సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా మార్కెట్లో ఒక కూరగాయ ధర ఎక్కువ ఉంటే మరో కూరగాయ ధర తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కూరగాయల ధరలు చూస్తే బాబోయ్ అనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తున్న వారు బ్యాగు నిండా కూరగాయలతో ఇంటికి వస్తున్నారు. కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం తక్కువ ధరలకే లభిస్తుండటంతో శాఖాహారులు, ఆరోగ్య అభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
50 నుంచి 80 శాతం తగ్గిన ధరలు
టమాటా నుంచి క్యాబేజీ వరకు చౌకగా లభిస్తున్నాయి. తాజా ఆకుకూరలు అతి తక్కువ ధరకే విరివిరిగా లభిస్తున్నాయి. కూరగాయల దిగుబడి బాగా ఉండటంతో మార్కెట్‌లో అధికంగా లభ్యమవుతున్నాయి. రిటైల్‌గా కిలో టమాటా రూ.8 నుంచే రూ.10లకి లభిస్తోంది. వంకాయ, కాకరకాయ ధరలు తక్కువ ఉండగా ఒక్క ఆలుగడ్డ తప్పతో మిగతా కాయగూరలు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. మెంతికూర, పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలు గతంలో కంటే 80 శాతం ధరలు తగ్గాయి. పుదీనా కొత్తిమీర ధలకు కూడా తగ్గాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూ.10 నుంచి రూ.15కే పీస్ చొప్పున అమ్ముతున్నారు. ఎప్పుడూ కూడా చుక్కలను అంటే ధరలతో ఉండే బీన్స్ మాత్రం కేజీ రూ.25 నుంచి రూ.30లకే లభ్యమవుతోంది.
నేరుగా కాలనీలు, బస్తీల్లోకే..
కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పోయిన యువకులు అధిక సంఖ్యలో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కాగా కూరగాయల కోసం బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే లభ్యమవుతున్నాయి. ఆటో ట్రాలీలలో గల్లీ గల్లీ తిరిగి విక్రయిస్తున్నారు. సాయంత్రం రోడ్లపక్కన, ప్రధాన కూడళ్ల వద్ద కూరగాయల స్టాళ్లు వెలుస్తున్నాయి. తాజాగా.. చౌకగా లభ్యమవుతుండటంతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు.