చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్‌లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్‌రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.
రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్‌ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment