మొద్దు నిద్ర వదలరా | The state government would control prices | Sakshi
Sakshi News home page

మొద్దు నిద్ర వదలరా

Published Mon, Nov 2 2015 1:22 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

మొద్దు నిద్ర వదలరా - Sakshi

మొద్దు నిద్ర వదలరా

♦ ధరల నియంత్రణ గాలికి... పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
♦ సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం ఉందో, లేదో తెలియని పరిస్థితి
♦ సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు..  విపక్షాల ఆగ్రహం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల మంటలో సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదు. బియ్యం, పప్పు, చింతపండు, ఎండుమిర్చి, ఉల్లి, టమోటా లాంటి నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నా.. ధరలను అదుపుచేసే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిన మంత్రివర్గ ఉపసంఘం.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గడిచిన మూడు నెలల్లో మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి కూడా ధరలపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. ఆ సంఘానికి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అసలు నిత్యావసరాల ధరల నియంత్రణ తమ ప్రభుత్వ బాధ్యతే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిత్యావసరాలపై అప్పటి మంత్రివర్గ ఉపసంఘం ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించేది. కరువు సమయంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కంటింజెన్సీ ప్రణాళిక రూపొం దించేది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఈ దిశగా అసలు ఆలోచనే చేయకపోవడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల వ్యవధిలో  పప్పుల ధరలు 3 రెట్లు పెరిగినా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ద్వారా సబ్సిడీ ధరపై విక్రయాలు చేపట్టకపోవడంపై రాజకీయపక్షాలు మండిపడుతున్నాయి. 

బలవంతపు భూ సమీకరణ గురించి నిత్యం ప్రకటనలు చేస్తున్న మంత్రులకు పెరుగుతున్న నిత్యావరాల ధరలు కనిపించడం లేదా? వాటి నియంత్రణ మంత్రుల బాధ్యత కాదా? ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాజీవనాన్ని విఘాతం కలుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరింది. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కేంద్రాల వద్ద ధర్నాలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ధరల మంటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, వామపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి.

 ముందుచూపు ఏదీ? : కరువు వల్ల పప్పు దినుసుల సాగు తగ్గిపోతుందని కిరాణా కొట్టు వ్యాపారి కూడా గ్రహించి పప్పుల ధరలు పెరుగుతాయని గుర్తిస్తాడు. సరుకు అందుబాటులో ఉన్నపుడు వీలైనంత కొని నిల్వ చేసుకుంటాడు. ధరలు పెరగ్గానే అమ్ముకుని లాభాలు ఆర్జిస్తాడు. ఒక చిన్న వ్యాపారికి ఉన్న ముందుచూపు అతి పెద్ద నెట్‌వర్క్ ఉన్న ప్రభుత్వానికి లేదా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం కారణమా? లేక ధరల నియంత్రణ, పేదలకు సబ్సిడీతో సరఫరా అనే విషయాలు తమకు సంబంధం లేదని ప్రభుత్వం భావిస్తోందా? చెప్పాలని ఆ పక్షాలు నిలదీస్తున్నాయి.

 బాబు చెప్పిందేమిటి? చేసిందేమిటి?
 ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అధికారంలోకి రాగానే చంద్రబాబు నీళ్లొదిలారు. ధరలు మండుతున్నా రూ. వెయ్యి కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే పౌరసరఫరాల శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న బాబు.. అధికారంలోకి రాగానే ‘రూ. 175కే 9 నిత్యావసర సరుకుల పంపిణీ పథకాన్ని’ ఎత్తివేశారు. పథకాలను మెరుగుపరచడమంటే ప్రజలకు ఉపయోగంగా ఉన్న పథకాన్ని రద్ధు చేయడమేనా? అని రాజకీయ పక్షాల నేతలు, ప్రజలు నిలదీస్తున్నారు. ఏటా 12 వంట గ్యాస్ సిలిండర్లను రూ. వంద సబ్సిడీతో ఇస్తామన్న హామీకి నీళ్లొదిలారు. గతంలో ఉన్న రూ. 25 సబ్సిడీకి కూడా మంగళం పాడారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు నేడు చుక్కలు చూపిస్తున్నారు.  
 
 ధరల మంటపై నేడు వెఎస్సార్‌సీపీ ధర్నాలు
 సాక్షి, హైదరాబాద్: వినియోగదారులను హడలెత్తిస్తూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ ఈ నెల 2న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని సంకల్పించింది. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఈ ధర్నాల్లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. అక్టోబర్ 30న పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ సీజన్‌లో సైతం సామాన్యులు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక కుటుంబం సగటు ఖర్చులు 80 శాతం పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో  వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement