రాజస్తాన్ బీజేపీ సీనియర్ నేత ఘన్‌శ్యామ్ తివారీ (పాత ఫొటో)
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్తాన్‌లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఘన్‌శ్యామ్ తివారీ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు రాజీనామా లేఖ సమర్పించారు. సీఎం వసుంధరా రాజేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వసుంధరా రాజే నిరంకుశ పాలన వల్ల ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ గతంలో ఆయన చాలాసార్లు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పార్టీలోని సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పించకుండా ఫిరాయింపు నేతలకే రాజే ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఆయన బాహాటంగానే విమర్శించారు.
సీఎం తీరు వల్ల పార్టీ కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత, నిరుత్సాహం ఆవహించాయని.. ఇందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ బీజేపీ నాయకత్వాన్ని మార్చాలంటూ అధిష్టానానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవటం లేదని, పార్టీకి నష్టం కలిగించే చర్యలు అడ్డుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాజస్తాన్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఘన్‌శ్యామ్ ప్రస్తుతం సంగానర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘన్‌శ్యామ్ గత ఎన్నికల్లో(2013) రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment