సెన్సార్ చేతి రాత
చేతిరాతను చూసి తలరాతను నిర్ణయిస్తారు చాలామంది...
ప్రస్తుతం చేతిరాతను చాలామంది మర్చిపోయారు. వరంగల్‌కి చెందిన సతీశ్ మాత్రం వందల కొద్దీ పేజీలు చేతితోనే రాస్తున్నారు. అది కూడా అచ్చంగా ప్రింట్‌లో అక్షరాల్లాగ. డిగ్రీ చదువుతుండగానే చలనచిత్రరంగంలోకి ప్రవేశించారు సతీశ్.
‘‘నా అక్షరాలు బాగున్నాయని ప్రశంసించిన చిత్రదర్శకుడు ఆదినారాయణరావు, చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించారు. చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తూ, నా చేతిరాతకు పనికి వచ్చే పని చేయడానికి ప్రయత్నించాను. సినిమా సెన్సార్‌కి స్క్రిప్ట్ రైటర్‌లు చాలా తక్కువమంది ఉంటారు.
నాకు చిత్ర పరిశ్రమలో అంతగా అవకాశాలు కలిసిరాని సమయంలో, అల్లాణి శ్రీధర్ గారి ఫిల్మీ మీడియా సంస్థలో సెన్సార్ స్క్రిప్ట్ వర్క్ పని అప్పచెప్పారు. నేను ఆ వర్క్ అంతా చేతితో రాసి ఇచ్చాను. ఆది చూసి ఆయన నన్నెంతగానో ప్రోత్సహించారు’’ అని తన సినీరంగ ప్రవేశం గురించి తెలిపారు సతీశ్. దర్శకత్వశాఖలో అవకాశాలు లభించక, ఆర్థికం ఇబ్బందుల నుంచి బయటపడటానికి సతీశ్ ఎంచుకున్న మార్గం సెన్సార్ స్క్రిప్ట్‌ను స్వయంగా చేతితో రాయడం.
సతీశ్‌చేతిరాత చూసిన ‘7్టజి సెన్స్’ చిత్ర దర్శకుడు పెద్ది కె. ఈశ్వర్ ఆ సినిమాకి సెన్సార్ స్క్రిప్ట్ రాయమని కోరటంతో సతీశ్ మొట్టమొదటిసారి సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒక సినిమాకి సుమారు 100 - 150 పేజీల వరకు స్క్రిప్ట్ ఉంటుంది. సతీశ్ అదంతా చేతితో రాశారు.
‘‘సతీశ్ చేతి రాత చూసిన తర్వాత ఎన్నో పెద్దపెద్ద సినిమా స్క్రిప్ట్స్ అతనితోనే రాయించాను. అతని చేతి రాత అచ్చు డిటిపి చేసినట్టుగా ఉంటుంది’’ అని ప్రశంసించారు ఎఫ్‌డిసిలో పని చేస్తున్న అనంత్. ‘‘నా చేతిరాత చూసిన దర్శకుడు చంద్రసిద్ధార్థ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా సెన్సార్ స్క్రిప్ట్ పని నాకు అప్పగించారు. సాహసం, అత్తారింటికి దారేది, డికెబోస్, ప్రతినిధి, జెండాపై కపిరాజు, వెల్‌కమ్ ఒబామా, వీడికి దూకుడెక్కువ... ఇలా అనేక చలనచిత్రాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశాను’’ అంటున్నారు సతీశ్.
సతీశ్ చేతిరాత కంప్యూటర్ అక్షరాలు అందంగా ఉండడం వల్ల రెండేళ్లలోనే వందకు పైగా సినిమాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే మరో వైపు సెన్సార్ స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉంటున్నారు సతీశ్. ‘‘దర్శకత్వ శాఖలో అవకాశాలు లభించక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అటువంటి వారికి డిటిపి వర్క్ అప్పచెబుతున్నాను. ఒకవేళ నా జీవితంలో నేను సెన్సార్ స్క్రిప్ట్ రాయకుండా ఉండి ఉంటే పరిశ్రమ నుండి తప్పుకునేవాడినేమో!’’ అని చెబుతున్న సతీశ్‌లోని ఆశావాదాన్ని అందరూ అనుసరిస్తే, ఎప్పటికైనా ఉన్నతస్థాయికి ఎదుగుతారనడంలో సందేహం లేదు.
- డా.వైజయంతి