ఓనమ్... మళయాళీలు పది రోజుల పాటు... వేడుకగా, ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ... రకరకాల వంటలతో, సంప్రదాయ నృత్యాలతో... ఆటలతో... పడవల పోటీలతో... పులి వేషాలతో... తెలుగువారి దసరాలను త లపించే పండుగ... ఇంటికి పంటలు చేరి భోగభాగ్యాలతో తులతూగే పండుగ... రేపు ‘ఓనమ్’... తెలుగింటి కోడలుగా మనలో ఒకరైపోయిన పరహారణాల కేరళ కుట్టి సుమ ‘సాక్షి’కి చెప్పిన ఓనమ్ పండుగ కబుర్లు...
మీరు మలయాళీ ఇంటి ఆడపడుచు! తెలుగింటి కోడలు! మరి ఓనమ్ బాగా సెలబ్రేట్ చేస్తారా?
సుమ: నేను చిన్నతనం నుంచీ ఇక్కడే అంటే హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. మా పెళ్లయినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ వేడుకగా జరుపుకుంటున్నాను. మా ఇంట్లో అటు తెలుగు పండుగలు, ఇటు కేరళ పండుగలు - రెండూ బాగా చేసుకుంటాం. కిందటేడాది మానాన్నగారు పోవడంతో ఆ ఒక్క సంవత్సరమే చేయలేదు.
పండుగను ఎలా జరుపుకుంటారు?
సుమ: ఓనమ్ పండుగ పది రోజులూ ఇంటి ముందర కళ్లాపి జల్లి, నేల తడిగా ఉండగానే పువ్వులతో పూక్కళమ్ చేస్తారు. అంటే పూల ముగ్గులాంటిదన్నమాట. సాధారణంగా అందరూ పది రోజులూ చేస్తారు. అయితే నేను నా షూటింగులలో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కరోజు మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించి, ఆనందిస్తాను.
ఓనమ్ సందర్భంగా ప్రత్యేక వంటలు ఏమేం చేస్తారు?
సుమ: ఈ పండుగకు సాధారణంగా 13 రకాల వంటకాలు చేస్తారు. మేం మాత్రం అవియల్, ఓలెన్, ఇంజుప్పులి, పాలడ పాయసం, కరి (సెనగపప్పు వంటకం), అనాస లేదా మామిడికాయతో పచ్చడి చేస్తాం. ప్రతి ఏడాదీ ఈ వంటలన్నీ నేనే చేస్తాను. ఈసారి మా అమ్మ కూడా నా దగ్గరే ఉన్నారు కనుక ఇద్దరం కలిసి చేసుకుంటాం.
ఓనమ్ నాడు మీ ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయి?
సుమ: ఈ పండుగ నాడు అప్పడం కంపల్సరీ. అరటిపండు (వేందరప్పళన్) ను ఇడ్లీ రేకులలో ఉంచి ఆవిరి మీద ఉడికించి తింటాం. ఈ అరటిపండును నెల రోజుల పసి పాపలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బలాన్నిస్తుంది. ఆవిరి మీద ఉడకపెట్టడం వలన ఇందులోని పోషకాలు ఎక్కడికీ పోవు. ఓనమ్ పండుగకు తప్పనిసరిగా అరటి ఆకులోనే భోజనం చేస్తాం. నాకు అందులో తినడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకులో పాలడ పాయసం వేసుకుని అది అటూ ఇటూ జారిపోతూ ఉంటే చేత్తో గబగబ దగ్గరకు లాక్కుంటూ తినడం భలే సరదాగా ఉంటుంది. నేను కొంచెం చిలిపి పనులు చేస్తుంటాను. నా ఆకు క్లీన్‌గా ఉండాలని, (నవ్వుతూ) నేను అన్నం తినడం పూర్తయిన తర్వాత, నా ఆకులో ఉన్న కరివేపాకు, పచ్చి మిర్చి వంటి వాటిని పక్క వాళ్ల ఆకులలోకి వాళ్లు చూడకుండా తోసేస్తాను. ఈ పండుగకు ప్రత్యేకంగా ముండుమ్ వేష్టి ధరిస్తాం (ఇది ఓనమ్ ప్రత్యేకం).
ఇంతకీ మీరు మొట్టమొదటసారి వంట చేసినప్పుడు మీ అనుభవం ఏమిటి?
సుమ: పెళ్లయిన పదిహేను రోజులకు మొదటిసారి రాజీవ్ నన్ను పచ్చి మిర్చి పచ్చడి చేయమన్నారు. ఆయన కోరిక మేరకు వంట చేయడానికి వంట గదిలోకి సంతోషంగానే అడుగుపెట్టాను. రాజీవ్ ఉద్దేశం కొబ్బరిలో పచ్చి మిర్చి కలిపిన పచ్చడి! కానీ నేను కేవలం పచ్చి మిర్చితో అనుకుని, పచ్చి మిర్చిలో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పి అన్నంలో వడ్డించాను. ఆ పచ్చడి కలుపుకుని తినేసరికి, ఇంక చూడాలి... రాజీవ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కళ్లలోనూ బాధతో నీళ్లు తిరిగాయి. రాజీవ్‌కి అందరు దేవుళ్లతో పాటు, మా కుటుంబ సభ్యులూ కళ్ల ముందు సాక్షాత్కరించారు.
మరి, ఆ తరవాత వంట నేర్చుకున్నారా?
సుమ: ఆ తరవాత అనుభవం మీద అదే వచ్చేసింది. వంట చేయడం నాకు ఇష్టమే. కానీ సమయం మాత్రం లేదు. పండుగలకు, వంటమనిషి ఊరెళ్లినప్పుడు, పిల్లలు అడిగితే చేసిపెట్టడం... అంతే తప్ప మిగతా సమయాల్లో వంట చేయాల్సిన అవసరం ఉండదు.
మలయాళీలు అన్ని వంటల్లోనూ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారంటారు?
సుమ: కొలెస్ట్రాల్ చింత పెరిగిపోవడంతో, ఇప్పుడు కొబ్బరి నూనెతో వంటలు చేయడం బాగా తగ్గిపోయింది. కొన్ని ప్రత్యేకమైన వంటకాలకు మాత్రమే కొబ్బరి నూనె వాడతున్నాం.
మీ జీవితంలో ఓనమ్ పండుగ పోషించిన ప్రత్యేక పాత్ర గురించి ఎక్కడో విన్నాం...
సుమ: అవును. సికింద్రాబాద్‌లో మలయాళీలకు ప్రత్యేకంగా ‘కేరళ అసోసియేషన్’ అని ఒకటి ఉంది. దానికి మా నాన్నగారు మేనేజర్‌గా ఉండేవారు. అక్కడ ప్రతి యేడూ ఓనమ్ పండుగనాడు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఏమాత్రం భయపడకుండా నేను వాటిలో పాల్గొనేదాన్ని. అందువల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది. అలా నా ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఓనమ్ పండుగ వల్లే వచ్చింది. ఇప్పుడు యాంకర్‌గా ఇంత సక్సెస్ సాధించగలిగానంటే అందుకు కారణం ఓనమ్ పండుగే. అలా ఓనమ్ నుంచి ఓనమాలు నేర్చుకున్నాను.
- సంభాషణ: డా. వైజయంతి
పాలడ పాయసం
కావలసినవి:
పాలడ (రైస్ అడ) - ముప్పావు కప్పు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); నెయ్యి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; కిస్‌మిస్ - టేబుల్ స్పూను; పాలు - 2 కప్పులు; బెల్లం తురుము - పావు కప్పు; ఏలకులపొడి - పావు టీ స్పూను
తయారీ:
రైస్ అడను రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి
పది నిమిషాల తర్వాత అవి బాగా పొంగి కనపడతాయి. అప్పుడు నీళ్లు వడకట్టి చల్ల నీళ్లలో వేసి వార్చాలి
బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించి తీసేయాలి
ఒక పాత్రలో పాలు, బెల్లం తురుము, ఏలకుల పొడి, నానబెట్టి తీసిన పాలడ వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి
బాగా ఉడికిన తర్వాత దించి, వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి అందించాలి.
ఇంజిప్పులి
కావలసినవి:
నూనె - 5 టేబుల్ స్పూన్లు; అల్లం - అర కేజీ (సన్నగా తురమాలి); ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను; కొబ్బరి ముక్కలు - 2 కప్పులు; కరివేపాకు - 2 రెమ్మలు; చిన్న ఉల్లిపాయలు - పావు కేజీ; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేయాలి); పసుపు - అర టీ స్పూను; ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు - 100 గ్రా. (నానబెట్టాలి); బెల్లం తురుము - తగినంత
తయారీ:
బాణలిలో నూనె వేసి వేడి చేయాలి
అల్లం తురుము వేసి వేయించి, ఉప్పు జత చేసి దోరగా వేయించి దించి పక్కన ఉంచాలి
మిగిలిన నూనెను బాణలిలో వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
కొబ్బరి ముక్కలు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక కరివేపాకు జత చేయాలి
చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి
పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించాలి
వేయించి ఉంచుకున్న అల్లం తురుము, చింతపండు పులుసు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి బెల్లం తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి.
చక్క ఎరిసెరి
కావలసినవి:
పచ్చిగా ఉన్న పనస తొనలు - పావు కేజీ; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - అర కప్పు; జీలకర్ర - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 2; కొబ్బరినూనె - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 4; చిన్న ఉల్లి పాయలు - 5; కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు
తయారీ:
ముందుగా పనస తొనలలోని గింజలు వేరు చేసి తొనలను నాలుగైదు ముక్కలుగా కట్ చేయాలి
ఒక పాత్రలో పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మూత పెట్టి ఉడకించాలి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల నీళ్లు మిక్సీలో మెత్తగా చేసి పక్కన ఉంచాలి
పనస ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి
మరొక బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
ఎండు మిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి దించేయాలి అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి.