‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు.
మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.
పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు.
భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.
ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు.
‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు.
నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.
స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.
తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే.
వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు.
ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః
Mayabazar Movie In Summer: వేసవి అభ్యాసం
Published Mon, May 6 2024 12:08 AM | Last Updated on Mon, May 6 2024 9:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment