సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు టమాటా రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. ఆరేడు క్వింటాళ్లకు మించకపోవంతో రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడం, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నగరంలోని బహిరంగ మార్కెట్లో ట‘మోత’ మోగుతోంది. ప్రస్తుతం సైజు, కలర్‌ను బట్టి కేజీ ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
(చదవండి: Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు?)
రైతుకు నష్టం.. కొనుగోలు కష్టం..
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14,173.05 ఎకరాల్లో కూరగాయల సాగవుతోంది. ఇందులో 5,827.03 ఎకరాల్లో టమాటా వేశారు. ఇటీవల ఏకధాటి వర్షాలతో పంట చేలోనే కుళ్లిపోయింది. టమాటా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోయే ప్రమాదం ఉండటంతో వచ్చిన పంటను వచ్చినట్లే మార్కెట్‌కు సరఫరా చేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో ప్రస్తుతం ఆశించిన మేర దిగుబడి రావడం లేదు.
అవసరం కొండంత.. దిగుబడి గోరంత..
► గ్రేటర్‌లో రోజుకు సగటున 350 నుంచి 380 టన్నుల టమాటా అవసరమవుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రంగారెడ్డి సహా ఇతర శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఆధించిన స్థాయిలో దిగుమతి కావడం లేదు. నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, మాదన్నపేట, ఎర్రగడ్డ, ఎల్బీనగర్ మార్కెట్లకు రోజుకు సగటున 150 నుంచి 180 టన్నులకు మించి రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
► కేవలం టమాటా మాత్రమే కాదు బీర, కాకర, బెండ, మిర్చి, దోస, సోర వంటి కూరకాయలు, పాలకూర, తోటకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర్ వంటి ఆకుకూరల దిగుబడి కూడా భారీగా పడిపోయింది. ఫలితంగా ఆయా కూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. నవంబర్ మొదటివారంలో కేజీ కాయకూరల ధరలు సగటున రూ.20 నుంచి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60పైగా ఉంది. ఆకుకూరలు రూ.10కి నాలుగు నుంచి అయిదు కట్టలు ఇస్తే.. ప్రస్తుతం అంతే మొత్తానికి రూ.20కిపైగా చెల్లించాల్సి వస్తోంది.
(చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే)
అర కేజీతో సరిపెట్టుకుంటున్నాం..
మార్కెట్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. సాధారణ రోజుల్లో కేజీ రూ.10 నుంచి రూ.20కే వచ్చేది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. ఈ ధరను పెట్టి కొనడం కష్టం. తాత్కాలికంగా వినియోగాన్ని తగ్గించాం. గతంలో వారానికి రెండు కేజీలు కొంటే..ప్రస్తుతం అరకేజీతో సరిపెట్టుకుంటున్నాం.
– చౌహాన్ లక్ష్మి, బడంగ్‌పేట్
పంట చేతికొచ్చే దశలోనే..
నేను రెండెకరాల్లో టమాటా సాగు చేశా. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని భావించాను. తీరా కాయ కోతకొచ్చే దశలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా చెట్టుకున్న కాయలు నేలకు ఆనుకుని ఉండటంతో వాటికి మచ్చలు ఏర్పడ్డాయి. బూజు పట్టి పాడైపోయాయి. చేను మొత్తం వెతికి ఏరినా ఒక డబ్బా నిండటం లేదు. తెంపిన కాయకు కూడా మచ్చలు ఉండటంతో వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు.
– యాట అంజయ్య, జాపాల గ్రామం
Comments
Please login to add a commentAdd a comment