నీటికై మహిళల పయనం.. (ఫైల్ ఫోటో)
జైపూర్, రాజస్థాన్ : అసలే అది ఎడారి ప్రాంతం. భగభగ మండే భానుడి తాపానికి గుక్కెడు నీళ్లు లేక వేల గొంతులు తడారిపోతున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ జిల్లాలోని వేల జనం వలస బాట పట్టాల్సిందే. విశేషమేమంటే.. ఆ ప్రాంతంమంతా చంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉండడం. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో.. ధోల్‌పూర్ జిల్లాలోని దాదాపు 40 గ్రామాల ప్రజలు ఎండాకాలం మొదలవగానే నీటి చెలిమలు వెతుక్కుంటూ.. వలసెళ్లి పోతారు. ఇంకో విస్మయం కల్గించే విషయమేంటంటే ధోల్‌పూర్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంత జిల్లా కావడం.
‘నీటి సంరక్షణ పథకాలు ప్రవేశపెడుతున్నాం. సంప్రదాయ నీటి నిలువ పద్ధతుల్ని కూడా అనుసరించి తాగునీటి సరఫరాకై చర్యలు తీసుకుంటున్నామ’ని ముఖ్యమంత్రి వసుంధర రాజే పదే పదే చెప్తున్నారు. మరి ధోల్‌పూర్ ప్రజలు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. నీటి కటకటతో వలసబాట పడుతున్నది వాస్తవం కాదా..! అని రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ వసుంధర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నీటికై రాష్ట్రం దాటాల్సిందే..
‘మా గ్రామ పంచాయతీ పరిధిలో 30 నుంచి 35 చిన్న చిన్న పల్లెలుంటాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క బిందెడు తాగునీటి సౌకర్యానికి కూడా నోచుకోలేదు. ఎండాకాలం మొదలవగానే ఆయా గ్రామాల ప్రజలు మరో ప్రాంతానికో లేదా బంధువుల ఊళ్లకో వలస పోతారు. ప్రధానంగా ధోల్‌పూర్ జిల్లా ప్రజలంతా ఆగ్రా, కాగరోల్, మధుర వంటి సరిహద్దు ప్రాంతాలకు పయనమవుతారు. ఐదేళ్లకోసారి వచ్చి ఎన్నికల్లో మాతో ఓటు వేయించుకొని పోయే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు మా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు’ అని గాలోరి గ్రామ నివాసి రాజేష్ వాపోయారు.
‘మా గ్రామంలోని పురుషులందరూ పిల్లలతో కలిసి నీటి చెలిమలు వెతకడానికి, నీటిని తేవడానికే సరిపోతోంది. నీటి కోసమే ఎంతో సమయం వృధా అవుతోంది. అక్కడక్కడ నీటి చెలిమలు ఉన్నా.. పశువులు తాగే నీటినే మనుషులు తాగాల్సిన పరిస్థితి. వాటిని తాగి జనం రోగాల పాలవుతున్నారు’ అని గాలోరి మరో నివాసి రామ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment