దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలు చోట్ల ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణ ఢిల్లీకి చెందిన ఏకైక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి రాజన్ సింగ్ పోలింగ్ బూత్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.
రాజన్ సింగ్ ఓటు వేసేందుకు సంగం విహార్‌లోని జె బ్లాక్‌లో గల ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 125కి వచ్చారు. అయితే అక్కడ ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ఏర్పాట్లు లేవన్న కారణంతో రాజన్ ఓటు వేయడానికి నిరాకరించారు. పోలింగ్ కేంద్రం బయట ధర్నాకు దిగారు.
కొద్దిసేపటి తరువాత ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ రాజన్ సింగ్‌కు పోలీసు రక్షణ మధ్య ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. తాను ట్రాన్స్‌జెండర్ ఓటరునని, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థినని పోలింగ్ బూత్‌లోని ప్రభుత్వ అధికారికి తాను చెప్పినప్పటికీ, తనను నెట్టివేశారని రాజన్‌సింగ్ ఆరోపించారు.
అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద రెండు లైన్లు మాత్రమే ఉన్నాయని, అవి మగవారికి, ఆడవారికి మాత్రమే ఉన్నాయని, ట్రాన్స్‌జెండర్ల కోసం ఎలాంటి క్యూ ఏర్పాటు చేయలేదని రాజన్ సింగ్ ఆరోపించారు. అలాగే ట్రాన్స్ జండర్లుకు పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయలేదని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, తాము ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నామని రాజన్ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment