10 రోజుల్లోనే రెట్టింపు అయిన ఉల్లిగడ్డ, టమాటా
ఉల్లిగడ్డ 50కి కిలో, టమాటా 60 పైనే..
పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడు, బెండకాయ, బీరకాయ ఏదైనా కిలో రూ. 80 పైనే
ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గిన కూరగాయల ఉత్పత్తి
ఏటా అవసరమైన కూరగాయలు 38.54 లక్షల టన్నులు..
రాష్ట్రంలో ఉత్పత్తి 20 లక్షల టన్నుల లోపే
సాక్షి, హైదరాబాద్: వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు దేశవ్యాప్తంగా తగ్గిన కూరగాయల సాగుతో వేసవి కాలం ముగిశాక వంటింట్లో అగ్గి రాజుకుంది. పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి.
సాధారణంగా వేసవిలో కాయగూరల ధరలు పెరిగే అవకాశం ఉండగా, ఈసారి వేసవి ముగిసిన తరువాత ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటా యి. వంటింట్లో తప్పనిసరిగా వినియోగించే టమోటా, ఆలు, ఉల్లిగడ్డ ధరలు ఈ వారం రోజుల్లోనే దాదాపుగా రె ట్టింపయ్యాయి. బీర, కాకరకాయ, చిక్కుడు, దొండకాయ, సొరకాయ మొదలైన వాటి ధరలూ భారీగా పెరిగాయి.
పది రోజుల క్రితం రూ.20... ఇప్పుడు రూ.50
మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో ఉల్లిగడ్డ ఉత్పత్తి భారీగా పెరగడంతో అక్కడ ఉల్లిరైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తక్కువ ధరకే ఉల్లిగడ్డను మార్కెట్‌కు తేవడంతో దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ రేటు తగ్గింది. రిటైల్‌లోనే కిలో ఉల్లిగడ్డ రూ. 20 వరకు లభించింది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అక్కడి అధికార బీజేపీ కూటమికి తక్కువ ఎంపీ సీట్లు రావడానికి కూడా ఉల్లిగడ్డల ధర తగ్గడమేనని అక్కడి ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చారు. ఉల్లిగడ్డకు ధర రాకపోవడంతో వేసవిలో అక్కడి రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేశారని తెలిసింది. దీంతో వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఉల్లిగడ్డకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పదిరోజుల క్రితం వరకు కిలో రూ.20–25 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.45–50కి చేరింది.
అన్ని కూరగాయల ధరలు పైపైకే..
హైదరాబాద్ కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన బోయినపల్లి మార్కెట్‌కు ప్రస్తుతం 22–24 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగువేల క్వింటాళ్లు తక్కువ. ఇక్కడి నుంచి కూరగాయలను చిల్లర వర్తకులు కొనుగోలు చేసి జంట నగరాల్లో విక్రయిస్తుండటంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలను పెంచే పరిస్థితి ఏర్పడింది.
మాల్స్, సూపర్‌మార్కెట్లతోపాటు ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లోనూ కూరగాయల ధరలు భారీగానే ఉన్నాయి. రైతుబజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్‌లో 30–50 శాతం వరకు ధరలు అధికంగా ఉన్నాయి. టమోట కిలో రూ.60–70, ఆలుగడ్డ రూ. 45–50, పచ్చిమిర్చి రూ.80–100 మధ్య ఉన్నాయి. బీన్స్ ధరలు చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని కిలోకు రూ. 110–120 మధ్య విక్రయిస్తున్నారు.
బీరకాయ గత వారంలో కేజీ రూ.60 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది. చిక్కుడు నాణ్యతను బట్టి కిలోకు రూ.100పైనే ఉంది. క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీలతో పాటు పుదీనా, కొత్తిమీర తదితర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. ఈ నెలలోనే ఉల్లిగడ్డల ధరలు 21 శాతం, టమాటా ధరలు 36 శాతం, ఆలుగడ్డల ధరలు 20 శాతం, వంట నూనెల ధరలు 15 శాతం పెరిగినట్టు ఓ ఆర్థిక అధ్యయనం తెలిపింది.
భారీగా తగ్గిన ఉత్పత్తి
రాష్ట్రంలో ఏటా 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని ఓ అంచనా. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల టన్నుల లోపే కూరగాయలు ఉత్పత్తి అవుతున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా, కూరగాయల పంటలు మాత్రం 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి.
ఈ కారణంగా 19 లక్షల టన్నుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచి వివిధ రకాల కూరగాయలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లోనూ దిగుబడి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment