ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రారంభమైన ఎఫ్‌పీవోలు
► చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పండ్లు, కూరగాయల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభం.
► విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం రేగ గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం.
► కర్నూలు జిల్లా తడకనపల్లెలో 100 మైక్రో యూనిట్స్‌తో ఆనియన్, టమాటా సోలార్ డీ హైడ్రేషన్ క్లస్టర్ ప్రారంభం.
వీటికి సీఎం శంకుస్థాపన
► తిరుపతి జిల్లా శ్రీసిటీలో మోన్ డ లీజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌కు శంకుస్థాపన.
► శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో గ్రౌండ్‌నట్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ.
► అనంతపురం జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాల్లో మూడు టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన.
సాక్షి, అమరావతి: రైతన్నలు పండించే పంటలకు మరింత మెరుగైన ధరలను కల్పించే లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆర్బీకేల స్థాయిలో ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, జిల్లా స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటి వల్ల రైతులు పండించిన పంటలకు మరింత విలువ తోడై మెరుగైన ధర లభిస్తుందన్నారు. గత నాలుగేళ్లలో పంటలు ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్ జోక్యం ద్వారా రూ.8,000 కోట్లతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పంటలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటించిందని తెలిపారు. చిరుధాన్యాలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు (ఎఫ్‌పీవోలు) వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
ఆర్బీకేల స్థాయిలో అనుసంధానం..
ఇవాళ 421 ప్రైమరీ ప్రాసెసింగ్ కలెక్షన్ సెంటర్లను ప్రారంభించుకున్నాం. ఇవన్నీ 1,912 ఆర్బీకేలతో మ్యాపింగ్ చేసినవి. మొత్తం 945 కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తొలిదశలో 344 కోల్డ్ రూమ్‌ల పనులు జరుగుతుండగా 43 కోల్డ్ రూమ్‌లను ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇవి 194 ఆర్బీకేలతో అనుసంధానమయ్యాయి.
ప్రతి ఆర్బీకేను కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్లకు మ్యాపింగ్ చేస్తూ ప్రైమరీ ప్రాసెసింగ్‌లో డ్రయ్యింగ్ ప్లాట్‌ఫామ్‌లు, కలెక్షన్ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు లాంటి వాటిని రైతు భరోసా కేంద్రం పరిధిలోకి తేవాలి. గ్రేడింగ్, సెగ్రిగేషన్ లాంటివి ఆ స్ధాయిలో జరిగితే సెకండరీ ప్రాసెసింగ్ జిల్లా స్థాయిలో చేపట్టేలా అడుగులు పడుతున్నాయి.
పోటీ పెంచేలా మద్దతు ధరల ప్రదర్శన
రైతులు పండించిన ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు సైతం కనీస మద్దతు ధర కల్పిస్తూ ఆర్బీకేలలో పోస్టర్ల ద్వారా ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్‌లో పోటీ నెలకొనేలా చర్యలు తీసుకున్నాం. ఏదైనా పంటకు ధరలు పడిపోతే సంబంధిత ఆర్బీకే స్థాయిలోనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నాం. ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఇందుకు ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పులన్నింటితో రైతు తాను పండించే పంటకు ఇంకా మెరుగైన రేటు పొందే పరిస్థితి వస్తుంది.
మార్కెట్‌లో రైతులకు మద్దతు ధరలు తగ్గిన ప్రతిసారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టి తోడుగా నిలుస్తున్నాం. ఆర్బీకేలో ప్రదర్శించే రేటు కన్నా రైతులకు ఎక్కడైనా తక్కువ ధర వస్తుంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ పంటలను సేకరిస్తుంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఏటా రూ.3 వేల కోట్లు కేటాయిస్తూ నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం దాదాపు రూ.8 వేల కోట్లు వెచ్చించాం.
ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం
శ్రీసిటీలో మరో రూ.1,600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం ఆనందాన్ని కలిగిస్తోంది. ‘మోన్ డ లీజ్’ కంపెనీ రెండో విడతలో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. చాక్‌లెట్, క్యాడ్‌బరి, బోర్న్‌వీటా లాంటివి తయారు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ దినదినాభివృద్ధి చెంది మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా.
ధర్మవరం వేరుశెనగ రైతులకు లబ్ధి
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో వేరుశెనగ పంటకు మరింత విలువ పెరిగి స్థానిక రైతన్నలకు ప్రయోజనం చేకూరుతుంది. వేరుశెనగ రైతులకు మెరుగైన ధరలు ఇవ్వగలిగే పరిస్థితి రావాలని ఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించాం. రూ.75 కోట్లతో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ ధర్మవరంలో ఏర్పాటవుతోంది.
55,620 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్ 15 వేల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరో 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా వేరుశెనగ పంట నుంచి చిక్కీ, వేరుశెనగ నూనె, పీనట్ బటర్ లాంటి ఉప ఉత్పత్తులు తయారై పంటకు మార్కెటింగ్ పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా రైతన్నలకు చాలా మేలు జరుగుతుంది.
రెండు జిల్లాల్లో 4 ఎఫ్‌పీవోలు
ఇవాళ చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తున్నాం. దాదాపు 14,400 మెట్రిక్ టన్నులకు సంబంధించి పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి రావడం ద్వారా మార్కెటింగ్ సౌకర్యం పెరిగి రైతులకు మంచి ధరలు లభిస్తాయి.
విజయనగరంలో మిల్లెట్స్ ప్రాసెసింగ్
మిల్లెట్స్‌లో దాదాపు 13 సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 32 పైచిలుకు ప్రైమరీ ప్రాసెసింగ్ మిల్లెట్ యూనిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మిల్లెట్స్‌కు కూడా ఎంఎస్‌పీ అందిస్తోంది మన రాష్ట్రంలోనే. మిల్లెట్స్ రేటు పడిపోతే జోక్యం చేసుకుని కొర్రలు లాంటి చిరుధాన్యాలకు ఎంఎస్‌పీ అందించాం. విజయనగరంలో 7,200 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ రావడం వల్ల ఈ ప్రాంతంలో రైతులకు మంచి జరుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది.
కర్నూలు ఉల్లి రైతన్నకు ఆదాయాన్నిచ్చేలా
కర్నూలులో ఆనియన్ డీహైడ్రేషన్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నాం. రూ.లక్ష పెట్టుబడితో ప్రతి ఒక్కరికి దాదాపు రూ.12 వేల ఆదాయాన్నిచ్చే కార్యక్రమమిది. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మరింత విస్తరిస్తూ ఐదువేల వరకు పెంచుతాం.
10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు
శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3,588 మంది రైతులుకు మేలు చేస్తూ 10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం. మరో నాలుగు నెలల్లో వీటిని ప్రారంభించుకోబోతున్నాం. దీనివల్ల టమాటా రైతులందరికీ మంచి జరుగుతుంది. 250 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో టమాటా రైతుల ఇబ్బందులు తీరతాయి. మార్కెట్‌లో ధరలు పడిపోయినా అయినకాడికి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. మంచి ధరలకు విక్రయించుకునే అవకాశం కలుగుతుంది.
చిరుధాన్యాల రైతులకు లబ్ధి
నాబార్డు సహకారంతో చిరుధాన్యాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 1,500 మంది సభ్యులున్నారు. ఎక్కడ విక్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో సీఎం జగన్ మా కష్టాలు తీర్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రూ.4 కోట్ల విలువైన యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో నేరుగా 30 మంది ఉపాధి పొందుతున్నాం. ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 10 వేల మంది రైతులు లబ్ధి పొందుతున్నాం. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే అన్నీ అందుతున్నాయి. సచివాలయ వ్యవస్థ చక్కగా పని చేస్తోంది.
– సరస్వతి, సీఈవో, ఆరోగ్య మిల్లెట్స్ ఎఫ్‌పీవో, విజయనగరం జిల్లా
సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం
గత 30 – 35 ఏళ్లుగా రైతులతో కలిసి పనిచేస్తున్నాం. రైతులతో కలిసి ‘ధరణి’ ఎఫ్‌పీవోని ప్రమోట్ చేస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయాన్ని, మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. మేం నెలకొల్పిన సొసైటీలో 2 వేల మందికి పైగా రైతులున్నారు. 115 ఉత్పత్తులను తయారు చేసి 500 రీటెయిలర్స్ ద్వారా 13 రాష్ట్రాలలో వ్యాపారం చేస్తున్నాం. సేంద్రీయ కూరగాయలు, పండ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పుడు మాకు అవకాశం లభించింది.
– మేరి, కో ఫౌండర్, ద టింబక్తు కలెక్టివ్, అనంతపురం జిల్లా
నేరుగా పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్
పలమనేరులో కూరగాయలు పండించే రైతులతో నాబార్డు సహకారంతో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రైతులు పండించే కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్ చేసి కార్పొరేట్ సంస్థలకు అందించే మా ఎఫ్‌పీవోను గుర్తించి ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.4 కోట్లతో మిషనరీ, కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఏర్పాటు చేశారు.
720 మంది రైతులు ఈ యూనిట్‌ను వినియోగించుకుని దళారీలతో సంబంధం లేకుండా నేరుగా తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకుంటున్నారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. దాదాపు 1000 మంది రైతులు దీనిని వినియోగించుకుని లబ్ధిపొందుతున్నారు.
– హరిబాబు, పలమనేరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment