జీవితం బ్యాంకుల పాలు.. చలిలో బారెడు కష్టాలు
కొండపాక: నల్లధనం కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులను ఇంకా కలవరంలోనే ఉంచింది. వారి దిన చర్య బ్యాంకుల వద్దే సరిపోతోంది. డబ్బుల కోసం రోజూ గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూ కడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల చలామణి గడువు దగ్గర పడుతున్న కొద్దీ బ్యాంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. దీంతో చలిలోనే వణుకుతూ దూర ప్రాంతాల్లోని బ్యాంకుల వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు పెద్దనోట్ల రద్దు తిప్పలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. బ్యాంకర్లు తమ ఇష్టా రీతిన చేస్తున్నారు.
ప్రజలకు ఓ రోజూ రూ. 2 వేలు , మరో రోజూ రూ. 4 వేలు చేతిలో పెడుతుండటంతో అవి సరిపోక నానా కష్టాలు పడుతున్నారు. కొండపాక మండలంలో దుద్దెడ, కొండపాకల్లో ఆంధ్రా బ్యాంకులు, కుకునూరుపల్లిలో మంజీరా గ్రామీణ వికాస్ బ్యాంకు , సిర్సనగండ్లలో (ఎస్‌బీహెచ్ ఏడీబీ లింకప్) కౌషిక్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిదిలో దుద్దెడ, కొండపాక, దమ్మక్కపల్లి, సిర్సనగండ్ల , జప్తినాచారం, మంగోల్, మేదినీపూర్, తిప్పారం, ముద్దాపురం, తిమ్మారెడ్డిపల్లి, లకుడారం, వెలికట్ట, ప్రక్క మండలంలోని పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల ప్రజలకు ఖాతాలున్నాయి. అయితే, వారానికి రూ. 24 వేలవరకు బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను మాత్రం ఈ బ్యాంకులు అస్సలు పాటించడంలేదని ఖాతాదారులు వాపోతున్నారు. ఒక్కొక రోజైతే రూ. 2వేలకు గంటల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీప్ సీజన్‌లో పండించిన పంటల డబ్బు బ్యాంకుల్లో జమ ఉండటంతో రబీ సీజన్ వ్యవసాయ పనులకు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తిందంటున్నారు.
బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు అవసరాలకు సరిపడా రాకపోతుండటంతో కొందరి సామాన్య కుటుంబాల్లో పూట గడువని దుస్తితులు కూడా నెలకొన్నాయి. కొన్ని గ్రామాల్లో ఖరీప్‌లో వేసుకున్న పత్తి పంటలు పెద్ద నోట్ల రద్దు కారణంగా కూలీల కొరత ఏర్పడి పంట మొత్తం చేలల్లోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాపారస్తులను, చిల్లర దుకాణా దారులను, టీ కొట్టు వ్యాపారులను, వ్యవసాయ కూలీలను, ఇతర పనుల కూలీలను, వ్యవసాయదారులను పెద్ద నోట్ల రద్దు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.