ఏ రుచైనా వెరైటీనే... | A variety rucaina ... | Sakshi
Sakshi News home page

ఏ రుచైనా వెరైటీనే...

Published Sat, Jan 17 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

A variety rucaina ...

పిల్లలు నిన్న మొన్నటి దాకా పండగ వంటలు తిన్నారు.
సెలవలు పూర్తయి స్కూల్స్‌కి బయలుదేరబోతున్నారు.
వాళ్లకి ఈ వెరైటీ చైనీస్ వంటల్ని సిద్ధం చేసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టండి... ఇష్టంగా తింటారు.

సేకరణ: డా. వైజయంతి పురాణపండ
 
 మష్రూమ్ మంచూరియా

 
 కావలసినవి:
 కార్న్‌ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు
 మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
 తాజా మష్రూమ్స్ - పావు కేజీ
 అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
 సోయా సాస్ - అర టీ స్పూను
 నూనె - తగినంత
 ఉప్పు - తగినంత
 
 వేయించడానికి:
 అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను
 పచ్చిమిర్చి తరుగు - టీ  స్పూను
 ఉల్లి తరుగు - పావు కప్పు
 ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు
 నూనె - 2 టేబుల్ స్పూన్లు
 సోయా సాస్ - ఒకటిన్నర టీ స్పూన్లు
 చిల్లీ సాస్ - అర టేబుల్ స్పూను
 టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ:  

మష్రూమ్‌లను మురికి పోయేలా శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబెట్టి, తడి పోయాక ముక్కలుగా కట్ చేయాలి. (ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండాలి)  ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, అర టీ స్పూను సోయా సాస్, ఉప్పు , 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలపాలి
 
 మష్రూమ్ ముక్కలు జత చేసి కలపాలి  
 
 బాణలిలో నూనె కాగాక, కొద్దికొద్దిగా పిండి తీసుకుని పకోడీల మాదిరిగా వేయాలి. (కొద్దిగా బంగారు వర్ణంలోకి మారగానే తీసేయాలి. లేదంటే మాడిపోతాయి)  
 
 ఇలా అన్నీ తయారుచేసి, పక్కన ఉంచాలి  
 
 వెడల్పాటి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు వేయించాలి  
 
 టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వే యించిన మంచూరియాలు వేసి బాగా కలిపి, ఉల్లికాడల తరుగు వేసి మరో మారు కలపాలి  
 
 అన్నీ బాగా కలిసినట్లు అనిపించగానే మంట ఆర్పేసి, టొమాటో సాస్‌తో వేడివేడి మష్రూమ్‌లు అందించాలి.
 
వెజ్ హక్కా నూడుల్స్
 
(హక్కా నూడుల్స్ ఇండియన్ చైనీస్ రెస్టారెంట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఇతర నూడుల్స్ కంటె చాలా రుచిగా ఉంటాయి. ఇవి పల్చగా ఉండే రైస్ నూడుల్స్. చైనాలోని హక్కా అనే తెగ వారి నుంచి ఈ పేరు వచ్చింది. అయితే ఒక విధంగా ఇది భారతీయుల వంటకమే!)
 
కావలసినవి:
క్యారట్ - 1; బీన్స్ - గుప్పెడు; మష్రూమ్స్ - అర కప్పు; ఉల్లి కాడల తరుగు - పావు కప్పు; బఠాణీ - అర కప్పు; గ్రీన్ క్యాప్సికమ్ - 1; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - అర టీ స్పూను; నూనె - టీ స్పూను; హక్కా నూడుల్స్ - ఒక ప్యాకెట్; ఎండు మిర్చి - 6; వెల్లుల్లి రేకలు - 4; సోయా సాస్ - కొద్దిగా
 
 తయారీ:  
 ముందుగా కూరలన్నిటినీ సన్నగా తరగాలి
 
 ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, కూరముక్కలు జత చేసి, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి
 
 హక్కా నూడుల్స్‌కి తగినన్ని నీళ్లు జత చేసి వేరుగా ఉడికించాలి  
 
 నీళ్లు ఒంపేసి, నూడుల్స్‌ను చన్నీళ్లలో రెండు మూడు సార్లు జాడించాక, నూనె జత చేసి, బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల నూడుల్స్ అతుక్కుపోకుండా విడిగా ఉంటాయి  
 
 ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి  
 
 మంట పెంచి, ఉల్లి కాడల తరుగు, ఫ్రెంచ్ బీన్స్ తరుగు వేసి సుమారు మూడు నిమిషాలు వేయించాలి  
 
 మష్రూమ్స్, క్యారట్ తరుగు, బఠాణీలు, గ్రీన్ క్యాప్సికమ్ తరుగు జత చేసి ఐదారు నిమిషాలు వేయించాలి  
 
 బంగారు వర్ణంలోకి మారుతుండగా సోయా సాస్ వేసి కలపాలి. హక్కా నూడుల్స్ వేసి కింద నుంచి పైకి బాగా కలపాలి  
 
 ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి, స్టౌ మీద నుంచి దింపేయాలి  
 
 ఉల్లికాడల తరుగుతో అలంకరించి అందించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement