పెరుగుతున్న హోమ్ థియేటర్ కల్చర్
ఇంటి వద్దనే నచ్చిన సినిమా చూసే వెసులుబాటు
ఆసక్తి చూపిస్తున్న సంపన్నవర్గాలు
యువతకు ఉపాధి మార్గంగా పట్టణాల్లో వెలుస్తున్న ప్రైవేట్ థియేటర్లు
గంటకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు అద్దె
సాక్షి, భీమవరం: వెండితెర వినోదం కొత్త పుంతలు తొక్కుతోంది. టూరింగ్ టాకీస్ రోజుల్లో కొత్త సినిమాలు పట్టణాల్లో మాత్రమే విడుదలయ్యేవి. అప్పట్లో ఎడ్ల బళ్లు కట్టుకుని మరీ ఇంటిళ్లపాది వెళ్లి చూసి వచ్చేవారు. కాలం మారింది. ఇప్పుడు ఎంత పెద్ద హిరో సినిమా అయినా నెలరోజుల్లోనే ఓవర్ ది టాప్ (ఓటీటీ)లో వస్తుంటే ఆధునిక పరిజ్ఞానం హోమ్ థియేటర్ల రూపంలో వెండితెరను ఇంటికే తెస్తోంది. థియేటర్‌లో చూసిన అనుభూతిని అందిస్తోంది.
కొన్నాళ్లు నగరాలకే పరిమితమైన ఈ హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్నిప్రాంతాలకూ విస్తరిస్తోంది. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడగా ఇళ్లకే పరిమితమైన జనానికి ఓటీటీనే ఏకైక వినోద సాధనమైంది. సినిమాలు నేరుగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్‌స్టార్, ఆహా, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ కావడం మొదలైంది. చౌక ప్లాన్లు, ఇంటిళ్లిపాది చూసే అవకాశం ఉండటంతో కొద్ది రోజుల్లోనే వీటికి ఆదరణ అమాంతం పెరిగిపోయింది.
ఇంట్లోనే థియేటర్ అనుభూతి
గతంలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే కనిపించే హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. సంపన్న వర్గాలతో పాటు కాస్తోకూస్తో డబ్బున్న వారు కూడా వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. హోం థియేటర్ సెట్ చేయడానికి కనీసం 10 గీ 15 అడుగుల విస్తీర్ణం కలిగిన హాల్ ఉండాలి.
నాణ్యమైన సౌండ్ సిస్టమ్, స్క్రీన్, అభిరుచికి తగ్గట్టుగా సిట్టింగ్, ఇంటీరియర్ డికరేషన్‌ను బట్టి హోం థియేటర్‌కు రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. స్క్రీన్, ప్రొజెక్టర్, యాంప్లిఫయర్, స్పీకర్స్, సౌండ్ ప్రూఫింగ్ తదితరాలను అమర్చుతారు. అధికశాతం మంది రూ.5 లక్షల వరకు వెచ్చిస్తుండగా, కొందరు రూ.10 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు టెక్నీషియన్స్ చెబుతున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 300కు పైగా హోమ్ థియేటర్లు ఉన్నాయంటున్నారు. తాజాగా ఏలూరు సమీపంలోని 150 విల్లాల్లో కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా హోం థియేటర్లు సిద్ధం చేస్తున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఒక హోం థియేటర్స్ అధినేత ఆర్‌ఎస్‌ఎస్ మూర్తి తెలిపారు.
ప్రైవేట్ థియేటర్లకు పెరుగుతున్న ఆదరణ
వినోదానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో సినిమాలు చూసేందుకు, ఈవెంట్స్, ప్రత్యేక వేడుకల కోసం మినీ థియేటర్లకు ఆదరణ పెరుగుతోంది. పది మంది లేదా కుటుంబ సభ్యులతో నిర్వహించే బర్త్‌డే పార్టీలు, ఇతర వేడుకలకు ఇవి అనువుగా ఉంటున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ఇవి ట్రెండింగ్‌గా మారాయి. స్క్రీన్, సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, పది మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్, ఇంటీరియర్‌తో ఆకర్షణీయంగా వీటిని తయారుచేస్తున్నారు.
30 X 20 చ.అడుగులు మొదలుకొని కొంత స్థలంలో మినీ హోం థియేటర్లు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఔత్సాహిక యువత ఉపాధి పొందుతున్నారు. ఇటీవల ఈ తరహా మినీ థియేటర్లు భీమవరంలో ఐదు వరకు వచ్చాయి. సీజన్‌ను బట్టి గంటకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు వీటికి అద్దె ఉంటుంది. మరో పక్క యువతను ఆకర్షించేందుకు జ్యూస్, ఐస్‌క్రీం పార్లర్లు, హోటళ్లలోను హోం థియేటర్ల ఏర్పాటుకు వ్యాపారులు ప్రాధాన్యమిస్తున్నారు.
ఈవెంట్ల కోసం ఇటీవల కాలంలో ప్రైవేట్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భీమవరంలోని మా మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్‌లో ఏర్పాటుచేసిన మినీ థియేటర్‌కు ఆదరణ బాగుంది. గంటల చొప్పున థియేటర్‌ను రెంట్‌కు ఇస్తుంటాం.
–జి.కృష్ణంరాజు, మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment