భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
నువ్వులు, శనగపప్పు, బియ్యం పిండి, నూనెల ధరలన్నీ పిరం
బేగంబజార్ మార్కెట్ మొదలు మాల్స్ వరకు మండుతున్న రేట్లు
బియ్యం, కందిపప్పు ధరలు మాత్రం తగ్గుదల
సాక్షి, హైదరాబాద్: సంకాంత్రి పండుగ సామాన్యుడికి భారమైంది. పట్టణం నుంచి పల్లె వరకు ప్రజలంతా నిత్యావసర ధరలను చూసి భయపడిపోతున్నారు. పల్లెల్లోని రైతులకు పిండివంటలకు అవసరమైన బియ్యం సొంత పొలాల నుంచే వచ్చినా.. సకినాలు, గారెలకు కావాల్సిన నువ్వులు, వాము(వంద గ్రాములకు రూ. 40), శనగలు, వేరుశనగ వంటి పప్పు, నూనె ధాన్యాల ధరలు భారీగా ఉన్నాయి. పండుగకు తప్పదనే ధోరణితో ఉన్న దాంట్లోనే పొదుపు పాటిస్తూ నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గాయి. పెరిగిన ధరలతోపాటు నగరవాసులు ఊళ్లకు వెళ్లడం కూడా అందుకు కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో డబ్బు సర్క్యులేషన్ కూడా ఆశించిన స్థాయిలో లేనందున కూడా గిరాకీలు తగ్గినట్టు చెబుతున్నారు. చేతినిండా పనిలేని కారణంగా ఆశించిన మేర డబ్బు ఆడడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
కాగుతున్న నూనెలు..
సంక్రాంతి వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే ఇళ్లలో పిండి వంటలు ఘుమఘుమలాడేవి. ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు పిండి వంటలకు దూరమవుతున్నారు. నాలుగు నెలల్లోనే నూనె లీటర్ ధర రూ.10 నుంచి రూ.15 వరకు, పప్పు ధాన్యాల ధరలు 10 శాతంకు పైగా పెరిగాయి. ఈ తేడా గత ఆగస్టు నెలతో పోలిస్తే రూ. 25 నుంచి రూ.30 వరకు ఉంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న యుద్ధ వాతావరణంతోపాటు నూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచడంతో పామాయిల్ లీటర్ ధర ఒక్కసారిగా రూ.94 నుంచి రూ.129కి చేరింది. సన్‌ఫ్లవర్ నూనె లీటరుకు రూ.145 నుంచి రూ.150 వరకు, పల్లీ నూనె లీటరుకు రూ.160కి పైగా, రైస్ బ్రాండ్ రూ.147 నుంచి రూ.160 ఉన్నాయి. నెలరోజుల క్రితం నూనె ధరలు ఇంకొంచెం అధికంగా ఉండగా, జనవరి మొదటివారంలో కొంత మేర తగ్గాయి.
ఉడకనంటున్న పప్పు
పిండి వంటలు చేసుకోవడానికి పప్పు ధాన్యాలే ముఖ్యం. ఏ పప్పు ముట్టుకున్నా వాటి ధరలు నిప్పుల్లా కాలుతున్నాయి. ప్రస్తుతం శనగపప్పు కిలోకు రూ.100, నువ్వులు రూ. 170, బెల్లం రూ. 70, గోధుమ పిండి ప్యాకెట్ రూ. 60గా ఉంది. కాగా కందిపప్పు, పెసరపప్పు ధరలు ఈనెల మొదటి వారం నుంచి కొంత తగ్గుముఖం పట్టడం కొంత ఊరట. కందిపప్పు రూ.158, మినప గుండ్లు రూ. 164, పెసరపప్పు రూ. 120కి తగ్గాయి.
కొత్త బియ్యం రూ. 60, పాతబియ్యం రూ.70 పైనే ఉండగా, మొన్నటి వానాకాలం సీజన్‌లో పండిన పంటకు సంబంధించిన నాణ్యమైన బియ్యం ధర మాత్రమే కిలో రూ. 60 కన్నా తక్కువగా ఉంది. జైశ్రీరాం, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ వంటి సన్నబియ్యం ధర పాతవైతే కిలో రూ.70 వరకు పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి ధర కిలో రూ. 450 నుంచి రూ. 500 వరకు ఉంది. ఇంత మొత్తంలో చెల్లించి సామాన్యులు వెల్లుల్లి కొనలేకపోతున్నారు. ఉల్లిగడ్డ ధరలు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నా, హైదరాబాద్‌లో కిలో రూ. 50కి తక్కువగా లేదు. ఇతర కూరగాయ రేట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఓ కిరాణాకొట్టు. సరుకుల కోసం పండుగ వేళ దుకాణంలోకి వస్తున్న వినియోగదారులు సగం సంబరం–సగం కష్టం అన్నట్టుగా కనిపిస్తున్నారు. ఒకవైపు పిల్లలు పండుగకు వస్తున్న సంతోషం, మరోవైపు ధరలు పెరిగిన అసంతృప్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతికి తమ వద్దకు వచ్చే కస్టమర్లలో చాలామంది సంతోషంగా సరుకులను తీసుకుపోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఖరీదు చేస్తున్నారని దుకాణ యజమాని చెప్పారు.
పండుగల సమయంలో హెచ్చుతగ్గులు సహజమే
ధరల హెచ్చుతగ్గులకు జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. నూనెలు, పప్పుల ధరల గత కొంతకాలంగా పెరిగాయి. పండుగల సమయంలో నిత్యా వసర వస్తువుల ధరల్లో 5 నుంచి 10 శాతం హెచ్చుతగ్గులు సహజమే. కొన్నేళ్లుగా పండుగలు వచ్చినప్పుడు హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌లో సందడి తగ్గింది. నగరవాసులు సొంతూర్లకు వెళుతుండడంతో బేగంబజార్ దుకాణాల్లో గిరాకీ ఉండడం లేదు. – జీవన్ భాటి, కిరాణ మర్చంట్స్ అసోసియేషన్, బేగంబజార్
Comments
Please login to add a commentAdd a comment