దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగిసింది. పలువురు నేతలు ఎన్నికల ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. అయితే రాజస్థాన్‌లో బీజేపీకి చెందిన ఓ మహిళా నేత ఇందుకు భిన్నమైన పరిస్థితిలో కనిపిస్తున్నారు.
రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలంతా వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం విశేషం. రాజస్థాన్‌లోని ఏ లోక్‌సభ స్థానంలోనూ ప్రచారం చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సైతం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రచారాల్లో పాల్గొంటున్నారు.
వసుంధర రాజే రాజస్థాన్‌లోని బరన్-జలావర్ లోక్‌సభ స్థానంలో మినహా మరెక్కడా ప్రచారం నిర్వహించలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమె రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ ఎన్నికల్లో యాక్టివ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె పచారపర్వానికి దూరంగా ఉండటం పలు చర్చలకు దారితీస్తోంది.
రాజస్థాన్‌లో లోక్‌సభకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో కొన్ని సీట్లలో వసుంధర రాజే సమావేశాలు, ర్యాలీల గురించి చర్చ జరిగింది. అక్కడి నేతలు వసుంధర రాజే రాకను కోరుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. రెండవ దశలో ఝలావర్‌లోనే ఓటింగ్ ఉండటంతో పైగా అది తన కుమారుని సీటు కావడంతో ఆమె ప్రచారం నిర్వహించారు. అయితే మూడో దశలో ఆమెను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగే ప్రచారాలకు పంపేందుకు బీజేపీ సన్నాహాలు చేసింది. అయినా ఆమె ఏ సమావేశంలోనూ కనిపించలేదు.
రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేతలు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నెల రోజులు ఒడిశాలోనే ఉంటూ ప్రచారం సాగించారు. పశ్చిమ బెంగాల్‌లోనూ రాజస్థాన్‌కు చెందిన ఒక మంత్రి ప్రచారం నిర్వహించారు. హర్యానాలోనూ రాజస్థాన్ బీజేపీ నేతలు ప్రచారాలు సాగించారు. ఢిల్లీ, యూపీలలోనూ బీజేపీ మహిళా నేతలు ప్రచార విధులను చేపట్టారు. వీటిలో ఎక్కడా వసుంధరా రాజే కనిపించకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment