్స్ జత చేసి కలపాలి వేడిగా ఉండగానే మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి దించేయాలి పైన తయారుచేసుకున్న పదార్థాలన్నిటినీ ఒక పాత్రలో వేసి బాగా కలపాలి పెద్ద స్పూన్‌తో ఈ మిశ్రమాన్ని టొమాటోలలో స్టఫ్ చేసి, బేకింగ్ షీట్ మీద ఉంచి అవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి. బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. టొమాటో - పుదీనా చట్నీ కావలసినవి: పుదీనా ఆకులు - అర కప్పు పండిన టొమాటోలు - 4 (మీడియం సైజువి) ఉల్లి తరుగు - పావుకప్పు పుట్నాలపప్పు - అర కప్పు ఎండుమిర్చి - 4 ఇంగువ - పావు టీ స్పూను నూనె - టేబుల్‌స్పూను ఆవాలు - పావు టీ స్పూను మినప్పప్పు - అర టీ స్పూను ఉప్పు - తగినంత తయారీ: బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించి, పక్కన ఉంచాలి అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు ఉంచాలి పుదీనా ఆకులు జత చేసి మూడు నిమిషాలు ఉడికించాలి పుట్నాలపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. (నీరు కలపకూడదు) (పుదీనా బదులు కొత్తిమీర కూడా వాడవచ్చు) టొమాటో ఆవకాయ కావలసినవి: టొమాటోలు - కిలో కారం - 50 గ్రా. చింతపండు - 150 గ్రా. ఉప్పు - తగినంత నూనె - పావు కేజీ ఇంగువ - టేబుల్ స్పూను ఎండుమిర్చి - 6 ఆవాలు - టేబుల్ స్పూను మెంతిపొడి - టేబుల్ స్పూను తయారీ: ముందురోజు రాత్రి ఒక గిన్నెలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాలి మరుసటి రోజు ముక్కలను గట్టిగా పిండి, రసం ఒక గిన్నెలో, ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రసంలో చింతపండు వేసి, ముక్కలను, రసాన్ని విడివిడిగా ఎండబెట్టాలి అయిదారు రోజులు ఎండాక, ముక్కలను రసంలో వేసి కలిసి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. కారం, మెంతిపిండి జత చేయాలి బాణలిలో పావుకేజీ నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి దించేసి, చల్లారాక టొమాటో ఊరగాయలో పోయాలి బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించి, పచ్చడిలో వేసి కలపాలి. టొమాటో సాస్ అరకిలో టొమాటోలను ఉడికించి, తొక్క తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఒక పాత్రలో ఉడికించిన టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కప్పు పంచదార, తగినంత ఉప్పు, కారం జత చేసి సుమారు పావుగంటసేపు ఉడికిస్తే హోమ్ మేడ్ టొమాటో సాస్ రెడీ. సేకరణ: డా. వైజయంతి -
మూడు రంగులు... ఆరు రుచులు
గణతంత్రం... స్వేచ్ఛా పావురం. దేశభక్తి... త్యాగం, శాంతి, సౌభాగ్యాల త్రివర్ణం! సమరయోధులు స్వాతంత్య్రాన్ని తెచ్చారు. రాజనీతిజ్ఞులు రాజ్యాంగాన్నిచ్చారు. మన దేశం, మన పాలన, మన వేడుక. రేపు రిపబ్లిక్ డే. ప్రతి హృదయం నిండా... మూడు రంగులే. మనకు మాత్రం... మూడు రంగులతో పాటు... ఆరు రుచులు. హ్యాపీ రిపబ్లిక్ డే! తిరంగా ఇడ్లీ కావలసినవి: ఇడ్లీపిండి - అరకేజీ, క్యారట్ తురుము - కప్పు, కొత్తిమీర పేస్ట్ - కప్పు, పోపు - టీ స్పూను తయారి: ఇడ్లీ పిండిని మూడు భాగాలుగా చేసుకుని, ఒక భాగంలో క్యారట్ తురుము, ఒక భాగంలో కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి. ఒక భాగం అలాగే ఉంచేయాలి ఈ మిశ్రమాన్ని గుండ్రంగా ఉండే మూడు బాక్స్‌లలో విడివిడిగా వేసి, కుకర్‌లో ఉంచి, ఆవిరి మీద ఉడికించాలి మూడిటినీ వరుసగా ఒక ప్లేట్లో ఉంచి, పోపుతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. తిరంగారవియోలి కావలసినవి: కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా., టొమాటో తరుగు - అర కప్పు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్ - 50 గ్రా., వెల్లుల్లి తరుగు - టీ స్పూను, చీజ్ తురుము - 20 గ్రా., ఆలివ్ ఆయిల్ - 10 మి.లీ., తులసి ఆకులు - 5 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., మైదాపిండి - 150 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., నీరు - లీటరు, చెర్రీ టొమాటోలు - 4 (మధ్యకి కట్ చేయాలి) తయారి: ఒక పాత్రలో... : కార్న్‌ఫ్లోర్, టొమాటో తరుగు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్, వెల్లుల్లి తరుగు, చీజ్ తురుము వేసి పక్కన ఉంచాలి (కాషాయరంగు) కార్న్‌ఫ్లోర్, ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచాలి (తెలుపురంగు) కార్న్‌ఫ్లోర్, తులసి ఆకులు, ఆలివ్ ఆయిల్, పుదీనా పేస్ట్ వేసి కలిపి ఉంచాలి (ఆకుపచ్చ రంగు) మైదాను చపాతీపిండిలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసి, పల్చటి పూరీలా ఒత్తి, పొడవుగా రిబ్బన్‌లా కట్ చేయాలి మూడురంగుల మిశ్రమాలను విడివిడిగా మూడు పొరలలో చుట్టి, మూడిటినీ కలిపి నలుచదరంగా వచ్చేలా కట్ చేసి, పైన కార్న్‌ఫ్లోర్‌తో బ్రష్ చేయాలి. ఒక పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి తయారుచేసి ఉంచుకున్న ‘రవియోలి’లను నీటిలో వేసి 5 నిముషాలు ఉంచి తీసేయాలి చెర్రీ టొమాటోలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. తిరంగా పాస్తా కావలసినవి: బటర్ - 2 టేబుల్ స్పూన్లు, మైదా - 2 టేబుల్ స్పూన్లు, పాలు - 100 మి.లీ., ఉప్పు - తగినంత, టొమాటో ప్యూరీ - 80 గ్రా. , టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు, తులసి ఆకులు - 10, పాస్తా - 80 గ్రా., నూనె - 50 గ్రా., వెల్లుల్లి రేకలు - 4, చీజ్ - 4 టేబుల్ స్పూన్లు, క్రీమ్ - 4 టేబుల్ స్పూన్లు, వైట్ సాస్ - 80 గ్రా., పుదీనాపేస్ట్ - 50 గ్రా., ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు. టొమాటో ప్యూరీ కోసం టొమాటోలు - 150 గ్రా., టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు తయారి: పాస్తాను ఉడికించి మూడు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి పాన్‌లో బటర్ వేసి కరిగాక మైదా, చల్లటిపాలు వేసి కలిపాక ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి టొమాటో ప్యూరీ కోసం... టొమాటోల పై తొక్క తీసి, టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, గిన్నెలో వేసి ఉడికాక, టొమాటో కెచప్, తులసి ఆకులు, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి గిన్నెలో నీళ్లు పోసి మరిగాక, పాస్తా వేసి ఉడికించి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు, టొమాటో ప్యూరీ, క్రీమ్ వేసి ఉడికించాక, పాస్తా జత చేసి, పైన చీజ్ వేసి తీసేయాలి అదే బాణలిలో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లి రేకలు, వైట్ సాస్, క్రీమ్, పాస్తా వేసి ఉడికించి దించేసి క్రీమ్‌తో గార్నిష్ చేయాలి ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లి రేకలు వేయించి, క్రీమ్, పుదీనా పేస్ట్ జత చేసి, కొద్దిగా ఉడికాక దించి చీజ్‌తో గార్నిష్ చేయాలి మూడు రంగుల పాస్తాలను వరుసగా పేర్చి సర్వ్ చేయాలి. తిరంగా మౌసే కావలసినవి: పాలు - టేబుల్ స్పూను, వైట్ చాకొలేట్ - 20 గ్రా., చిక్కగా చిలికిన క్రీమ్ - 150 మి.లీ., ఆరెంజ్ ప్యూరీ - 20 గ్రా., కివీ ప్యూరీ - 20 గ్రా. తయారి: ఒక పాత్రలో పాలు, వైట్ చాకొలేట్ వేసి కరిగించాలి క్రీమ్‌ను మూడు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి క్రీమ్‌లో ఒక్కో భాగానికి ఆరెంజ్ ప్యూరీ, కివీ ప్యూరీ, కరిగించిన వైట్ చాకొలేట్ విడివిడిగా జతచేయాలి ఒక గ్లాసులో ఈ మిశ్రమాలను వరుసగా పోసి సుమారు రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచాక, చల్లగా సర్వ్ చేయాలి. తిరంగా కుల్ఫీ కావలసినవి: చిక్కటిపాలు - ఒకటిన్నర లీటర్లు, బాదంపప్పు - 2 టేబుల్ స్పూన్లు, పిస్తా తరుగు - టేబుల్ స్పూను, ఏలకులపొడి - 5 గ్రా., కుంకుమపువ్వు - కొద్దిగా, ఖస్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), క్రీమ్ - 3 టేబుల్ స్పూన్లు తయారి: మందంగా ఉండే వెడల్పాటి పాత్రలో పాలు పోసి మరిగాక, మంట తగ్గించి, పాలు చిక్కబడి సగం అయ్యేవరకు కలుపుతూ ఉండాలి బాదంపప్పులు, పిస్తా తరుగు, ఏలకులపొడి జత చేసి మరోసారి కలిపి దించేయాలి మూడు భాగాలుగా విభజించి, ఒక భాగానికి కుంకుమపువ్వు, ఒక భాగానికి ఖస్ సిరప్, ఒక భాగానికి క్రీమ్ జతచేసి కుల్ఫీ మౌల్డ్‌లో వరుసగా పోసి కవర్ చేసి ఫ్రిజ్‌లో సుమారు ఆరు గంటలు ఉంచాక, సర్వ్ చేయాలి. తిరంగా వెజిటబుల్ పులావ్ కావలసినవి: కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా., టొమాటో తరుగు - అర కప్పు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్ - 50 గ్రా., వెల్లుల్లి తరుగు - టీ స్పూను, చీజ్ తురుము - 20 గ్రా., ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, తులసి ఆకులు - 5 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., మైదాపిండి - 150 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., నీరు - లీటరు, చెర్రీ టొమాటోలు - 4 (మధ్యకి కట్ చేయాలి) తయారి: ఒక పాత్రలో... : కార్న్‌ఫ్లోర్, టొమాటో తరుగు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్, వెల్లుల్లి తరుగు, చీజ్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి (కాషాయరంగు) కార్న్‌ఫ్లోర్, ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచాలి (తెలుపురంగు) కార్న్‌ఫ్లోర్, తులసి ఆకులు, ఆలివ్ ఆయిల్, పుదీనా పేస్ట్ వేసి కలిపి ఉంచాలి (ఆకుపచ్చ రంగు) మైదాను చపాతీపిండిలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసి, పల్చటి పూరీలా ఒత్తి, పొడవుగా రిబ్బన్‌లా కట్ చేయాలి మూడురంగుల మిశ్రమాలను విడివిడిగా మూడు పొరలలో చుట్టి, మూడిటినీ కలిపి చతురస్రంగా వచ్చేలా కట్ చేసి, పైన కార్న్‌ఫ్లోర్‌తో బ్రష్ చేయాలి ఒక పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి తయారుచేసి ఉంచుకున్న ‘రవియోలి’లను నీటిలో వేసి 5 నిముషాలు ఉంచి తీసేయాలి చెర్రీ టొమాటోలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. సేకరణ డా. వైజయంతి -
మకర మాధుర్యం
సంక్రాంతి... ఒక పండుగ కాదు! పాడి పంటల పండుగ ముగ్గు ముచ్చట్ల పండుగ గొబ్బెమ్మలు, గంగిరెద్దుల పండుగ కొత్త అల్లుళ్ల పండుగ పాయసం, పరమాన్నాల పండుగ తియ్యని పిండి వంటల పండుగ. మొత్తంగా... మకరం తెచ్చే మధురమైన పండుగ! ముందైతే అరిసెలు మొదలుపెట్టండి. ఆదిత్యుడు అతిథిగా వచ్చేలోపు... జంతికలు, మిగతా ‘సంక్రాంతికలు’పూర్తి చెయ్యొచ్చు! కజ్జి కాయలు కావలసినవి ::: మైదా - పావు కేజీ, కొబ్బరితురుము - 100 గ్రా., బెల్లం తురుము - 150 గ్రా., ఏలకులపొడి - టేబుల్ స్పూను, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా తయారి: ఒక పాత్రలో మైదాపిండి, తగినంత నీరు వేసి చపాతీపిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి బాణలిలో కొబ్బరితురుము, బెల్లంతురుము, ఏలకులపొడి వేసి, స్టౌ మీద ఉంచి ఉడికించి దించేయాలి చల్లారాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి మైదాను కొద్దికొద్దిగా తీసుకుని చిన్నసైజు పూరీలా ఒత్తాలి కజ్జికాయలు తయారుచేసే అచ్చులో ఆ పూరీని ఉంచి, అందులో కొబ్బరి ఉండను ఉంచి అచ్చు మూసేసి, అంచులు తీసేయాలి. (ఇలా అన్నీ తయారుచేసుకోవాలి) స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న ఒక్కో కజ్జికాయను వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి చల్లారాక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి (గమనిక: స్టఫ్‌గా కొబ్బరి ఉండలే కాకుండా, పుట్నాలపప్పుపొడి + కొబ్బరితురుము + బెల్లంతురుము కలిపిన మిశ్రమంతో తయారుచేసుకోవచ్చు. ఇంకా... బొంబాయిరవ్వను దోరగా వేయించి అందులో పంచదార, ఏలకులపొడి కలిపి కేసరిలా చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు) గుమ్మడికాయ బొబ్బట్లు కావలసినవి ::: శనగపప్పు -పావుకేజీ, మైదాపిండి - పావుకేజీ, బెల్లం - పావుకేజీ, గుమ్మడికాయ తురుము - కప్పు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి - టీ స్పూను, నూనె - తగినంత తయారి: ఒక పాత్రలో మైదాపిండి వేసి, తగినంత నీరు జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి పైన నూనె వేసి బాగాకలిపి సుమారు రెండు గంటలసేపు నాననివ్వాలి ఒక పాత్రలో శనగపప్పు, తగినంత నీరు పోసి పప్పు ఉడి కించి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి బెల్లం తురుము, ఏలకుల పొడి జతచేసి బాగా గట్టిపడేవరకు ఉంచి దించేయాలి ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన ఉంచాలి మైదాను చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో వుండను ఒత్తి, మధ్యలో పూర్ణం ఉంచాలి ప్లాస్టిక్ కవర్‌కి నూనె రాసి, ఈ ఉండను దాని మీద ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టును దాని మీద వేసి రెండు వైపులా కాల్చి తీసేయాలి. అరిసెలు కావలసినవి::: బియ్యం - కిలో, బెల్లం - అరకిలో, నువ్వుపప్పు - 50 గ్రా., నూనె - తగినంత.(పాకంలో పట్టినంత బియ్యప్పిండి మాత్రమే వేయాలి. ఎక్కువ తీపి కావాలనుకుంటే బెల్లం మరికాస్త వేయచ్చు) తయారి: ముందురోజు బియ్యం నానబెట్టాలి. మర్నాడు బియ్యంలోని నీటిని వడగట్టి, మిక్సీలో వేసి మెత్తగా పిండిపట్టాలి బాగా జల్లెడపట్టాలి బెల్లానికి తగినంత నీరు జత చేసి స్టౌ మీద ఉంచి ఉండపాకం వచ్చే వరకు కలుపుతుండాలి (చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా పాకం వేసి చేత్తో మెదిపితే ఉండలా వస్తే ఉండపాకం వచ్చినట్టు) పాకం కిందకు దింపి అందులో బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి కలిపిన పిండిలో చిన్నగిన్నెడు నూనె పోసి ఉంచాలి ఒక గిన్నెలో నువ్వుపప్పు, కొద్దిగా నూనె వేసి కలిపి ఉంచుకోవాలి (ఇలా చేయడం వల్ల నువ్వులు విడిపోకుండా ఉంటాయి) బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి కాగనివ్వాలి పిండిని కొద్దిగా తీసుకుని, ఉండలా చేసి, నువ్వుపప్పులో ముంచి తీసి, చిన్న పాలిథిన్ కవర్ మీద ఉంచి, చేతితో పల్చగా వచ్చేలా ఒత్తి నూనెలో వేయాలి రెండువైపులా కాలాక తీసేయాలి అరిసెల చట్రం మీద ఉంచి నూనె పోయేలా గట్టిగా ఒత్తాలి బాగా ఆరిన తరవాత గాలి చొరని డబ్బాలో భద్రపరచాలి. పాకం ఉండలు కావలసినవి::: బియ్యం - 250 గ్రా., బెల్లంతురుము - 100 గ్రా., ఏలకులపొడి - టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా. తయారి: ఒక గిన్నెలో చిన్నగ్లాసుడు నీరు పోసి మరిగించాలి ఏలకులపొడి, బెల్లంతురుము వేసి కరిగేవరకు ఉంచాలి బియ్యప్పిండి కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచాలి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కాగిన నూనెలో వేసి వేయించి తీసేయాలి. - డా.వైజయంతి