సాక్షి, హైదరాబాద్: దేశ వాప్తంగా టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ విన్నా టమోట పేరే వినపడుతోంది. ఎక్కడ చూసినా టమాటా చర్చలే. గతంలో ఎన్నడూ లేనంతగా కేజీ టమాటా ధర రూ. 200కి చేరి సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ధరలు పెరిగిపోవడంతో టమాట దొంగతనాలు, పంటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి తలెత్తింది. అయితే ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు.
అయితే దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా దిగుబడి పెరగడంతో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం వరకు రూ.4,300 పలికిన 23 కేజీల బాక్సు ధర ప్రస్తుతం రూ. 2,300కి తగ్గింది. నాణ్యతను బట్టి బాక్సు ధర రూ.1500 నుంచి రూ.2,300 వరకు పలుకుతున్నది. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 60-100 మధ్య పలుకుతోంది. బయట మార్కెట్లో మాత్రం రూ. 100-140 మధ్య ఉంది.
పది రోజుల క్రితం హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్‌కు 850 క్వింటాళ్ల టమాటా రాగా సోమవారం ఏకంగా 2,450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్‌కు టమాటాలు వస్తున్నాయి. దీనికితోడు రంగారెడ్డి, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటాలు పోతెత్తడంతో ధర తగ్గుముఖం పట్టింది. ఈ నెలాఖరుకు కిలో టమాటా రూ. 50కి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
టమాటాలపై నిఘా కోసం పొలంలో సీసీ కెమెరా
ఔరంగాబాద్: మహారాష్ట్రలో ఓ రైతు ఏకంగా తన టమాట పొలంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపూర్ బంజర్‌కు చెందిన రైతు శరద్ రాటేకు ఐదెకరాల సాగుభూమి ఉంది. ఒకటిన్నర ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఆ పంటను కాపాడుకోవడానికి పొలంలో డిజిటల్ నిఘాను ఏర్పాటు చేశారు. దానిని ఫోన్‌కు అనుసంధానించి ఫోన్‌లో ఎక్కడైనా విజువల్స్‌ని తనిఖీ చేస్తున్నారు.
ఇటీవల టమాటా తోటపై దొంగలు దాడి చేసి 20 నుంచి 25 కిలోల టమాటాలు ఎత్తుకుపోవడంతో తాను ఈ చర్యలు తీసుకున్నానన్నారు. ఈ రోజు అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయ అయిన టమాటాలను కోల్పోవడం తాను భరించలేనని చెప్పారు. 22–25 కిలోల టమాటా ఇప్పుడు రూ.3 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కెమెరా సౌరశక్తితో నడుస్తుందని, దాని విద్యుత్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment