టొమాటోలు...
నిన్నమొన్నటి దాకా ఆకాశంలో కూర్చుని మనకు అందకుండా దూరం నుంచి ఊరించాయి...
మరి ఇప్పుడో...
ఒక్కసారిగా నేలమీదకు వచ్చి బుద్ధిగా చేతులు కట్టుకు నిలబడ్డాయి...
ఆలస్యం చేయకుండా....
చాకు పట్టుకుని టొమాటోలను కసాకసా ముక్కలు చేసేద్దాం...
పచ్చడి, ఊరగాయ, రసం, సూప్, స్నాక్...
మనకు నచ్చినట్టుగా వండేద్దాం...
స్వీటైనా, హాటైనా టొమాటో మాటెత్తకుండా ముద్ద దిగడం కష్టమని గమనిద్దాం...
టొమాటోకి ఓటేద్దాం...
టొమాటో హల్వా
కావలసినవి:
టొమాటోలు - 4 (మీడియం సైజువి)
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి - పావు టీ స్పూను
పంచదార - 7 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను
బాదంపప్పులు, పిస్తా పప్పులు - గార్నిషింగ్‌కి తగినంత
తయారీ:
టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి కాగాక టొమాటో గుజ్జు, ఏలకులపొడి, పంచదార వేసి, కలుపుతుండాలి
మంట బాగా తగ్గించి, టొమాటో గుజ్జు ఉడుకుతుండగా మరికాస్త నెయ్యి జత చేయాలి
కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీరు జత చేయాలి
మిశ్రమం బాగా చిక్కగా, మృదువుగా అయ్యేవరకు కలిపి దించేయాలి
బాదంపప్పులు, పిస్తా పప్పులతో గార్నిష్ చేయాలి.
టొమాటో సూప్
కావలసినవి:
పాస్తా - కప్పు
నీరు - 4 కప్పులు
టొమాటోలు - 8
మిరియాలపొడి - టీ స్పూను
కారం - టీ స్పూను
జీలకర్ర పొడి - టీ స్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
ఉప్పు - తగినంత
పుదీనా ఆకులు - 5
బ్రెడ్ క్యూబ్స్ - 10
కొత్తిమీర - ఒక కట్ట
తయారీ:
ఒక పాత్రలో నీరు మరుగుతుండగా పాస్తా వేసి దించేయాలి.
టొమాటోలను శుభ్రంగా కడిగి, రెండు విజిల్స్ వచ్చేవరకు కుకర్‌లో ఉడికించాలి.
చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి నీటిని జత చేసి స్టౌ మీద ఉంచి, బాగా మరుగుతుండగా మిరియాలపొడి, కారం, జీలకర్రపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి.
ఉడికించిన పాస్తా జత చేయాలి.
మంట తగ్గించి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.
ఔసూప్‌బౌల్‌లో బ్రెడ్ క్యూబ్స్, పుదీనా, కొత్తిమీర వేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.
స్టఫ్‌డ్ టొమాటో
కావలసినవి:
ఎర్రగా ఉన్న టొమాటోలు - 2
ఆలివ్ ఆయిల్ - టీ స్పూను
వెల్లుల్లి రేక లు - 2
ఉల్లి తరుగు - పావుకప్పు
జీలకర్ర - అర టీ స్పూను
వంకాయ ముక్కలు - అర కప్పు
వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో ముక్కలు - పావుకప్పు
పుదీనా ఆకులు - 5
నువ్వుపప్పు - 3 టేబుల్ స్పూన్లు
పైన్‌నట్స్ - 2 టేబుల్ స్పూన్లు
కారం - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
మిరియాలపొడి - పావు టీ స్పూను
కొత్తిమీర తరుగు - కప్పు
తయారీ:
అవెన్‌ను 375 డిగ్రీల దగ్గర వేడి చేయాలి
టొమాటోలపై భాగాన్ని కట్ చేసి, లోపల ఉండే గుజ్జును స్పూను సహాయంతో జాగ్రత్తగా తీయాలి
ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లిరేకలు, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మూడు నిమిషాలు వేయించాలి
వంకాయ ముక్కలను జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
ఒక చిన్న బాణలిలో వెనిగర్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి
పుదీనా ఆకులు, కారం జత చేసి రెండు నిమిషాలు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
మరో బాణలిలో కూరగాయ ముక్కలకు, నువ్వుపప్పు, పైన్ నట్స్ జత చేసి కలపాలి
వేడిగా ఉండగానే మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి దించేయాలి
పైన తయారుచేసుకున్న పదార్థాలన్నిటినీ ఒక పాత్రలో వేసి బాగా కలపాలి
పెద్ద స్పూన్‌తో ఈ మిశ్రమాన్ని టొమాటోలలో స్టఫ్ చేసి, బేకింగ్ షీట్ మీద ఉంచి అవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి.
బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
టొమాటో - పుదీనా చట్నీ
కావలసినవి:
పుదీనా ఆకులు - అర కప్పు
పండిన టొమాటోలు - 4
(మీడియం సైజువి)
ఉల్లి తరుగు - పావుకప్పు
పుట్నాలపప్పు - అర కప్పు
ఎండుమిర్చి - 4
ఇంగువ - పావు టీ స్పూను
నూనె - టేబుల్‌స్పూను
ఆవాలు - పావు టీ స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారీ:
బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించి, పక్కన ఉంచాలి
అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు ఉంచాలి
పుదీనా ఆకులు జత చేసి మూడు నిమిషాలు ఉడికించాలి
పుట్నాలపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. (నీరు కలపకూడదు)
(పుదీనా బదులు కొత్తిమీర కూడా వాడవచ్చు)
టొమాటో ఆవకాయ
కావలసినవి:
టొమాటోలు - కిలో
కారం - 50 గ్రా.
చింతపండు - 150 గ్రా.
ఉప్పు - తగినంత
నూనె - పావు కేజీ
ఇంగువ - టేబుల్ స్పూను
ఎండుమిర్చి - 6
ఆవాలు - టేబుల్ స్పూను
మెంతిపొడి - టేబుల్ స్పూను
తయారీ:
ముందురోజు రాత్రి ఒక గిన్నెలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాలి
మరుసటి రోజు ముక్కలను గట్టిగా పిండి, రసం ఒక గిన్నెలో, ముక్కలు ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
రసంలో చింతపండు వేసి, ముక్కలను, రసాన్ని విడివిడిగా ఎండబెట్టాలి
అయిదారు రోజులు ఎండాక, ముక్కలను రసంలో వేసి కలిసి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
కారం, మెంతిపిండి జత చేయాలి
బాణలిలో పావుకేజీ నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి దించేసి, చల్లారాక టొమాటో ఊరగాయలో పోయాలి
బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించి, పచ్చడిలో వేసి కలపాలి.
టొమాటో సాస్
అరకిలో టొమాటోలను ఉడికించి, తొక్క తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.
ఒక పాత్రలో ఉడికించిన టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కప్పు పంచదార, తగినంత ఉప్పు, కారం జత చేసి సుమారు పావుగంటసేపు ఉడికిస్తే హోమ్ మేడ్ టొమాటో సాస్ రెడీ.
సేకరణ: డా. వైజయంతి
స్వీటొమాటో హాటొమాటో
Published Fri, Feb 7 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement