జూన్‌తో పోలిస్తే అధికంగా ఉన్నాయి
ఉల్లి 87 శాతం, పామాయిల్ 33 శాతం పెరిగినట్టు ప్రకటన
అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేసిన మంత్రి
సంబంధిత శాఖ ద్వారా రాత పూర్వక సమాధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినట్టు ప్రభుత్వం శాసన సభలో అంగీకరించింది. కీలకమైన నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయా అంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, దాసరి సుధ అడిగిన ప్రశ్నను ప్రశ్నోత్తరాల సమయం షెడ్యూల్‌లో ఉంచినప్పటికీ సంబంధిత మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేశారు.
సంబంధిత విభాగం ద్వారా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. జూన్‌తో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగినట్లు ప్రభుత్వం ఆ సమాధానంలో తెలిపింది. శనగపప్పు 17 శాతం, సన్‌ఫ్లవర్ నూనె 21 శాతం, పామాయిల్ 33 శాతం, ఉల్లిపాయలు 87 శాతం ధరలు పెరిగినట్టు ప్రకటించింది. రైతుబజార్లలో సబ్సిడీపై సరుకులను అందిస్తున్నామంది.
అతిసార మృతుల కుటుంబాలకు పరిహారం లేదు
సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. విజయనగరం జిల్లాలో ఇటీవల అతిసారతో మరణించిన వ్యక్తుల వివరాలు చెప్పాలని, వారికి ఎలాంటి పరిహారం ఇస్తారో చెప్పాలని అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పినట్టే భావించాలని స్పీకర్ ప్రకటించారు. అయితే, నలుగురు మాత్రమే అతిసారతో చనిపోయారని, వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
రీసర్వేలో తప్పుచేసిన అధికారులను శిక్షిస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని 22ఏ నుంచి తొలగించారని, ఇందులో అక్రమాలు జరిగాయని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 25 వేల రిజిస్ట్రేషన్లలో 8 వేల వరకు తప్పు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామన్నారు. గత ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు అసైనీలను బెదిరించి లాక్కోవడమే కాకుండా రిజిస్ట్రేషన్లు త్వరగా చేసుకునేందుకు జీవోలు కూడా ఇచ్చారన్నారు.
నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి, విశాఖలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, అందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తెస్తున్నట్టు చెప్పారు. 70 వేలకుపై అర్జీలు రీ సర్వేపైనే వచ్చాయన్నారు. రీ సర్వే పూర్తయిన 6,700 గ్రామాల్లో సభలు పెట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు. వాటిన్నింటినీ పాత పద్ధతిలో వెబ్‌ల్యాండ్‌లో పెట్టి రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. తప్పు చేసిన అధికారులను కూడా శిక్షిస్తామని చెప్పారు. ఇనాం భూములపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి న్యాయం చేస్తామన్నారు.
సర్వే చేసి హౌసింగ్ బిల్లులు చెల్లిస్తాం: గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి
గత ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు హౌసింగ్ ప్రోగ్రామ్ మచ్చుతునక అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బిల్లులను నిలిపివేసిందని, గ్రామాల్లో ఇళ్ల పరిస్థితిపై సర్వే చేసిన అనంతరం పాత బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. విశాఖలో గృహాల నిర్మాణం 2026 మార్చికి పూర్తి చేస్తామన్నారు.
జగనన్న కాలనీల్లో లోన్లు ఎక్కడా బలవంతంగా తీసుకోలేదని, 52 వేల మంది బ్యాంకు రుణాలు తీసుకున్నారని, ఈ మొత్తం కలెక్టర్ వద్దే ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో యూఎల్బీలో యూనిట్ ధర తగ్గించడంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వీటిలో ఎక్కడా తప్పులు జరగలేదని మంత్రి వివరించారు.
వైఎస్ జగన్‌ని దూషించిన బుచ్చయ్య చౌదరి
జగనన్న కాలనీ ఇళ్లను ప్రస్తావిస్తూ రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. జగనన్న కాలనీల పేరుతో వేల ఎకరాలు కొని, అన్యాక్రాంతం చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. ఆ భూములు నిర్మాణాలకు ఉపయోగపడవన్నారు. ప్రతిచోటా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పట్టాపై వైఎస్ జగన్ బొమ్మ వేసుకుని పనికిరాని పట్టాలు ఇచ్చారని, ఇవేమన్నా ఆయన సొంత ఆస్తులు ఇస్తున్నారా అంటూ విమర్శించారు.
మల్లవల్లి పారిశ్రామికవాడలో సమస్యలు లేవు: మంత్రి టీజీ భరత్
మల్లవల్లి పార్కులో సదుపాయాల కొరతతో యాజమాన్యాలు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న విషయంలో వాస్తవం లేదని, అక్కడ ఎలాంటి సమస్యలు లేవని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
మత్స్యకార భరోసా ఇవ్వలేం
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
మత్స్యకారులకు 2014–19 మధ్య మేలు జరిగితే, గత ఐదేళ్లలో ప్రభుత్వం వారిని నాశనం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈనెల 21న మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేమని, అసలైన అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నామని చెప్పారు.
వేట విరామ సమయంలో గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.5 వేలు ఇచ్చేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దానిని రూ.10 వేలకు పెంచిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఒక్కటీ తప్ప గత ఐదేళ్లలో మత్స్యకారులకు ఏదీ అందలేదన్నారు. గత ఐదేళ్లల్లో 63 మంది వేటకెళ్లి చనిపోతే పరిహారం ఇవ్వలేదన్నారు. కాగా, మత్స్యకారుల అంశంపై ప్రత్యేక చర్చ పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
ఆర్టీసీలో సిబ్బంది క్రమబద్ధీకరణ లేదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
ఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్లు పోస్టుల కొరత ఉందన్నారు. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించే ప్రతిపాదన లేదన్నారు. ఆన్ కాల్ డ్యూటీ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ విలీనం అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. ఆర్టీసీలో 18 విభాగాల్లో 7,545 పోస్టులు పెండింగ్ ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు.
గత ప్రభుత్వం ఆన్ కాల్ డ్యూటీ ప్రవేశపెట్టి, అనుభవం లేని డ్రైవర్లను విధుల్లోకి తెస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సిబ్బందిని చిన్న విషయానికి కూడా శిక్షిస్తున్నారని తెలిపారు. ఈహెచ్‌ఎస్‌ను పాత విధానంలో అమలు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment