బహిరంగ సభలో అభివాదం చేస్తున్న మోదీ, వసుంధర రాజే
జైపూర్: దేశంలోని కాంగ్రెస్ బడా నాయకులంతా కేసుల్లో ఇరుక్కొని బెయిలుపై బయట తిరుగుతున్నారనీ.. కాంగ్రెస్ పార్టీ ‘బెయిల్ గాడీ’ (బెయిల్ బండి) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాగా, భార్య సునందా పుష్కర్ హత్య కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ ఆరోపణలు ఎదుర్కొటున్న సంగతి తెలిసిందే. ఆయా కేసుల్లో వీరిద్దరూ ఇటీవలే బెయిలు పొందారు.
కొన్ని నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం జరిగిన బహిరంగ సభ.. ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. దాదాపు 2.5 లక్షల మంది ఈ సభలో పాల్గొన్నారనీ.. 12 సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభ నిండిపోయిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలోని 1500 గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తామని హామీనిచ్చారు. వసుంధరా రాజే నాయకత్వంతో రాష్ట్రం గొప్ప అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. మరోవైపు సభకు హాజరైనవారంతా బీజేపీ కార్యకర్తలేనని.. అందులో లబ్ధిదారులు లేరని కాంగ్రెస్ విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment