కూరగాయల ధరలు తగ్గడానికి అసలు కారణమిదే!
కూరగాయల ధరలు తగ్గడానికి అసలు కారణమిదే!
Published Tue, Dec 27 2016 8:53 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
ఇటీవల కాలంలో చాలావరకు కూరగాయలు ధరలు కిందకి దిగొచ్చిన సంగతి తెలిసిందే. రిటైల్ మార్కెట్లో కొన్ని కూరగాయల ధరలు కేజీ రూ.10కే విక్రయిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేయడమేనని చాలా వాదనలు వినిపించాయి. రెండు సార్లు వరుస కరువుల అనంతరం బాగా పండినవి అనుకున్న కూరగాయల పంటల ధరలకు పెద్ద నోట్ల రద్దు గండికొడుతుందని ఆరోపణలొచ్చాయి. అయితే కూరగాయల ధరలు తగ్గడానికి అసలు కారణం అది కాదంట.
శీతాకాల సమయంలో కూరగాయల పంట దిగుబడి పెరగడంతో, సరఫరా పెరిగి ధరలు దిగొచ్చాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఈ కాలంలో ఒక్క కూరగాయలే కాక, ఆకుకూరలు కూడా ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయని వాషిలోని ముంబాయి వ్యవసాయదారుల ఉత్పత్తి మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చెప్పింది. అయితే పెద్ద నోట్ల రద్దు పూర్తిగా కాకపోయినా కొంతమొత్తంలో ప్రభావం చూపి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.
సోమవారం రోజు కాలిఫ్లవర్, టమోటో, క్యాప్సికమ్ వంటివి కూరగాయలు మార్కెట్కు ఎక్కువగా సరఫరా అయ్యాయని ఏపీఎంసీ పేర్కొంది. టమోటో మార్కెట్కి రికార్డు స్థాయిలో సరఫరా అవుతుందని, ఆ కారణంతో టమోటో ధరలు క్రాష్ అయినట్టు చెప్పింది. రూ.30, రూ.20గా ఉన్న టమోటో ధరలు రిటైల్ మార్కెట్లో రూ.10కు పడిపోయాయని చెప్పింది. మార్కెట్లోకి తాజా కూరగాయలు రావడానికి శీతాకాల సమయం చాలా మంచి కాలమని వివరించింది. ముంబాయి రిటైల్ మార్కెట్లోనూ చాలా కూరగాయల ధరలు 50 శాతం వరకు దిగొచ్చాయి.
Advertisement
Advertisement