అబ్బ! వంటలు భలే ఉన్నాయండి..అంటూ అతిథులు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే కష్టపడి వండిన వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కేరళలోని అలప్పూలో నివసించే మహిళ ఫిలోకు కూడా అంతే. పెళ్లిళ్లు, పేరంటాలు, పార్టీలు అంటే చాలు కష్టపడి వెజ్.. నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేసి ఇచ్చేసేది. ఆమె పికెల్స్‌కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆమె చేతి మహిమను అర్థం చేసుకోవచ్చు. మధ్యలో ఆటంకాలొచ్చినా.. చివరికి భర్తకిచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్తగా మారిపోయింది.
బెటర్ ఇండియా అందించిన వివరాల ప్రకారం స్టోరీ ఏంటంటే..
ఫిలో ఇంటర్ అయిపోయిన వెంటనే ఒక ఇంటికి భార్యగా వెళ్లిపోయింది. చిన్నప్పటినుంచి వంటలు చేయడం ఆసక్తి. ఇక పచ్చళ్లలో ఆమె చేయని ప్రయోగం లేదని చెప్పవచ్చు. అలాగే ఏదైనా చేయాలనే గాఢమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే 2015లో భర్త, కోడలు టిన్సీ సాయంతో ఊరగాయ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. కానీ మొదట్లో పెద్దగా విజయంసాధించలేదు. మళ్లీ తిరిగి కోడలి సహకారంతో ఫిలో 60 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా అవతరించింది. అత్తాకోడళ్లు ద్వయం విజయవంతంగా వ్యాపారాన్ని నడిపించారు.
కేవలం ఫేస్‌బుక్ పేజీతో చిన్న స్థాయిలోనే వ్యాపారాన్ని ప్రారంభించారు. చికెన్, స్వీట్ లైమ్, బీఫ్ వంటి రెండు మూడు రకాల ఊరగాయలను విక్రయించేవారు. కేవలం నోటి మాట ద్వారానే అయినా వ్యాపారం బాగానే సాగింది. మళ్లీ అనుకోకుండా భర్త థామస్ అనారోగ్యం కారణంగా వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కేన్సర్‌తో బాధపడుతూ మూడు నెలలు ఆయన ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఆ తరువాత కూడా చికిత్స కోసం తరచుగా వెల్లూరుకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వ్యాపారం ముందుకు సాగలేదు.
ఇదంతా గమనించిన థామస్ తన భార్యకు ఒకటే మాట చెప్పారు. ‘ఫిలో.. నీలో చాలా టాలెంట్ ఉంది. నీ పచ్చళ్లు అందరికీ నచ్చుతాయి. ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంది. వ్యాపారాన్ని కొనసాగించు. ఏదో ఒకరోజు కచ్చితంగా నువ్వు గొప్పదానివి అవుతావు. నామాట విను’’ అంటూ తన కోరికను వెల్లడించారు.
ఆ మాటలే వేదమంత్రాలయ్యాయి. ఈ సారి పకడ్బందీగా రంగంలోకి దిగారు అత్తాకోడళ్లు. 2018లో కొత్త అవతార్‌లో లోగో, ప్యాకేజింగ్ మార్చేసి, ‘ఫిలోస్ పికిల్స్’ స్టార్ట్ చేశారు. దీనికి తోడు ముఖ్యమైన FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫుడ్ లైసెన్స్ తెచ్చుకున్నారు. 10వేల రూపాయల పెట్టుబడితో మళ్లీ పచ్చళ్ల తయారీ మొదలు పెట్టారు. స్థానిక సూపర్ మార్కెట్‌లకు అందించే వారు. ఇది ప్రచారానికి బాగా ఉపయోగపడింది.
ఫుడ్ బ్లాగర్ మృణాల్ దాస్ వెంగలాట్ 2019లో వారి ఉత్పత్తుల గురించి ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇది మంచి ఆర్డర్‌లను తెచ్చిపెట్టింది. దీంతో ఒక ఇన్‌స్టా పేజీని కూడా స్టార్ట్ చేశారు. ఇక అప్పట్నించి విదేశాలకు సైతం రుచికరమైన పచ్చళ్లను సరఫరా చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. రొయ్యల ఊరగాయ, చేపలు, మాంసం ఊరగాయలు, చెమ్మీన్ చమ్మంతి పొడి (ఎండిన రొయ్యల పొడి) బెస్ట్ సెల్లర్స్‌గా నిలిచాయి. మామిడి, నిమ్మకాయ. సీజన్ల వారీగా, అనేక కూరగాయల ఊరగాయలను కూడా తయారు చేస్తారు. చాలా శ్రద్ధగా ప్రేమతో పచ్చళ్లు తయారు చేస్తాం అంటారు ఫిలో.
‘‘జీవితం అంతా బాధ్యతలతోనే గడిచిపోయింది. 60 ఏళ్లు దాటాక విసుగు, అలసట వస్తుంది..దీంతో ఈ వయసులో ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ ఈ ధోరణి మారాలి. మన నైపుణ్యంపై దృష్టి పెట్టాలి. అలా నేను ఫిలోస్ ప్రారంభించాక, ఒత్తిడి, ఆందోళన మాటుమాయమైంది. కొత్త ఉత్సాహం వచ్చింది. గౌరవం, ప్రేమ లభిస్తోంది’’ అంటారామె ఆ స్వర్గంనుంచి తన భర్త కేజే థామస్ తనను, తన విజయాన్ని చూస్తూ ఉంటాడనే ఆశతో.
Comments
Please login to add a commentAdd a comment