గత దశాబ్దిన్నరగా ఎన్నడెరుగని పరిస్థితి. మే నెలలో మండే ఎండలు తెలిసినవే అయినా, ఏప్రిల్ మొదలు జూన్ సగం దాటినా మాడు పగిలేలా దీర్ఘకాలిక ఉష్ణపవనాల దెబ్బ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులతో ఢిల్లీ సహా ఉత్తరాది అంతా ఇప్పుడు అగ్నిగుండమైంది. మొన్న మంగళవారం 1969 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో 35.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఢిల్లీ మలమల మాడిపోయింది.
ఒక్క జూన్‌లోనే ఇప్పటిదాకా ఏడు రోజులు తీవ్ర ఉష్ణపవనాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి కాగా, పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరిగిపోవడంతో అవస్థలు హెచ్చాయి. మే 12 తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయినా 40 డిగ్రీల కన్నా తగ్గనే లేదు. నిరాశ్రయులు 192 మంది ఈ జూన్ నెల 11 నుంచి 19 మధ్య కాలంలో వడదెబ్బ తగిలి మరణించారట. మునుపెన్నడూ చూడని ఇన్ని మరణాల సంఖ్య పరిస్థితి తీవ్రతకు మచ్చుతునక.
నగరంలో నీటి కొరత మరో పెద్ద కథ. అధిక జనాభాతో దేశరాజధాని చాలాకాలంగా తల్లడిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది వలస రావడంతో గత పాతికేళ్ళలో ఢిల్లీలో డజన్లకొద్దీ శిబిరాలు చట్టవిరుద్ధంగా వెలిశాయి. అసలే శిథిలమైన నగర జలవ్యవస్థ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ఈ మురికివాడలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి. దానికి తోడు యమునా నదీజలాలు తగ్గిపోయి, నీటి కోసం అల్లాడే ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకర్లతో నీటి పంపిణీ పెద్ద వ్యాపారమైంది.
ఇదే అదనుగా జలవనరుల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా బయలుదేరింది. పెరిగిన ఎండలతో ఉత్తరాదిన రోజువారీ విద్యుత్ వినియోగం 89 గిగా వాట్ల పతాకస్థాయికి చేరి, ఢిల్లీ విమానాశ్రయం అరగంట సేపు కరెంట్ కోతలో మగ్గాల్సి వచ్చింది. మిగతా దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తరాదికి 25 నుంచి 30 శాతం విద్యుత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎండల్లో ఇన్ని సమస్యల ముప్పేటదాడితో రాజధాని ప్రజలకు కష్టాలు వర్ణనాతీతం.
సందట్లో సడేమియాగా వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. పొరుగున హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, యమునలోని నీళ్ళొదలడం లేదన్నది ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపణ. మాకే తగినంత లేవన్నది హర్యానా జవాబు. నీళ్ళైనా అందించలేకపోవడం ఆప్ వైఫల్యమేనంటూ ఢిల్లీ బీజేపీ నేతలు రోడ్డు పైకొచ్చి నిరసనలకు దిగడం ఒక ఎత్తయితే... ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోవడం, ఢిల్లీ నీటి సరఫరా పైపులకు సైతం దుష్టశక్తులు చిల్లులు పెడుతున్నాయంటూ ఆప్ సర్కార్ ఆ పైపులకు పోలీసు రక్షణ కోరడం పరాకాష్ఠ.
దేశ రాజధానిలో నీటి కొరతపై ప్రధాని మోదీ స్పందించకపోతే శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ఢిల్లీ మంత్రి ఆతిశి ప్రకటించడంతో మహానగరం మరింత వేడెక్కింది. నిజానికి, ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకి, ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. తీరా జూన్ 12 నుంచి మధ్యభారతంలో అవి స్తంభించేసరికి, దేశమంతా ఇటు వర్షాలు లేవు. అటు ఎండలు, ఉక్కపోత. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతావనిలో మరీ దుర్భరం. ఇలాంటి దీర్ఘకాలిక వేసవిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటున్నది అందుకే!
నిజానికి ఇదంతా ఎక్కడో ఢిల్లీలో వ్యవహారమనీ, అది అక్కడికే పరిమితమనీ అనుకోవడానికి వీల్లేదు. వాతావరణ మార్పులు, మన స్వయంకృతాపరాధాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నిటికీ ఇదే దుఃస్థితి దాపురించడం ఖాయం. ఆ మధ్య బెంగుళూరులో ఇలాంటివే చూశాం. దేశానికి అభివృద్ధిఇంజన్లయిన బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లోనూ రేపు ఇవే పరిస్థితులు వస్తే, పరిస్థితి ఏమిటి? దేశ ఆర్థికపురోగతికి వెన్నెముక అయిన వీటిని నివాసయోగ్యం కాకుండా చేస్తే, జనం ఉద్యోగ, ఉపాధుల మాటేమిటి? పొంచివున్న నీటికొరత నివారణకు పాలకులు ఏం ప్రణాళిక వేస్తున్నారు? హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వందల కొద్దీ చెరువులు, కుంటలు కబ్జాకు గురై, పర్యావరణానికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకూ తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు రాకపోతే కష్టం.
మానవాళికి శాపంగా మారిన ఈ అధిక ఉష్ణోగ్రతల వెనక వాయుకాలుష్యం, శరవేగంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత... ఇలా చాలా కారణాలున్నాయి. విపరీతంగా నిర్మాణాలు పెరిగి, పట్టణాలన్నీ కాంక్రీట్ జనారణ్యాలుగా మారేసరికి, పచ్చని చెట్లు, ఖాళీ ప్రదేశాలున్న ప్రాంతాలతో పోలిస్తే కొద్ది కి.మీ.ల దూరంలోనే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా, దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడడం కూడా పాతికేళ్ళ క్రితంతో పోలిస్తే బాగా నిదానించిందట. ‘పట్టణ ఉష్ణద్వీప’ ప్రభావంగా పేర్కొనే ఈ పరిస్థితిని నివారించడం అత్యవసరం. అలాగే, నిలువ నీడ లేని వారితో సహా సమాజంలోని దుర్బల వర్గాలను ఈ వేడిమి బాధ నుంచి కాపాడే చర్యలు చేపట్టాలి.
ఒంట్లో నీటి శాతం తగ్గిపోనివ్వకుండా ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి వసతి కల్పించాలి. శీతల కేంద్రాలు, ఎండబారిన పడకుండా తగినంత నీడ ఏర్పాటు చేయాలి. గత ఏడాది, ఈసారి ఎన్జీఓ ‘స్వయం ఉపాధి మహిళా సంఘం’ (సేవ) అమలు చేసిన ‘ఎండల నుంచి బీమా సౌకర్యం’ లాంటి వినూత్న ఆలోచనలు అసంఘటిత కార్మికుల జీవనోపాధిని కాపాడతాయి. ఇప్పటికే ఈ 2024 మానవచరిత్రలోనే మండుటెండల వత్సరంగా రికార్డు కెక్కింది. వచ్చే ఏడాది ఈ రికార్డును తిరగరాయక ముందే ఈ మహోపద్రవం పట్ల కళ్ళు తెరవడం మంచిది.
మండుటెండల మహోపద్రవం
Published Fri, Jun 21 2024 4:15 AM | Last Updated on Fri, Jun 21 2024 1:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment