
2024లో 500 సినిమాలు ఓటీటీ ద్వారానే విడుదల
డిజిటల్ మీడియా రంగంలో ఏటా 7 శాతం వృద్ధి
2027 నాటికి 6.50 కోట్ల ఇళ్లల్లో ఓటీటీ వీక్షణం
ఐదేళ్లలో రెట్టింపైన డిజిటల్ వినోద మీడియా ఆదాయం
ఫిక్కీ–ఎర్నెస్ట్ యంగ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: సినిమా చూడాలంటే థియేటర్‌కే వెళ్లాలనే రోజులకు కాలం చెల్లుతోంది. ఓటీటీ (ఓవర్ ద టాప్)ల్లో సినిమాలకే ఆదరణ పెరుగుతోంది. వినోదమంటే టీవీ చానళ్లు చూడాలనే రోజులు ఇక గతమే. వినోదం కోసం ప్రజలు డిజిటల్ మాధ్యమాలవైపే మొగ్గు చూపుతున్నారు. సినిమాలు, టీవీ చానళ్ల స్థానాన్ని డిజిటల్ మీడియా కబళిస్తోంది. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవంతో డిజిటల్ మీడియా ప్రజల ఇళ్లల్లోకే దూసుకువస్తోంది.
ఇది స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చేస్తోంది. డిజిటల్ మీడియా ఏటా సగటున 7 శాతం వృద్ధి సాధిస్తోంది. రానున్న కాలంలో వినోద రంగం అంటే డిజిటల్ మీడియాదేనని ‘ఫిక్కీ–ఎర్నెస్ట్ యంగ్ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది. వీక్షకుల ఆదరణే కాదు ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోందని తెలిపింది.
టీవీని అధిగమిస్తున్న స్మార్ట్ ఫోన్
దేశంలో టీవీల ద్వారా వినోద కార్యక్రమాల వీక్షణం కంటే స్మార్ట్ ఫోన్ల ద్వారానే అధికంగా వినోద కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్, రియాల్టీ షోలు, క్రికెట్, ఇతర స్పోర్ట్స్ మొదలైవన్నీ కూడా టీవీల్లో కంటే స్మార్ట్ ఫోన్లలోనే వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి మున్ముందు మరింతగా పెరుగుతుంది.
ఓటీటీ విప్లవం
సినిమాలను థియేటర్ల కంటే ఓటీటీల్లో చూసేందుకే ఆసక్తి పెరుగుతోంది. 2024లో దేశంలో 1,600 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 500 సినిమాలు కేవలం ఓటీటీల్లోనే విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న కాలంలో ఓటీటీల్లో మాత్రమే విడుదలయ్యే సినిమాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. 2027 నాటికి దేశంలో 6.50 కోట్ల ఇళ్లల్లో ఓటీటీ చానళ్లు చూస్తారు.
ఆదాయంలోనూ డిజిటల్ మీడియా జోరు
వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోంది. టీవీల్లోకంటే డిజిటల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. డిజిటల్ మీడియా, టీవీలు, షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా మొదలైన వాటిని కలిపి వీడియో వినోద రంగంగా పరిగణిస్తారు. వాటిలో అత్యధిక ప్రకటనల ఆదాయం ఎన్నో దశాబ్దాలుగా టీవీ రంగానికే దక్కేది.
కానీ.. ఐదేళ్లుగా డిజిటల్ మీడియా అనూహ్యంగా దూసుకువస్తోంది. 2019లో దేశంలో మీడియా, వినోద రంగం ప్రకటనల ద్వారా రూ.1.90 లక్షల కోట్లు ఆదాయం సాధించింది. 2024లో అది మరింత పెరిగి రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం రాబట్టింది. 2027 నాటికి రూ.3.1 లక్షల కోట్లు రాబడి సాధించవచ్చని అంచనా.
