సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది.
సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఎఫ్‌పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం
రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది.
రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు..
సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది.
కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత
టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment