టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలతో వినియోగదారులు సతమతం
స్వల్పకాలిక పంట.. త్వరగా కుళ్లిపోవడమే కారణమని నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏడాది ఏదో ఒక సీజన్‌లో టమాటాలు, ఉల్లిగడ్డల ధరలు ఒకేసారి పెరిగి ‘సెంచరీ’కొట్టడం...మనందరి గుండెలు గుభిల్లుమనడం...మళ్లీ ఒక్కసారే వాటి ధరలు పడిపోవడం షరామామూలై పోతున్న విషయం మనకు తెలిసిందే.
దక్షిణాదిలో ఈ సమస్య ఉండగా...టమాటా, ఉల్లిగడ్డల ధరల మోతతో పాటు దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ తదితర ప్రాంతాల్లో ఆలుగడ్డల ధరలు బెంబేలెత్తిస్తున్న సంగతి కూడా విదితమే. ఏ యేడాదికి ఆ ఏడాది ఇలా ధరల పిడుగు మనపై పడుతూ, ఉత్పత్తి, సరఫరా సరిగా లేక ఈ సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లో ‘కిచెన్ బడ్జెట్’ను కిందా మీదా చేస్తున్నా దీనికి తగిన పరిష్కారమంటూ లభించకపోవడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
భారత రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ పేపర్ సిరీస్‌లో భాగంగా... డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అక్టోబర్–2024లో విడుదల చేసిన ‘వెజిటబుల్స్ ఇన్‌ఫ్లేషన్ ఇన్ ఇండియా :ఏ స్టడీ ఆఫ్ టమాటో, ఆనియన్ అండ్ పొటాటో (టాప్)’నివేదికలో వివిధ అంశాలను పొందుపరిచారు.
కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ (సీపీఐ)లో పెద్దగా ప్రాధాన్యత లేని టమాట, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు «వివిధ సందర్భాల్లో అధిక ధరల పెరుగుదల కారణంగా ఆహారపదార్థాలపై ప్రభావం పడటంతో పాటు ద్రవ్యోల్బణం విషయంలో వార్తాపత్రికలు, దృశ్యమాధ్యమాల పతాక శీర్షికలకు కారణమవుతోంది.
ఈ నివేదికలో భాగంగా...వివిధ అంశాలను పరిశీలించారు. వాల్యూచెయిన్‌తో ముడిపడిన అంశాలు తదితరాలపై అధ్యయనం చేశారు. వీటిధరల్లో రైతుల భాగస్వామ్యం అనే విషయానికొస్తే...టమాటాల్లో 33 శాతం, ఉల్లిపాయల్లో 36 శాతం, ఆలుగడ్డల్లో 37 శాతం రైతుల ‘షేర్’ఉన్నట్టుగా పేర్కొన్నారు.
వీటి పెట్టుబడి ఖర్చులు, వర్షపాతం, కూలీల వేతనాలు ఇంకా... సీజనల్ ఆటోరిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ విత్ ఎక్సోజీనోస్ వేరియబుల్ (సారిమాక్స్) ప్రభావితం చేస్తున్నట్టుగా అంచనావేస్తున్నారు. చాలా దేశాల్లో మాదిరిగానే భారత్‌లోనూ...కరోనా మహమ్మారి అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తుతున్న పరిణామాల ప్రభావంతో సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇందులో భాగంగా... భారత్‌లో ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణానికి కన్జూమర్ ప్రైస్‌ఇండెక్స్ (సీపీఐ)లో ఇవి మూడు అధిక ప్రాధాన్యతను పొందే పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యి, అధికంగా వినియోగించే కూరగాయల్లో ఈ మూడు ఉండటంతో కొరత ఏర్పడినప్పుడు ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఇవి మూడు కూడా ప్రధానంగా స్వల్పకాలిక పంటలు, (షార్ట్ సీజనల్ క్రాప్స్) త్వరగా కుళ్లిపోవడం, కొన్ని ప్రాంతాల్లోనే వీటి ఉత్పత్తి కేంద్రీకృతం కావడం, వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం వీటిపై తీవ్రంగా పడడం వంటి కారణాల వల్ల ధరల హెచ్చుతగ్గులకు అవకాశం ఏర్పడుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు.
సూచించిన పరిష్కారాలు...
» నెలవారీగా ఈ మూడింటి సప్లయ్, డిమాండ్‌ను రూపొందించి, దీనికి తగ్గట్టుగా మార్కెట్ స్పందనలు.. మరీముఖ్యంగా రైతులు, వ్యాపారులు, దిగుమతిదారులు, స్టాకిస్ట్‌లు, వినియోగదారుల కొనుగోలుతీరును పరిశీలించాలి.
» వీటి ధరలు అకస్మాత్తుగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి స్టాక్‌లు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ ధరల పెరుగుదలలు స్వల్పంగా ఉండేలా చూసుకోవాలి.
» వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ...వచ్చే 12 నెలలకుగాను ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి వాటిని ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ూ ఈ మూడింటి ధరలు పెరగకుండా జాగరూకతతో వ్యవహరించడంలో భాగంగా వీటికి సంబంధించి వాల్యూ చెయిన్‌ను అర్థం చేసుకుని, వినియోగదారులు చెల్లించే మొత్తంలో వీటిని పండించే రైతుల వాటాను పెంచేలా చర్యలు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment