పండుమిర్చి...
పేరు వినగానే నోరు మండుతుంది...
అలాగని మనసు ఊరుకోనిస్తుందా...
ఒక్కసారి ఆ ఘాటును రుచి చూడమంటుంది...
అంత కారం తినాలంటే ఎలా అని మళ్లీ అనిపిస్తుంది...
అందుకే పండుమిర్చితో రకరకాల పదార్థాలను జత కట్టిద్దాం...
గోంగూర, కొబ్బరి, చింతకాయ, టొమాటో, మసాలా...
వీటి స్నేహంతో మిరప తన ఘాటు కోపాన్ని కాస్తంత తగ్గించుకొని...
కమ్మటి రుచిని అందిస్తోంది...
అమ్మో! పండుమిర్చి! అనకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి...
అబ్బ! ఎంత బాగుందో... అనక మానరు.
పండుమిర్చిచింతకాయ పచ్చడి
కావలసినవి:
పండుమిర్చి - 100 గ్రా.
చింతకాయలు - 100 గ్రా., శనగపప్పు - టీ స్పూను
జీలకర్ర - అర టీస్పూను, కరివేపాకు - ఒక రెమ్మ, వెల్లుల్లి రేకలు - 5 ఇంగువ - చిటికెడు, ఆవాలు - అర టీ స్పూను,
నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2, ఉప్పు - 25 గ్రా. పసుపు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను
తయారి:
చింతకాయలను కడిగి ఆరబోసి, తడి పోయాక దంచి, గింజలు, ఈనెలు, పై తొక్క వేరు చేయాలి
పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి, మిర్చిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
చింతకాయల పేస్ట్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు తిప్పి తీసేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక, ఇంగువ, కరివేపాకు జత చేసి వేగాక పచ్చడిలో వేసి కలపాలి.
పండుమిర్చి టొమాటో పచ్చడి
కావలసినవి:
ఆవాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
వైట్ వెనిగర్ - ఒకటిన్నర కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు, పండుమిర్చి - పావు కేజీ (గింజలు తీసేయాలి)
టొమాటోలు - 2 కేజీలు, (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పసుపు - టీ స్పూను, జీలకర్ర - 4 టీ స్పూన్లు
పంచదార - కప్పు, ఉప్పు - తగినంత
తయారి:
ఒక పాత్రలో ఆవాలు, వైట్ వెనిగర్ వేసి సుమారు అరగంటసేపు నాననివ్వాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి
పసుపు, జీలకర్ర, పంచదార, ఉప్పు, వెనిగర్‌లో నానబెట్టిన ఆవాలు జత చేయాలి
మిశ్రమం దగ్గరపడే వరకు సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి
చల్లారాక గాలిచొరని జాడీలోకి తీసుకుని సుమారు 10 రోజుల తరువాత ఉపయోగించుకోవాలి.
పండుమిర్చి కొబ్బరి పచ్చడి
కావలసినవి:
పండుమిర్చి - 200 గ్రా., కొబ్బరితురుము - కప్పు, వెల్లుల్లి రేకలు - 10, అల్లం తురుము - టీ స్పూను, ఆవపొడి - అర కప్పు, ఎండుమిర్చి - 6, ఆవాలు - టేబుల్ స్పూను, పసుపు - టీ స్పూను, చింతపండు - కొద్దిగా, మెంతిపొడి - అర టేబుల్ స్పూను, పల్లీ నూనె - 300 మి.లీ., ధనియాలపొడి - టీ స్పూను, జీలకర్రపొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - టీ స్పూను
తయారి:
పండుమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి
బాణలిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, కొబ్బరితురుము వేసి వేయించాలి. చల్లారాక, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
అల్లం తురుము, చింతపండు జత చేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి
పండుమిర్చి, కొబ్బరిపేస్ట్ వేసి వేయించాలి
చివరగా ఆవపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలయ్యాక దింపేయాలి.
పండుమిర్చి గుత్తి పచ్చడి
కావలసినవి:
పండుమిర్చి -3 కేజీలు, వాము - 100 గ్రా.
జీలకర్ర - 100 గ్రా., సోంపు - 100 గ్రా., ఎండుమిర్చి - 100 గ్రా. మెంతులు - 100 గ్రా., ఇంగువ - టేబుల్ స్పూను
కలౌంజీ - 100 గ్రా., ఉప్పు - 200 గ్రా.
ఆమ్‌చూర్ - 150 గ్రా., ఆవనూనె - కేజీ
వైట్ వెనిగర్ - 200 మి.లీ.
తయారి:
పండుమిర్చిని శుభ్రంగా కడిగి,తడి పోయేవరకు గాలిలో ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి. గింజలు తీసి పక్కన ఉంచాలి
స్టౌ మీద బాణలిలో వాము, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
ఉప్పు, ఆమ్‌చూర్ జతచేసి మరోమారు మిక్సీ పట్టాలి. పండు మిర్చి గింజలను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
రెండు పొడులకు కలౌంజీ జత చేసి, ఆవనూనె, వైట్ వెనిగర్ వేయాలి. (వీటిని కలిపేటప్పుడు గ్లౌజ్ వేసుకుంటే మంచిది. లేదంటే చేతులు మండుతాయి)
నూనె, ఇంగువ వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని రెండు మూడు రోజులు ఎండలో ఉంచాలి
ఈ మిశ్రమాన్ని కట్ చేసి ఉంచుకున్న పండుమిర్చిలో స్టఫ్ చేసి, నాలుగు రోజులు ఎండలో ఉంచాక, మిగిలిన నూనెను వాటి మీద పోసి గాలిచొరని జాడీలో నిల్వ చేయాలి.
పండుమిర్చి గోంగూర పచ్చడి
కావలసినవి:
గోంగూర - కేజీ, పండుమిర్చి - 300గ్రా., చింతపండు - 250 గ్రా., ఉప్పు -తగినంత, ఇంగువ - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 6, పసుపు - టీ స్పూను, మెంతులు - 3 టీ స్పూన్లు, నూనె - పావు కేజీ
తయారి:
మెంతులను దోరగా వేయించి పొడి చేసి పక్కన ఉంచాలి
పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
చింతపండు శుభ్రం చేసి పక్కన ఉంచాలి
గోంగూర ఆకులను శుభ్రం చేసి, బాగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
ఒక పెద్ద పాత్రలో మెత్తగా చేసి ఉంచుకున్న పండుమిర్చి, గోంగూర, చింతపండు వేసి వాటికి ఉప్పు, వెల్లుల్లి రేకలు, పసుపు, మెంతిపొడి జత చేసి బాగా కలపాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపి దించి చల్లారిన తరువాత పచ్చడిలో వేసి బాగా కలిపి, గాలిచొరని జాడీలో నిల్వ చేసుకోవాలి
వాడుకునే ముందు పోపు వేస్తే తాజాగా, రుచిగా ఉంటుంది.
పండుమిర్చి పచ్చడి
కావలసినవి:
పండుమిర్చి - కేజీ
ఉప్పు - అర కప్పు
చింతపండు - పావు కేజీ
పసుపు - టీ స్పూను
మెంతులు - టీ స్పూను
నూనె - 2 కప్పులు
జీలకర్ర - టేబుల్ స్పూను
ఆవాలు - టేబుల్ స్పూను
ఇంగువ - పావు టీ స్పూను
తయారి:
ఒక పాత్రలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి బాగా కలిపి గాలిచొరని సీసాలో మూడు రోజులు ఉంచాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు, పసుపు వేయించి, పచ్చడిలో వేసి కలపాలి
తగినంత నూనె పోసి రెండు రోజుల తర్వాత వాడుకోవాలి.
సేకరణ: డా. వైజయంతి
నోరు పండే పచ్చళ్లు
Published Fri, Feb 14 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement