సాక్షి,ముంబయి: నోట్ల రద్దుతో సామాన్యుడు బిక్కచచ్చిపోతే బ్యాంకర్లు మాత్రం ఈ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో పెద్దమొత్తంలో డిపాజిట్లు పెరిగాయని, డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయని చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగానికి నోట్ల రద్దు నిర్ణయం సానుకూలంగానే పరిణమించిందని, బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు అందుబాటులోకి వచ్చాయని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. డిపాజిట్లు పెరగడంతో బ్యాంకులకు మిగులు నిధులు లభించాయని చెప్పారు.
ఇక నోట్ల రద్దు పొదుపును పెంచిందని, మ్యూచ్‌వల్ ఫండ్లు, బీమా రంగంలోకి నిధుల వెల్లువ పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ అభిప్రాయపడ్డారు. నిధుల లభ్యతతో బ్యాంకులు సగటు కస్టమర్ల అవసరాలపై దృష్టి సారించే వెసులుబాటు కల్పించిందని చెప్పారు.డిజిటల్ లావాదేవీలూ నోట్లరద్దుతో పెద్దసంఖ్యలో జరుగుతున్నాయని, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేశారు.
మరోవైపు నోట్ల రద్దు ఫలితంగా భారీ మొత్తంలో నల్లధనం వెలికితీయవచ్చని ప్రభుత్వ అంచనాలు తారుమారు కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. రద్దయిన కరెన్సీలో 99 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరిందని ఆర్‌బీఐ వెల్లడించడంతో సర్కార్‌పై విపక్షాలు, విశ్లేషకులు విమర్శల దాడి పెంచారు.నోట్ల రద్దుకు ఏడాది పూర్తవడంతో విపక్షాలు సర్కార్ నిర్ణయంపై నిప్పులు చెరుగుతుండగా, నల్లధనాన్ని నియంత్రించడంలో ఈ నిర్ణయం ముందడుగు వంటిదని ప్రభుత్వం తన చరర్యను సమర్ధించుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment