Lack of Water
-
మండుటెండల మహోపద్రవం
గత దశాబ్దిన్నరగా ఎన్నడెరుగని పరిస్థితి. మే నెలలో మండే ఎండలు తెలిసినవే అయినా, ఏప్రిల్ మొదలు జూన్ సగం దాటినా మాడు పగిలేలా దీర్ఘకాలిక ఉష్ణపవనాల దెబ్బ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులతో ఢిల్లీ సహా ఉత్తరాది అంతా ఇప్పుడు అగ్నిగుండమైంది. మొన్న మంగళవారం 1969 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో 35.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఢిల్లీ మలమల మాడిపోయింది. ఒక్క జూన్‌లోనే ఇప్పటిదాకా ఏడు రోజులు తీవ్ర ఉష్ణపవనాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి కాగా, పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరిగిపోవడంతో అవస్థలు హెచ్చాయి. మే 12 తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయినా 40 డిగ్రీల కన్నా తగ్గనే లేదు. నిరాశ్రయులు 192 మంది ఈ జూన్ నెల 11 నుంచి 19 మధ్య కాలంలో వడదెబ్బ తగిలి మరణించారట. మునుపెన్నడూ చూడని ఇన్ని మరణాల సంఖ్య పరిస్థితి తీవ్రతకు మచ్చుతునక. నగరంలో నీటి కొరత మరో పెద్ద కథ. అధిక జనాభాతో దేశరాజధాని చాలాకాలంగా తల్లడిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది వలస రావడంతో గత పాతికేళ్ళలో ఢిల్లీలో డజన్లకొద్దీ శిబిరాలు చట్టవిరుద్ధంగా వెలిశాయి. అసలే శిథిలమైన నగర జలవ్యవస్థ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ఈ మురికివాడలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి. దానికి తోడు యమునా నదీజలాలు తగ్గిపోయి, నీటి కోసం అల్లాడే ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకర్లతో నీటి పంపిణీ పెద్ద వ్యాపారమైంది. ఇదే అదనుగా జలవనరుల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా బయలుదేరింది. పెరిగిన ఎండలతో ఉత్తరాదిన రోజువారీ విద్యుత్ వినియోగం 89 గిగా వాట్ల పతాకస్థాయికి చేరి, ఢిల్లీ విమానాశ్రయం అరగంట సేపు కరెంట్ కోతలో మగ్గాల్సి వచ్చింది. మిగతా దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తరాదికి 25 నుంచి 30 శాతం విద్యుత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎండల్లో ఇన్ని సమస్యల ముప్పేటదాడితో రాజధాని ప్రజలకు కష్టాలు వర్ణనాతీతం. సందట్లో సడేమియాగా వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. పొరుగున హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, యమునలోని నీళ్ళొదలడం లేదన్నది ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపణ. మాకే తగినంత లేవన్నది హర్యానా జవాబు. నీళ్ళైనా అందించలేకపోవడం ఆప్ వైఫల్యమేనంటూ ఢిల్లీ బీజేపీ నేతలు రోడ్డు పైకొచ్చి నిరసనలకు దిగడం ఒక ఎత్తయితే... ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోవడం, ఢిల్లీ నీటి సరఫరా పైపులకు సైతం దుష్టశక్తులు చిల్లులు పెడుతున్నాయంటూ ఆప్ సర్కార్ ఆ పైపులకు పోలీసు రక్షణ కోరడం పరాకాష్ఠ. దేశ రాజధానిలో నీటి కొరతపై ప్రధాని మోదీ స్పందించకపోతే శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ఢిల్లీ మంత్రి ఆతిశి ప్రకటించడంతో మహానగరం మరింత వేడెక్కింది. నిజానికి, ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకి, ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. తీరా జూన్ 12 నుంచి మధ్యభారతంలో అవి స్తంభించేసరికి, దేశమంతా ఇటు వర్షాలు లేవు. అటు ఎండలు, ఉక్కపోత. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతావనిలో మరీ దుర్భరం. ఇలాంటి దీర్ఘకాలిక వేసవిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటున్నది అందుకే!నిజానికి ఇదంతా ఎక్కడో ఢిల్లీలో వ్యవహారమనీ, అది అక్కడికే పరిమితమనీ అనుకోవడానికి వీల్లేదు. వాతావరణ మార్పులు, మన స్వయంకృతాపరాధాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నిటికీ ఇదే దుఃస్థితి దాపురించడం ఖాయం. ఆ మధ్య బెంగుళూరులో ఇలాంటివే చూశాం. దేశానికి అభివృద్ధిఇంజన్లయిన బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లోనూ రేపు ఇవే పరిస్థితులు వస్తే, పరిస్థితి ఏమిటి? దేశ ఆర్థికపురోగతికి వెన్నెముక అయిన వీటిని నివాసయోగ్యం కాకుండా చేస్తే, జనం ఉద్యోగ, ఉపాధుల మాటేమిటి? పొంచివున్న నీటికొరత నివారణకు పాలకులు ఏం ప్రణాళిక వేస్తున్నారు? హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వందల కొద్దీ చెరువులు, కుంటలు కబ్జాకు గురై, పర్యావరణానికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకూ తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు రాకపోతే కష్టం. మానవాళికి శాపంగా మారిన ఈ అధిక ఉష్ణోగ్రతల వెనక వాయుకాలుష్యం, శరవేగంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత... ఇలా చాలా కారణాలున్నాయి. విపరీతంగా నిర్మాణాలు పెరిగి, పట్టణాలన్నీ కాంక్రీట్ జనారణ్యాలుగా మారేసరికి, పచ్చని చెట్లు, ఖాళీ ప్రదేశాలున్న ప్రాంతాలతో పోలిస్తే కొద్ది కి.మీ.ల దూరంలోనే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా, దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడడం కూడా పాతికేళ్ళ క్రితంతో పోలిస్తే బాగా నిదానించిందట. ‘పట్టణ ఉష్ణద్వీప’ ప్రభావంగా పేర్కొనే ఈ పరిస్థితిని నివారించడం అత్యవసరం. అలాగే, నిలువ నీడ లేని వారితో సహా సమాజంలోని దుర్బల వర్గాలను ఈ వేడిమి బాధ నుంచి కాపాడే చర్యలు చేపట్టాలి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోనివ్వకుండా ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి వసతి కల్పించాలి. శీతల కేంద్రాలు, ఎండబారిన పడకుండా తగినంత నీడ ఏర్పాటు చేయాలి. గత ఏడాది, ఈసారి ఎన్జీఓ ‘స్వయం ఉపాధి మహిళా సంఘం’ (సేవ) అమలు చేసిన ‘ఎండల నుంచి బీమా సౌకర్యం’ లాంటి వినూత్న ఆలోచనలు అసంఘటిత కార్మికుల జీవనోపాధిని కాపాడతాయి. ఇప్పటికే ఈ 2024 మానవచరిత్రలోనే మండుటెండల వత్సరంగా రికార్డు కెక్కింది. వచ్చే ఏడాది ఈ రికార్డును తిరగరాయక ముందే ఈ మహోపద్రవం పట్ల కళ్ళు తెరవడం మంచిది. -
తీవ్ర విషాదం: గుక్కెడు నీళ్లు దొరక్క దాహార్తితో..
జైపూర్: గ్రామానికి అమ్మమ్మతో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి దాహంతో అలమటించి అలమటించి చివరకు మృత్యు ఒడికి చేరింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. గుక్కెడు నీళ్లు దొరక్క చిన్నారి కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. అయితే ఆ అవ్వ కూడా దాహంతో అల్లాడి స్పృహ తప్పి పడిపోయింది. అటుగా వెళ్లేవారు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అవ్వకు నీళ్లు తాగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయ్‌పూర్‌లోని రాణివాడ తాలుక రోడ గ్రామానికి చెందిన సుఖిదేవి భిల్ (60), ఐదేళ్ల మనమరాలు ఆదివారం గ్రామానికి నడుచుకుంటూ బయల్దేరారు. రాయిపూర్ నుంచి నడుచుకుంటూ 15 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఎండ తీవ్రంగా ఉంది. నడిచి నడిచి అలసిపోయారు. దాహం వేస్తున్నా ఎక్కడా నీళ్లు లభించలేదు. దీంతో వారిద్దరూ మార్గమధ్యలో కుప్పకూలిపోయారు. దాహార్తితో పాప నీరసించిపోయి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అవ్వకు నీళ్లు తాపించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో ఎండలు అధికంగా ఉంటాయి. పాప నీళ్లు లేక మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. చదవండి: లాక్‌డౌన్‌తో ఛాన్స్‌ల్లేక నటుడు ఆత్మహత్యాయత్నం నీళ్లు తాగిస్తున్న పోలీసులు -
గుక్కెడు నీటికోసం రాష్ట్రం దాటాల్సిందే..
జైపూర్, రాజస్థాన్ : అసలే అది ఎడారి ప్రాంతం. భగభగ మండే భానుడి తాపానికి గుక్కెడు నీళ్లు లేక వేల గొంతులు తడారిపోతున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ జిల్లాలోని వేల జనం వలస బాట పట్టాల్సిందే. విశేషమేమంటే.. ఆ ప్రాంతంమంతా చంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉండడం. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో.. ధోల్పూర్ జిల్లాలోని దాదాపు 40 గ్రామాల ప్రజలు ఎండాకాలం మొదలవగానే నీటి చెలిమలు వెతుక్కుంటూ.. వలసెళ్లి పోతారు. ఇంకో విస్మయం కల్గించే విషయమేంటంటే ధోల్పూర్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంత జిల్లా కావడం. ‘నీటి సంరక్షణ పథకాలు ప్రవేశపెడుతున్నాం. సంప్రదాయ నీటి నిలువ పద్ధతుల్ని కూడా అనుసరించి తాగునీటి సరఫరాకై చర్యలు తీసుకుంటున్నామ’ని ముఖ్యమంత్రి వసుంధర రాజే పదే పదే చెప్తున్నారు. మరి ధోల్పూర్ ప్రజలు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. నీటి కటకటతో వలసబాట పడుతున్నది వాస్తవం కాదా..! అని రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ వసుంధర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నీటికై రాష్ట్రం దాటాల్సిందే.. ‘మా గ్రామ పంచాయతీ పరిధిలో 30 నుంచి 35 చిన్న చిన్న పల్లెలుంటాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క బిందెడు తాగునీటి సౌకర్యానికి కూడా నోచుకోలేదు. ఎండాకాలం మొదలవగానే ఆయా గ్రామాల ప్రజలు మరో ప్రాంతానికో లేదా బంధువుల ఊళ్లకో వలస పోతారు. ప్రధానంగా ధోల్పూర్ జిల్లా ప్రజలంతా ఆగ్రా, కాగరోల్, మధుర వంటి సరిహద్దు ప్రాంతాలకు పయనమవుతారు. ఐదేళ్లకోసారి వచ్చి ఎన్నికల్లో మాతో ఓటు వేయించుకొని పోయే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు మా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు’ అని గాలోరి గ్రామ నివాసి రాజేష్ వాపోయారు. ‘మా గ్రామంలోని పురుషులందరూ పిల్లలతో కలిసి నీటి చెలిమలు వెతకడానికి, నీటిని తేవడానికే సరిపోతోంది. నీటి కోసమే ఎంతో సమయం వృధా అవుతోంది. అక్కడక్కడ నీటి చెలిమలు ఉన్నా.. పశువులు తాగే నీటినే మనుషులు తాగాల్సిన పరిస్థితి. వాటిని తాగి జనం రోగాల పాలవుతున్నారు’ అని గాలోరి మరో నివాసి రామ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
60 కోట్ల పిల్లలకు నీటి కొరత
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది పిల్లలు 2040 లో తీవ్ర నీటి కొరత ఎదుర్కోనున్నారని యూనిసెఫ్ పేర్కొంది. ప్రతి నలుగురి పిల్లల్లో ఒకరు ఈ సమస్య ఎదుర్కొంటారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలు తక్కువ నీటి వనరులతో జీవిస్తారని హెచ్చరించింది. మంగళవారం యూనిసెఫ్ విడుదల చేసిన రిపోర్ట్‌ను ఈఎఫ్ఈ న్యూస్ సంస్థ బుధవారం వెల్లడించింది. నీరు లేకుండా జీవించడం కష్టమని, కానీ ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు తీవ్ర మంచి నీటి కొరత ఎదుర్కుంటారని తెలిపింది. ఆరోగ్యంగా జీవించాలంటే తాగే నీరు ఎంతో ముఖ్యమని, కానీ భవిష్యత్తు తరాలకు హానీ కలుగుతుందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోని లేక్ తెలిపారు. దీనికి కారణం నీటిని వృధా చేయడమేనన్నారు. జనాభా పెరుగుదలతో నీటి వాడకం పెరుగుతుందని, ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పడే 36 దేశాల్లో నీటి కొరత అధికంగా ఉందని, తక్కువగా నీటిని వాడుకోవాలని హెచ్చరించింది. తీవ్ర నీటి కొరతకు ప్రధాన కారణాలు వాతావరణం వేడెక్కడం, సముద్రాల విస్తీరణం పెరగడం, మంచు కరగడం, కరువులని తెలిపింది. ఇప్పటికే 66 కోట్ల మంది నీటి సమస్య ఎదుర్కుంటున్నారంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 800 మంది పిల్లలు డయేరియాతో మరణిస్తున్నారని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎక్కువ మంది పిల్లలకు మంచి నీరు అందకపోవడం వల్లే డయేరియా భారిన పడుతున్నారని తెలిపింది. రాబోయే రోజులోనైనా ప్రభుత్వాలు నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని యూనిసెఫ్ సూచించింది. -
మం‘జీరో’!
నదిలోని నీరొస్తున్నా కళతప్పిన నీటి పథకాలు ‘శాపూర్’ వద్ద పనులు చేపట్టని అధికారులు ఎగువున మరిన్ని భారీ వర్షాలు కురిస్తేనే ఆశలు నారాయణఖేడ్: మంజీరా నదిలోకి చేరుతున్న వరద.. నీటి పథకాలకు ఏమాత్రం ఊతమివ్వడం లేదు. ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే నదికి జీవకళ వచ్చేది. ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో నది వట్టిపోయింది. ఈనేపథ్యంలో రెండ్రోలుగా ఎగువు ప్రాజెక్టుల నుంచి కొద్దికొద్దిగా నీరు వస్తుండటం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే, భారీ వరదలు వస్తే తప్ప సింగూరు వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు నీరు చేరని పరిస్థితి. ప్రస్తుతం చిన్నపాటి ఇన్‌ఫ్లో వల్ల సింగూరు ప్రాజెక్టుకు ఆదివారానికి కొద్దిగా నేరు చేరే పరిస్థితి ఉంది. మంజీరా నది జిల్లాలో మనూరు మండలం గౌడ్గాం జన్వాడ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, మెదక్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తుంది. సింగూరు ప్రాజెక్టు ఎగువున మంజీరాపై నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ తదితర నియోజకవర్గాల నీటి పథకాలు ఉన్నాయి. వరద పెరిగి బ్యాక్‌వాటర్ నిలిస్తే తప్ప నీటిపథకాలు పనిచేయని పరిస్థితి. శాపూర్ నీటిపథకం వద్ద భారీ లోయ ఉండటంతో అక్కడ కొద్దిగా నీరు పంపింగ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పథకం వద్ద మోటార్ల మరమ్మతులతో పాటు చిన్నపాటి పనులు చేయాలని ఎమ్మెల్యే ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించినా పనులు ప్రారంభం కాలేదు. ఖేడ్ నియోజకవర్గం బోరంచ, గూడూరు ఇన్‌టేక్‌వెల్.. జహీరాబాద్ నియోజకవర్గం పుల్కుర్తి వద్ద ఉన్న ఇన్‌టేక్‌వెల్ వరకు పూర్తిస్థాయిలో వరద నీరు రాలేదు. ఇవీ పథకాలు గూడూరు వద్ద 13 ఏళ్ల క్రితం రూ.14కోట్లతో మంజీరా నదిపై 74 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నీటిపథకం నిర్మించారు. ఎన్ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేజ్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేట నియోజకవర్గంలో ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. దీంతో పాటు పుల్కుర్తి సమీపంలోని నీటి పథకం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా జరుగుతోంది. నీరు నిలవాల్సిందే సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరితే తప్ప నీటి పథకాలు పనిచేసేందుకు పరిస్థితి లేదు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఉన్నా.. మంజీరా నదిలో నీరు లేని కారణంగా వరద నీరు కిందకు పోతోంది. సింగూరు ప్రాజెక్టు నిండితేనే మంజీరా నదిలో నీరు నిలిచి బ్యాక్‌వాటర్ పెరిగే అవకాశం ఉంది. ఇందుకు మరిన్ని వరదలు రావాల్సి ఉంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నదిలోకి నీరు చేరకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వారం రోజుల పాటు కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తప్ప.. నీటి పథకాలు పనిచేయని దుస్థితి ఉంది. మంజీరా నదిలోకి నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగి బోరు, బావులు రీచార్జ్ కానున్నాయి. -
నీళ్ళు లేక.. నిలిచిన ఆపరేషన్లు!
-
నీళ్లు లేక ఆగిన ఆపరేషన్లు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అందరికీ ముందుగా గుర్తొచ్చేది గాంధీ ఆస్పత్రే.. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 50 మేజర్ ఆపరేషన్లు, 100కు పైగా మైనర్ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం నుంచి ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం నుంచి ఆపరేషన్ థియేటర్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఈ సమస్య నెలకొంది. ఆపరేషన్ థియేటర్లకు నీళ్లు సరఫరా చేసే పంపులకు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అత్యవసర చికిత్సలన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి.