vasundara raje
-
రాజకీయలపై రాజస్థాన్ మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
జైపూర్: రాజకీయాల్లో నాయకులు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సి వస్తుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుధర రాజే అన్నారు. శనివారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ప్రతి నాయకుడు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సిందే. రాజకీయాల్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. పదవి, మత్తు, స్థాయి. పదవి, మత్తు ఎప్పుడు ఉండకూడదు. పార్టీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటే స్థాయి దానికదే పెరుగుతుంది. రాజకీయలు అంత ఈజీ కాదు. రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ పార్టీ కోసం పని చేస్తూనే ఉండాలి. ప్రజలను సమన్వయం చేయటం కూడా అంత సులభం కాదు. మన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గతంలో కొంతమంది నాయకులు అభివృద్ది చేయటంలో విఫలం అయ్యారు’’ అని అన్నారు.ఇక.. ఇటీవల ఆమెను పార్టీలో పక్కకు పెడుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది బీజేపీ అధిష్టానం మరోసారి వసుంధర రాజేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను బీజేపీ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 11 స్థానాల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. -
బీజేపీపై వసుంధరా రాజే అలక?
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగిసింది. పలువురు నేతలు ఎన్నికల ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. అయితే రాజస్థాన్‌లో బీజేపీకి చెందిన ఓ మహిళా నేత ఇందుకు భిన్నమైన పరిస్థితిలో కనిపిస్తున్నారు.రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలంతా వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం విశేషం. రాజస్థాన్‌లోని ఏ లోక్‌సభ స్థానంలోనూ ప్రచారం చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సైతం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రచారాల్లో పాల్గొంటున్నారు.వసుంధర రాజే రాజస్థాన్‌లోని బరన్-జలావర్ లోక్‌సభ స్థానంలో మినహా మరెక్కడా ప్రచారం నిర్వహించలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమె రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ ఎన్నికల్లో యాక్టివ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె పచారపర్వానికి దూరంగా ఉండటం పలు చర్చలకు దారితీస్తోంది.రాజస్థాన్‌లో లోక్‌సభకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో కొన్ని సీట్లలో వసుంధర రాజే సమావేశాలు, ర్యాలీల గురించి చర్చ జరిగింది. అక్కడి నేతలు వసుంధర రాజే రాకను కోరుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. రెండవ దశలో ఝలావర్లోనే ఓటింగ్ ఉండటంతో పైగా అది తన కుమారుని సీటు కావడంతో ఆమె ప్రచారం నిర్వహించారు. అయితే మూడో దశలో ఆమెను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగే ప్రచారాలకు పంపేందుకు బీజేపీ సన్నాహాలు చేసింది. అయినా ఆమె ఏ సమావేశంలోనూ కనిపించలేదు.రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేతలు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నెల రోజులు ఒడిశాలోనే ఉంటూ ప్రచారం సాగించారు. పశ్చిమ బెంగాల్లోనూ రాజస్థాన్‌కు చెందిన ఒక మంత్రి ప్రచారం నిర్వహించారు. హర్యానాలోనూ రాజస్థాన్ బీజేపీ నేతలు ప్రచారాలు సాగించారు. ఢిల్లీ, యూపీలలోనూ బీజేపీ మహిళా నేతలు ప్రచార విధులను చేపట్టారు. వీటిలో ఎక్కడా వసుంధరా రాజే కనిపించకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది. -
పాలిటిక్స్ నుంచి వసుంధర రిటైర్మెంట్..! క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం
కోట: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్టేట్ మాజీ సీఎం వసుంధర రాజే కీలక ప్రకటన చేశారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఇప్పట్లో పాలిటిక్స్‌లో నుంచి తన రిటైర్మెంట్ లేదని క్లారిటీ ఇచ్చారు. జలావర్ జిల్లాలోని జల్రాపటాన్ నియోజకవర్గం నుంచి వసుంధర శనివారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. పాలిటిక్స్‌లో నుంచి తాను రిటైర్ అవనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు ఈ సందర్భంగా ఆమె తెరదించారు.తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం జరిగిన ఒక ప్రచార బహిరంగ సభలో వసుంధర చేసిన వ్యాఖ్యలు ఆమె రిటైర్మెంట్పై ఊహాగానాలు రావడానికి కారణమయ్యాయి. తన కుమారుడు ఎంపీ దుశ్యంత్ సింగ్ మంచి లీడర్‌గా తయారయ్యాడని, ఇక రిటైర్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందని వసుంధర ఆ మీటింగ్‌లో అన్నారు. -
రాజస్తానీ కౌన్
రాజస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా లోక్‌సభ ఎన్నికల కంటే ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు దక్కించుకోవడం ఒక సెంటిమెంట్. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా? లేదా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఎజెండాలే వేర్వేరు అనే అవగాహన ఓటర్లలో పెరిగిందా? ఎడారి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఎవరి ఓటుబ్యాంకును దెబ్బ తీస్తుంది? కుల సమీకరణలు ఎవరికి సానుకూలంగా ఉన్నాయి? మోదీ ఇమేజ్ ఎంతవరకు పని చేస్తుంది? ఓటరు మదిలో ఏముంది..?! గత లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ హవాతో రాజస్తాన్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. 2018 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి వసుంధరా రాజె వ్యవహార శైలిపై నెలకొన్న అసమ్మతి బీజేపీ పుట్టి ముంచింది. 200 అసెంబ్లీ స్థానాలకు 73 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, కాంగ్రెస్.. మ్యాజిక్ ఫిగర్‌కి ఒక్క సీటు దూరంలో ఆగిపోయి వంద సీట్లు మాత్రమే దక్కించుకుంది. సాధారణంగా రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావమే లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపిస్తుంటుంది. కానీ ఈసారి అలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. అలాగని గత లోక్‌సభ ఎన్నికల మాదిరిగా బీజేపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితీ లేదు. మొత్తమ్మీద చూస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ కమలనాథులు పై చేయి సాధించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రాణం మీదికి ‘రుణమాఫీ’ రాజస్తాన్ ఎన్నికల్లో వ్యవసాయ రంగం కీలకాంశం. 70 శాతం జనాభా గ్రామాల్లోనే ఉన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు పెట్టుబడికయ్యే ఖర్చు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ కూడా జాడ లేదు. దీంతో ఈశాన్య రాజస్తాన్‌లోని షెకావతీ ప్రాంతంలో రైతులు అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు. లోక్‌సభ ఎన్నికల్లో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని ఆల్ ఇండియా కిసాన్ సభకు చెందిన ఆమ్రా రామ్ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎందరో రాజెను ఇంటికి పంపించినా, ఈ ఎన్నికల్లో మోదీకే తమ ఓటు అంటున్నారు. కుల సమీకరణలు–ఎవరికి సానుకూలం? రాజస్తాన్ ఓటర్లలో గుజ్జర్లు తొమ్మిది శాతం ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజ్జర్లకు చెందిన సచిన్ పైలెట్‌కి బదులుగా మాలీ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గహ్లోత్‌ను సీఎంను చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఎస్టీ హోదా కోసం వారు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఈసారి గుజ్జర్లు బీజేపీ వైపే నడిచే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని మరో ప్రధానమైన సామాజిక వర్గం రాజపుత్రులు. వీరు జనాభాలో పది శాతం వరకు ఉన్నారు. వసుంధరా రాజెపై వ్యతిరేకతతో అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్‌కే ఓటేశారు. ‘రాజె పదవి దిగిపోయారు. అదే మాకు కావల్సింది. మోదీపై మాకు ఎలాంటి ఆగ్రహం లేదు‘ అని రాజపుత్రులు అంటున్నారు. దక్షిణ రాజస్తాన్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన భిల్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఓట్లపై ఆర్ఎస్ఎస్ పెద్దగా దృష్టి సారించలేదు. గత ఎన్నికల్లో గుజరాత్ ఎమ్మెల్యే చోటూ వాసవ భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) పేరుతో పార్టీ పెట్టి రెండు అసెంబ్లీ సీట్లను సాధించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీ ప్రభావం కొంత ఉంటుందని అంచనా. మొత్తమ్మీద కుల సమీకరణలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తోంది. రెండు పార్టీలకూ తలనొప్పి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మాజీ సీఎం వసుంధరా రాజెకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టి ఆమె స్థానాన్ని పరిమితం చేశారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సత్సంబంధాలు లేని వసుంధర రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలోపేతానికి, ఎన్నికల ప్రచారానికి ఒక ఊపు తీసుకురావడానికి ఏమీ చేయడం లేదని ఆమె సన్నిహితులే విమర్శిస్తున్నారు. ఈ అంశంలో కాంగ్రెస్ కాస్త నయంగానే ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కలసికట్టుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే స్థానిక నాయకుల్లో సమన్వయం కొరవడడం కాంగ్రెస్‌కు సమస్యగా మారింది. ఉదాహరణకు చురూ లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను పార్టీ మాజీ ఎంపీ రఫీక్ మండేలియాకు ఇచ్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శాసనసభ్యులు, ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీలో కేబినెట్ పదవి దక్కించుకున్న మంత్రి కూడా రఫీక్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి వర్గపోరు బీజేపీలోనూ ఉంది. మీనాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఎస్టీ నియోజకవర్గం దౌసాలో బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా తన భార్య గోల్మాదేవికి టికెట్ ఆశించారు. మాజీ ఎంపీ ఓపీ హుడ్లా కూడా టికెట్ కోసం లాబీయింగ్ చేశారు. చివరగా బీజేపీ మాజీ ఎంపీ జస్కౌర్ మీనాకు టికెట్ ఇచ్చింది. దీంతో కిరోడిలాల్, హుడ్లా వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. తాము కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతామని ఈ వర్గాలు అంటున్నాయి. బేనీవాల్‌కు బీజేపీ మద్దతు! ప్రతిష్టాత్మక నాగూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అ«భ్యర్థిని నిలబెట్టకుండా బేనీవాల్‌కు మద్దతునిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి మూడు స్థానాలను దక్కించుకున్న ఈ యువనేత సభలకు జనం వెల్లువెత్తుతున్నారు. అయితే బీజేపీ బేనీవాల్‌కు మద్దతునివ్వదని, త్రిముఖ పోటీ నెలకొంటే బేనీవాల్ లాభపడతాడనే అభ్యర్థిని నిలబెట్టలేదన్న ప్రచారం జరుగుతోంది. బేనీవాల్ వంటి నేతలు పక్కలో బల్లెంలా మారతారని బీజేపీ భావిస్తోందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల మాటెలా ఉన్నా టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ సరిగా వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని సరిగా ఎంపిక చేయలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని వారు, ఎంపీగానూ గెలిచే అవకాశాలైతే లేవు’ అని జైపూర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు అనిల్ శర్మ అభిప్రాయపడ్డారు. అటూ ఇటూ అంచనాలు రాజస్తాన్ అంటేనే ఎన్నికల బెట్టింగ్‌లకు మారు పేరు. ఇక్కడ సట్టా మార్కెట్లో గెలుపు గుర్రాలపై పందేలు జోరుగా సాగుతుంటాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 18 స్థానాలు, కాంగ్రెస్‌కి ఏడు స్థానాలు వస్తాయని సట్టా మార్కెట్ అంచనా వేస్తోంది. ఇక కొంతమంది రాజకీయ విశ్లేషకులు, స్థానిక జర్నలిస్టులు కాంగ్రెస్ 8–9 స్థానాలు గెలుచుకోవచ్చునంటూ లెక్కలు వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా పది స్థానాలకు మించి గెలవలేరని తేలినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించవచ్చు కానీ, గత ఎన్నికలతో పోలిస్తే చాలా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీట్లు చాలా హాట్ జోధ్‌పూర్ : కాంగ్రెస్ పార్టీ తరఫున రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్‌నే పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో నాలుగు లక్షల ఓట్ల తేడాతో షెకావత్ గెలుపొందారు. సీఎం కుమారుడే పోటీకి నిలవడంతో ఇది హాట్ సీటుగా మారింది బాఢ్‌మేర్ : బీజేపీని వీడిన జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ కైలాస్ చౌధరీకి, మానవేంద్ర సింగ్‌కు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. జైపూర్ రూరల్ : కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బీజేపీ తరఫున బరిలో ఉంటే, కామన్వెల్త్లో స్వర్ణపతక విజేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ పూనియా గట్టి పోటీయే ఇస్తున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన కృష్ణ పూనియాకు కుల సమీకరణలు అనుకూలంగా ఉన్నాయి. రాజపుత్రుడైన రాథోడ్‌కి కులాలకు అతీతంగా వ్యక్తిగత ఛరిష్మా ఉంది. దీంతో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నెలకొంది. అల్వార్ : బీజేపీకి చెందిన బాబా బాలక్‌నాథ్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సహాయ మంత్రి భన్వర్ జితేంద్ర మధ్య గట్టి పోటీ నెలకొంది. గోవధకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజపుత్రులు, దళితులు, మెవ్ ముస్లింలపై అత్యధికంగా మూకదాడులు జరిగాయి. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బాలక్‌నాథ్‌కు వ్యతిరేకంగా వీరు ఓటు వేసే అవకాశాలున్నాయి. అదే ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరుకు దారి తీసింది. టోంక్–సవాయ్ మధోపూర్ : ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ డీజీపీ నమో నారాయణ్ మీనా బరిలో ఉంటే, బీజేపీ నుంచి సుఖ్బీర్ సింగ్ ఝనాపూరియా పోటీ పడుతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి సచిన్ పైలెట్ ప్రాతి నిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం ఈ లోక్‌సభ పరిధిలో ఉన్నందున కాంగ్రెస్‌కి ఈ స్థానంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. నాగూర్ : జాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా చెప్పుకునే నాగూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, జాట్ల యోధుడిగా చెప్పుకునే నాథూరాం మీర్ధా మనవరాలు జ్యోతి మీర్ధాను ఎన్నికల బరిలో దింపింది. ఇదే స్థానం నుంచి యువ జాట్ నాయకుడు, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బేనీవాల్ పోటీకి దిగారు. -
విజయం వైపు నడిపిన ‘పైలెట్’
జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలెట్ కుమారుడే సచిన్ పైలెట్(41). ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలెట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2004లో దౌసా నియోజకవర్గం నుంచి ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సచిన్ 1995లో అమెరికాలో ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పలుమార్లు పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. డ్రైవింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రముఖులు.. గెలుపోటములు రాజస్తాన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే(ఝల్రాపటన్), పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్‌ను ఝల్రాపటన్ నియోజకవర్గంలో వసుంధరాపై కాంగ్రెస్ బరిలోకి దించింది. వసుంధరా చేతిలో ఆయన 34,980 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్ భిల్వారా స్థానం నుంచి 74వేలకు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముఖ్య నేతల్లో జోహ్రీలాల్ మీనా(రాజ్‌గఢ్–లక్ష్మణ్‌గఢ్), మదన్ ప్రజాపత్(పచ్‌పద్ర), జహీదా ఖాన్(కమన్), రామ్‌లాల్ జాట్(మండల్), ప్రశాంత్ బైర్వా(నివాయి) ఉన్నారు. అలాగే, బీజేపీ నేతల్లో సంతోష్(అనూప్‌గఢ్), కాలూరామ్(దాగ్), సామారామ్ గరైసా(పిండ్వారా–అబు), జగ్సిరామ్(రియోదార్) విజయం సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధుల్లో సందీప్ కుమార్(తిజారా), వజీబ్ అలీ(నాగర్) గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన సీపీఎం ఈసారి బల్వాన్ పునియా (భద్ర), గిరిధారీలాల్ మహియా (శ్రీ దుంగార్‌గఢ్)లను గెలిపించుకుంది. నీటి వనరుల మంత్రి రామ్ ప్రతాప్, రెవెన్యూ మంత్రి అమ్రారామ్, గోపాలన్ మంత్రి ఓతారాం దేవసి(సిరోహి), పర్యాటక శాఖ మంత్రి యూనస్‌ఖాన్ ఓటమి పాలయ్యారు. -
శరద్ యాదవ్ మాటలు సిగ్గుచేటు
జైపూర్: ఎన్నికల ప్రచారంలో తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన బుధవారం శరద్‌యాదవ్ మాట్లాడుతూ ‘రాజే చాలా లావై పోయారు, ప్రజలు ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు అవమానంగా అనిపించింది. నిజానికి ఇది మహిళా జాతికే అవమానం, ఆయన మాటలతో నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఒక అనుభవమున్న సీనియర్ నేత నుంచి ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం ఊహించలేదు’ అని ఆమె ఝలావర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిసారించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె కోరారు. శరద్ యాదవ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రసారం కావడంతో ప్రజల నుంచి కూడా ఆయన మాటలపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మొదట్లో ఆమె నాజూకుగా ఉంది. ఇప్పుడు విపరీతంగా లావైపోయింది. ప్రజలు ఆమెకు విశ్రాంతినిస్తే బావుంటుంది’’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ఓటింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ ప్రభావం ఎంతన్నది తేలనుంది. -
రాజస్తాన్‌లో 74% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. గత 2013 ఎన్నికల్లో 75.23% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్ సింగ్ హఠాన్మరణంతో ఆల్వార్ జిల్లా రామ్‌గఢ్ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4.74 కోట్ల ఓటర్ల కోసం 51, 687 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. స్వల్ప ఘటనలు మినహా రాష్ట్ర మంతటా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. సీఎం అభ్యర్ధి వసుంధర 2003 నుంచి పోటీ చేస్తున్న ఝల్రాపటన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. వసుంధర ప్రధాన ప్రత్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ తనయుడు మాన్వేంద్రసింగ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా గట్టి పోటీ నిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈయన కాషాయాన్ని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతోపాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తుండగా ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా బీజేపీ ఏకైక ముస్లిం అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి యూనస్ ఖాన్ బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో దౌసా, అజ్మీర్ లోక్‌సభ స్థానాల నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన పైలట్ ఈసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు. దాదాపు 130 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 25 మంది సభ్యుల బలం ఉంది. తాజా ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. మైళ్ల దూరం నడిచి... జోధ్‌పూర్: రాజస్తాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాథూర్, మండి వంటి ప్రాంతాల్లో పోలింగ్ ఓ గంట ఆలస్యంగా ప్రారంభమవ్వగా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న బర్మార్, జైసల్మేర్ జిల్లాల ప్రజలు ఎడారిలో కొన్ని మైళ్ల దూరం నడిచి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలు వీరు నివసించే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉంటాయి. దూరాన్ని సైతం లెక్క చేయకుండా మారుమూల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌కు హాజరయ్యారు. ఈసారి పోలింగ్‌లో పాల్గొన్న మహిళలు సంఖ్య కూడా పెరిగింది. 101 ఏళ్ల పాలీదేవి అనే మహిళ బర్మార్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. అలాగే బుండి జిల్లా హిందోలీ ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల కుస్నీబాయ్ చేతి కర్ర సాయంతో ఓటు వేసేందుకు వచ్చారు. జోథ్‌పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బరన్ జిల్లా సుఖ్‌నాయర్ గ్రామ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. తమ గ్రామ సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకపోవడంతో నిరసన తెలుపుతూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నామని తెలిపారు. -
'రాజే'రికం కొనసాగేనా?
రాజస్తాన్‌లో 25 ఏళ్లుగా ఏ పార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదు. తిరిగి అదే సంప్రదాయం పునరావృతమవుతుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న వసుంధర రాజే సర్కార్ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదనే అంచనాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో అప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో బాగా కలిసొచ్చింది. కేవలం మోదీ ఇమేజ్ మీదే బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సారి కూడా మోదీ అంటే ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ.. వసుంధరా రాజే పరిపాలనే బీజేపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో రాజే మళ్లీ సీఎం కావాలని కేవలం 24% మంది మాత్రమే కోరుకున్నారు. ఇక ఇండియాటుడే సర్వేలో 35% మంది రాజేకు జై కొట్టారు. ప్రజల్లో మాత్రమే కాదు పార్టీలో కూడా అంతర్గతంగా ఆమెపై అసమ్మతి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామంటూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బహిరంగంగానే వెల్లడిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రభావితం చూపే అంశాలు రోజురోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగంతో యువత తీవ్ర అసంతృప్తితో ఉండడం ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్లతో రైతన్నలు నిరసనలకు దిగుతూనే ఉన్నారు. రైతుల్లో అసంతృప్తిని గుర్తించిన రాజే ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసింది. రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ చర్యతో 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ‘వసుంధరా సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైంది. అందుకే స్థానిక ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఓడించారు. కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. నిజానికి బీజేపీ పరిపాలనలో వాస్తవంగా లబ్ధి పొందింది లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్య మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఈ సారి అమలు కాని హామీలేవీ ఇవ్వలేదు. పాజిటివ్ డెవలప్మెంట్ అన్న అంశాన్నే తీసుకొని ముందుకు వెళుతోంది. అదే పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది’ అని రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పేర్కొన్నారు. -
చాంపియన్ ఎవరు?
సాక్షి : రాజస్తాన్ చరిత్రలో ఉదయ్‌పూర్‌ది ప్రత్యేక స్థానం. మొగలులకు ఎదురొడ్డి పోరాడిన మేవార్ వీరుడు మహారాణా ప్రతాప్.. తన తండ్రి రాణా ఉదయ్‌సింగ్ పేరుతో నిర్మించిన నగరమే ఇది. చుట్టూ సరస్సులతో అందంగా ఉంటుందీ నగరం. కానీ కాలక్రమంలో ఇదో బిజీ నగరంగా మారిపోయింది. నగరీకరణ కారణంగా.. ఆ సరస్సులన్నీ ఇప్పుడు మురికినీటితో నిండిపోయాయి. అద్భుతమైన కోటలు, రాజ మహల్‌ను చూసేందుకు వచ్చే వారికి ఇప్పుడు గుంతల రోడ్లు స్వాగతం పలుకుతాయి. చినుకుపడితే చిత్తడే. భారత చరిత్ర వారసత్వ సంపదను తనలో ఇమిడ్చుకున్న నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చింది. కానీ పురోగతి మాత్రం నత్తనడక నడుస్తోంది. పెద్దనోట్ల రద్దు సమయంలో నగరంలో పర్యాటకం తీవ్రంగా ప్రభావితమైంది. వీటన్నింటికీ తోడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్నప్పటికీ.. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ నగరాభివృద్ధికి సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కటారియా ఎదురీత గత మూడు ఎన్నికల్లోనూ ఉదయపురి నుంచే ఎన్నికవుతూ వస్తున్న కటారియాకు ఈసారి ఎదురీత తప్పేట్లు లేదు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలతో పాటు అక్రమ గైడ్లు పర్యాటకులకు కుచ్చు టోపీ పెట్టడం అక్కడ సర్వసాధారణంగా మారింది. ఉదయ్‌పూర్‌లో నిండా సమస్యలే ఉన్నప్పటికీ కటారియా కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందే క్రమంలో రోడ్ల విస్తరణ , ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా రోడ్లపై గుంతలు ఉన్నాయని ఆయన పేర్కొంటున్నారు. వ్యాస్.. తీస్ సాల్కే బాద్! జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, కేంద్ర మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎంపీ అయిన గిరిజా వ్యాస్ 33 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. 1985లో ఉదయ్‌పూర్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. అనంతరం జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న గెహ్లాట్, పైలెట్ మధ్య విభేదాలు ముదిరితే.. వీరిద్దరికీ చెక్ పెట్టేందుకే.. గిరిజా వ్యాస్‌ను రంగంలోకి దించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మోదీ, షాలకు సన్నిహితుడు సిట్టింగ్ ఎమ్మెల్యే.. రాష్ట్ర హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా మరోసారి తన అదృష్టాన్ని ఇక్కడినుంచే పరీక్షించుకోబోతున్నారు. నగరంలో నేరాలను అదుపు చేయలేకపోయారని ఆరోపణలొచ్చాయి. ప్రధాని, అమిత్ షాలకు కటారియా అత్యంత సన్నిహితుడు. వసుంధరా రాజేపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన మోదీ, షాలు ఒకానొక దశలో కటారియానే సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించాలని యోచించారు. -
బీజేపీకి తిరుగు‘పోట్లు’.. కాంగ్రెస్‌కు ‘చేరిక’ కష్టాలు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల ఓటు బ్యాంకులు తారుమారవుతున్నాయి. గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టిన వివిధ వర్గాల ఓటర్లు ఇప్పుడాపార్టీకి దూరమవుతోంటే, మరోవైపు సొంత నేతల నుంచి తిరుగుబాట్లను ఎదుర్కొంటోంది బీజేపీ. వీటన్నిటి ఫలితంగా విపక్ష కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. అయితే, కొత్త చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుండటం విశేషం. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలో ఏర్పాటయిన ఏడు పార్టీల కూటమి –లోక్తాంత్రిక్ మోర్చా– ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఈ కూటమి గెలుపోటములు ఎలా ఉన్నా విజయావకాశాలున్న అభ్యర్థుల ఓట్లను గణనీయంగా చీల్చుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన రాకతో పార్టీకి ఇబ్బందులా..? ఏదేమైనా రాజస్థాన్‌లో అధికారం నిలుపుకోవడం బీజేపీకి అంత సులభం కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంటే మరోవైపు కీలక నేతలు పార్టీకి దూరమవుతున్నారు. ఘనశ్యాం తివారి, హనుమాన్ బెనివాల్, కిరోరి సింగ్ బైంస్లా వంటి నేతలు మొదలుకుని తాజాగా జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ వరకు బీజేపీకి రాంరాం చెప్పారు. రాష్ట్రంలో రాజ్‌పుత్, జాట్ వంటి కులాలకు చెందిన ఈ నేతలు తమ వర్గీయులపై గణనీయమైన పట్టు ఉన్నవారు. పది పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తిమంతులు. వీరి తిరుగుబాటు బీజేపీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఇదిలా ఉంటే, ఈ సారి ఎన్నికల్లో సగానికిపైగా బీజేపీ సిట్టింగులకు టికెట్లు రావన్న ప్రచారం జరుగుతోంది. టికెట్లు రానివారిలో కొందరైనా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి వసుంధర రాజే తీరుపై పార్టీలో పలువురు అసంతప్తితో ఉన్నారు. ఇవన్నీ బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్‌కు కొత్త సమస్య అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, విపక్ష కాంగ్రెస్ మరో సమస్యతో సతమతమవుతోంది. మానవేంద్ర సింగ్ బీజేపీ నుంచి వచ్చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరిక పార్టీకి రాజకీయంగా మేలు కలిగించాలి. అయితే, పార్టీలో జాట్ నేతలు రాజ్‌పుత్ వర్గానికి చెందిన మానవేంద్ర సింగ్ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాక వల్ల తమకు ప్రాధాన్యం తగ్గిపోతుందని హరీశ్‌చౌదరి వంటి సీనియర్‌కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆయన తన అసంతప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. హరీశ్వర్గీయుల (జాట్లు) అసంతప్తి బర్మార్, జైసల్మేర్ జిల్లాల్లో కనీసం 9 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. తెరపైకి లోక్ తాంత్రిక్ మోర్చా సిపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎంసీపీఐ, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్‌లతో కూడిన ఫ్రంట్ ‘లోక్ తాంత్రిక్ మోర్చా’ ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ కూటమి అధికారంలోకి వస్తే అమ్రా రామ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తాము రంగంలోకి దిగుతున్నట్టు తెలిపింది. దూరమవుతున్న రాజ్‌పుత్‌లు జన్‌సంఘ్ కాలం నుంచి బీజేపీకి సంప్రదాయక మద్దతు దారులుగా ఉన్న రాజ్‌పుత్‌లు 25కుపైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయగలరు. ప్రస్తుత ప్రభుత్వంలో ముగ్గురు కేబినెట్, ఒక జూనియర్ మంత్రి రాజ్‌పుత్‌లకు చెందినవారు. వసుంధర తీరుపై రాజ్‌పుత్‌లకు ఏర్పడిన అసంతప్తి రాణి పద్మావతి సినిమా వివాదంతో తీవ్రమయింది. మానవేంద్ర సింగ్ పార్టీని వీడటంతో రాజ్‌పుత్‌లు బీజేపీకి దూరమయ్యారన్నది వాస్తమమని తేలిపోయింది. రాజ్‌పుత్‌లు తమ నాయకుడిగా గౌరవించే జస్వంత్సింగ్కు 2014లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడం, స్వతంత్రంగా నిలబడ్డ ఆయన తరపున ప్రచారం చేసిన మానవేంద్ర సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీ–రాజ్‌పుత్‌ల బంధం ఒడిదుడుకుల్లో పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్పుత్నేత గజేంద్ర షెకావత్‌ను కాదని ఓబిసీ నేత మదన్‌లాల్‌ను వసుంధర నియమించడం, పద్మావతి సినిమా విడుదలకు వసుంధర అనుమతించడం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన అనందపాల్ సింగ్ అనే గూండాను ప్రభుత్వం ఎన్కౌంటర్లో హతమార్చడం వంటి పరిణామాలు రాజ్‌పుత్‌లకు బీజేపీ మధ్య దూరాన్ని పెంచాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో జైపూర్‌లోని రాజమహల్ ప్రవేశద్వారాన్ని మూసివేసింది. ఇది కూడా రాజవంశీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ పరిణామలతో రాజ్‌పుత్‌లు వసుంధర ప్రభుత్వానికి దూరమవుతూ వచ్చారు. రాష్ట్ర జనాభాలో89 శాతం హిందువులు, 9శాతం ముస్లింలు, 2 శాతం ఇతరులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 13 శాతం, జాట్లు 12 శాతం, గుజ్జార్లు,రాజ్‌పుత్‌లు 9 శాతం ఉంటే, బ్రాహ్మణులు, మినాలు ఏడు శాతం చొప్పున ఉన్నారు. జైపూర్ సంస్థానం భారత్‌లో విలీనమైనప్పటి నుంచీ రాజ్‌పుత్‌లు, జాట్లు ప్రత్యర్థులుగా ఉంటున్నారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లకుగాను 54 సీట్లను రాజ్‌పుత్‌లు గెలుచుకుంటే 12 సీట్లు జాట్లకు, ఎస్సీలు పది సీట్లు గెలుచుకున్నారు. తర్వాత కాలంలో జాట్లు, బిష్ణోయిలు బలపడ్డారు. ఫలితంగా తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్‌ల సీట్లు 26కు పడిపోతే, జాట్లు 23 సీట్లు దక్కించుకున్నారు. దాంతో ఈ రెండు వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా 60 సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గుజ్జార్లు కూడా ఓబీసి జాబితా విషయమై ప్రభత్వం పట్ల అసంతప్తితో ఉన్నారు. రాజకీయంగా తమకు తగిన ప్రాతినిధ్యం లేదని వారు భావిస్తున్నారు. ఐటీ బందాల ఏర్పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నాయి. 2004 ఎన్నికల్లో బీజేపీ విజయంలో సామాజిక మాధ్యమాలు కీలక భూమిక పోషించడంతో అన్ని పార్టీలు అటే దష్టి పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 51వేల పోలింగ్ బూత్‌లకు ఒక ఐటీ కార్యకర్త చొప్పున నియమించినట్టు బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి హీరేంద్ర కౌశిక్ తెలిపారు. డివిజన్ స్థాయిలో 10 మందితో ఐటీ బందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా ప్రచారం సాగిస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ తరఫున కూడా సామాజిక మాధ్యమాల బందాలను ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్చార్జి అర్చన శర్మ చెప్పారు.ఈ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్న ఆప్ పార్టీ కూడా తమ అభ్యర్థుల తరఫున సామాజిక మీడియా మేనేజర్లను నియమించింది. -
ముఖ్యమంత్రి ఎదుటే కుమ్ముకున్న బీజేపీ నేతలు..!
-
ముఖ్యమంత్రి ఎదుటే కుమ్ముకున్న బీజేపీ నాయకులు..!
ఆళ్వార్ : రాజస్థాన్ బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ చేపట్టిన గౌరవ్‌యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వసుంధర రాజే వేదికపై మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గౌరవ్‌యాత్ర చేపట్టారు. సమావేశం కొనసాగుతుండగానే రోహిత్ శర్మ, దేవీసింగ్ షెకావత్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తలెత్తింది. అది తీవ్ర రూపం దాల్చడంతో ఇద్దరూ ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి ఇద్దరినీ దూరంగా తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, బీజేపీకీ గుడ్‌బై చెప్పిన మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌సింగ్ కుమారుడు మన్వేందర్సింగ్ బీజేపీ గౌరవ్యాత్రకు వ్యతిరేకంగా ‘స్వాభిమాన్ ర్యాలీ’చేపట్టిన విషయం తెలిసిందే. -
‘కాంగ్రెస్ బడా నాయకులకు జైలు, బెయిలు’
జైపూర్: దేశంలోని కాంగ్రెస్ బడా నాయకులంతా కేసుల్లో ఇరుక్కొని బెయిలుపై బయట తిరుగుతున్నారనీ.. కాంగ్రెస్ పార్టీ ‘బెయిల్ గాడీ’ (బెయిల్ బండి) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాగా, భార్య సునందా పుష్కర్ హత్య కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ ఆరోపణలు ఎదుర్కొటున్న సంగతి తెలిసిందే. ఆయా కేసుల్లో వీరిద్దరూ ఇటీవలే బెయిలు పొందారు. కొన్ని నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం జరిగిన బహిరంగ సభ.. ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. దాదాపు 2.5 లక్షల మంది ఈ సభలో పాల్గొన్నారనీ.. 12 సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభ నిండిపోయిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలోని 1500 గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తామని హామీనిచ్చారు. వసుంధరా రాజే నాయకత్వంతో రాష్ట్రం గొప్ప అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. మరోవైపు సభకు హాజరైనవారంతా బీజేపీ కార్యకర్తలేనని.. అందులో లబ్ధిదారులు లేరని కాంగ్రెస్ విమర్శించింది. -
రాజస్తాన్ బీజేపీ చీఫ్‌గా సైనీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ మదన్‌లాల్ సైనీ రాజస్తాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ నియామకాన్ని ఖరారు చేశారు. సీఎం వసుంధరా రాజే, అమిత్ మధ్య చర్చలు జరిగాక జాట్లు, రాజ్‌పుత్ వర్గాల మధ్య విభేదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మాలీ వర్గానికి చెందిన సైనీకి ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇదే సామాజిక వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్ నేత, మాజీ సీఎం)కు చెక్ పెట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. ‘రాష్ట్రంలోని 200 అసెంబ్లీ సీట్లలో 180, మొత్తం 25 లోక్‌సభ స్థానాలు గెలవడంపైనే దృష్టి పెడతాను’ అని సైనీ అన్నారు. ఇన్నాళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నందుకే సైనీకి ఈ అవకాశం వచ్చిందని పలువురు రాజస్తాన్ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తన అనుచరుడే ఉండాలని పట్టుబడుతున్న సీఎం వసుంధర రాజే కొంతమేర విజయం సాధించారనే చెప్పవచ్చు. గజేంద్రసింగ్ షెకావత్‌కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం భావించినా.. దీనికి వసుంధర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏ వర్గానికీ చెందని, సంఘ్ పరివార్‌తో సంబంధమున్న సైనీని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు చేయడంతో ఒక రకంగా వసుంధరా తన ప్రత్యర్థులను నిలువరించినట్లే. -
గోరక్షణ కోసం.. లిక్కర్‌పై పన్ను
జైపూర్: గోసంరక్షణ కొరకు రాజస్తాన్‌లోని వసుంధర రాజే (బీజేపీ) ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గోవుల రక్షణ కోసం నిధుల సమీకరణకు మద్యంపై 20 శాతం పన్ను విధించింది. ఈ మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ శర్మ ప్రకటన జారీ చేశారు. విదేశీ, స్వదేశీ, బీర్ లాంటి తేడాలు లేకుండా వాల్యు యాడెడ్ ట్యాక్స్ చట్టం 2003 ప్రకారం అన్నింటిపై ఇరవైశాతం పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది స్టాంప్‌డ్యూటీపై పదిశాతం పన్ను పెంచడంతో ఏడాదికి రూ.895 కోట్లు ఖజానాకు చేరిందని, ఈ మొత్తం కూడా గోరక్షణ కోసం ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. గోరక్షణ కోసం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.132 కోట్లు, 2017-18లో రూ.123 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 8.58 లక్షల గోవులు ఉన్నాయని వాటి కోసం 2562 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. -
బీజేపీ సీనియర్ నేత రాజీనామా
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్తాన్‌లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఘన్‌శ్యామ్ తివారీ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు రాజీనామా లేఖ సమర్పించారు. సీఎం వసుంధరా రాజేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వసుంధరా రాజే నిరంకుశ పాలన వల్ల ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ గతంలో ఆయన చాలాసార్లు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పార్టీలోని సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పించకుండా ఫిరాయింపు నేతలకే రాజే ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఆయన బాహాటంగానే విమర్శించారు. సీఎం తీరు వల్ల పార్టీ కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత, నిరుత్సాహం ఆవహించాయని.. ఇందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ బీజేపీ నాయకత్వాన్ని మార్చాలంటూ అధిష్టానానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవటం లేదని, పార్టీకి నష్టం కలిగించే చర్యలు అడ్డుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాజస్తాన్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఘన్‌శ్యామ్ ప్రస్తుతం సంగానర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘన్‌శ్యామ్ గత ఎన్నికల్లో(2013) రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. -
గుక్కెడు నీటికోసం రాష్ట్రం దాటాల్సిందే..
జైపూర్, రాజస్థాన్ : అసలే అది ఎడారి ప్రాంతం. భగభగ మండే భానుడి తాపానికి గుక్కెడు నీళ్లు లేక వేల గొంతులు తడారిపోతున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ జిల్లాలోని వేల జనం వలస బాట పట్టాల్సిందే. విశేషమేమంటే.. ఆ ప్రాంతంమంతా చంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉండడం. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో.. ధోల్పూర్ జిల్లాలోని దాదాపు 40 గ్రామాల ప్రజలు ఎండాకాలం మొదలవగానే నీటి చెలిమలు వెతుక్కుంటూ.. వలసెళ్లి పోతారు. ఇంకో విస్మయం కల్గించే విషయమేంటంటే ధోల్పూర్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంత జిల్లా కావడం. ‘నీటి సంరక్షణ పథకాలు ప్రవేశపెడుతున్నాం. సంప్రదాయ నీటి నిలువ పద్ధతుల్ని కూడా అనుసరించి తాగునీటి సరఫరాకై చర్యలు తీసుకుంటున్నామ’ని ముఖ్యమంత్రి వసుంధర రాజే పదే పదే చెప్తున్నారు. మరి ధోల్పూర్ ప్రజలు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. నీటి కటకటతో వలసబాట పడుతున్నది వాస్తవం కాదా..! అని రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ వసుంధర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నీటికై రాష్ట్రం దాటాల్సిందే.. ‘మా గ్రామ పంచాయతీ పరిధిలో 30 నుంచి 35 చిన్న చిన్న పల్లెలుంటాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క బిందెడు తాగునీటి సౌకర్యానికి కూడా నోచుకోలేదు. ఎండాకాలం మొదలవగానే ఆయా గ్రామాల ప్రజలు మరో ప్రాంతానికో లేదా బంధువుల ఊళ్లకో వలస పోతారు. ప్రధానంగా ధోల్పూర్ జిల్లా ప్రజలంతా ఆగ్రా, కాగరోల్, మధుర వంటి సరిహద్దు ప్రాంతాలకు పయనమవుతారు. ఐదేళ్లకోసారి వచ్చి ఎన్నికల్లో మాతో ఓటు వేయించుకొని పోయే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు మా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు’ అని గాలోరి గ్రామ నివాసి రాజేష్ వాపోయారు. ‘మా గ్రామంలోని పురుషులందరూ పిల్లలతో కలిసి నీటి చెలిమలు వెతకడానికి, నీటిని తేవడానికే సరిపోతోంది. నీటి కోసమే ఎంతో సమయం వృధా అవుతోంది. అక్కడక్కడ నీటి చెలిమలు ఉన్నా.. పశువులు తాగే నీటినే మనుషులు తాగాల్సిన పరిస్థితి. వాటిని తాగి జనం రోగాల పాలవుతున్నారు’ అని గాలోరి మరో నివాసి రామ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఎం పదవి నుండి తప్పించండి
-
వివాహ వేడుకలో విషాదం.. ఆరుగురు మృత్యువాత
జైపూర్ : ఆ వివాహ వేడుకలో అనుకోకుండా జరిగిన ఘటన పెను విషాదం మిగిల్చింది. వేడుక జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి ఆరుగురు చనిపోగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా ఖటోలాయి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో పెళ్లికి వచ్చిన వారిలో ఆరుగురు చనిపోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే జైపూర్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వసుంధరా రాజే తీవ్ర సంతాపం ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. -
రాజస్థాన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరారోపిత ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించే చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాజే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 180 రోజులపాటు వారిని విచారణ చేపట్టే హక్కు ఎవరికీ ఉండదని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ క్రిమినల్ చట్టం 2017కి సవరణ ద్వారా సెప్టెంబర్ 7న ఓ ఆర్డినెన్స్ రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానికి ఆమోదం తెలుపుతూ రాజస్థాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ‘‘ అవినీతితోపాటు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న న్యాయమూర్తులు(మాజీ అయినా సరే), ప్రజా సేవకులపై ఆయా అభియోగాలు నమోదయినప్పుడు.. వారిని విచారణ చేపట్టేందుకు వీల్లేదు. ఈ మేరకు న్యాయమూర్తిసహా ఎవరికీ కూడా విచారణకు ఆదేశించే హక్కు లేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు 6 నెలలపాటు ఉపశమనం ఉంటుంది’’ అని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. అదే సమయంలో ఆయా అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ ఏ రూపంలో అయినా కథనాలు ప్రచురించటానికి వీల్లేదంటూ మీడియాపై ఆంక్షలు కూడా విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించింది. కాగా, ఇలాంటి చట్టం ఒకటి రూపకల్పన అవుతోందని తెలిసినప్పటి నుంచే రాజే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఆరు నెలలో కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయని.. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ చట్టం సరికాదంటూ వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
ఆ ఇద్దరిదీ కచ్చితంగా తప్పే!
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మ, రాజేలు తప్పు చేశారన్న బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు ఐపీఎల్ స్కామ్‌స్టర్, పరారీలో ఉన్న నిందితుడైన లలిత్ మోదీ విదేశాల్లో తలదాచుకునేందుకు సహకరించడం కచ్చితంగా తప్పేనని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘అది చట్టపరంగా, నైతికంగా తప్పే. ఎవరైనా సరె.. పరారీలో ఉన్న నిందితుడ్ని కలవడం, అతడికి సహకరించడం కచ్చితంగా పొరపాటే’ అని ఈ హోంశాఖ మాజీ కార్యదర్శి తేల్చి చెప్పారు. లలిత్‌ను భారత్‌కు రప్పించి, చట్టం ముందు నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. లలిత్ విషయంలో సుష్మ, రాజేలు తప్పేం చేయలేదంటూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సమర్ధిస్తున్న సమయంలో ఆర్కే సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు చెందిన కంపెనీకి లలిత్ మోదీ రుణం ఇవ్వడాన్ని తాను ‘సాధారణ వ్యాపారపరమైన లావాదేవీ’గానే అభివర్ణించడంపై దుమారం లేవడంతో స్టాన్ఫర్డ్లోలో ఉన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నష్టనివారణ ప్రారంభించారు. తానా మాట అనలేదని అన్నారు. లలిత్ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతున్న సంస్థలు.. ఆ లావాదేవీపైనా విచారణ జరుపుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ నియంత్రణలో ఉండే ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ పనితీరును ప్రభావితం చేసేలా జైట్లీ మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.