Prices of essential items
-
‘టాప్’ మోతపై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏడాది ఏదో ఒక సీజన్లో టమాటాలు, ఉల్లిగడ్డల ధరలు ఒకేసారి పెరిగి ‘సెంచరీ’కొట్టడం...మనందరి గుండెలు గుభిల్లుమనడం...మళ్లీ ఒక్కసారే వాటి ధరలు పడిపోవడం షరామామూలై పోతున్న విషయం మనకు తెలిసిందే. దక్షిణాదిలో ఈ సమస్య ఉండగా...టమాటా, ఉల్లిగడ్డల ధరల మోతతో పాటు దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ తదితర ప్రాంతాల్లో ఆలుగడ్డల ధరలు బెంబేలెత్తిస్తున్న సంగతి కూడా విదితమే. ఏ యేడాదికి ఆ ఏడాది ఇలా ధరల పిడుగు మనపై పడుతూ, ఉత్పత్తి, సరఫరా సరిగా లేక ఈ సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లో ‘కిచెన్ బడ్జెట్’ను కిందా మీదా చేస్తున్నా దీనికి తగిన పరిష్కారమంటూ లభించకపోవడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ పేపర్ సిరీస్‌లో భాగంగా... డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అక్టోబర్–2024లో విడుదల చేసిన ‘వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా :ఏ స్టడీ ఆఫ్ టమాటో, ఆనియన్ అండ్ పొటాటో (టాప్)’నివేదికలో వివిధ అంశాలను పొందుపరిచారు. కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ (సీపీఐ)లో పెద్దగా ప్రాధాన్యత లేని టమాట, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు «వివిధ సందర్భాల్లో అధిక ధరల పెరుగుదల కారణంగా ఆహారపదార్థాలపై ప్రభావం పడటంతో పాటు ద్రవ్యోల్బణం విషయంలో వార్తాపత్రికలు, దృశ్యమాధ్యమాల పతాక శీర్షికలకు కారణమవుతోంది. ఈ నివేదికలో భాగంగా...వివిధ అంశాలను పరిశీలించారు. వాల్యూచెయిన్తో ముడిపడిన అంశాలు తదితరాలపై అధ్యయనం చేశారు. వీటిధరల్లో రైతుల భాగస్వామ్యం అనే విషయానికొస్తే...టమాటాల్లో 33 శాతం, ఉల్లిపాయల్లో 36 శాతం, ఆలుగడ్డల్లో 37 శాతం రైతుల ‘షేర్’ఉన్నట్టుగా పేర్కొన్నారు. వీటి పెట్టుబడి ఖర్చులు, వర్షపాతం, కూలీల వేతనాలు ఇంకా... సీజనల్ ఆటోరిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ విత్ ఎక్సోజీనోస్ వేరియబుల్ (సారిమాక్స్) ప్రభావితం చేస్తున్నట్టుగా అంచనావేస్తున్నారు. చాలా దేశాల్లో మాదిరిగానే భారత్‌లోనూ...కరోనా మహమ్మారి అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తుతున్న పరిణామాల ప్రభావంతో సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా... భారత్‌లో ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణానికి కన్జూమర్ ప్రైస్ఇండెక్స్ (సీపీఐ)లో ఇవి మూడు అధిక ప్రాధాన్యతను పొందే పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యి, అధికంగా వినియోగించే కూరగాయల్లో ఈ మూడు ఉండటంతో కొరత ఏర్పడినప్పుడు ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇవి మూడు కూడా ప్రధానంగా స్వల్పకాలిక పంటలు, (షార్ట్ సీజనల్ క్రాప్స్) త్వరగా కుళ్లిపోవడం, కొన్ని ప్రాంతాల్లోనే వీటి ఉత్పత్తి కేంద్రీకృతం కావడం, వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం వీటిపై తీవ్రంగా పడడం వంటి కారణాల వల్ల ధరల హెచ్చుతగ్గులకు అవకాశం ఏర్పడుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. సూచించిన పరిష్కారాలు... » నెలవారీగా ఈ మూడింటి సప్లయ్, డిమాండ్‌ను రూపొందించి, దీనికి తగ్గట్టుగా మార్కెట్ స్పందనలు.. మరీముఖ్యంగా రైతులు, వ్యాపారులు, దిగుమతిదారులు, స్టాకిస్ట్‌లు, వినియోగదారుల కొనుగోలుతీరును పరిశీలించాలి.» వీటి ధరలు అకస్మాత్తుగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి స్టాక్‌లు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ ధరల పెరుగుదలలు స్వల్పంగా ఉండేలా చూసుకోవాలి.» వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ...వచ్చే 12 నెలలకుగాను ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి వాటిని ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ూ ఈ మూడింటి ధరలు పెరగకుండా జాగరూకతతో వ్యవహరించడంలో భాగంగా వీటికి సంబంధించి వాల్యూ చెయిన్‌ను అర్థం చేసుకుని, వినియోగదారులు చెల్లించే మొత్తంలో వీటిని పండించే రైతుల వాటాను పెంచేలా చర్యలు చేపట్టాలి. -
'నిజమే'.. నిత్యావసరాల ధరలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినట్టు ప్రభుత్వం శాసన సభలో అంగీకరించింది. కీలకమైన నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయా అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, దాసరి సుధ అడిగిన ప్రశ్నను ప్రశ్నోత్తరాల సమయం షెడ్యూల్లో ఉంచినప్పటికీ సంబంధిత మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేశారు. సంబంధిత విభాగం ద్వారా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. జూన్‌తో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగినట్లు ప్రభుత్వం ఆ సమాధానంలో తెలిపింది. శనగపప్పు 17 శాతం, సన్‌ఫ్లవర్ నూనె 21 శాతం, పామాయిల్ 33 శాతం, ఉల్లిపాయలు 87 శాతం ధరలు పెరిగినట్టు ప్రకటించింది. రైతుబజార్లలో సబ్సిడీపై సరుకులను అందిస్తున్నామంది.అతిసార మృతుల కుటుంబాలకు పరిహారం లేదుసోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. విజయనగరం జిల్లాలో ఇటీవల అతిసారతో మరణించిన వ్యక్తుల వివరాలు చెప్పాలని, వారికి ఎలాంటి పరిహారం ఇస్తారో చెప్పాలని అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పినట్టే భావించాలని స్పీకర్ ప్రకటించారు. అయితే, నలుగురు మాత్రమే అతిసారతో చనిపోయారని, వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.రీసర్వేలో తప్పుచేసిన అధికారులను శిక్షిస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్ గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని 22ఏ నుంచి తొలగించారని, ఇందులో అక్రమాలు జరిగాయని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 25 వేల రిజిస్ట్రేషన్లలో 8 వేల వరకు తప్పు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామన్నారు. గత ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు అసైనీలను బెదిరించి లాక్కోవడమే కాకుండా రిజిస్ట్రేషన్లు త్వరగా చేసుకునేందుకు జీవోలు కూడా ఇచ్చారన్నారు. నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి, విశాఖలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, అందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తెస్తున్నట్టు చెప్పారు. 70 వేలకుపై అర్జీలు రీ సర్వేపైనే వచ్చాయన్నారు. రీ సర్వే పూర్తయిన 6,700 గ్రామాల్లో సభలు పెట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు. వాటిన్నింటినీ పాత పద్ధతిలో వెబ్‌ల్యాండ్‌లో పెట్టి రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. తప్పు చేసిన అధికారులను కూడా శిక్షిస్తామని చెప్పారు. ఇనాం భూములపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి న్యాయం చేస్తామన్నారు.సర్వే చేసి హౌసింగ్ బిల్లులు చెల్లిస్తాం: గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిగత ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు హౌసింగ్ ప్రోగ్రామ్ మచ్చుతునక అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులను నిలిపివేసిందని, గ్రామాల్లో ఇళ్ల పరిస్థితిపై సర్వే చేసిన అనంతరం పాత బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. విశాఖలో గృహాల నిర్మాణం 2026 మార్చికి పూర్తి చేస్తామన్నారు.జగనన్న కాలనీల్లో లోన్లు ఎక్కడా బలవంతంగా తీసుకోలేదని, 52 వేల మంది బ్యాంకు రుణాలు తీసుకున్నారని, ఈ మొత్తం కలెక్టర్ వద్దే ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో యూఎల్బీలో యూనిట్ ధర తగ్గించడంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వీటిలో ఎక్కడా తప్పులు జరగలేదని మంత్రి వివరించారు. వైఎస్ జగన్‌ని దూషించిన బుచ్చయ్య చౌదరిజగనన్న కాలనీ ఇళ్లను ప్రస్తావిస్తూ రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. జగనన్న కాలనీల పేరుతో వేల ఎకరాలు కొని, అన్యాక్రాంతం చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. ఆ భూములు నిర్మాణాలకు ఉపయోగపడవన్నారు. ప్రతిచోటా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పట్టాపై వైఎస్ జగన్ బొమ్మ వేసుకుని పనికిరాని పట్టాలు ఇచ్చారని, ఇవేమన్నా ఆయన సొంత ఆస్తులు ఇస్తున్నారా అంటూ విమర్శించారు.మల్లవల్లి పారిశ్రామికవాడలో సమస్యలు లేవు: మంత్రి టీజీ భరత్మల్లవల్లి పార్కులో సదుపాయాల కొరతతో యాజమాన్యాలు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న విషయంలో వాస్తవం లేదని, అక్కడ ఎలాంటి సమస్యలు లేవని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.మత్స్యకార భరోసా ఇవ్వలేంవ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుమత్స్యకారులకు 2014–19 మధ్య మేలు జరిగితే, గత ఐదేళ్లలో ప్రభుత్వం వారిని నాశనం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈనెల 21న మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేమని, అసలైన అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నామని చెప్పారు. వేట విరామ సమయంలో గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.5 వేలు ఇచ్చేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిని రూ.10 వేలకు పెంచిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఒక్కటీ తప్ప గత ఐదేళ్లలో మత్స్యకారులకు ఏదీ అందలేదన్నారు. గత ఐదేళ్లల్లో 63 మంది వేటకెళ్లి చనిపోతే పరిహారం ఇవ్వలేదన్నారు. కాగా, మత్స్యకారుల అంశంపై ప్రత్యేక చర్చ పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.ఆర్టీసీలో సిబ్బంది క్రమబద్ధీకరణ లేదు: మంత్రి రాంప్రసాద్రెడ్డిఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్లు పోస్టుల కొరత ఉందన్నారు. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించే ప్రతిపాదన లేదన్నారు. ఆన్ కాల్ డ్యూటీ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ విలీనం అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. ఆర్టీసీలో 18 విభాగాల్లో 7,545 పోస్టులు పెండింగ్ ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. గత ప్రభుత్వం ఆన్ కాల్ డ్యూటీ ప్రవేశపెట్టి, అనుభవం లేని డ్రైవర్లను విధుల్లోకి తెస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సిబ్బందిని చిన్న విషయానికి కూడా శిక్షిస్తున్నారని తెలిపారు. ఈహెచ్ఎస్ను పాత విధానంలో అమలు చేయాలని కోరారు. -
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్‌టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్‌ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్‌లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
గుడ్ న్యూస్.. 70 శాతం వరకూ తగ్గనున్న ఔషధాల ధరలు!
న్యూఢిల్లీ: రోగులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఔషధాల ధరలను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రధానంగా క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు సంబంధించిన మందుల ధరల తగ్గనున్నాయి. దీనివల్ల రోగులకు భారీ ఉపశమనం లభించనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, ప్రకటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. మందుల ధరలను నియంత్రించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అంతా అకున్నట్లు జరిగితే వాటి ధరలు 70 శాతం వరకు తగ్గిపోతాయని అధికారులు వెల్లడించారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియనల్ మెడిసిన్(ఎన్ఎల్ఈఎం)–2015ను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. రోగులు దీర్ఘకాలం ఉపయోగించే ఔషధాలపై హై–ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించాలని యోచిస్తోంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు కూడా నిర్వహించింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న 355 మందుల ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఇప్పటికే పరిమితి విధించింది. కొన్ని రకాల షెడ్యూల్డ్ మెడిసిన్లపై ట్రేడ్ మార్జిన్‌ను హోల్‌సేల్ వ్యాపారులకు 8 శాతం, రిటైలర్లపై 16 శాతానికి పరిమితం చేసింది. ఇలాంటి మందుల తయారీదార్లు సీలింగ్ ప్రైస్ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. మిగతా మందుల విషయంలో ఇలాంటి నియంత్రణలు ఏవీ లేవు. కంపెనీలు ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు. ధరలను కంపెనీలే నిర్ధారించుకోవచ్చు. ధరల నియంత్రణ పరిధిలో లేని ఔషధాలపై ట్రేడ్ మార్జిన్లు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆ భారమంతా అంతిమంగా రోగులే భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీలక ఔషధాలను నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వాటి ధరలు చాలావరకు తగ్గిపోతాయి. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
మొద్దు నిద్ర వదలరా
♦ ధరల నియంత్రణ గాలికి... పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ♦ సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం ఉందో, లేదో తెలియని పరిస్థితి ♦ సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు.. విపక్షాల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల మంటలో సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదు. బియ్యం, పప్పు, చింతపండు, ఎండుమిర్చి, ఉల్లి, టమోటా లాంటి నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నా.. ధరలను అదుపుచేసే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిన మంత్రివర్గ ఉపసంఘం.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గడిచిన మూడు నెలల్లో మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి కూడా ధరలపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. ఆ సంఘానికి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అసలు నిత్యావసరాల ధరల నియంత్రణ తమ ప్రభుత్వ బాధ్యతే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిత్యావసరాలపై అప్పటి మంత్రివర్గ ఉపసంఘం ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించేది. కరువు సమయంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కంటింజెన్సీ ప్రణాళిక రూపొం దించేది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఈ దిశగా అసలు ఆలోచనే చేయకపోవడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల వ్యవధిలో పప్పుల ధరలు 3 రెట్లు పెరిగినా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ద్వారా సబ్సిడీ ధరపై విక్రయాలు చేపట్టకపోవడంపై రాజకీయపక్షాలు మండిపడుతున్నాయి. బలవంతపు భూ సమీకరణ గురించి నిత్యం ప్రకటనలు చేస్తున్న మంత్రులకు పెరుగుతున్న నిత్యావరాల ధరలు కనిపించడం లేదా? వాటి నియంత్రణ మంత్రుల బాధ్యత కాదా? ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాజీవనాన్ని విఘాతం కలుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరింది. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కేంద్రాల వద్ద ధర్నాలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ధరల మంటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, వామపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ముందుచూపు ఏదీ? : కరువు వల్ల పప్పు దినుసుల సాగు తగ్గిపోతుందని కిరాణా కొట్టు వ్యాపారి కూడా గ్రహించి పప్పుల ధరలు పెరుగుతాయని గుర్తిస్తాడు. సరుకు అందుబాటులో ఉన్నపుడు వీలైనంత కొని నిల్వ చేసుకుంటాడు. ధరలు పెరగ్గానే అమ్ముకుని లాభాలు ఆర్జిస్తాడు. ఒక చిన్న వ్యాపారికి ఉన్న ముందుచూపు అతి పెద్ద నెట్వర్క్ ఉన్న ప్రభుత్వానికి లేదా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం కారణమా? లేక ధరల నియంత్రణ, పేదలకు సబ్సిడీతో సరఫరా అనే విషయాలు తమకు సంబంధం లేదని ప్రభుత్వం భావిస్తోందా? చెప్పాలని ఆ పక్షాలు నిలదీస్తున్నాయి. బాబు చెప్పిందేమిటి? చేసిందేమిటి? ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అధికారంలోకి రాగానే చంద్రబాబు నీళ్లొదిలారు. ధరలు మండుతున్నా రూ. వెయ్యి కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే పౌరసరఫరాల శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న బాబు.. అధికారంలోకి రాగానే ‘రూ. 175కే 9 నిత్యావసర సరుకుల పంపిణీ పథకాన్ని’ ఎత్తివేశారు. పథకాలను మెరుగుపరచడమంటే ప్రజలకు ఉపయోగంగా ఉన్న పథకాన్ని రద్ధు చేయడమేనా? అని రాజకీయ పక్షాల నేతలు, ప్రజలు నిలదీస్తున్నారు. ఏటా 12 వంట గ్యాస్ సిలిండర్లను రూ. వంద సబ్సిడీతో ఇస్తామన్న హామీకి నీళ్లొదిలారు. గతంలో ఉన్న రూ. 25 సబ్సిడీకి కూడా మంగళం పాడారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు నేడు చుక్కలు చూపిస్తున్నారు. ధరల మంటపై నేడు వెఎస్సార్సీపీ ధర్నాలు సాక్షి, హైదరాబాద్: వినియోగదారులను హడలెత్తిస్తూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ఈ నెల 2న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని సంకల్పించింది. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఈ ధర్నాల్లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. అక్టోబర్ 30న పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ సీజన్లో సైతం సామాన్యులు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక కుటుంబం సగటు ఖర్చులు 80 శాతం పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.