సంకాంత్రి పండుగ ముందే నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజలు మండిపడుతున్నారు. సగం సరుకులు కూడా కొనలేకపోతున్నామని వాపోతున్నారు. –సాక్షి, నెట్‌వర్క్
సరుకుల ధరలు భారీగా పెరిగాయి..
గతేడాదితో పోలిస్తే బియ్యం. గోధుమ పిండి, వంటనూనెలు, బెల్లం, చక్కెర, నెయ్యి వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. నూనె ధరలు మరికాస్త పెరిగాయి. వంట నూనెల కొనుగోళ్లు తగ్గాయి. ధరలు పెరగటం వల్ల ప్రజలు పిండివంటలు తగ్గించారు. సామాన్య ప్రజలు అయితే పండుగ సరుకులు కొనటానికి వెనకాడుతున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది లాభాలు తగ్గాయి. తెచ్చిన ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నాం – కుసుమ తారాబాయి, తిలక్‌రోడ్డు, వరంగల్
అన్ని రకాల పిండివంటలు చేసుకోలేకపోయాం..
సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటాం. పాఠశాల లకు సెలవులు రావడంతో మూడు రోజులముందే బంధువులు ఇంటికి వచ్చారు. వారు వచ్చేలోపే అన్ని సిద్ధం చేసి ఉంచాలనే ఆలోచనతో పిండివంటల తయారీలో మునిగిపోయాం. సరుకుల ధరలు పెరగడంతో అన్ని రకాల పిండివంటలు చేయలేకపోతున్నాం. – బి.రమేష్, ఫోర్ట్ రోడ్డు, వరంగల్
నిత్యావసర ధరలు తగ్గించాలి..
పండుగ చేసుకోవాలనుకుంటు న్నా.. పెరిగిన ధరలతో ఏమి కొనేటట్టు లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడంతో ఆశించినంతగా చేతిలో ఆదాయం లేకపోవడంతో కూడా గ్రామాల్లో పండుగ వాతావరణం కళ తప్పింది. ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – గొట్టిముక్కల సాంబరాజు, వేలేరు, హనుమకొండ జిల్లా
గిరాకీ లేదు, సరుకులు తేలే..
రోజుకు 7 నుంచి 8 ట్రిప్పులు నడిచే ఆటో ఇప్పుడు జీరో టికెట్ వల్ల సగానికి పడిపోయింది. ఫైనాన్స్‌కు సరిపోయే డబ్బులు కూడా వస్తలేవు. సంక్రాంతి పండుగకు నాలుగు రోజుల ముందుగానే బిజీగా ఉండాల్సిన సమయంలో గిరాకీ లేక కాలక్షేపం చేస్తున్న. ఒకప్పుడు అన్నీ ఖర్చులు పోను రోజుకు రూ.1,200, రూ.1,400 వచ్చేవి.. ఇప్పుడు రూ.400 మిగలడం లేదు. గత ఏడాది పండుగతో పోల్చితే, ఈసారి ఏమాత్రం లాభం లేదు. ఇంట్లో కనీసం సరుకులు కూడా తేలేదు. – కె.ప్రభాకర్, ఆటోడ్రైవర్, జనగామ
పండుగ గిరాకీ ఈసారి అంతంత మాత్రమే..
సంక్రాంతి పండుగ వాతావరణం పల్లెల్లో అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కిరాణా షాపుల్లో గిరాకీ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువే. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు కూడా పిండి వంటలపై ఆసక్తిని తగ్గించుకున్నారు. అరకొరగా చేసుకుంటున్నారు. దీంతో గిరాకీ మామూలుగానే ఉంటుంది. – కొయ్యడ రవీందర్, ఓ మార్ట్ యాజమాని, వేలేరు
సగానికి పడిపోయింది
సంక్రాంతి సీజన్‌లో రోజుకు రూ.70 వేల వరకు సరుకులు అమ్మేది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో రోజుకు రూ. 35 వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. గతంతో పోల్చితే ధరలు పెరగడం ఒక కారణం అయితే మాల్స్, సూపర్ మార్కెట్‌లతోపాటు ఆన్‌లైన్‌తో మా గిరాకీ పూర్తిగా పడిపోయింది. - చంద్రశేఖర్, కిరాణా షాప్ యజమాని, సిద్దిపేట
ధరలు పెరిగిపోయాయి....
నిత్యావసర సరుకుల ధరలు భాగా పెరిగి పోయాయి. దీంతో ఖర్చు ఎక్కువైంది. పప్పులు, నూనెలకు ధరలు పెరగడంతో పిండివంటలు చేసుకోవాలంటేనే భయమేస్తుంది. మాది పెద్ద కుటుంబం...మా పిల్లల కోసం సంక్రాంతికి అప్పాలు చేయాలి. ఇతర ఖర్చులు తగ్గించుకొని గతేడాది కంటే తక్కువగా అప్పాలు చేసుకుంటున్నాం. – చంద్రకళ, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment