సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా సంన్నకుటుంబాల వాళ్లు కేన్సర్ బారినపడి జయించడం అనేది వేరు. ఎందుకంటే అత్యాధునిక వైద్యం పొందే ఆర్థిక స్థోమత వారికి ఉంటుంది. ఆ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చులు తట్టుకోగలరు. కేవలం వాళ్లు ధైర్యంగా చికిత్స చేయించుకుంటే చాలు. అదే సామాన్యుడు.. అందులోనూ ఓ మధ్య తరగతివాడు ఇలాంటి కేన్సర్ బారినపడితే అతడి పరిస్థితి తలకిందులైపోవడం లేదా కుటుంబమే రోడ్డున పడిపోతుంది. ఇక్కడ అలానే ఓ మధ్యతరగతికి చెందిన భార్యభర్తలిద్దరూ కేన్సర్ బారిన పడ్డారు. అయితే వారిద్దరూ కేన్సర్‌ని జయించి ఏకంగా లక్షల టర్నోవర్ చేసేలా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారెవరంటే..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరానికి చెందిన దంపతులు లవీనా జైన్(Laveena Jain), ఆమె భర్త ఓ ప్రైవేటు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి కేన్సర్(cancer) మహమ్మారి ఒక్క కుదుపు కుదిపేసింది.
భార్యభర్తలిద్దరూ 2010లో కేన్సర్ బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం అంటే తలకు మించిన భారమే. అందులోనూ ఇరువురు కేన్సర్ బారినపడ్డారు. లవీనాకు రొమ్ము కేన్సర్(Breast Cancer), ఆమె భర్తకు నోటి కేన్సర్(Mouth Cancer)..ఇలా ఇద్దరికి అయ్యే చికిత్సా ఖర్చులు, మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఇవన్నీంటిని ఎలా నిర్వహించాలన్న ప్రశ్నలే ఆ దంపతులను వేధించాయి.
ఏదో రకంగా ఇద్దరం దీన్నుంచి బయటపడితే పిల్లలని చూసుగోలమన్నా నిశ్చయానికి వచ్చి స్నేహితులు, తెలిసిన వాళ్లు బంధువుల దగ్గర అందినకాడికి అప్పులు తెచ్చి మరీ వైద్యం చేయించుకున్నారు. నిజానికి అవి తీర్చగలుగుతామా అన్న ఆలోచన లేకుండానే ఆ దంపతులు ముందు ఈ మహమ్మారిపై గెలవాలన్న సంకల్పంతో పోరాడారు.
అలా ఇద్దరు కఠినమైన కీమోథెరపీ, రేడియోథెరపీలు చేయించుకుని కోలుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆర్థిక కష్టాలు మాములుగా మొదలవ్వలేదు. కుటుంబాన్ని ఎలా నడపాలన్నిది అర్థం కాలేదు. ఆ వ్యాధి నుంచి బయటపడ్డామంటే..మరోవైపు తినడానికే గుప్పుడు బియ్యం లేని గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఆ మహ్మమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలు తాళ్లలేక చనిపోవాలన్నంత నరకయాతన అనుభవించారు.
అయితే లవీనా కేన్సర్ నుంచి కోలుకుని మాములు స్థితికి వచ్చింది గానీ ఆమె భర్తకి మాత్రం నోటి కేన్సర్ కారణంగా మాట రావడానికి టైం పడుతుందని చెప్పారు వైద్యులు. మరోవైపు చుట్టుముడుతున్న ఈ కష్టాల మధ్య ఆ దంపతులు తమ ఇంటిని అమ్మక తప్పలేదు. అలాంటి పరిస్థితిలో లవీనాకు తన చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న పాకనైపుణ్యం గుర్తొచ్చింది.
సరదాగా నేర్చుకున్న ఆహార సంరక్షణ కోర్సు ఇలా ఉపయోగపడుతుందని లవీనా ఊహించలేదు. ఆ కోర్సులో భాగంగా మురబ్బా, ఊరగాయలు, జామ్‌లు తయారు చేయడం నేర్చుకున్న కళే తనకు ఆధారం అని భావించింది లవీనా. సరిగ్గా ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహార సంరక్షణకు సంబంధించిన వందరోజుల ఉపాధి అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. వెంటనే లవీనా అందులో జాయిన్ అయ్యి శిక్షణ తీసుకుంది.
అయితే వ్యాపారం పెట్టేందుకు ఆమె వద్ద కేవలం రూ. 1500/-లు మాత్రమే ఉన్నాయి. దాంతోనే 'లవీనాస్ ట్రిప్టి ఫుడ్స్' అనే పచ్చళ్ల ఫుడ్‌స్టార్టప్‌ని ప్రారంభించింది. లవీనా స్వయంగా ఇంట్లో తయారు చేసే స్క్వాష్, జామ్‌లు, ఊరగాయలు విక్రయించేది. అయితే విక్రయాలు అంత ఈజీగా జరగలేదు. తయారుచేయడమే ఈజీ వాటిని ప్రజల వద్దకు చేరేలా చేయడమే అత్యంత కష్టమని తెలిసిందామెకు. అసలు వ్యాపార కిటుకేంటో తెలియక ఎన్నో ఇక్కట్లు పడింది. ఎలా ప్రజలకు తన వ్యాపారం గురించి తెలిపి విక్రయాలు ఊపందుకునేలా చేయాలన్నది ఆమెకు ఓ పెద్ద టాస్క్‌లా మారింది.
అయితే స్థానిక కిట్టి పార్టీల ద్వారా తన వ్యాపారం గురించి ప్రచారం చేసుకోవడం..శ్యాంపుల్ బాటిల్స్ ఇవ్వడం వంటివి చేయడంతో అమ్మకాలు మొదలయ్యాయి. అలా ఒకరినుంచి ఒకరికి ఆమె చేసే పచ్చళ్లు, జామ్‌ల గురించి తెలియడం మొదలై వ్యాపారం ఊపందుకుని లాభాలు రావడం మొదలైంది. ఆ లాభాలతో అప్పులు తీర్చడం మొదలు పెట్టడమే గాక కుటుంబ ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండేలా చేసింది. అయితే ఈ బతుకుపోరాటం కారణంగా ఆమె కొడుకు డ్రీమ్ పక్కన పెట్టి తన వ్యాపారం ప్రచారంలో పాలుపంచుకోక తప్పలేదు. అతడే తనకు చేదుడు వాదోడుగా ఉండి వ్యాపారాన్ని చూసుకోవడంతోనే తన వ్యాపారం ఇంతలా విస్తరించిందని అంటోంది లవీనా. ప్రస్తుతం ఆమె వ్యాపారం రూ. 34 లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతోంది.
ఇక ఆమె కుమారుడు కిన్షుక్ (30) మాట్లాడుతూ..సీఏ చేయాలనేది తన డ్రీమ్ అని కానీ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా చేయలేకపోయానని చెప్పాడు. తమ కుంటుంబాన్ని ఆదుకోవడానికి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మా అమ్మ ప్రయత్నానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. తమ వ్యాపారం గురించి ఇంటి ఇంటికి తిరుగుతున్నప్పుడు ఎదురైన అవమానాలను గుర్తుచేసుకుంటూ..వ్యాపారం నిర్వహించడం అంత ఈజీ కాదని అర్థమైందంటూ చెప్పుకొచ్చాడు.
తాను ప్రజల్లోకి తమ పచ్చళ్ల వ్యాపారం ఎలా తీసుకెళ్లగలను, వారితో చెప్పడం ఎలా అని బాధపడుతుంటే తన తండ్రి మాట్లాడలేని స్థితిలో కూడా సైగలతో ఓ బస్సు ఎక్కినప్పుడు ప్రయాణికుడితో మాటలు ఎలా కలుపుతావో అలానే అనుకుని మాట్లాడు చాలు అన్నారు. ఆ ఒక్క మాట తనను ఎంతగానో ప్రేరేపించి.. ఎన్నో ఆర్డర్లు అందుకునేలా చేసిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు కిన్షుక్. ఈ కథ ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే.. గివ్ అప్ ఇవ్వకూడదని, అచంచలమైన సంకల్పం, ఆశతో పోరాడితే గెలుపు తలుపు తప్పక తెరుచుకుంటుందనడానికి ఈ 50 ఏళ్ల కేన్సర్ వారియర్ లవీనా జైన్ కథే ఉదాహరణ.
(చదవండి: కేన్సర్‌ని ముందే పసిగట్టే స్ర్రీనింగ్ పరీక్షలేమిటి..? ఎప్పుడు చేయించాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment