60 కోట్ల పిల్లలకు నీటి కొరత
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది పిల్లలు 2040 లో తీవ్ర నీటి కొరత ఎదుర్కోనున్నారని యూనిసెఫ్ పేర్కొంది. ప్రతి నలుగురి పిల్లల్లో ఒకరు ఈ సమస్య ఎదుర్కొంటారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలు తక్కువ నీటి వనరులతో జీవిస్తారని హెచ్చరించింది. మంగళవారం యూనిసెఫ్ విడుదల చేసిన రిపోర్ట్‌ను ఈఎఫ్‌ఈ న్యూస్ సంస్థ బుధవారం వెల్లడించింది. నీరు లేకుండా జీవించడం కష్టమని, కానీ ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు తీవ్ర మంచి నీటి కొరత ఎదుర్కుంటారని తెలిపింది. ఆరోగ్యంగా జీవించాలంటే తాగే నీరు ఎంతో ముఖ్యమని, కానీ భవిష్యత్తు తరాలకు హానీ కలుగుతుందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోని లేక్ తెలిపారు. దీనికి కారణం నీటిని వృధా చేయడమేనన్నారు.
జనాభా పెరుగుదలతో నీటి వాడకం పెరుగుతుందని, ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పడే 36 దేశాల్లో నీటి కొరత అధికంగా ఉందని, తక్కువగా నీటిని వాడుకోవాలని హెచ్చరించింది. తీవ్ర నీటి కొరతకు ప్రధాన కారణాలు వాతావరణం వేడెక్కడం, సముద్రాల విస్తీరణం పెరగడం, మంచు కరగడం, కరువులని తెలిపింది. ఇప్పటికే 66 కోట్ల మంది నీటి సమస్య ఎదుర్కుంటున్నారంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 800 మంది పిల్లలు డయేరియాతో మరణిస్తున్నారని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎక్కువ మంది పిల్లలకు మంచి నీరు అందకపోవడం వల్లే డయేరియా భారిన పడుతున్నారని తెలిపింది. రాబోయే రోజులోనైనా ప్రభుత్వాలు నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని యూనిసెఫ్ సూచించింది.