vegetables price
-
కూరగాయలకు ధరల మంట
సాక్షి, హైదరాబాద్: వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు దేశవ్యాప్తంగా తగ్గిన కూరగాయల సాగుతో వేసవి కాలం ముగిశాక వంటింట్లో అగ్గి రాజుకుంది. పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. సాధారణంగా వేసవిలో కాయగూరల ధరలు పెరిగే అవకాశం ఉండగా, ఈసారి వేసవి ముగిసిన తరువాత ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటా యి. వంటింట్లో తప్పనిసరిగా వినియోగించే టమోటా, ఆలు, ఉల్లిగడ్డ ధరలు ఈ వారం రోజుల్లోనే దాదాపుగా రె ట్టింపయ్యాయి. బీర, కాకరకాయ, చిక్కుడు, దొండకాయ, సొరకాయ మొదలైన వాటి ధరలూ భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం రూ.20... ఇప్పుడు రూ.50 మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో ఉల్లిగడ్డ ఉత్పత్తి భారీగా పెరగడంతో అక్కడ ఉల్లిరైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తక్కువ ధరకే ఉల్లిగడ్డను మార్కెట్‌కు తేవడంతో దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ రేటు తగ్గింది. రిటైల్‌లోనే కిలో ఉల్లిగడ్డ రూ. 20 వరకు లభించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అక్కడి అధికార బీజేపీ కూటమికి తక్కువ ఎంపీ సీట్లు రావడానికి కూడా ఉల్లిగడ్డల ధర తగ్గడమేనని అక్కడి ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చారు. ఉల్లిగడ్డకు ధర రాకపోవడంతో వేసవిలో అక్కడి రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేశారని తెలిసింది. దీంతో వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఉల్లిగడ్డకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పదిరోజుల క్రితం వరకు కిలో రూ.20–25 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.45–50కి చేరింది. అన్ని కూరగాయల ధరలు పైపైకే.. హైదరాబాద్ కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన బోయినపల్లి మార్కెట్‌కు ప్రస్తుతం 22–24 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగువేల క్వింటాళ్లు తక్కువ. ఇక్కడి నుంచి కూరగాయలను చిల్లర వర్తకులు కొనుగోలు చేసి జంట నగరాల్లో విక్రయిస్తుండటంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలను పెంచే పరిస్థితి ఏర్పడింది. మాల్స్, సూపర్‌మార్కెట్లతోపాటు ఆన్లైన్ షాపింగ్ యాప్స్‌లోనూ కూరగాయల ధరలు భారీగానే ఉన్నాయి. రైతుబజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 30–50 శాతం వరకు ధరలు అధికంగా ఉన్నాయి. టమోట కిలో రూ.60–70, ఆలుగడ్డ రూ. 45–50, పచ్చిమిర్చి రూ.80–100 మధ్య ఉన్నాయి. బీన్స్ ధరలు చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని కిలోకు రూ. 110–120 మధ్య విక్రయిస్తున్నారు. బీరకాయ గత వారంలో కేజీ రూ.60 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది. చిక్కుడు నాణ్యతను బట్టి కిలోకు రూ.100పైనే ఉంది. క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీలతో పాటు పుదీనా, కొత్తిమీర తదితర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. ఈ నెలలోనే ఉల్లిగడ్డల ధరలు 21 శాతం, టమాటా ధరలు 36 శాతం, ఆలుగడ్డల ధరలు 20 శాతం, వంట నూనెల ధరలు 15 శాతం పెరిగినట్టు ఓ ఆర్థిక అధ్యయనం తెలిపింది. భారీగా తగ్గిన ఉత్పత్తి రాష్ట్రంలో ఏటా 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని ఓ అంచనా. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల టన్నుల లోపే కూరగాయలు ఉత్పత్తి అవుతున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా, కూరగాయల పంటలు మాత్రం 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా 19 లక్షల టన్నుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచి వివిధ రకాల కూరగాయలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లోనూ దిగుబడి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. -
డబుల్ సెంచరీ కొట్టిన టమాట.. కిలో ఏకంగా రూ. 250.. ఎక్కడంటే
ఎన్నడూ లేనంతగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఏదీ కొందామన్న అగ్గిలాగ మండుతున్నాయి. ప్రధానంగా టమాటా ధర దడపుట్టిస్తోంది. సాధారణంగా రూ. 20, 30 కిలో ఉండే టమాట ఇప్పుడు సామన్యుడికి అందని ద్రాక్షగా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే సెంచరీ దాటి టామాట మరింత పరుగులు పెడుతోంది. మరి కొన్ని చోట్ల ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. పెరిగిన ధరలతో ప్రజలు లబోదిబోమంటుంటో.. పలు చోట్ల ప్రభుత్వాలే సబ్సిడీ రేట్లలో టమాటాలను సరఫరా చేస్తున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో టమాట ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం గంగోత్రి ధామ్‌లో కిలో టమాట రూ. 250 పలుకుతోంది. ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది. యమునోత్రిలో కిలో టమాట రూ. 200 నుంచి 250 వరకు చేరింది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోయాయని.. కూరగాయల విక్రయదారుడు తెలిపారు. ఇటీవల తీవ్రల ఎండలు, అకాల వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ అదే విధంగా కోల్కతాలోరూ.152, ఢిల్లీలో రూ.120, బెంగుళూరులో రూ. 120గా ఉంది. చెన్నైలో రూ.100 నుంచి 130 పలుకుతుండటంతో స్థానిక రేషన్ షాపుల ద్వారా టమాట రూ. 60కే కిలో చొప్పున అందిస్తున్నారు. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో రూ.31గా ఉన్నది. ఇతర కూరగాయలు కూడా ధరల విషయంలో తామేమీ తీసిపోలేదని అల్లం, వంకాయటమాటాతో పోటీపడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
Hyderabad: దిగివచ్చిన ఆకుకూరలు, కూరగాయలు.. 50-80 శాతం తగ్గిన ధరలు
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా మార్కెట్లో ఒక కూరగాయ ధర ఎక్కువ ఉంటే మరో కూరగాయ ధర తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కూరగాయల ధరలు చూస్తే బాబోయ్ అనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తున్న వారు బ్యాగు నిండా కూరగాయలతో ఇంటికి వస్తున్నారు. కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం తక్కువ ధరలకే లభిస్తుండటంతో శాఖాహారులు, ఆరోగ్య అభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 80 శాతం తగ్గిన ధరలు టమాటా నుంచి క్యాబేజీ వరకు చౌకగా లభిస్తున్నాయి. తాజా ఆకుకూరలు అతి తక్కువ ధరకే విరివిరిగా లభిస్తున్నాయి. కూరగాయల దిగుబడి బాగా ఉండటంతో మార్కెట్లో అధికంగా లభ్యమవుతున్నాయి. రిటైల్‌గా కిలో టమాటా రూ.8 నుంచే రూ.10లకి లభిస్తోంది. వంకాయ, కాకరకాయ ధరలు తక్కువ ఉండగా ఒక్క ఆలుగడ్డ తప్పతో మిగతా కాయగూరలు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. మెంతికూర, పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలు గతంలో కంటే 80 శాతం ధరలు తగ్గాయి. పుదీనా కొత్తిమీర ధలకు కూడా తగ్గాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూ.10 నుంచి రూ.15కే పీస్ చొప్పున అమ్ముతున్నారు. ఎప్పుడూ కూడా చుక్కలను అంటే ధరలతో ఉండే బీన్స్ మాత్రం కేజీ రూ.25 నుంచి రూ.30లకే లభ్యమవుతోంది. నేరుగా కాలనీలు, బస్తీల్లోకే.. కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పోయిన యువకులు అధిక సంఖ్యలో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కాగా కూరగాయల కోసం బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే లభ్యమవుతున్నాయి. ఆటో ట్రాలీలలో గల్లీ గల్లీ తిరిగి విక్రయిస్తున్నారు. సాయంత్రం రోడ్లపక్కన, ప్రధాన కూడళ్ల వద్ద కూరగాయల స్టాళ్లు వెలుస్తున్నాయి. తాజాగా.. చౌకగా లభ్యమవుతుండటంతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. -
కొండెక్కిన కూరగాయలు..!
కూరగాయల ధరలు చుక్కలనంటడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఏది కొనాలన్నా నిప్పులా ఉంది. ధరలు చూసి కొనేందుకు జనం వెనకడుగు వేస్తున్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో తక్కువ పరిణామంలో కొనుగోలు చేసుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: కూరగాయల ధరలు కొండెక్కడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం పెరిగిపోయింది. సాధారణంగా ఆగస్టు నెలలో కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు కూరగాయల తోటలు పాడవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయ రేటు చూసినా కిలో రూ.40కిపైగానే ఉంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. వ్యాపారులు చెప్పే ధరలకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కిందకు మీదకు చూడాల్సి వస్తుంది. కూరగాయలు లేకుండా పూట గడవని పరిస్థితిలో వాటి ధరలు ఆకాశాన్నంటడంతో.. కిలో కొనాలనుకున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. కిలో రూ.40 పైనే.. ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఎర్రగడ్డ రూ.25, కాకరకాయ, బీన్స్, చిక్కుడు కేజీ రూ.60, క్యారెట్ కేజీ రూ.80, వంకాయ, బెండకాయ కేజీ రూ.50 పలుకుతున్నాయి. వర్షాలకు కూరగాయలు దెబ్బతినడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇది చదవండి : రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’ -
కూరగాయలు సెంచరీ కొట్టేశాయ్‌గా..
సాక్షి, బాపట్ల(గుంటూరు) : కూరగాయల సంచిలో ధరల కుంపటి రగులుతోంది. రూ. 500 తీసుకెళ్తే సగం సంచి కూడా నిండని పరిస్థితుల్లో వంటింటిలో ధరల మంటలు చెలరేగుతున్నాయి. కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు దిగిరానుంటున్నాయ్. నిత్యావసరాలు సెంచరీ కొట్టేశాయ్. వర్షాభావ పరిస్థితులు ఓ కారణమైతే.. కృత్రిమ కొరత చూపిస్తున్న వ్యాపారులు సామాన్యుడి జీవితంతో చెలగాటమాడుతున్నారు. ఏంకొనేట్లు లేదు...ఏంతినేట్లులేదంటూ సగటు జీవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంకేసి దూసుకుపోతూ సామాన్యుడికి భారమవుతున్నాయి. ఈ ఏడాది వార్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఆహారోత్పత్తులు అందుబాటులో లేవనే సాకు చూపి వ్యాపారులు రోజురోజుకూ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజల ఇంట్లో పప్పులుడకడం లేదు. గంజినీళ్ళతో కడుపు నింపేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కందిపప్పు రూ.100 నాటౌట్.. కందిపప్పు ధర చుక్కల్ని తాకుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.70 ఉన్న కందిపప్పు ప్రస్తుత ధర రూ.100కు చేరుకుంది. రోజురోజుకీ ధర పెరుగుతోందే తప్ప కిందికి దిగడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో నెలలోపే రూ.150 కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో పాటు మిగిలిన నిత్యావసర సరుకుల ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో గతంలో రూ.80 నుంచి రూ.90 ఉన్న మినపపప్పు ప్రస్తుతం కిలో రూ.140 నుండి రూ.160 ల వరకు చేరింది. చింతపండు ధర కిలో రూ.150 దాటింది. ఇక నూనెలు సలసల కాగుతున్నాయి. శనగనూనె కిలో రూ.85ల నుండి రూ.90 ల వరకు ఉంది. విడిగా కిలో నూనె రూ.95కి చేరింది. నిత్యావసరాల్లో ఏది కొనాలన్నా వంద రూపాయలపైనే ఉంటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలదీ అదే తీరు.. నిత్యావసర వస్తువుల ధరలకు ఏమాత్రం తీసిపోనట్లుగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండల ధాటికి కూరగాయల పంటలు ఎండిపోవడంతో దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రభావం ధరలపై పడి సామాన్యులు కొనలేని స్థితికి చేరుకున్నాయి. టమోటా కిలో రూ.60, బెండకాయలు కిలో రూ.40, బంగాళాదుంపలు కిలో రూ.40, పచ్చిమిరపకాయలు కిలో రూ.80 లుగా ఉన్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.30 కంటే దిగువన ఉండటం లేదు. దీంతో.. ఉన్న వాటితో సర్దుకుపోతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. 500 రూపాయలు బజారుకు తీసుకెళ్తే కనీసం నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడంలేదని ఆవేదన చెందుతున్నారు. -
కూరగాయల ధరలు తగ్గడానికి అసలు కారణమిదే!
ఇటీవల కాలంలో చాలావరకు కూరగాయలు ధరలు కిందకి దిగొచ్చిన సంగతి తెలిసిందే. రిటైల్ మార్కెట్లో కొన్ని కూరగాయల ధరలు కేజీ రూ.10కే విక్రయిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేయడమేనని చాలా వాదనలు వినిపించాయి. రెండు సార్లు వరుస కరువుల అనంతరం బాగా పండినవి అనుకున్న కూరగాయల పంటల ధరలకు పెద్ద నోట్ల రద్దు గండికొడుతుందని ఆరోపణలొచ్చాయి. అయితే కూరగాయల ధరలు తగ్గడానికి అసలు కారణం అది కాదంట. శీతాకాల సమయంలో కూరగాయల పంట దిగుబడి పెరగడంతో, సరఫరా పెరిగి ధరలు దిగొచ్చాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఈ కాలంలో ఒక్క కూరగాయలే కాక, ఆకుకూరలు కూడా ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయని వాషిలోని ముంబాయి వ్యవసాయదారుల ఉత్పత్తి మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చెప్పింది. అయితే పెద్ద నోట్ల రద్దు పూర్తిగా కాకపోయినా కొంతమొత్తంలో ప్రభావం చూపి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. సోమవారం రోజు కాలిఫ్లవర్, టమోటో, క్యాప్సికమ్ వంటివి కూరగాయలు మార్కెట్‌కు ఎక్కువగా సరఫరా అయ్యాయని ఏపీఎంసీ పేర్కొంది. టమోటో మార్కెట్‌కి రికార్డు స్థాయిలో సరఫరా అవుతుందని, ఆ కారణంతో టమోటో ధరలు క్రాష్ అయినట్టు చెప్పింది. రూ.30, రూ.20గా ఉన్న టమోటో ధరలు రిటైల్ మార్కెట్లో రూ.10కు పడిపోయాయని చెప్పింది. మార్కెట్లోకి తాజా కూరగాయలు రావడానికి శీతాకాల సమయం చాలా మంచి కాలమని వివరించింది. ముంబాయి రిటైల్ మార్కెట్లోనూ చాలా కూరగాయల ధరలు 50 శాతం వరకు దిగొచ్చాయి. -
కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు
కుభీర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు వచ్చాయని, పెట్రోల్, డీ జిల్‌తోపాటు ఉల్లి, కూరగాయలు, ఎరువులు, విత్తనాలు ధరలు ఆకాశాన్నంటాయని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. మండలంలోని సౌంవ్లీ, లింగి, వాయి, అంతర్ని, మాలేగాం, సోనారి, డోడర్న గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పర్యటించారు. టీడీపీ హయూంలో యూరియా బస్తా ధర రూ.160 ఉంటే ఇప్పుడు రూ.400లకు పెరిగిందని, డీఏపీ రూ.400 నుంచి రూ.1300లకు చేరిందని ఎంపీ ఆం దోళన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు ఎక్కువయ్యూయని ఆరోపించారు. గ్రామాల్లో నీరు, డ్రెరుునేజీలు, రోడ్ల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యూరని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లతో దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా అందరూ ఉద్యమించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఏం సాధించారని కృతజ్ఞత సభ పెట్టారని, ఆ పార్టీకి చెందినవారే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు మాలేగాం, అంతర్నిలో సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. డోడర్న తండాలో బస చేశారు. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు బోయిడి విఠల్, శేషనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.మోహన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాశెట్టి రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు కె.శంకర్, మాలేగాం సర్పంచ్ రేఖ, నాయకులు పాల్గొన్నారు.