Traditional dances
-
నటరాజ వందనం.. శివుడికే అంకితం
సాక్షి, హన్మకొండ: ‘నటరాజ వందనం.. శివుడికి అంకితం చేసిన నృత్య ప్రదర్శన. నా తల్లి మృణాళిని సారాభాయ్ వెలువరించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి రూపొందించింది. సాధారణంగా పురుష దేవతల్లో ఐక్యత కోసం నాయిక అన్వేషణగా ఇది ప్రదర్శితమవుతుంది.’ అని అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయ్ అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్ప ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రం ‘కుడా’ మైదానంలో ‘నటరాజ వందనం’ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నృత్య అనుభవం.. నటరాజ వందనం ప్రదర్శన తీరు, వివిధ ఆలయాల్లోని శిల్పాల్లో నృత్య భంగిమల ప్రత్యేకతల్ని వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు నృత్యమంటే ప్రాణం. ఈ ఇష్టం మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. అమ్మ శాస్త్రీయ నృత్యకారిణి. పుస్తకాలు రచించేది. ఆ అభిరుచి నాకు కూడా అలవడింది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పేరిణి నృత్యం గురించి నాకు తెలుసు. 40 ఏళ్ల క్రితం కూచిపూడి గ్రామానికి చెందిన సీఆర్ ఆచార్యుల వద్ద నేను నృత్యం నేర్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలిచ్చా. శాస్త్రీయ సమకాలీన రచనలు సృష్టించి ప్రదర్శనలిస్తూ వస్తున్నా. 30 ఏళ్లుగా ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సంస్థ ‘దర్పణ అకాడమీ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్’కు కో–డైరెక్టర్‌గా ఉన్నా. 1989లో మహిళా శక్తిని బలోపేతం చేసే సోలో థియేట్రికల్ వర్క్‌లను ప్రదర్శించాం. సామాజిక మార్పు కోసం, మహిళా సాధికారత, పర్యావరణ స్పృహ కలిగించేలా మా ప్రదర్శనలుంటాయి. అనేక రంగస్థల నిర్మాణాల్ని రూపొందించాం. సామాజిక మార్పు, పరివర్తన కోసం కళల్ని ఉపయోగించడమే నా ధ్యేయం. నాట్యాల్లో ప్రత్యేకం.. నాట్యాల్లో నటరాజ వందనం ప్రదర్శన ఒక ప్రత్యేకం. మా అమ్మ మృణాళిని సారాభాయ్ రచించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి దీన్ని కూర్పు చేశాను. పరమాత్మ కోసం ఆత్మ చేసే అన్వేషణే భరతనాట్యం. శివపార్వతుల నృత్యాన్ని చూడడానికి విశ్వం నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రదర్శనను వర్ణం అని కూడా పిలుస్తారు. ఈప్రదర్శనలో నృత్యకారుడు శివుడి తాండవ నృత్య శక్తిని, గంభీరమైన రూపాన్ని చూపిస్తాడు. రామప్పలో ప్రదర్శించాలని కోరిక.. రామప్పలో నటరాజ నృత్య ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కొన్ని కారణాల వల్ల ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ కాకతీయులు ఏలిన వరంగల్ నగరంలో ప్రదర్శించడం కూడా సంతోషంగానే ఉంది. ఇందుకు కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ వారు చాలా సహకారం అందించారు. రామప్ప ఆలయంలోని శిల్పాల నృత్యభంగిమలు ఎంతో ప్రత్యేకమైనవి. పూర్వం పురాతన దేవాలయాల్లోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగేవి. అప్పటి వాళ్లు కళాపిపాసులు. అందుకేనేమో నృత్య ప్రదర్శనలను వివిధ నృత్య భంగిమల్లో శిల్పాలుగా రూపొందించారు. చరిత్రను, పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి. అభిరుచి ఉండాలి.. ఈపోటీ ప్రపంచంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే అభిరుచి ఉండి తీరాలి. లేదంటే మనల్ని మనం నిరూపించుకోలేం. ముందు తరాల వారు శాస్త్రీయ నృత్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండి, ఆర్థిక బలహీనత వల్ల వెనకబడేవారికి నేర్చుకునేలా అవకాశం కల్పించాలి. మన ప్రభుత్వం శాస్త్రీయ కళలకు నిధులివ్వట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అవసరం. మల్లికా సారాభాయ్ గురించి క్లుప్తంగా.. అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, శాస్త్రీ య నృత్యకారిణి మృణాళిని సారాభాయ్ దంపతుల కుమార్తె మల్లికా సారాభాయ్. 1954 మే9న అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే నృత్యం నేర్చుకున్నారు. 15ఏళ్ల వయస్సులో సినీ నటిగా పేరు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో భరతనాట్యం, కూచి పూడి శాస్త్రీయ నృత్యంలో అసాధారణ మైన యువనర్తకిగా గుర్తింపు పొందారు. నాటక, నృత్యరంగంలో చేసిన కృషికిగానూ గుజరాత్ ప్రభుత్వం ఆమెకు గౌరవ్ పురస్కార్ అందించింది. 2010లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. -
ఆట.. పాట.. చైతన్యం
కళాకారులకు లాక్డౌన్ అడ్డుగాలేదు... ఒంట్లోకి, ఇంట్లోకి కరోనా రానివ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. ఆ వైరస్ తెచ్చినlకష్టం కలకాలం ఉండదని.. ఏకాంతంలో ఉంటూ సమష్టి బాధ్యతలో పాలుపంచుకోవాలనే చైతన్యాన్ని కళనే మాధ్యమంగా వాట్సప్, యూట్యూబ్ వేదికల ద్వారా పంచుతున్నారు ఈ అక్కాచెల్లెళ్లు లహరి, లక్ష్మీప్రియ.. ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూచిపూడి కళాకారులే. అక్క లహరి.. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో కూచిపూడిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. చెల్లి.. లక్ష్మీప్రియది డ్యాన్స్‌లోనే డిగ్రీ. సమయం, సందర్భానుసారం ప్రదర్శనలిచ్చే వీరు ఇప్పుడు దానిని కూచిపూడిలోకి కన్వర్ట్ చేశారు.. కరోనా వ్యాప్తిని ఎలా నిరోధించాలో చెప్పడానికి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం... అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మనిషికి మనిషికి మధ్య కనీస దూరం పాటించడం... వంటి జాగ్రత్తలను కూచిపూడి నాట్యరూపంలో చెప్తూ వీరు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జనతా కర్ఫ్యూ పాటించిన ఆదివారం.. ఊరికే ఇంట్లో కూర్చోని ఏం చేయాలా అని అనుకుంటూండగా ఈ ఆలోచన తట్టింది. అప్పటికప్పుడు ఈ మూడు జాగ్రత్తలకు కొరియోగ్రఫీ చేసి. చెల్లి, నేను కలిసి డ్యాన్స్ చేశాం. ఆ వీడియో ను ముందు తెలిసినవాళ్లకే పంపాం. బాగుంది... కరోనామీద అవేర్నెస్ కల్పించే వీడియో ఇది. అందరికీ తెలియాలి.. అని మా ఫ్రెండ్స్.. తెలిసినవాళ్లు.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలా అది వైరల్ అయింది’ చెప్పింది లహరి. అందరికీ చేరే మీడియం.. ‘సామాజిక సమస్యల మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఇలాంటి కళారూపాలు ఎంతో ఉపయోగపడ్తాయి. నేను డ్యాన్స్‌స్కూల్ నడుపుతున్నాను. స్త్రీ శక్తి, మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలను తీసుకొని డాన్స్ కంపోజ్ చేసి నా సంస్థలోని పిల్లలతో ప్రదర్శనలిప్పిస్తుంటాను. దీనివల్ల డ్యాన్స్ చేసిన పిల్లలూ తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో.. ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు. అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా.. ఈ కళను సామాజిక చైతన్యానికి సాధనంగా ఉపయోగించుకుంటూంటాను’ వివరించింది లహరి. పాటిస్తే దక్కేవి ప్రాణాలే.. కనోనాను అడ్డుకోవడానికి ప్రభుత్వం చెప్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు పెడచెవిన పెట్టకండి. ప్రమాదంలో పడకండి.. సూచనలు పాటిస్తే దక్కేవి మన ప్రాణాలే.. ఏకాంతం లో ఉంటూ సమష్టి బాధ్యతలో పాలుపంచుకోండి అనే సారంతో యూట్యూబ్‌లో ఒక పాట బాగా వైరల్ అవుతోంది. ఆ పాటను పాడింది ఈ అక్కాచెల్లెళ్లే. అక్క పేరు జాహ్నవి.. చెల్లి లాస్య. టీవీలో రియాలిటీ షోస్ చూసేవాళ్లకు ఈ ఇద్దరూ సుపరిచితులు. 2017.. పాడుతా తీయగా విన్నర్ జాహ్నవి. జీ సరిగమలు లిటిల్ చాంప్స్ ఫైనలిస్ట్ లాస్య. ప్రతివారం.. ఆ వారంలో జరిగిన సంఘటన.. లేదా ఆ వారంలో బాగా పాపులర్ అయిన అంశం మీద ఇలా పాటను రికార్డ్ చేసి ‘జాహ్నవి సింగర్’ అనే యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేయడం వీరి హాబీ. అలా ఈసారి... ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనాకు చెక్ పెట్టడానికి ఈ పాట పాడారు. ‘మా పాట మాకే కాదు పదిమందికీ మేలు చేయాలి కదా.. అందుకే ఇలాంటి వాటినీ పాడుతూంటాం’ అంటుంది పదిహేనేళ్ల జాహ్నవి. ఈ పాటను రాసింది వాళ్లమ్మ చోడవరపు లక్ష్మీశ్రీ. ఇదొక్కటే కాదు... వారం వారం ‘జాహ్నవి సింగర్’ యూట్యూబ్ చానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి పాటా ఆమే రాస్తారు. ‘ఆట, పాట, చదువు ఎంత ముఖ్యమో .. తోటివారితో సఖ్యంగా ఉండడం.. సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవడమూ అంతే ముఖ్యమని, దీన్ని నేర్పాల్సిన బాధ్యత అమ్మగా నాదేననీ నమ్ముతా’ అంటారు లక్ష్మీశ్రీ. వీరే కాదు జానపద కళాకారులు నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి, సాయిచంద్, ప్రముఖ చిత్రకారులు కూడా తమ పాటలు, బొమ్మలతో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కృషిచేస్తున్నారు. -
నాట్యప్రియ
‘‘మా అమ్మాయికి పుట్టుకతోనే నాట్యం వచ్చింది’’ అంటున్నారు మద్దిపట్ల కృష్ణవేణి, సత్యకుమార్ దంపతులు. ఇది వింత కాదు, విచిత్రం అంతకంటే కాదు... నెలల పాపాయిగా ఉయ్యాలలో ఉన్నప్పుడే తల్లి జోలపాటకు అనుగుణంగా కాళ్లు చేతులను కదిలిస్తూ కేరింతలు కొట్టేది. ‘‘నా గొంతు పలికే స్వరానికి అనుగుణంగా లయబద్ధంగా కాళ్లు కదుపుతోంది. పాపాయికి నాట్యం నేర్పిద్దాం’’ అన్నారు కృష్ణవేణి. గోదావరి తీరం, రాజమండ్రి నగరం, రాఘవేంద్రస్వామి మఠం వెనుక ఉన్న వారి ఇంటి గోడలే ఇందుకు సాక్ష్యాలు. ఆ రోజు వాళ్లు అలా అనుకున్నారు... పదిహేనేళ్ల లోపే వారి కలల పంట పరిమళ హరిప్రియ ఆ అమ్మానాన్నలు ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. ఏడు కొండల మీద తిరుమల మాడవీథుల్లో వేంకటేశ్వరుని సన్నిధిలో నాట్య ప్రదర్శన ఇచ్చింది. తిరుమలలో నాట్యప్రదర్శన మూడో ఏట నాట్యసాధన ప్రారంభించిన హరిప్రియ ఇప్పటి వరకు ఐదువందలకు పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతర్జాతీయ వేదికల ఆహ్వానాలు అందుకుంటోంది. నాట్యాన్ని ఎన్ని వేదికల మీద ప్రదర్శించినప్పటికీ పుణ్యక్షేత్రాలలో నాట్యం చేసినప్పుడే పరిపూర్ణత చేకూరుతుందని నమ్మేది హరిప్రియ. ‘‘2018లో ఓ సారి మేమంతా వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాం. దేవుని ఎదుట నాట్యం చేయాలనే కోరిక అంత బలంగా ఉండడమే కారణం కావచ్చు. వరాహస్వామి దర్శనం చేసుకుని బయటకు రాగానే తదాత్మ్యంతో హరిప్రియ పాదాలు వాటంతట అవే కదలసాగాయి. తమాయించుకోలేకపోయింది. ఆ క్షణంలో అక్కడే నాట్యం చేసింది. అలాగే ఈ ఏడాది మరోసారి దర్శనానికి వెళ్లాం. అప్పుడు కూడా వరాహస్వామి ఆలయం సమీపంలోని మాడవీధిలో సూరదాస్, కబీర్దాస్ అభంగాలకు స్వామివారి ఊరేగింపులో నాట్యం చేసింది. ఆ దేవునికి ఆమె సమర్పించిన నాట్యాంజలి అది’’ అన్నారు హరిప్రియ తల్లిదండ్రులు. శృంగేరీ పీఠాధిపతి రచనకు నృత్యాభినయనం శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామి రచించిన ‘గరుడగమన తవ చరణకమల’ గీతం పరిమళ హరిప్రియను అమితంగా ఆకట్టుకుంది. ఈ గీతానికి స్వయంగా నాట్యరీతిని కంపోజ్ చేసిందామె. ఆ నర్తనాన్ని యూట్యూబ్‌లో సుమారు ఆరు లక్షలమంది వీక్షించారు. మీరాబాయి ‘గిరిధర గోపాల’రచనకు కూడా హరిప్రియ స్వయంగా కంపోజ్ చేసిన ప్రదర్శన కూడా వేలాదిమంది కళాభిమానుల ప్రశంసలు అందుకుంది. నాట్యమయూరి శ్రీహరికోటలో ఇస్రో 2018లో నిర్వహించిన కార్యక్రమం, ఉడిపి రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో జరిగిన నృత్యోత్సవంలో ఈ తెలుగింటి చిన్నారి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమిళనాడు, హోసూరు మాధవ మహాసభ ఆధ్వర్యంలోనూ, బెంగళూరులో కూచిపూడి నాట్యపరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మంత్రాలయం, పుట్టపర్తి తదితర క్షేత్రాలలో నాట్యప్రదర్శనలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. తెలంగాణ రాష్ట్రం, శంషాబాద్‌లో చిన్నజీయరు స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో నాట్యం చేసి జీయరు ఆశీస్సులు అందుకుంది. గుంటూరులో 2015లో జాతీయస్థాయి పోటీలలో హరిప్రియ ‘నాట్యమయూరి’ పురస్కారాన్ని, వివిధ సాంస్కృతిక సంస్థల నుండి ‘నర్తన బాల, నాట్యపరిమళ’ పురస్కారాలను అందుకుంది. చదువుకు నాట్యం అడ్డంకి కాదు ‘నాట్యం చదువులో ఒక భాగం అని అనుకుంటున్నప్పుడు, నాట్యం చదువుకు అడ్డంకి ఎలా అవుతుంది?’ అంటోంది హరిప్రియ. ‘‘నాట్య సాధనను నేను నా కోసమే కొనసాగిస్తున్నాను. భావవ్యక్తీకరణకు, నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి నాట్యం ఒక సాధన. తిరుమల మాడ వీధిలో నా నాట్యం చూసి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు ద్వారం లక్ష్మి ఫోను చేసి అభినందనలు తెలిపారు. అదో తీయని అనుభూతి’’ అన్నారు హరిప్రియ. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రభావం హరిప్రియ నాట్య ప్రదర్శనల మీద కూడా ప్రభావాన్ని చూపించింది. ఈ ఏడాది తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన హరిప్రియ వేసవి సెలవుల్లో మస్కట్‌లో నాట్య ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రదర్శన కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి, రాజమండ్రి ఫొటోలు : గరగ ప్రసాద్ ఆన్లైన్ నాట్య శిక్షణ మొదట చింతలూరి శ్రీలక్ష్మిగారి వద్ద మూడు సంవత్సరాలపాటు కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. తరువాత ఘంటసాల పవన్‌కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాను. కేరళ రాష్ట్రం, కొచ్చిన్‌కు చెందిన హేమంత్ లక్ష్మణ్ నుండి ఆన్లైన్లో భరతనాట్యం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో నాట్య సాధన కూడా ఖర్చుతో కూడిన కళగా మారిపోయింది. చాలా కోచింగ్ సెంటర్లు నాట్యాన్ని వ్యాపారాత్మకం చేస్తున్నాయి. నాట్యం చేయగలిగిన ప్రతిభ ఉండి, శిక్షణ తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేనివారి కోసం... నేను పెద్దయ్యాక ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించాలన్నదే నాధ్యేయం. – పరిమళ హరిప్రియ, శాస్త్రీయ నాట్యకారిణి -
ఇక్కడ సాధన అక్కడ బోధన
కత్యా తొషేవా! బల్గేరియా పౌరురాలు. భారతీయ కళలంటే మక్కువ. తరచూ దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ ఉంటారు. ఇక్కడ సాధన చేసిన నృత్యాలను అక్కడికెళ్లి బోధిస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరులో గురు రవి శంకర్ మిశ్రా దగ్గర కథక్ నేర్చుకుంటున్నారు. విషయం తెలిసి సాక్షి ఆమెను సంప్రదించింది. ఇ–మెయిల్ ద్వారా సంభాషించింది. ఆ విశేషాలివి. ఐరోపా, ఆసియా ఖండాలకు మధ్యలో ఉండే ఓ ఒక చిన్న దేశం బల్గే రియా. అందంగా, ప్రకృతిసిద్ధం అనిపించేలా ఉంటుంది.పర్వత శ్రేణులు ఎక్కువ. నల్ల సముద్ర తీరంలో ఉంటుంది. బల్గేరియాలోని సోఫియా ఆమె స్వస్థలం. డిగ్రీ వరకు చదివారు. పెళ్లయింది. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నట్లున్నారు. తొషేవాకు ఒక తమ్ముడు. అమ్మానాన్న డాక్టర్లు. భర్త పేరు రోజున్ జెన్కోవ్. ఆయనకు వాద్య పరికరాలంటే ఇష్టం. రకరకాల వాద్యాలు నేర్చుకోవటానికి ప్రయత్నించారు. చివరకు తబలా దగ్గర సెటిల్ అయిపోయారు. సంస్కృతిని, సంప్రదాయ కళల్ని ఇష్టపడేవారెవరైనా భారతదేశాన్నీ ఇష్టపడతారు. అలా ఈ దంపతులకూ ఇండియా ఇష్టమైన దేశం అయింది. యోగా వల్ల ఆసక్తి ‘‘నాట్యం నేర్చుకోవాలనే కోరిక ఎవరికైనా సహజంగానే కలగాలి’’ అంటారు తొషేవా. ‘‘నేను యోగా చేయటం ప్రారంభించాక, నాట్యం మీద ఆసక్తి కలిగింది. చివరికి నాట్యాభ్యాసం లేనిదే జీవితం లేదన్న స్థితికి చేరుకున్నారు. నాట్యం ఇప్పుడు నా ఊపిరి’’ అన్నారు తొషేవా ఓ ప్రశ్నకు సమాధానంగా. భరతనాట్యం అభ్యాసంతో ఆమె నృత్యయానం మొదలైంది. ప్రస్తుతం బెంగళూరులోని ‘సాంజలి సెంటర్ ఫర్ ఒడిస్సీ అండ్ కథక్’ లో గురు షర్మిల ముఖర్జీ దగ్గర, పండిట్ మిశ్రా దగ్గర ఒడిస్సీ కథక్ నృత్యాలను నేర్చుకుంటున్నారు. ‘‘కూచిపూడి నాట్యంలో మాత్రం నాకు ప్రవేశం లేదు. గురు సరస్వతి రాజేశ్ ద్వారా తొలిసారి కూచిపూడి గురించి తెలుసుకున్నాను’’ అన్నారు తొషేవా. ఇష్టమైన వ్యాపకం భార్యాభర్తలు ఏడాదంతా బల్గేరియా, భారత్‌ల మధ్య ప్రయాణిస్తూనే ఉంటారు. బల్గేరియాలో.. భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న ‘ఇందిరా గాం«ధీ’ అనే పేరున్న ఒక పాఠశాలలో తొషేవా నాట్యానికి సంబంధించిన పాఠాలు బోధిస్తుంటారు. ‘ఇండియన్ డ్యాన్స్ స్కూల్ కాయా’ అని ఒక స్కూల్‌ను స్థాపించి, బల్గేరియాలోని పెద్ద పెద్ద నగరాలైన సోఫియా, ప్లొవ్డివ్లలో పిల్లలకు, పెద్దలకు నాట్యం నేర్పిస్తున్నారు. ‘‘మా అమ్మమ్మ గారి స్వగ్రామం బ్రూసెన్లో కూడా నాట్యం నేర్పిస్తున్నాను. భారతదేశం పట్ల నాకున్న ప్రేమను అందరితో పంచుకోవటం కోసం, ప్రతి నెల వర్క్‌షాపులు నిర్వహిస్తూ, ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో ప్రసంగాలు ఇవ్వడం నాకు ఇష్టమైన వ్యాపకం. గ్రీసు, సైప్రస్, స్పెయిన్, ఫ్రాన్స్, సెర్బియా దేశాలలో నా ప్రదర్శనలకు మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే అవి నాకు కాదు. భారతీయ సంస్కృతికి లభించినట్లుగా నేను భావిస్తాను’’ అంటారామె. రెండేళ్ల క్రితం భారత రాష్ట్రపతి బల్గేరియా సందర్శించిన సందర్భంలో ఆయన ముందు నాట్యం చేయటానికి ఆమెకు ఆహ్వానం అందింది. బల్గేరియా, ఫ్రాన్స్, సైబీరియా ప్రాంతాలలో భారత దేశ రాయబారుల ఎదుట కూడా ప్రదర్శనలిచ్చారు. వైజయంతి పురాణపండ -
గిన్నిస్ నృత్యం
కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంత మహిళలు సంప్రదాయ నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించారు. నపోరా పండుగ సందర్భంగా 299 మంది మహిళలు లడఖ్ సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా షాండోల్ నృత్యం చేశారు. దీంతో అత్యధిక మంది ప్రజలు ఓ చోట గుమిగూడి షాండోల్ నృత్యం చేసినట్లు గిన్నిస్ ప్రతినిధి సర్టిఫికెట్ ఇచ్చారు. బౌద్ధ పండితుడు, సన్యాసి నపోరా బోధనలు, జీవిత విశేషాలను సంప్రదాయ నృత్యంలో ప్రదర్శిస్తారు. -
రికార్డ్ కోసం సాంప్రదాయ నృత్య ప్రదర్శన
దుబాయ్ లో నివసిస్తున్న మలయాళీలు అక్కడ అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల స్త్రీలు భారీ నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న జరగనున్న ఓ కార్యక్రమంలో దాదాపు 1300 మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 40 గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఈ ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు. ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్ నృత్య దర్శకత్వంలో కేరళ సాంప్రదాయ నృత్యం కైకొట్టైకలిని 15 నిమిషాల 30 సెకన్ల సుధీర్ఘ ప్రదర్శన ఇవ్వనున్నారు. కేరళలో నిర్వహించే త్రిసూర్ పోరం తరహాలో దుబాయ్ లో నిర్వహిస్తున్న పోరమ్ దుబాయ్ లో భాగంగా ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్, అబుదాబి, అజ్మాన్, అల్ ఐన్ ప్రాంతాల్లో నివసిస్తున్న మలయాళీలు పాల్గొననున్నారు. తిరువథిరకలి అని కూడా పిలుచుకునే ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భారత్ వెలుపల అది ఎక్కువ మంది ప్రదర్శించిన రికార్డ్ ను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రికార్డ్ కోసం సాంప్రదాయ నృత్య ప్రదర్శన
-
ఘల్లుమన్న గిరిజనం
మహిళా సర్పంచ్‌లకు ఘన స్వాగతం 10 రాష్ట్రాల నుంచి 850 మంది హాజరు జాతీయ సదస్సులో ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు హాజరైన కేంద్ర మంత్రులు, సీఎం గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సుకు విజయవాడ వేదికైంది. పది రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మహిళా సర్పంచులకు ఘన స్వాగతం లభించింది. గిరిజనులు ప్రదర్శించిన వివిధ సంప్రదాయ నృత్యాల్లో వారితో కలిసి కేంద్రమంత్రులు, సీఎం చంద్రబాబు కాలు కదిపారు. ఈ సదస్సు సందర్భంగా మహిళా సర్పంచులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. -
ఓనమాలు నేర్పిన ఓనమ్
ఓనమ్... మళయాళీలు పది రోజుల పాటు... వేడుకగా, ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ... రకరకాల వంటలతో, సంప్రదాయ నృత్యాలతో... ఆటలతో... పడవల పోటీలతో... పులి వేషాలతో... తెలుగువారి దసరాలను త లపించే పండుగ... ఇంటికి పంటలు చేరి భోగభాగ్యాలతో తులతూగే పండుగ... రేపు ‘ఓనమ్’... తెలుగింటి కోడలుగా మనలో ఒకరైపోయిన పరహారణాల కేరళ కుట్టి సుమ ‘సాక్షి’కి చెప్పిన ఓనమ్ పండుగ కబుర్లు... మీరు మలయాళీ ఇంటి ఆడపడుచు! తెలుగింటి కోడలు! మరి ఓనమ్ బాగా సెలబ్రేట్ చేస్తారా? సుమ: నేను చిన్నతనం నుంచీ ఇక్కడే అంటే హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. మా పెళ్లయినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ వేడుకగా జరుపుకుంటున్నాను. మా ఇంట్లో అటు తెలుగు పండుగలు, ఇటు కేరళ పండుగలు - రెండూ బాగా చేసుకుంటాం. కిందటేడాది మానాన్నగారు పోవడంతో ఆ ఒక్క సంవత్సరమే చేయలేదు. పండుగను ఎలా జరుపుకుంటారు? సుమ: ఓనమ్ పండుగ పది రోజులూ ఇంటి ముందర కళ్లాపి జల్లి, నేల తడిగా ఉండగానే పువ్వులతో పూక్కళమ్ చేస్తారు. అంటే పూల ముగ్గులాంటిదన్నమాట. సాధారణంగా అందరూ పది రోజులూ చేస్తారు. అయితే నేను నా షూటింగులలో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కరోజు మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించి, ఆనందిస్తాను. ఓనమ్ సందర్భంగా ప్రత్యేక వంటలు ఏమేం చేస్తారు? సుమ: ఈ పండుగకు సాధారణంగా 13 రకాల వంటకాలు చేస్తారు. మేం మాత్రం అవియల్, ఓలెన్, ఇంజుప్పులి, పాలడ పాయసం, కరి (సెనగపప్పు వంటకం), అనాస లేదా మామిడికాయతో పచ్చడి చేస్తాం. ప్రతి ఏడాదీ ఈ వంటలన్నీ నేనే చేస్తాను. ఈసారి మా అమ్మ కూడా నా దగ్గరే ఉన్నారు కనుక ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓనమ్ నాడు మీ ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయి? సుమ: ఈ పండుగ నాడు అప్పడం కంపల్సరీ. అరటిపండు (వేందరప్పళన్) ను ఇడ్లీ రేకులలో ఉంచి ఆవిరి మీద ఉడికించి తింటాం. ఈ అరటిపండును నెల రోజుల పసి పాపలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బలాన్నిస్తుంది. ఆవిరి మీద ఉడకపెట్టడం వలన ఇందులోని పోషకాలు ఎక్కడికీ పోవు. ఓనమ్ పండుగకు తప్పనిసరిగా అరటి ఆకులోనే భోజనం చేస్తాం. నాకు అందులో తినడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకులో పాలడ పాయసం వేసుకుని అది అటూ ఇటూ జారిపోతూ ఉంటే చేత్తో గబగబ దగ్గరకు లాక్కుంటూ తినడం భలే సరదాగా ఉంటుంది. నేను కొంచెం చిలిపి పనులు చేస్తుంటాను. నా ఆకు క్లీన్‌గా ఉండాలని, (నవ్వుతూ) నేను అన్నం తినడం పూర్తయిన తర్వాత, నా ఆకులో ఉన్న కరివేపాకు, పచ్చి మిర్చి వంటి వాటిని పక్క వాళ్ల ఆకులలోకి వాళ్లు చూడకుండా తోసేస్తాను. ఈ పండుగకు ప్రత్యేకంగా ముండుమ్ వేష్టి ధరిస్తాం (ఇది ఓనమ్ ప్రత్యేకం). ఇంతకీ మీరు మొట్టమొదటసారి వంట చేసినప్పుడు మీ అనుభవం ఏమిటి? సుమ: పెళ్లయిన పదిహేను రోజులకు మొదటిసారి రాజీవ్ నన్ను పచ్చి మిర్చి పచ్చడి చేయమన్నారు. ఆయన కోరిక మేరకు వంట చేయడానికి వంట గదిలోకి సంతోషంగానే అడుగుపెట్టాను. రాజీవ్ ఉద్దేశం కొబ్బరిలో పచ్చి మిర్చి కలిపిన పచ్చడి! కానీ నేను కేవలం పచ్చి మిర్చితో అనుకుని, పచ్చి మిర్చిలో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పి అన్నంలో వడ్డించాను. ఆ పచ్చడి కలుపుకుని తినేసరికి, ఇంక చూడాలి... రాజీవ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కళ్లలోనూ బాధతో నీళ్లు తిరిగాయి. రాజీవ్‌కి అందరు దేవుళ్లతో పాటు, మా కుటుంబ సభ్యులూ కళ్ల ముందు సాక్షాత్కరించారు. మరి, ఆ తరవాత వంట నేర్చుకున్నారా? సుమ: ఆ తరవాత అనుభవం మీద అదే వచ్చేసింది. వంట చేయడం నాకు ఇష్టమే. కానీ సమయం మాత్రం లేదు. పండుగలకు, వంటమనిషి ఊరెళ్లినప్పుడు, పిల్లలు అడిగితే చేసిపెట్టడం... అంతే తప్ప మిగతా సమయాల్లో వంట చేయాల్సిన అవసరం ఉండదు. మలయాళీలు అన్ని వంటల్లోనూ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారంటారు? సుమ: కొలెస్ట్రాల్ చింత పెరిగిపోవడంతో, ఇప్పుడు కొబ్బరి నూనెతో వంటలు చేయడం బాగా తగ్గిపోయింది. కొన్ని ప్రత్యేకమైన వంటకాలకు మాత్రమే కొబ్బరి నూనె వాడతున్నాం. మీ జీవితంలో ఓనమ్ పండుగ పోషించిన ప్రత్యేక పాత్ర గురించి ఎక్కడో విన్నాం... సుమ: అవును. సికింద్రాబాద్‌లో మలయాళీలకు ప్రత్యేకంగా ‘కేరళ అసోసియేషన్’ అని ఒకటి ఉంది. దానికి మా నాన్నగారు మేనేజర్‌గా ఉండేవారు. అక్కడ ప్రతి యేడూ ఓనమ్ పండుగనాడు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఏమాత్రం భయపడకుండా నేను వాటిలో పాల్గొనేదాన్ని. అందువల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది. అలా నా ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఓనమ్ పండుగ వల్లే వచ్చింది. ఇప్పుడు యాంకర్‌గా ఇంత సక్సెస్ సాధించగలిగానంటే అందుకు కారణం ఓనమ్ పండుగే. అలా ఓనమ్ నుంచి ఓనమాలు నేర్చుకున్నాను. - సంభాషణ: డా. వైజయంతి పాలడ పాయసం కావలసినవి: పాలడ (రైస్ అడ) - ముప్పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నెయ్యి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; కిస్మిస్ - టేబుల్ స్పూను; పాలు - 2 కప్పులు; బెల్లం తురుము - పావు కప్పు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారీ: రైస్ అడను రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత అవి బాగా పొంగి కనపడతాయి. అప్పుడు నీళ్లు వడకట్టి చల్ల నీళ్లలో వేసి వార్చాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో పాలు, బెల్లం తురుము, ఏలకుల పొడి, నానబెట్టి తీసిన పాలడ వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత దించి, వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి అందించాలి. ఇంజిప్పులి కావలసినవి: నూనె - 5 టేబుల్ స్పూన్లు; అల్లం - అర కేజీ (సన్నగా తురమాలి); ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను; కొబ్బరి ముక్కలు - 2 కప్పులు; కరివేపాకు - 2 రెమ్మలు; చిన్న ఉల్లిపాయలు - పావు కేజీ; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేయాలి); పసుపు - అర టీ స్పూను; ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు - 100 గ్రా. (నానబెట్టాలి); బెల్లం తురుము - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి వేడి చేయాలి అల్లం తురుము వేసి వేయించి, ఉప్పు జత చేసి దోరగా వేయించి దించి పక్కన ఉంచాలి మిగిలిన నూనెను బాణలిలో వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొబ్బరి ముక్కలు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక కరివేపాకు జత చేయాలి చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించాలి వేయించి ఉంచుకున్న అల్లం తురుము, చింతపండు పులుసు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి బెల్లం తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. చక్క ఎరిసెరి కావలసినవి: పచ్చిగా ఉన్న పనస తొనలు - పావు కేజీ; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - అర కప్పు; జీలకర్ర - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 2; కొబ్బరినూనె - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 4; చిన్న ఉల్లి పాయలు - 5; కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు తయారీ: ముందుగా పనస తొనలలోని గింజలు వేరు చేసి తొనలను నాలుగైదు ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మూత పెట్టి ఉడకించాలి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల నీళ్లు మిక్సీలో మెత్తగా చేసి పక్కన ఉంచాలి పనస ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి మరొక బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఎండు మిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి దించేయాలి అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు
మాదాపూర్, న్యూస్‌లైన్: సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, వినూత్న కార్యక్రమాల సమాహారంగా రాష్ర్ట స్థాయి యువజనోత్సవాలు శనివారం నుంచి మాదాపూర్‌లోని శిల్పారామంలో కనువిందు చేయనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి వట్టి వసంతకుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 23 జిల్లాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులను రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేశారు. ఆయా ప్రదర్శనల్లో ఎంపికయిన వారిని పంజాబ్ లూథియానాలో జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలకు పంపిస్తారు. శిల్పారామంలో జానపద సంగీతం, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీతం (కర్నాటక, హిందుస్తానీ), శాస్త్రీయ వాయిద్యాలు (తబలా, వీణా, మృదంగం, హార్మోనియం, సితారా, వేణువు), శాస్త్రీయ నృత్యాలు (కూచిపూడి, భరతనాట్యం, మణిపూరి, కథక్, ఒడిస్సీ) తదితరాల్ని నిర్వహించనున్నారు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మ్యాజిక్, ఏకపాత్రాభిన యం, ఫ్యాన్సీడ్రెస్, క్విజ్, వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వం, గీతం, నృత్యం, సామూహిక చర్చ, మార్షల్ ఆర్ట్స్ తదితర ప్రత్యేక ప్రదర్శన, కార్యక్రమాలు కూడా అలరించనున్నాయి. అదేవిధంగా మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం, అవయవదానంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29న లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు. 30న జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని యువజన సర్వీసుల శాఖ నిర్దేశకుడు కర్రి రాజభౌమ హరినారాయణ చక్రవర్తి తెలిపారు.