సాక్షి, హన్మకొండ: ‘నటరాజ వందనం.. శివుడికి అంకితం చేసిన నృత్య ప్రదర్శన. నా తల్లి మృణాళిని సారాభాయ్ వెలువరించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి రూపొందించింది. సాధారణంగా పురుష దేవతల్లో ఐక్యత కోసం నాయిక అన్వేషణగా ఇది ప్రదర్శితమవుతుంది.’ అని అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయ్ అన్నారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్ప ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రం ‘కుడా’ మైదానంలో ‘నటరాజ వందనం’ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నృత్య అనుభవం.. నటరాజ వందనం ప్రదర్శన తీరు, వివిధ ఆలయాల్లోని శిల్పాల్లో నృత్య భంగిమల ప్రత్యేకతల్ని వివరించారు.
ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
నాకు నృత్యమంటే ప్రాణం. ఈ ఇష్టం మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. అమ్మ శాస్త్రీయ నృత్యకారిణి. పుస్తకాలు రచించేది. ఆ అభిరుచి నాకు కూడా అలవడింది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పేరిణి నృత్యం గురించి నాకు తెలుసు. 40 ఏళ్ల క్రితం కూచిపూడి గ్రామానికి చెందిన సీఆర్ ఆచార్యుల వద్ద నేను నృత్యం నేర్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలిచ్చా. శాస్త్రీయ సమకాలీన రచనలు సృష్టించి ప్రదర్శనలిస్తూ వస్తున్నా.
30 ఏళ్లుగా ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సంస్థ ‘దర్పణ అకాడమీ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్’కు కో–డైరెక్టర్‌గా ఉన్నా. 1989లో మహిళా శక్తిని బలోపేతం చేసే సోలో థియేట్రికల్ వర్క్‌లను ప్రదర్శించాం. సామాజిక మార్పు కోసం, మహిళా సాధికారత, పర్యావరణ స్పృహ కలిగించేలా మా ప్రదర్శనలుంటాయి. అనేక రంగస్థల నిర్మాణాల్ని రూపొందించాం. సామాజిక మార్పు, పరివర్తన కోసం కళల్ని ఉపయోగించడమే నా ధ్యేయం.
నాట్యాల్లో ప్రత్యేకం..
నాట్యాల్లో నటరాజ వందనం ప్రదర్శన ఒక ప్రత్యేకం. మా అమ్మ మృణాళిని సారాభాయ్ రచించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి దీన్ని కూర్పు చేశాను. పరమాత్మ కోసం ఆత్మ చేసే అన్వేషణే భరతనాట్యం. శివపార్వతుల నృత్యాన్ని చూడడానికి విశ్వం నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రదర్శనను వర్ణం అని కూడా పిలుస్తారు. ఈప్రదర్శనలో నృత్యకారుడు శివుడి తాండవ నృత్య శక్తిని, గంభీరమైన రూపాన్ని చూపిస్తాడు.
రామప్పలో ప్రదర్శించాలని కోరిక..
రామప్పలో నటరాజ నృత్య ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కొన్ని కారణాల వల్ల ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ కాకతీయులు ఏలిన వరంగల్ నగరంలో ప్రదర్శించడం కూడా సంతోషంగానే ఉంది. ఇందుకు కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ వారు చాలా సహకారం అందించారు. రామప్ప ఆలయంలోని శిల్పాల నృత్యభంగిమలు ఎంతో ప్రత్యేకమైనవి. పూర్వం పురాతన దేవాలయాల్లోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగేవి. అప్పటి వాళ్లు కళాపిపాసులు. అందుకేనేమో నృత్య ప్రదర్శనలను వివిధ నృత్య భంగిమల్లో శిల్పాలుగా రూపొందించారు. చరిత్రను, పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి.
అభిరుచి ఉండాలి..
ఈపోటీ ప్రపంచంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే అభిరుచి ఉండి తీరాలి. లేదంటే మనల్ని మనం నిరూపించుకోలేం. ముందు తరాల వారు శాస్త్రీయ నృత్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండి, ఆర్థిక బలహీనత వల్ల వెనకబడేవారికి నేర్చుకునేలా అవకాశం కల్పించాలి. మన ప్రభుత్వం శాస్త్రీయ కళలకు నిధులివ్వట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అవసరం.
మల్లికా సారాభాయ్ గురించి క్లుప్తంగా..
అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, శాస్త్రీ య నృత్యకారిణి మృణాళిని సారాభాయ్ దంపతుల కుమార్తె మల్లికా సారాభాయ్. 1954 మే9న అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే నృత్యం నేర్చుకున్నారు. 15ఏళ్ల వయస్సులో సినీ నటిగా పేరు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో భరతనాట్యం, కూచి పూడి శాస్త్రీయ నృత్యంలో అసాధారణ మైన యువనర్తకిగా గుర్తింపు పొందారు. నాటక, నృత్యరంగంలో చేసిన కృషికిగానూ గుజరాత్ ప్రభుత్వం ఆమెకు గౌరవ్ పురస్కార్ అందించింది. 2010లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment