భారీగా పెరుగుతున్న ఓటీటీ వీక్షకుల సంఖ్య
మల్టీఫ్లెక్స్‌లు పెరగడంతో థియేటర్‌కు దూరమైన మధ్యతరగతి ప్రజలు
ఒక సినిమాకు అయ్యే ఖర్చుతో ఏడాది పాటు రెండు ఓటీటీ స్ట్రీమింగ్‌లు
2023తో పోల్చితే 21 శాతం పెరిగిన ఓటీటీ సబ్‌స్క్రైబర్స్
ఓటీటీల ద్వారా స్మార్ట్‌ఫోన్, టీవీల్లో సినిమాలు, వెబ్‌సిరిస్‌లు చూస్తున్న వైనం
క్యూ ఎల్‌ఈడీ, ఫోర్‌కే వంటి క్వాలిటీ టీవీల రాకతో థియేటర్ ఎక్స్‌పీరియన్స్
వినోదం అంటే దాదాపు అందరికీ ఫస్ట్ ఛాయిస్ సినిమానే! ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఎన్ని ఉన్నా ఇప్పటికీ సినిమా క్రేజ్ తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలు చూసేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చూసే విధానం మారుతోంది. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతూ ఓటీటీల్లో వీక్షించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్నెట్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు దూసుకురావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ తీరు పూర్తిగా మారిపోయింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఒక సినిమాకు ఒక ఫ్యామిలీ వెళ్తే అయ్యే ఖర్చుతో రెండు ఓటీటీ యాప్‌లలో ఏడాది పాటు సినిమాలు చూడొచ్చు. వీడియో, ఆడియో థియేటర్ క్వాలిటీతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ‘ఎంటర్‌టైన్‌మెంట్’ ఇంట్లోనే ఆస్వాదించే అవకాశం ఉండటంతో అధికశాతం మంది ఓటీటీకి జై కొడుతున్నారు. – సాక్షిప్రతినిధి, కర్నూలు
వెండితెర!... సినిమా స్క్రీన్‌కు సినీ ప్రియులు పెట్టిన పేరు! 50 ఏళ్ల కిందట వినోదం అంటే డ్రామాలు, సినిమాలు! అభిమాన హీరో సినిమా వస్తోందంటే చెప్పలేని హడావుడి. అయితే ప్రస్తుతం ప్రేక్షకుడి తీరు మారింది. థియేటర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఖర్చు పెరగడమే! మలి్టఫ్లెక్స్ల రాకతో వెండితెర సగటు ప్రేక్షకుడికి అందనంత దూరం వెళ్లింది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్లాలంటే రిక్లైనర్‌సీట్లకు రూ.295 చొప్పున రూ.1180. ట్యాక్స్‌లతో కలిపి రూ.1312.16 అవుతుంది.
అదే కొత్త సినిమా అయితే ఒక్కో టిక్కెట్ రూ.400పైమాటే! దీనికి బ్రేక్ టైంలో స్నాక్స్ ఖర్చు అదనం. సామాన్య ప్రజలు ఇంత డబ్బు ఖర్చు చేయాలంటే కష్టమే! దీంతో సినిమా కూడా సామాన్యులకు అందకుండా ఖరీదైన వినోదం అయిపోయింది. అయితే అదే సమయంలో సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదేంటి అనుకుంటున్నారా...అవును ఓటీటీ స్ట్రీమింగ్! ఓటీటీల ఎంట్రీతో ‘ఎంటర్‌టైన్‌మెంట్’ ‘షో’ పూర్తిగా మారిపోయింది.
ఎప్పుడు వీలైతే, అప్పుడు ‘సినిమా’!..
వీడియో, ఆడియో క్వాలిటీని ఎంజాయ్ చేయాలంటే థియేటర్‌లోనే సినిమా చూడాలనుకునేవాళ్లం. ఇప్పుడు 4కే, క్యూ ఎల్‌ఈడీ లాంటి టీవీలు వచ్చాయి. అందులోనూ 65, 75 ఇంచుల్లో పెద్ద టీవీలూ ఉన్నాయి. కొన్ని థియేటర్ల కంటే ఈ టీవీల్లో ఆడియో, వీడియో క్వాలిటీ బాగుంటోంది. దీంతో ఇంట్లో కూడా ‘థియేటర్ ఎక్స్‌పీరియన్స్’ వస్తోంది.
పైగా ఇప్పుడు ‘హోం థియేటర్ కల్చర్’ పెరిగింది. కొత్తగా నిరి్మంచే ఇళ్లలో చాలామంది ‘హోంథియేటర్’ నిరి్మస్తున్నారు. థియేటర్‌కు వెళ్లాలంటే నిర్దేశిత సమయం కేటాయించాలి. ఉద్యోగస్తులు, వ్యాపారులకు సినిమాపై కోరిక ఉన్నా వీలుండదు. వీరంతా ఓటీటీ కేటగిరీలో ఉన్నారు. కొందరు ఒకే సినిమాను రోజూ కొద్ది కొద్దిగా 2–3 రోజుల్లో చూస్తున్నారు. ఇలా ఓటీటీ ప్లాట్‌ఫాం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది.
ఎంటర్‌టైన్ మెంట్‌ను మార్చేసిన కోవిడ్
కోవిడ్ సమయంలో థియేటర్‌కు వెళ్లడం తగ్గింది. ఒకదశలో ‘సినిమా’ మనుగడ కష్టమే! అనే చర్చ నడిచింది. ఈ విపత్తు నుంచి పుట్టుకొచ్చిందే ఓటీటీ ప్లాట్‌ఫాం! అంతకు ముందు కూడా ఉన్నా, కోవిడ్ నుంచి ఓటీటీ సంఖ్య, స్ట్రీమింగ్ పెరిగాయి. అమెజాన్‌ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సన్‌నెక్ట్స్, జీ5, సోనీలివ్‌తో పాటు దేశవ్యాప్తంగా 46 ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.
వీటి స్ట్రీమింగ్ ఖర్చు కూడా చాలా తక్కువ. అమెజాన్ ప్రైమ్ ఏడాది స్ట్రీమింగ్ రూ.1499. ఆహా గోల్డ్ ఏడాది సబ్‌్రస్కిప్షన్ రూ.699. రెండు కలిపినా రూ.2,198! ఒక ఫ్యామిలీ, ఒక సినిమాకు వెళ్లే ఖర్చుకంటే తక్కువ! దాదాపు అన్ని ఓటీటీ ఏడాది సబ్‌్రస్కిప్షన్ రేట్లు కూడా రూ,.1500లోపే ఉన్నాయి. దీంతో ప్రజలు థియేటర్‌కు వెళ్లడం తగ్గించి, ‘టీవీ రిమోట్’ చేతిలో పట్టుకుంటున్నారు.
ఒక సర్వే ప్రకారం, సినిమాను థియేటర్‌లో చూసేవారి సంఖ్య కంటే, ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత చూసేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు పెద్ద హీరోలు కూడా రియాలీ్టషోల్లో నటించి, వాటిని ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. చివరకు క్రికెట్‌తో పాటు ఇతర స్పోర్ట్స్ కూడా ఓటీటీల్లో లైవ్ ఇస్తున్నారు. దీన్నిబట్టే ఓటీటీ ఏస్థాయికి వెళ్లిందో తెలుస్తోంది. 2022తో పోల్చితే 2023లో 13.8శాతం ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ పెరిగితే, 2024లో ఇప్పటివరకూ 21 శాతం పెరిగారు.
5జీతో పెరిగిన ఇంటర్నెట్ వేగం!
5 జీ రాకతో ఇంటర్నెట్ వేగం కూడా పెరిగింది. పైగా రూ.351కే 40ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందుతోంది. ఓటీటీల విస్తృతికి ప్రధాన కారణం ఇంటర్నెట్ వినియోగమే! టీనేజర్ల నుంచి పెద్దల దాకా దాదాపు అందరూ ‘స్మార్ట్‌ఫోన్’ యూజర్లే! వీరంతా ఇంటర్నెట్ యూజర్లు కూడా! దీంతో మొబైల్‌లో ఓటీటీయాప్ల ద్వారా వినోదం చూస్తున్నారు. ఓటీటీలపై అవగాహన ఉన్న వారంతా రెండు ఓటీటీయాప్‌లకు తక్కువ లేకుండా చూస్తున్నారు. కేబుల్‌రంగంలో ఇంటర్నెట్ హవా పెరిగింది. ఎక్కువగా వైఫై ద్వారానే కేబుల్ ప్రసారాలు చేస్తున్నారు.
వెబ్‌సిరిస్‌లపై ఆసక్తి!..
ప్రస్తుతం సినిమాకు ధీటుగా ‘వెబ్‌సిరీస్’ లు వచ్చాయి. పెద్ద దర్శకులు, పేరున్న నటులు వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. పైగా సినిమా 2.30గంటలు చూడాలి. వెబ్‌సిరీస్ 40 నుంచి 60 నిమిషాలే. పైగా ఇవి ఓటీటీ రిలీజ్‌లు. దీంతో ఎక్కువమంది వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య 82.5శాతం ఉంటే, వెబ్‌సిరీస్‌లు చూసేవారి సంఖ్య 68.7శాతం ఉంది.
అంటే వెబ్‌సిరిస్ కంటే సినిమాలు చూసే వారి సంఖ్య కేవలం 13.8 శాతం మాత్రమే అధికం! 2022లో హిందీలో 72, తెలుగులో 56 వెబ్‌సిరీస్‌లు విడుదలయ్యాయి. ఈ సంఖ్య ఈ ఏడాది 3 నుంచి 5 రెట్లు పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అంచనా. ఓటీటీల రాకతో పైరసీలకు చెక్‌పడింది.
Comments
Please login to add a commentAdd a comment